• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కేంద్రీయ విద్యాల‌యాల్లో ఉద్యోగాలు

  13,404 ఖాళీల‌తో ప్ర‌క‌ట‌న విడుద‌ల 

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగావకాశాలు వచ్చాయి. పీఆర్‌టీ, టీజీటీ, పీజీటీ, వైస్‌ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్, మ్యూజిక్‌ టీచర్, లైబ్రేరియన్, ఇతర పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. అన్ని విభాగాల్లోనూ మొత్తం 13,404 ఖాళీలున్నాయి. పోస్టు ప్రకారం పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ, స్కిల్‌టెస్టుల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు! 


కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీలను దేశవ్యాప్తంగా నిర్వహించే ఉమ్మడి పరీక్షతో భర్తీ చేస్తారు. ప్రతి రెండు మూడేళ్లకు ఒకసారి ఈ ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు దేశంలో ఎక్కడి నుంచైనా విధులు నిర్వర్తించడానికి సిద్ధపడాలి. వీరు ఆకర్షణీయ వేతనాలు అందుకోవచ్చు. ఉపాధ్యాయ పోస్టులకు స్థాయిని బట్టి డెమో, ఇంటర్వ్యూ తప్పనిసరి. పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. 

ప్రైమరీ టీచర్‌ అవకాశం వచ్చినవారు రూ.55,000 కంటే ఎక్కువే అందుకోవచ్చు. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌గా ఎంపికైతే దాదాపు రూ.75,000 పొందవచ్చు. పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌గా చేరినవారు సుమారు రూ.85 వేల వరకు వేతనం పొందవచ్చు. కొన్నేళ్ల అనుభవంతో భవిష్యత్తులో వీరు సొంత రాష్ట్రంలో సేవలు అందించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో డీఎడ్, బీఎడ్‌ పూర్తిచేసినవారు ఈ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. పీఆర్‌టీ, టీజీటీ పోస్టులకు సీటెట్‌లో అర్హత తప్పనిసరి. హిందీ భాషకు సంబంధించి పది ప్రశ్నలు ఎదుర్కోవాలి. 

పరీక్ష ఇలా..

కేంద్రీయ విద్యాలయాల్లో నియామకాలకు నోటిఫికేషన్ల వారీ ప్రశ్నపత్రంలో స్వల్ప మార్పులుంటాయి. అయితే ప్రశ్నలడిగే అంశాలు మాత్రం అవే ఉంటాయి. గతంలో రుణాత్మక మార్కులు లేవు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. గత పరీక్షల ప్రకారం ప్రశ్నపత్రాలు ఇలా రూపొందించారు. 

పీఆర్‌టీ: మొత్తం 150 ప్రశ్నలు. రెండు విభాగాల్లో వస్తాయి. పార్ట్‌-1లో.. జనరల్‌ ఇంగ్లిష్‌ 10, జనరల్‌ హిందీ 10 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్‌-2లో.. కరెంట్‌ అఫైర్స్, జీకే 10, రీజనింగ్‌ ఎబిలిటీ 10, టీచింగ్‌ మెథడాలజీ 20, కంప్యూటర్‌ లిటరసీ 10, సబ్జెక్టుల నుంచి 80 ప్రశ్నలు ఉన్నాయి.

టీజీటీ: జనరల్‌ ఇంగ్లిష్‌ 10, జనరల్‌ హిందీ 10, కరెంట్‌ అఫైర్స్, జీకే 40, రీజనింగ్‌ ఎబిలిటీ 40, టీచింగ్‌ మెథడాలజీ 40, కంప్యూటర్‌ లిటరసీ 10. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి.

పీజీటీ: ప్రశ్నపత్రం 150 మార్కులకు ఉంటుంది. జనరల్‌ ఇంగ్లిష్‌ 10, జనరల్‌ హిందీ 10, జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్‌ 10, రీజనింగ్‌ ఎబిలిటీ 10, కంప్యూటర్‌ లిటరసీ 10, టీచింగ్‌ మెథడాలజీ 20, సంబంధిత సబ్జెక్టు 80 ప్రశ్నలు ఉంటాయి. 

సన్నద్ధత ఇలా...

టీచింగ్‌ పోస్టులకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు బాగా చదవాలి. పరీక్షలో విజయానికి మెథడాలజీ, సంబంధిత సబ్జెక్టుల్లో ప్రావీణ్యం తప్పనిసరి. 

ప్రైమరీ టీచర్‌ పోస్టులకు.. పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టులపైనా పట్టు ఉండాలి. డీఎడ్‌ రెండేళ్ల మెథడాలజీ పాఠ్యపుస్తకాలు బాగా చదవాలి. 

టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ స్థాయి వరకు గట్టి పట్టు తప్పనిసరి. అలాగే సబ్జెక్టు మెథడాలజీ కోసం బీఎడ్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదువుకోవాలి.

పీజీటీ కోసమైతే.. పీజీ స్థాయిలో సబ్జెక్టుపై పట్టు పెంచుకోవాలి. మెథడాలజీ కోసం బీఎడ్‌ పాఠ్యపుస్తకాలు చదివితే సరిపోతుంది. 

అన్ని పోస్టులకూ ఇంగ్లిష్, హిందీ, కరంట్‌ అఫైర్స్, జీకే, రీజనింగ్‌... మొదలైనవి ఉమ్మడిగా ఉంటాయి. వీటిని సాధారణ పరిజ్ఞానంతో ఎదుర్కోవచ్చు. మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే ఈ విభాగాల్లో ఎక్కువ మార్కులు పొందవచ్చు. 

పాత ప్రశ్నపత్రాలు పరిశీలించి.. ప్రశ్నల స్థాయి, పరీక్ష స్వరూపంపై అవగాహన పెంచుకోవాలి. గతంలో జరిగిన డీఎస్సీ, టెట్, సీటెట్, టీఆర్‌టీ...ప్రశ్నపత్రాలూ అధ్యయనంలో ఉపయోగపడతాయి. పీజీటీ పోస్టులకు పరీక్ష రాసేవాళ్లు ఆ సబ్జెక్టుల్లో జేఎల్, డీఎల్, యూజీసీ/సీఎస్‌ఐఆర్‌ నెట్‌ పాత ప్రశ్నపత్రాలను సాధన చేస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు. 

‣ పరీక్షకు ముందు వీలైనన్ని మాక్‌ టెస్టులు రాసి, ఫలితాలు విశ్లేషించుకుని, సన్నద్ధతను మెరుగుపరుచుకుంటే పోటీలో ముందుండవచ్చు.   

గమనించండి!

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: డిసెంబరు 26

పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు. 

పరీక్ష కేంద్రాలు: ఏపీలో..అనంతపురం, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్‌. 

దరఖాస్తు ఫీజు: పోస్టును బట్టి    రూ.1200-2300 వరకు చెల్లించాలి. 

వెబ్‌సైట్‌: https://kvsangathan.nic.in/

ప్రైమరీ టీచర్‌

ఖాళీలు: 6414

అర్హత: ఇంటర్మీడియట్‌ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల డీఎడ్‌ కోర్సు పూర్తిచేయాలి. లేదా 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఎడ్‌ ఉత్తీర్ణత. వీటితోపాటు సీటెట్‌ పేపర్‌-1లో ఇప్పటికే అర్హత సాధించి ఉండాలి. 

వయసు: 30 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: లెవెల్‌ 6. రూ.35,400-1,12,400

ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ)

ఖాళీలు: 3176

విభాగాలు: హిందీ-377, ఇంగ్లిష్‌-401, సంస్కృతం 245, సోషల్‌ స్టడీస్‌-398, మ్యాథ్స్‌-426, సైన్స్‌-304, పీ అండ్‌ హెచ్‌ఈ-435, ఆర్ట్‌ ఎడ్యుకేషన్‌-251, డబ్ల్యూఈ-339.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత, బీఎడ్‌ పూర్తిచేసి, సీటెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. పీ అండ్‌ హెచ్‌ఈ పోస్టులకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ అవసరం. ఏఈ పోస్టులకు డ్రాయింగ్‌ అండ్‌ పెయింటింగ్‌ లేదా స్కల్‌ప్చర్‌/ గ్రాఫిక్‌ ఆర్ట్‌లో ఐదేళ్ల డిప్లొమా/ సమాన స్థాయి కోర్సులో ఉత్తీర్ణత అవసరం.  డబ్ల్యుఈ పోస్టులకు ఎలక్ట్రికల్‌ లేదా  ఎలక్ట్రానిక్స్‌లో డిగ్రీ అవసరం. 

వయసు: 35 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: లెవెల్‌ 7. రూ.44,900-1,42,400. 

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ)

ఖాళీలు: 1409

విభాగాలు: హిందీ-172, ఇంగ్లిష్‌-158, ఫిజిక్స్‌-135, కెమిస్ట్రీ-167, మ్యాథ్స్‌-184, బయాలజీ-151, హిస్టరీ-63, జాగ్రఫీ-70, ఎకనామిక్స్‌-97, కామర్స్‌-66, కంప్యూటర్‌ సైన్స్‌-142, బయోటెక్నాలజీ-4. 

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. బీఎడ్‌ పూర్తిచేసి ఉండాలి. కంప్యూటర్‌ సైన్స్‌ టీచర్‌ పోస్టులకు బీఈ/ బీటెక్‌లో సీఎస్‌ఈ/ ఐటీ లేదా ఎమ్మెస్సీ(సీఎస్‌) లేదా ఎంసీఏ చదివివనాళ్లు అర్హులు. 

వయసు: 40 ఏళ్లకు మించరాదు. 

పే స్కేల్‌: లెవెల్‌ 8 రూ.47,600-1,51,100 

లైబ్రేరియన్‌ 

ఖాళీలు: 355

అర్హత: లైబ్రరీ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా డిగ్రీ తర్వాత లైబ్రరీ సైన్స్‌లో ఏడాది డిప్లొమా. 

వయసు: 35 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: లెవెల్‌ 7. రూ.44,900-1,42,400 

జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ 

ఖాళీలు: 702

అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. టైప్‌లో నైపుణ్యం. ఇంగ్లిష్‌లో నిమిషానికి 35, హిందీ అయితే 30 పదాలు కంప్యూటర్‌పై టైప్‌ చేయగలగాలి.

వయసు: 27 ఏళ్లు మించరాదు

వేతన శ్రేణి: లెవెల్‌ 2. రూ.19,900-63,200

సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ 

ఖాళీలు: 322

అర్హత: డిగ్రీతోపాటు మూడేళ్ల పని అనుభవం

వయసు: 30 ఏళ్లకు మించరాదు

పే స్కేల్‌: లెవెల్‌ 4. రూ.25,500-81,100

ప్రైమరీ టీచర్‌ మ్యూజిక్‌ 

ఖాళీలు: 303

అర్హత: ఇంటర్‌లో 50 శాతం మార్కులతో పాటు మ్యూజిక్‌లో డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: లెవెల్‌ 6. రూ.35,400-1,12,400

ప్రిన్సిపల్‌ 

ఖాళీలు: 239

అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఏదైనా పీజీ, బీఎడ్‌. వైస్‌ ప్రిన్సిపల్‌ లేదా పీజీటీ హోదాలో నిర్ణీత వ్యవధిలో పని అనుభవం. 

వయసు: 35 నుంచి 50 ఏళ్లు

పే స్కేల్‌: లెవెల్‌ 12 రూ.78,800-2,09200.

వైస్‌ ప్రిన్సిపల్‌ 

ఖాళీలు: 203

అర్హత: యాభై శాతం మార్కులతో పీజీ, బీఎడ్‌. నిర్ణీత పని అనుభవం.

వయసు: 35 నుంచి 45 ఏళ్లు

పే స్కేల్‌: లెవెల్‌ 10 56,100-1,77,500

అసిస్టెంట్‌ కమిషనర్‌ 

ఖాళీలు: 52 

అర్హత: 45 శాతం మార్కులతో పీజీ, బీఎడ్, పని అనుభవం, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. 

వయసు: యాభై ఏళ్లకు మించరాదు.. 

పే స్కేల్‌: లెవెల్‌ 12 రూ.78800-209200.

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ 

ఖాళీలు: 156

అర్హత: డిగ్రీతోపాటు మూడేళ్ల పని అనుభవం తప్పనిసరి

వయసు: 35 ఏళ్లకు మించరాదు

పే స్కేల్‌: లెవెల్‌ 6 రూ.35,400-1,12,400

స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ 2

ఖాళీలు: 54

అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు స్టెనోగ్రఫీ ప్రావీణ్యం

వయసు: 27 ఏళ్లకు మించరాదు

వేతన శ్రేణి: రూ.25,500-81,100

ఫైనాన్స్‌ ఆఫీసర్‌ 6, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ 2, హిందీ ట్రాన్స్‌లేటర్‌ 11 ఖాళీలు ఉన్నాయి. అన్ని పోస్టులకూ కంప్యూటర్‌ అప్లికేషన్‌ ప్రావీణ్యం ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. వయసును డిసెంబరు 26, 2022 నాటికి లెక్కిస్తారు. టీచింగ్‌ పోస్టులకు ఎంపికైనవారు హిందీ, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో బోధించగలగాలి. పరీక్షలో ప్రతిభ చూపినవారికి పోస్టును బట్టి క్లాస్‌ డెమో/ఇంటర్వ్యూ/స్కిల్‌ టెస్టు నిర్వహిస్తారు. అన్ని దశల్లోనూ సాధించిన మార్కుల మెరిట్, రిజర్వేషన్లు అనుసరించి పోస్టులు కేటాయిస్తారు. 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కచ్చితంగా నేర్చుకోండి లీన్‌ 6 సిగ్మా

‣ టాప్‌ 5 ఉద్యోగాలు ఇవే!

‣ ఇంటర్మీడియట్‌తో ఇవిగో ఉద్యోగాలు

‣ ఏపీ పోలీస్‌ కొలువుకు సిద్ధ‌మేనా?

‣ పోలీస్ ఉద్యోగాల మొయిన్స్‌లో మెర‌వాలంటే?

Posted Date : 16-12-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌