• facebook
  • whatsapp
  • telegram

పోలీస్ ఉద్యోగాల మొయిన్స్‌లో మెర‌వాలంటే?

స‌న్న‌ద్ధ‌త‌కు నిపుణుల సూచ‌న‌లు

తెలంగాణ పోలీసు నియామక మండలి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించినవారికి డిసెంబరు 8 నుంచి జనవరి 3 వరకూ దేహదార్ఢ్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇందులో అర్హత పొందినవారికి మెయిన్‌ పరీక్ష రాసే అవకాశం వస్తుంది. కీలకమైన ఈ పరీక్షలో మెరుగైన మార్కులు సాధించటానికి ఏ అంశాలపై దృష్టి పెట్టాలో తెలుసుకుందాం!


ఎస్‌.ఐ. మెయిన్స్‌ పరీక్షలో 4 పేపర్లు, కానిస్టేబుల్‌కు 1 పేపరు ఉంటాయి. 


ఎస్‌.ఐ. పరీక్షలో..


1) ఇంగ్లిష్‌- 100 మార్కులు 


2) తెలుగు - 100 మార్కులు 


3) అరిథ్‌మెటిక్, రీజనింగ్‌ - 200 మార్కులు 


4) జనరల్‌ స్టడీస్‌ - 200 మార్కులు  


మొదటి పేపర్‌ ఇంగ్లిష్, రెండో పేపర్‌ తెలుగుల్లో 25 మార్కులకు (50 ప్రశ్నలు), ఆబ్జెక్టివ్, ఖాళీలు ఉంటాయి. తప్పు సమాధానానికి పావు శాతం మార్కులు తగ్గిస్తారు. 75 మార్కులకు వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి.


1. ఇంగ్లిష్‌: ఇందులో టెన్సెస్, ఆర్టికల్స్, యాక్టివ్‌ అండ్‌ పాసివ్‌ వాయిస్, డైరెక్ట్‌ అండ్‌ ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌లు, క్వశ్చన్‌ ట్యాగ్స్, డిగ్రీస్‌ ఆఫ్‌ కంపారిజన్, ఇడియమ్స్, యాంటనిమ్స్, సిననిమ్స్‌ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. 75 మార్కులకుగాను లెటర్‌ రైటింగ్, ఎస్సే రైటింగ్, ప్రెస్సీ, కాంప్రహెన్షన్, రిపోర్ట్‌ రైటింగ్, ఇంగ్లిష్‌లో ఉన్న వ్యాసాన్ని తెలుగులోకి అనువదించడం, పారాగ్రాఫ్‌లోని పదాలను తగ్గించడం మొదలైనవి అడుగుతారు. 


2. తెలుగు పేపర్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో సంధులు, సమాసాలు, విభక్తులు, అలంకారాల నుంచి ప్రశ్నలు వస్తాయి వ్యాసరూప ప్రశ్నల్లో సమకాలీన అంశంపై వ్యాసం రాయడం, లెటర్‌ (మిత్రుడికి, కాలనీ సమస్యలపై కార్పొరేటర్‌కు మొదలైనవి), ఒక వ్యాసాన్ని ఆంగ్లంలోకి తర్జమా చేయడం, రిపోర్ట్‌ రైటింగ్, కాంప్రహెన్షన్‌ మొదలైన అంశాలపై ప్రశ్నలుంటాయి.


తెలుగు, ఇంగ్లిష్‌ల్లో అర్హత సాధిస్తే సరిపోతుంది. వీటిలో సాధించిన మార్కులు తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. 


3. అరిథ్‌మెటిక్‌ - రీజనింగ్‌ (200 మార్కులు): అరిథ్‌మెటిక్‌లో 25 అంశాలు, రీజనింగ్‌లో 30 అంశాల వరకు ఉంటాయి. వీటిని అంశాలవారీ చదివి, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి.


 నిష్పత్తి-అనుపాతానికి సంబంధించి బహుళ నిష్పత్తి, వర్గ నిష్పత్తి, ఘన నిష్పత్తి, విలోమ నిష్పత్తి, రెండు నిష్పత్తులకు ఒక సంఖ్య కలపడం లేదా తీసివేయడం సాధన చేయాలి. 


సంఖ్యా వ్యవస్థలో సంఖ్యలు వాటి ధర్మాలు, స్థానాలు, ముఖాలు, భాజనీయత సూత్రాలపై పట్టు సాధించాలి. 


బారువడ్డీలో కాలం, వడ్డి, వడ్డీరేటు అసలులో ఏదో ఒకటి కనుక్కోవాలి. సంవత్సరం, అర్ధ సంవత్సరం, 3 నెలలు, కొన్ని రోజులకు చక్రవడ్డీని లెక్కించాలి. అలాగే బారువడ్డీ, చక్రవడ్డీల మధ్య సంబంధం కనుక్కోవడం లాంటి ప్రశ్నలు సాధన చేయాలి. 


సగటు: సహజ సంఖ్యల సగటు, సగటు వేగం, ప్రధాన సంఖ్యల సగటు, తరగతిలోని విద్యార్థుల సగటు మొదలైన ప్రశ్నలపై పట్టు సాధించాలి.


శాతం: పాఠ్యాంశంలో పెరిగిన లేదా తగ్గిన శాతం, ఒక సంఖ్య మరో సంఖ్య కంటే ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ తదితర ప్రశ్నలు ఉంటాయి. 


లాభనష్టాల్లో ఒక వస్తువు కొన్నధర కంటే ఎక్కువ లేదా తక్కువ ధరకు అమ్మితే వచ్చిన లాభం లేదా నష్టం అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. 


కాలం-పని: దీంట్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది ఒక పనిని కొన్ని రోజుల్లో చేసినట్లయితే.. అందరూ కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు? వచ్చిన డబ్బుని ఏవిధంగా పంచుకోవాలి? మొదలైన అంశాలను సాధన చేయాలి. 


పని-వేతనం, కాలం-దూరం అంశాలపై ప్రశ్నలుంటాయి. వేగం, దూరం, కాలం, సాపేక్ష వేగం... తదితర అంశాలను సాధన చేయాలి. పరుగు-పందెం, మిశ్రమాలు, రైళ్లకు సంబంధించిన అంశాలు, గడియారాలు, భాగస్వామ్యం క.సా.గు. - గ.సా.భా, వయసులు, భిన్నాలు, వైశాల్యాలు - ఘనపరిమాణాలు, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ మొదలైన అంశాలపై పట్టు సాధించాలి. 


రీజనింగ్‌ విభాగాన్ని వెర్బల్‌ రీజనింగ్, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్, లాజికల్‌ రీజనింగ్‌ అని విభజించి సాధనచేస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. 


వెర్బల్‌ రీజనింగ్‌: కోడింగ్, డీకోడింగ్, దిశాత్మక పరీక్ష, పరిమాణ పరీక్ష, ర్యాంకింగ్‌ టెస్ట్, మిస్సింగ్‌ నంబర్, పోలిక పరీక్ష, భిన్న పరీక్ష, అక్షరమాల, లాజికల్‌ వెన్‌ చిత్రాలు మొదలైన అంశాలు ఉంటాయి. 


నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌లో: పాచికలు, దర్పణ (అద్దం) ప్రతిబంబాలు, నీటి ప్రతిబింబాలు, శ్రేణులు, పోలిక పరీక్ష, భిన్న పరీక్ష మొదలైన అంశాలపై పట్టు సాధించాలి. 


లాజికల్‌ రీజనింగ్‌: ప్రకటనలు-వాదనలు, ప్రకటనలు-ఊహాగానాలు, ప్రకటనలు-తీర్మానాలు, తర్కవాదం, డెసిషన్‌ మేకింగ్‌ మొదలైన అంశాలు ఉంటాయి. 


4. జనరల్‌ స్టడీస్‌ 


జనరల్‌సైన్స్‌: మానవ నిర్మాణం, వ్యాధులు, పోషణలోని అంశాలైన విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, రక్తవర్గాలు, మానవుడి నిజ జీవితంలో సైన్స్‌ ఉపయోగాలు, ధ్వని గురించిన అంశాలు, అయస్కాంత బలాలు, ఆధునిక భౌతికశాస్త్రానికి సంబంధించిన అంశాలు, అలాగే శాస్త్ర-సాంకేతిక రంగానికి సంబంధించి గ్రహాలు, ఉపగ్రహాలు, రక్షణ వ్యవస్థలోని యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, పరిశోధనలపై ప్రశ్నలు అడగొచ్చు.


భారత భౌగోళిక అంశాలు: సరిహద్దులు, హిమాలయాలు, నదులు, అడవులు, వ్యవసాయం, నీటిపారుదల వ్యవస్థ, ఖనిజ వనరులు, రవాణా వ్యవస్థ, పరిశ్రమలు, జనాభాకు సంబంధించిన అంశాలు వస్తాయి. 


తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి.. సరిహద్దులు, నీటి పారుదల వ్యవస్థ, ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఖనిజవనరులు, రవాణా వ్యవస్థ, వ్యవసాయం-పంటలు, జనాభా, నదీ వ్యవస్థ గురించి చదవాలి. 


భారతదేశ చరిత్ర: 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి జాతీయోద్యమం వరకు అన్ని అంశాలపై పట్టు సాధించాలి. యూరోపియన్ల రాక, బ్రిటిస్‌ సామ్రాజ్య విస్తరణ నేపథ్యంలో జరిగిన యుద్ధాలు, కుల ఉద్యమాలు, రైతు ఉద్యమాలు, గవర్నర్‌ జనరల్‌ల గురించి చదవాలి. ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి వేదకాలం, సింధు నాగరికత, జైనులు, బౌద్ధులు, మగధ సామ్రాజ్య విస్తరణ, మౌర్యుల పరిపాలనా కాలం నాటి అంశాలు, గుప్తులు, హర్షవర్ధనుడి కాలం గురించి చదవాలి. 


మధ్యయుగానికి సంబంధించి ముస్లింలు భారతదేశానికి రావడం, దిల్లీ సుల్తానులు, బహమనీలు, విజయనగర సామ్రాజ్యం, భక్తి సూఫీ ఉద్యమాలు, మొఘలులు, మరాఠాలు, శివాజీ గురించిన అంశాలు ముఖ్యమైనవి.  


శాతవాహనులు, కాకతీయులు, గోల్కొండ సుల్తానులు, ఆసఫ్‌జాహీలు, తెలంగాణలో వందేమాతర ఉద్యమం, ఆంధ్రమహా సభలు, పత్రికలు సంబంధించిన అంశాలు చదవాలి. 


తెలంగాణ ఉద్యమ చరిత్ర: ఈ విభాగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకూ అన్ని అంశాలూ చదవాలి. తెలంగాణలోని వివిధ జాతులు, జాతరలు, పండగలకు సంబంధించిన అంశాలు, ముల్కీ-నాన్‌ ముల్కీ అంశం, హెచ్‌ఎస్‌సీ స్థాపన, నిజాం సబ్జెక్ట్స్‌ లీగ్, హైదరాబాద్‌ సంస్థానం సైనిక చర్య ద్వారా భారత్‌లో విలీనం - పరిణామాలు. 


 1952 ముల్కీ ఉద్యమం, 1953-రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ (ఎస్‌ఆర్‌సీ), 1956 - పెద్ద మనుషుల ఒప్పందం, 1969 - తెలంగాణ ఉద్యమం, అష్ట సూత్రాల పథకం, జై ఆంధ్ర ఉద్యమం, ఆర్టికల్‌ 371-డి, 1980-2000 వరకు ఆవిర్భవించిన పార్టీలు, టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం, టీఆర్‌ఎస్‌ సభలు, 2009 తెలంగాణ ఉద్యమం, శ్రీకృష్ణ కమిటీ నివేదిక, తెలంగాణ ఏర్పాటు చదవాలి. 


 భారత రాజ్యాంగం: రాజ్యాంగం ఏర్పాటు, రచన, పౌరసత్వం, ప్రవేశిక, ప్రాథమిక హక్కులను తెలుసుకోవాలి. 


ఆర్థిక అంశాలు: ఈ విభాగంలో పంచవర్ష ప్రణాళిక, పేదరికం, నిరుద్యోగం, జనాభా, బడ్జెట్, ఆర్థిక సర్వే.. వీటికి వర్తమాన అంశాలను జోడిస్తూ చదవాలి. 


కరెంట్‌ అఫైర్స్‌: పరీక్ష తేదీకి 9 నెలల ముందు వరకు అంశాలను చదవాలి. సదస్సులు, అవార్డులు, క్రీడాంశాలు, ప్రధాన నియామకాలు, రాజీనామాలు, ప్రముఖుల మరణాలు, పర్యటనలు, శాస్త్ర-సాంకేతిక విశేషాలు, పుస్తకాలు-రచయితలు, ఎన్నికలు, సంస్థల సర్వేలపై దృష్టి పెట్టాలి.


సన్నద్ధత పూర్తయిన తర్వాత వీలైనన్ని మాక్‌ పరీక్షలు రాయాలి. ఈ ఫలితాలు విశ్లేషించుకోవాలి. ఏ అంశాల్లో వెనుకబడుతున్నారో చూసుకుని, వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తూ చదవాలి. ప్రతి మాక్‌ టెస్టులోనూ ఇదే పద్ధతి కొనసాగిస్తే 10 పరీక్షలు రాసేసరికి సిలబస్‌పై గట్టి పట్టు లభిస్తుంది. విజయావకాశాలు మెరుగవుతాయి. 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స‌గం ప్ర‌శ్న‌లు స‌రిగా రాస్తే చాలు!

‣ ఎడ్యుకేష‌న్ లోన్‌ ఎలా తీసుకోవాలి?

‣ స‌మూహంలో స‌త్తా చూపించండి! 

‣ ఎన్‌సీఎల్‌  405 ఉద్యోగాలు!

‣ గెలుద్దాం గ్రూప్‌-4!

‣ వాయుసేన‌లో పైలెట్ పోస్టు కావాలా?

‣ నాలుగేళ్ల డిగ్రీతో నేరుగా పీహెచ్‌డీ!

Posted Date : 08-12-2022

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు