• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అంద‌రి కోసం ఆన్‌లైన్ లైబ్ర‌రీ

ఎన్‌డీఎల్ఐతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు


గ్రంథాలయాలు జాతి సంపద. విజ్ఞాన భాండాగారాలైన పుస్తకాలను భవిష్యత్‌ తరాల కోసం ఏళ్లుగా భద్రపరుస్తున్నాయివి. అందుకే దేశమేదైనా లైబ్రరీలకు సముచిత ప్రాధాన్యం లభిస్తుంది. అయితే మారుతున్న కాలానికి తగినట్టు  ఇవి నడిచే తీరులోనూ మార్పులొచ్చాయి. ప్రస్తుతం ప్రముఖ గ్రంథాలయాలన్నీ డిజిటల్‌ రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఎవరైనా ఎక్కడి నుంచైనా పుస్తకాలను చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇది విద్యార్థులకు ఉపకరించే అంశం.


అంతా డిజిటల్‌మయం అయిపోతున్న ఈ రోజుల్లో... లైబ్రరీలు కూడా విద్యార్థుల కోసం డిజిటల్‌ బాట పట్టాయి. లక్షలకొద్దీ వివిధ రకాలైన పుస్తకాలు ఆన్‌లైన్‌లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్స్, పూర్వ ప్రశ్నపత్రాలు, అనుబంధ పుస్తకాలతో సహా అన్నీ దొరుకుతున్నాయి. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా ఖర్చు తగ్గడమే కాదు, కావాల్సిన సమాచారం అంతా ఒకేచోట దొరికేస్తుంది. ఇలా డిజిటల్‌ సేవలు అందిస్తున్న లైబ్రరీలు ఏం ఉన్నాయో చూద్దాం.


నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌డీఎల్‌ఐ)

 


ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థుల నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చదువుకునేవారి వరకూ ఆన్‌లైన్‌ పుస్తకాలు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. ఇందులో దాదాపు 5 కోట్ల పుస్తకాలున్నాయి! అన్ని    భారతీయ భాషల నుంచి అవసరమైన, ప్రముఖమైన పుస్తకాలన్నింటినీ దీనిలో భద్రపరిచారు. పుస్తకం, సబ్జెక్టు రచయిత..వంటి వివరాల  ఆధారంగా విద్యార్థులు తమకు కావాల్సినవి ఇందులో వెతకవచ్చు. ఇంట్లోనే ఉంటూ చదువుకునేవారికి సైతం పూర్తిస్థాయి మద్దతునిచ్చేలా ఈ సంస్థ ప్రపంచంలో ఉన్న ఇతర డిజిటల్‌ ల్రైబరీలతో అనుసంధానం అవుతోంది. ఇందులో టెస్ట్‌ ప్రిపరేషన్, స్టడీ ఎట్‌ హోమ్, ఫీచర్డ్‌ కలెక్షన్‌ అనే పేరుతో విభాగాలున్నాయి. ఐఐటీ-జేఈఈ, జామ్, గేట్, యూజీసీ నెట్‌ వంటి పరీక్షలకు మెటీరియల్‌ మాత్రమే కాక... ఉద్యోగ సమాచారం కూడా లభిస్తుంది.


యూనివర్సల్‌ డిజిటల్‌ లైబ్రరీ 


కళలు, సైన్స్, లిటరేచర్‌ రంగాల్లో ఇప్పటివరకూ జరిగిన కృషిని డిజిటల్‌గా భద్రపరచాలనే లక్ష్యంతో ఇది నడుస్తోంది. విద్యార్థులు, పరిశోధకులకు ఉపయోగపడే ఎన్నో రకాలైన పుస్తకాలు ఇందులో ఉంచారు. లక్షల కొద్దీ కాపీలను స్కాన్‌ చేసి భద్రపరిచారు. చదివేవారికి అనుకూలంగా ఉండేందుకు అధునాతన సెర్చ్‌ ఆప్షన్లు ఉపయోగిస్తున్నారు. భాష, పుస్తకం ప్రచురించిన సంవత్సరం వంటి అంశాలతో సైతం సెర్చ్‌ చేసే వెసులుబాటు ఉంది.


ఇంటర్నెట్‌ ఆర్కైవ్‌ 


ఇది ఉచితంగా కంటెంట్‌ను అందించే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థ. ఇందులో దాదాపు 52,500 కోట్ల వెబ్‌పేజెస్‌ ఉన్నాయి! కేవలం పుస్తకాలే కాక... స్టడీ మెటీరియల్‌కు సంబంధించిన వీడియోలు, ఆడియోలు, చిత్రాలు వంటివి అందిస్తున్నారు. ఇతర దేశాల యూనివర్సల్‌ లైబ్రరీలు, అమెరికన్, కెనెడియన్, గ్రంథాలయాలు, కమ్యూనిటీ టెక్ట్స్‌ వంటివాటితో అనుసంధానమై పనిచేస్తోంది. భాష ఆధారంగా ఇందులో పుస్తకాలను కేటగిరీలుగా విభజించారు.


డైరక్టరీ ఆఫ్‌ ఓపెన్‌ యాక్సెస్‌ బుక్స్‌ (డీవోఏబీ)


ఎటువంటి ఖర్చు, నిబంధనలు లేకుండా పుస్తకాలను సులభంగా విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. 200 పేజీల పుస్తకం అయినా 5 సెకన్లలోనే డౌన్‌లోడ్‌ అయ్యేలా ఇందులో ప్రతిదీ వేగంగా జరుగుతుంది. 


పబ్లిషర్లు తమ పుస్తకాలు వెనువెంటనే చదువరులకు కనిపించేలా చేసే అడ్వాన్స్‌డ్‌ సెట్టింగ్స్‌ ఇందులో ఉన్నాయి. అయితే ఇందులో ఉన్న సమాచారాన్ని ఏదైనా అవసరం కోసం విద్యార్థులు ఉపయోగించాలి అనుకుంటే లైసెన్స్‌ నిబంధనలు పాటించాలి.


బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఆన్‌లైన్‌ లైబ్రరీ


ఇదో అంతర్జాతీయ సంస్థ. సాంస్కృతిక సంబంధాలను, విద్యాసంబంధిత అవకాశాలను సృష్టిస్తోంది. ఇంగ్లిష్‌ నేర్చుకోవాలి అనుకునే భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. డిజిటల్‌ మెంబర్‌షిప్‌ పొందడం ద్వారా ఇందులో ఉన్న కంటెంట్‌ను వినియోగించుకోవచ్చు. దీని ద్వారా చదవడమే కాకుండా కావాల్సిన పుస్తకాన్ని డౌన్‌లోడ్‌ కూడా చేసుకోవచ్చు. ఈ-బుక్స్, ఈ-జర్నల్స్, మ్యాగజైన్లు, న్యూస్‌పేపర్లు, ఆడియోబుక్స్, స్కూల్‌ సంబంధిత మెటీరియల్‌ ఇందులో ఉంది. ఈ సంస్థ మెంబర్‌షిప్‌ ఉన్నవారు కళాప్రదర్శనలు, లైవ్‌ కాన్సర్ట్‌లు, మ్యూజిక్‌ డాక్యుమెంటరీలను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్‌లైన్‌లోనే చూడవచ్చు.


వీటితోపాటుగా దిల్లీ యూనివర్సిటీ లైబ్రరీ సిస్టం (డీయూఎల్‌ఎస్‌), ఐఐఎం-కోజికోడ్, ఇందిరా గాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్‌ వంటి కొన్ని ఉన్నత విద్యాసంస్థలు తమ గ్రంథాలయాలను విద్యార్థులు అందరికీ అందుబాటులో ఉండేలా ఆన్‌లైన్‌లోకి మారుస్తున్నాయి. ప్రైవేటుగాను, అంతర్జాతీయంగా కూడా చాలా విద్యాసంస్థలు డిజిటల్‌ లైబ్రరీ సొల్యూషన్స్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌ గ్రంథాలయాలను నెలకొల్పుతున్నాయి. అమూల్యమైన ఈ విద్యాసంపదను విద్యార్థులంతా వినియోగించుకోవడం ద్వారా చక్కని  కెరియర్‌కూ, ఉన్నతమైన వ్యక్తిత్వానికీ బాటలు వేసుకోవచ్చు.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ లెక్చ‌ర‌ర్ ఉద్యోగం సాధించాలంటే?

‣ కేంద్రీయ విద్యాల‌యాల్లో ఉద్యోగాలు

‣ కచ్చితంగా నేర్చుకోండి లీన్‌ 6 సిగ్మా

‣ టాప్‌ 5 ఉద్యోగాలు ఇవే!

‣ ఇంటర్మీడియట్‌తో ఇవిగో ఉద్యోగాలు

‣ ఏపీ పోలీస్‌ కొలువుకు సిద్ధ‌మేనా?

‣ పోలీస్ ఉద్యోగాల మొయిన్స్‌లో మెర‌వాలంటే?

Posted Date : 17-12-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌