• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నాలుగేళ్ల డిగ్రీతో నేరుగా పీహెచ్‌డీలోకి!

మూడు సంవత్సరాల డిగ్రీతోనే పీహెచ్‌డీ చేయవచ్చనే అపోహ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చింది. యూజీసీ జారీచేసిన 2022 పీహెచ్‌డీ నిబంధనల ప్రకారం- పీజీ లేకుండానే, నాలుగు సంవత్సరాల డిగ్రీలో 75% మార్కులు పొందినవారు నేరుగా పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంది. అంతేకానీ మూడు సంవత్సరాల డిగ్రీతో మాత్రం కాదు! 


గతంలో యూజీసీ జారీ చేసిన 2009, 2016 నిబంధనల ప్రకారం- పీహెచ్‌డీ చేయాలంటే డిగ్రీ తరువాత రెండు సంవత్సరాల పీజీ/ పీజీ తరువాత ఎంఫిల్‌ చేసి ఉండాలి. ఈ 2022 రెగ్యులేషన్స్‌ కంటే ముందునుంచే ఐఐటీలు, ఐఐఎంలు నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్‌ డిగ్రీతోనే పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. జాతీయ విద్యావిధానం 2020లో భాగంగా ఇంటర్మీడియట్‌ తరువాత ఏడాది సర్టిఫికెట్‌ ప్రోగ్రాం, రెండు సంవత్సరాల డిప్లొమా, మూడు సంవత్సరాల డిగ్రీ, నాలుగు సంవత్సరాల డిగ్రీ ఆనర్స్‌ ప్రోగ్రాం, మూడేళ్ల డిగ్రీ చేసినవారికి రెండేళ్ల పీజీ, నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్‌ చేసినవారికి ఏడాది పీజీ ప్రోగ్రాంలు అమల్లోకి వచ్చాయి.  

విద్యార్హతలు

దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో పీహెచ్‌డీలో పరిశోధన నాణ్యతను పెంచడానికి యూజీసీ ఎప్పటికప్పుడు రకరకాల రెగ్యులేషన్స్‌ను జారీ చేస్తుంది. మొదటి రెగ్యులేషన్‌ని 2009లో, రెండో రెగ్యులేషన్‌ని 2016లో జారీ చేసింది. ఇటీవల అమల్లోకి వచ్చిన జాతీయ విద్యావిధానం 2020కి అనుగుణంగా మూడో రెగ్యులేషన్‌ని 2022లో జారీ చేసింది. దీని ప్రకారం- నాలుగేళ్ల (8 సెమిస్టర్లు) బ్యాచిలర్‌ డిగ్రీ తర్వాత ఏడాది (2 సెమిస్టర్లు) పీజీ చేసినవారు, మూడేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ తర్వాత రెండేళ్ల (4 సెమిస్టర్లు) పీజీ చేసినవారు అర్హులు. పీహెచ్‌డీ చేయాలంటే పీజీలో కనీసం 55 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డిఫరెంట్లీ ఏబుల్డ్, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్ధులకు 5 శాతం మార్కుల సడలింపు ఉంటుంది. నాలుగు సంవత్సరాల (8 సెమిస్టర్లు) బ్యాచిలర్‌ డిగ్రీలో 75 శాతం (రిజర్వ్‌డ్‌ కేటగిరీలకు 70 శాతం) మార్కులు పొందినవారు కూడా పీహెచ్‌డీ చేయడానికి అర్హులే. ఎంఫిల్‌లో 55 శాతం (రిజర్వ్‌డ్‌ కేటగిరీలకు 50 శాతం) మార్కులు పొందినవారు కూడా పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు.


ప్రోగ్రాం వ్యవధి


పీహెచ్‌డీ ప్రోగ్రాంని కోర్సు వర్క్‌తో కలిపి కనిష్ఠంగా మూడేళ్లలో గరిష్ఠంగా ఆరేళ్లలో పూర్తిచేయాలి. ఆయా యూనివర్సిటీల నియమనిబంధనలను అనుసరించి రీ-రిజిస్ట్రేషన్‌తో మరో రెండేళ్లు, అంటే గరిష్ఠంగా 8 సంవత్సరాల్లో పూర్తిచేయాలి. మహిళా పరిశోధకులు, 40 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్నవారు మరో రెండేళ్ల పొడిగింపుతో గరిష్ఠంగా 10 సంవత్సరాల్లో పీహెచ్‌డీని పూర్తిచేయాలి.

అడ్మిషన్‌ విధానం

పీహెచ్‌డీ ప్రోగ్రాంలో అడ్మిషన్‌ వివిధ పద్ధతుల్లో/దశల్లో చేపట్టవచ్చు. వీటిలో ముందుగా యూజీసీ నెట్‌ జేఆర్‌ఎఫ్‌/ యూజీసీ సీ‡ఎస్‌ఐఆర్‌ నెట్‌ జేఆర్‌ఎఫ్‌/ గేట్‌/ సీడ్‌ (కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌)/ఇతర జాతీయ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి, ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పించవచ్చు. ఉన్నత విద్యాసంస్థ సొంతంగా ప్రవేశ పరీక్ష నిర్వహించుకోవచ్చు. ఈ ప్రవేశ పరీక్షలో 50 శాతం మార్కులు రిసెర్చ్‌ మెథడాలజీకీ, 50 శాతం మార్కులు సంబంధిత సబ్జెక్టుకూ కేటాయించాలి. ఈ ప్రవేశ పరీక్షలో 50 శాతం మార్కులు పొందినవారే ఇంటర్వ్యూకు అర్హులవుతారు. రిజర్వేషన్‌ ఉన్నవారికి 5 శాతం మార్కుల సడలింపు ఉంటుంది. ఇంటర్వ్యూకు ఎంతమందిని పిలవాలనేది ఆయా యూనివర్సిటీలో ఉన్న ఖాళీల ఆధారంగా నిర్ణయిస్తారు. రాత పరీక్షకు 70 శాతం వెయిటేజి, ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజి ఇచ్చి మెరిట్‌ లిస్ట్‌ తయారుచేసి ప్రవేశాలు నిర్వహించాలి. భవిష్యత్తులో కేంద్ర విశ్వవిద్యాలయాలన్నింటికీ జాతీయస్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించే దిశలో ప్రయత్నాలు మొదలయ్యాయి.


పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశం పొందినవారు కనీసం 12 క్రెడిట్లతో కోర్స్‌ వర్క్‌ కచ్చితంగా చేయాలి. దీంట్లో భాగంగా ‘రిసెర్చ్‌ అండ్‌ పబ్లికేషన్‌ ఎథిక్స్‌’, ‘రిసెర్చ్‌ మెథడాలజీ’లు ముఖ్య భాగంగా ఉండాలి. కోర్స్‌ వర్క్‌లో కొన్ని కోర్సులను ఆన్‌లైన్‌ పద్ధతిలో కూడా చేయవచ్చు. పీహెచ్‌డీని కొనసాగించడానికీ, థీసిస్‌ సమర్పించడానికీ స్కాలర్స్‌ అందరూ కోర్సు వర్క్‌లో కనీసం 55% మార్కులు పొందాలి. పీహెచ్‌డీ స్కాలర్‌లు అందరూ విధిగా బోధన/ బోధన పద్ధతులు/ అకడెమిక్‌ రైటింగ్‌లో శిక్షణ పొందవలసి ఉంటుంది. ప్రతి రిసెర్చ్‌ స్కాలర్‌ వారానికి కనీసం 4 నుంచి 6 గంటల వరకు బోధన/ పరిశోధన సహాయకునిగా ట్యుటోరియల్స్‌/ ప్రాక్టికల్స్‌ /మూల్యాంకనంలో భాగం కావాలి.

పార్ట్‌ టైమ్‌ 

ఈ రెగ్యులేషన్‌లో పొందుపరిచిన అన్ని నిబంధనలకూ లోబడి పార్ట్‌ టైమ్‌ పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించవచ్చు. కాకపోతే ఈ అభ్యర్థుÄలు వారు ఉద్యోగం చేసే చోటనుంచి ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ తీసుకొని రావాలి. ఆ సర్టిఫికెట్‌లో మూడు విషయాలు స్పష్టంగా పేర్కొనాలి. మొదటిది అభ్యర్థి పార్ట్‌ టైమ్‌ పీహెచ్‌డీ చేయడానికి అనుమతి, రెండోది అతని/ ఆమె అధికారిక విధులు పరిశోధన చేయడానికి అవసరమైన సమయం అనుమతిస్తాయని, చివరిగా అవసరమైతే కోర్స్‌ వర్క్‌ పూర్తిచేయడానికి కావాల్సిన సెలవులు ఇవ్వడం. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ నిబంధనల ప్రకారం దూరవిద్య/ ఆన్‌లైన్‌ పద్ధతిలో పీహెచ్‌డీ ప్రోగ్రాంను నిర్వహించకూడదు. 

 పరిశోధన పత్రాలు 

గత రెండు రెగ్యులేషన్లలో పీహెచ్‌డీ థీసిస్‌ సమర్పించాలంటే పరిశోధన పత్రాలను ప్రచురించడం, సెమినార్‌/ కాన్ఫరెన్స్‌లో పత్ర సమర్పణ కచ్చితంగా చేయాలనే నిబంధన ఉండేది. వివిధ కారణాలవల్ల ఈ రెగ్యులేషన్‌లో వాటి ప్రస్తావన లేదు. రెగ్యులేషన్‌లో ఆ నిబంధన లేనప్పటికీ పరిశోధన పత్రాలను ప్రచురించడం, సెమినార్‌/ కాన్ఫరెన్స్‌లో పత్ర సమర్పణ చేయడం శ్రేయస్కరం. భవిష్యత్తులో మీరు బోధన వృత్తిలోకి ప్రవేశించాలంటే పరిశోధన పత్రాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఒకవేళ మీరు పరిశోధన పత్రాలు రాయకుండానే పీహెచ్‌డీ చేస్తే జీవితకాలం అధ్యాపక/ పరిశోధక వృత్తిలోకి ప్రవేశించే అవకాశం కోల్పోతారు. 


యూజీసీ 2022 రెగ్యులేషన్స్‌ ప్రకారం ఏ ఉన్నత విద్యాసంస్థ కూడా ఎంఫిల్‌ ప్రోగ్రాంను నిర్వహించరాదు. 2009/2016/2022 యూజీసీ రెగ్యులేషన్లు పీహెచ్‌డీ చేయడానికీ, డిగ్రీ ప్రదానం చేయడానికీ అవసరమైన కనీస ప్రమాణాలు మాత్రమే. మీరు జాతీయ/ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడాలంటే ఈ నిబంధనల్లో పేర్కొన్నవాటికంటే అత్యున్నత స్థాయిలో పరిశోధన చేయాలి. నాణ్యమైన అంతర్జాతీయ పరిశోధనా జర్నల్స్‌లో పరిశోధన పత్రాల్ని ప్రచురించి, జాతీయ/అంతర్జాతీయ సెమినార్లలో పత్ర సమర్పణలు చేసి, అంతర్జాతీయ స్థాయి థీసిస్‌ తయారుచేసినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది!


జాతీయ/ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడాలంటే నిబంధనల్లో పేర్కొన్నవాటికంటే అత్యున్నత స్థాయిలో పరిశోధన చేయాలి. 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఊహ‌ల‌కు రూప‌మిస్తూ... ఉత్ప‌త్తులు రూపొందిస్తూ!

‣ పవర్‌ గ్రిడ్‌లో కొలువు కావాలా?

‣ ఉన్నాయా మీకు ఈ ఉద్యోగ లక్షణాలు?

‣ బీమా పథకాలను రూపొందిస్తారా?

Posted Date : 07-12-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌