• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఏకాగ్రతతో ఎలా చదవాలి?

చదువుకునేటప్పుడు ఏకాగ్రత చాలా ముఖ్యం. ఫోకస్‌ లేకపోతే కళ్లు అక్షరాలు చదువుతూ వెళ్లిపోయినా, అక్కడ ఉన్న విషయం అర్థం కాదు. సబ్జెక్టు గుర్తుపెట్టుకోవాలంటే అర్థం చేసుకుంటూ చదవడం అవసరం. అందుకే నిశ్చలమైన మనసుతో, పూర్తిగా ఏకాగ్రత కేంద్రీకరించి చదవాలి. 


అయితే... ఇప్పుడున్న పరిస్థితుల్లో మన కాన్సన్‌ట్రేషన్‌ దెబ్బతీసేందుకు అవకాశాలు చాలా ఎక్కువ. ఏ ఫోన్‌ మోతకో, వేరే వాళ్ల అలికిడికో పుస్తకంపై ధ్యాస దెబ్బతినకుండా ఎక్కువ సేపు ఫోకస్‌తో చదవాలంటే... ఇలా చేసి చూడండి.


మొట్టమొదట చేయాల్సిన పని మనల్ని డిస్టర్బ్‌ చేసే వస్తువులు అన్నింటినీ పూర్తిగా దూరం పెట్టడం. చదివేందుకు కూర్చోవడానికి ముందే ఫోన్‌ను పక్క గదిలో పెట్టేయాలి. ఒకవేళ దాన్ని చదువుకునేటప్పుడు వాడాల్సి వచ్చినా నోటిఫికేషన్లు ఆఫ్‌ చేసి పెట్టుకోవడం ఉత్తమం. నిశ్శబ్దంగా ఉన్నచోట కూర్చుని, ప్రతిచిన్న విషయానికీ పిలవొద్దని ఇంట్లోవాళ్లకి ముందే చెప్పాలి. ల్యాప్‌టాప్‌ వాడాల్సి వచ్చినా అవసరమైన అప్లికేషన్లు మాత్రమే తెరిచేలా గట్టిగా నిర్ణయించుకోవడం అవసరం. మొత్తంగా వేరే ఏ ఇతర పనులూ, వ్యాపకాలకూ ఆ టైమ్‌లో చోటివ్వకూడదు.


 కొందరికి చదువుకునేటప్పుడు ప్రశాంతంగా ఉన్న సంగీతం వినడం నచ్చుతుంది. అది చదివే మూడ్‌ను, ఏకాగ్రతను మరింత పెంచుతుంది కూడా. అలాంటప్పుడు ఆ మ్యూజిక్‌ తక్కువ శబ్దంతో వినొచ్చు. కానీ మరికొందరు ఇలా సంగీతం ఉంటే ఏకాగ్రత చూపలేరు. అలాంటి వారు వినకపోవడం మంచిది. 


 ఏకాగ్రతకు కెఫీన్‌ ఉపకరిస్తుంది. 2021లో చేసిన ఓ పరిశోధన ప్రకారం... చదువుకునే ముందు ఓ కప్పు కాఫీ తాగిన విద్యార్థులు, తాగని వారి కంటే ఎక్కువ ఏకాగ్రత చూపగలిగారట. అందువల్ల అలవాటు ఉన్న వారు ఓ మంచి కాఫీ తాగి పుస్తకాల ముందు కూర్చోవచ్చు. అదీ మితంగానే తీసుకోవాలి. మోతాదుకు మించి తీసుకుంటే ఆందోళన పెరిగి ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.


 ‘పోమోడారో టెక్నిక్‌’ను పాటించవచ్చు. ఈ విధానంలో మొదటి ఏదైనా పని 25 నిమిషాలపాటు చేసేందుకు అలారం పెట్టుకోవాలి. ఆ పని అయ్యాక 5 నిమిషాలు విరామం తీసుకోవాలి. అలాగే మరో మూడు సార్లు చేయాలి. అంటే గంటన్నరపైనే పూర్తి ఏకాగ్రతతో చదువుతాం. ఆ తర్వాత ఇలాగే అలారం పెట్టుకుని చదువుతూ... తీసుకునే విరామం వ్యవధి 10, 15, 20... నిమిషాల చొప్పున పెంచుకుంటూ వెళ్లాలి. ఈ టెక్నిక్‌లో బ్రెయిన్‌ త్వరగా అలసిపోకుండా ఎక్కువసేపు ఏకాగ్రతతో చదివేలా సహకరిస్తుంది. 


 ఫోకస్, ఫోకస్‌మి, యాప్‌బ్లాక్, ఫ్రీడమ్‌... ఈ యాప్స్‌ చేసే పనేంటో తెలుసా? మీ ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్‌లో సోషల్‌మీడియా యాప్స్‌ ఏవీ పనిచేయకుండా చేయడం. వీటికి కొంత సమయం నిర్దేశిస్తే... ఆ టైంలో ఏ సోషల్‌ మీడియా యాప్స్‌ కూడా డివైజ్‌లో పనిచేయవు. దానివల్ల ఎటువంటి ఇబ్బందీ లేకుండా చదువుకోవచ్చు. 


 ఆకలిగా ఉన్నా, మనసు బాగాలేకపోయినా ఫోకస్‌ పెట్టలేం. సమతుల ఆహారాన్ని సమయానికి తీసుకోవడం, ఆరోగ్యకరమైన చిరుతిళ్లనే ఎంచుకోవడం, చిన్న చిన్న విషయాలకు మనసు పాడుచేసుకోకుండా ఉండటం వల్ల హాయిగా చదువుకోగలం. 


‣  సరిపడా నిద్రపోవడం అనేది అత్యంత అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రను అశ్రద్ధ చేయకూడదు. అలా చేయడం జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది. తద్వారా మనసుపెట్టి చదవలేం. 


  ఒక్కోసారి ఎంత వద్దనుకున్నా ఆలోచనలు ఎక్కడినుంచి ఎక్కడికో వెళ్లిపోతుంటాయి. ఇది అందరికీ జరిగేదే. అలాంటప్పుడు వీలైనంత త్వరగా మనసును మన అధీనంలోకి తెచ్చుకుని పుస్తకంపై శ్రద్ధ పెట్టేందుకు ప్రయత్నించాలి. తరచూ ఇలా సాధన చేస్తే చదువుపై పూర్తిగా ఏకాగ్రతను చూపగలం!

మరింత సమాచారం... మీ కోసం!

‣ టిస్‌ కోర్సుల్లోకి ప్రవేశాలు ప్రారంభం

‣ అందరూ కామర్స్‌ కోర్సుల్లో చేరుతున్నారు!

‣ సందిగ్ధతను దాటి.. సన్నద్ధత వైపు!

‣ రూ.51 లక్షల జీతంతో క్యాంపస్‌ ఉద్యోగం!

‣ అంద‌రి కోసం ఆన్‌లైన్ లైబ్ర‌రీ

‣ ఎలా నెగ్గాలి సివిల్స్ ఇంట‌ర్వ్యూ?

Posted Date : 23-12-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.