• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉన్నాయా మీకు ఈ ఉద్యోగ లక్షణాలు?

సంస్థలు ఏం ఆశిస్తున్నాయి?

ఏటా లక్షల మంది విద్యార్థులు పట్టాలు పుచ్చుకుని విద్యాలయాల నుంచి బయటకు వస్తుంటారు. వీరిలో కొద్దిమందికి మాత్రమే మంచి అవకాశాలు లభిస్తుంటాయి. అందులోనూ ప్రస్తుతం ఉన్న ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో ఇప్పటికే ఉన్న గ్రాడ్యుయేట్లు, కొత్తగా పాసయ్యేవారు... ఉద్యోగం విషయంలో కొద్దిగా భయపడుతుండటం సహజం. జాబ్‌ వస్తుందా రాదా, వచ్చినా మంచి కంపెనీలోకి వెళ్లగలమా.. ఇలా అనేక సందేహాలు ఉంటాయి. అయితే మనం కొన్ని విషయాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెడితే... ఈ భయాలేవీ అక్కర్లేదు. అవేంటో చూద్దాం.


ప్రపంచ, దేశ ఆర్థిక పరిస్థితుల్లో ఒడుదొడుకులనేవి సహజం. ముఖ్యంగా ఆ ప్రభావం ఐటీ వంటి రంగాలపై అధికంగా ఉంటుంది. గత ఇరవై ఏళ్లలో ఈ రంగం ఎన్నో రెసిషన్లనూ, బూమ్‌లనూ చూసింది. అయితే అన్నింటికీ అతీతంగా ఎదుగుతూ వచ్చింది. ఇందులో కెరియర్‌ను ఆశించేవారు ఈ విషయాన్ని మొదట తెలుసుకోవాలి. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు అయినా ఏడాది, ఏడాదిన్నరలో సర్దుకుంటాయి. అందువల్ల ఇదంతా తాత్కాలికమేనని గుర్తించాలి. ఏ ఐటీ కంపెనీ అయినా ఈ కింది లక్షణాలు ఉన్న వారినే ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అందువల్ల వీటిని అలవరుచుకోవడానికి కృషిచేయాలి.


క్రమశిక్షణ, నిబద్ధత


‘పీపుల్‌ గెట్‌ హైర్డ్‌ అండ్‌ పీపుల్‌ గెట్‌ ఫైర్డ్‌’ అనేది ఐటీలో నానుడి. అయితే నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించేవారు, సంస్థకు విధేయంగా ఉండేవారు, క్రమశిక్షణ, నిబద్ధత ఉన్నవారు... ఎప్పుడూ సంస్థలకు తక్కువగానే దొరుకుతూ ఉంటారు. ఇలాంటి వారికి డిమాండ్‌ ఉంటూనే ఉంటుంది. ఎలాంటి తీవ్ర మాంద్యం పరిస్థితుల్లోనైనా ఇటువంటి లక్షణాలు కలిగిన ఉద్యోగులను సంస్థలు వదులుకోలేవు.


తేలిగ్గా తీసుకోవద్దు


ఏ పనినైనా తేలికగా తీసుకునే మనస్తత్వం, వర్క్‌లో శ్రద్ధ పెట్టకపోవడం, బృందంతో మంచి సంబంధాలు లేకపోవడం వంటివి చాలామందిలో కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి కష్ట సమయాల్లో మొదట వేటు పడేది ఇలాంటివారిపైనే! కెరియర్‌లోనూ, కంపెనీలోనూ సీరియస్‌నెస్‌ అవసరం. మనం చేసే ప్రతి పనీ సంస్థ దృష్టిలో ఉంటుందనే విషయాన్ని గమనించాలి.


స్థిరత్వం


ఉద్యోగానికి కావాల్సిన కనీస నైపుణ్యాలు నేర్చుకుని వస్తే చాలు... తమకేవి కావాలో నేర్పించేందుకు చాలా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. కావాల్సినదల్లా ఉద్యోగి తమతో కనీసం నాలుగైదేళ్లు కలిసి పనిచేస్తాడనే నమ్మకం కలిగించడమే. చాలామందిలో తరచూ ఉద్యోగాలు మారుతుండటం కనిపిస్తూ ఉంటుంది. పట్టుమని రెండేళ్లు కూడా ఒకచోట పనిచేయరు. చిన్నపాటి అధిక జీతం ఇస్తామంటే చాలు, వెళ్లిపోవడానికి చూస్తారు. ఇలాంటివారిని కంపెనీలు సులభంగా గుర్తించగలవు. ఏ సంస్థ అయినా పునాదుల్లాంటి నిపుణులు కావాలని ఆశ పడుతుంది. అది మీరే అని నిరూపించుకోవాలి.


టైపింగ్‌


ప్రస్తుతం ఏ కాలేజీలోనూ టైపింగ్‌ గురించి శ్రద్ధగా నేర్పించడం లేదు. కానీ ఉద్యోగంలో చేరేవారికి ఇది చాలా ముఖ్యమైన నైపుణ్యం. కోడింగ్‌లోనైనా, ఇతర దస్త్రాలు రాసేటప్పుడైనా టైపింగ్‌ వేగంగా చేయడం అవసరం. లేదంటే కంపెనీ పని గంటలు నష్టపోతుందని భావిస్తుంది. అభ్యర్థులు దీన్ని బాగా సాధన చేయాలి.


మానసికంగా...


ఐటీ అనేకాదు... ఏ ఉద్యోగంలోనైనా సరే మానసికంగా దృఢంగా ఉండటం అవసరం. పనిచేసేచోట రకరకాలైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం తెలియాలి. మానసికంగా బలంగా ఉండాలి. ఎమోషనల్‌ కోషంట్‌ను పెంచుకోవడం నేర్పించేందుకు కొన్ని కోర్సులు ఉన్నాయి. వాటిని చేయడం ద్వారా దీని గురించి మరింత తెలుసుకోవచ్చు. ‘ఎమోషనల్లీ ఇంటెలిజెంట్‌’ అయినవారు కంపెనీలకు బాగా నచ్చుతారు. మనమీద మనకు నమ్మకం, బోల్డ్‌నెస్‌ ఉండాలి.


ఆరోగ్యం


శారీరకంగానూ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలి. తరచూ అనారోగ్య కారణాలతో సెలవులు పెట్టేవారితో ఎవరికైనా ఇబ్బందే. ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా బలహీనంగా ఉంటుంటారు. హిమోగ్లోబిన్‌ సరిపడా లేకపోతే నీరసంతోపాటు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పవు. వీరు చురుగ్గా ఆలోచించలేరు. అందువల్ల మంచి ఆహారం తీసుకోవడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం నేర్చుకోవాలి.


నైపుణ్యాలు

ప్రస్తుతం ఎథికల్‌ హ్యాకింగ్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా ఎనాలిసిస్, నెట్‌వర్కింగ్, టెస్టింట్‌ వంటి వాటికి బాగా ఆదరణ లభిస్తోంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక వీటిలో నచ్చినవి ఏవైనా కనీసం రెండింటి గురించి నేర్చుకోవాలి. ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు ‘నాకు ఇవి వచ్చు... మీరు ఇంకా ఏమైనా కావాలి అంటే నేర్చుకుంటాను’ అని చెప్పేలా ఉండాలి. 

ఆంగ్ల నైపుణ్యం


ఇప్పుడు విద్యార్థుల్లో చాలామందికి ఇంగ్లిష్‌ తెలుసు, అర్థమవుతుంది, మాట్లాడగలరు. కానీ మాట్లాడటం అంటే అవతలి వారిని మన భాషతో సౌకర్యవంతంగా భావించేలా చేయడం. తడబడకుండా ధారాళంగా ఆంగ్లంలో మాట్లాడటం రావాలి. ఐఈఎల్‌టీఎస్, టోఫెల్‌ వంటి పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతారో ఆ స్థాయిలో చదవాలి. ఫీజులు కట్టి ఆ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు కానీ రాస్తే పాసయ్యే స్థాయిలో ప్రావీణ్యం సంపాదించాలి.


 ఎప్పుడో ఉద్యోగంలో చేరేముందు నేర్చుకుందాంలే అనే ఆలోచన ఉండకూడదు. ఇంజినీరింగ్‌ చదివేవారైతే మూడో ఏడాది నుంచే ఉద్యోగ ప్రపంచానికి అన్నివిధాలా సిద్ధం కావాలి.


 ఓ సంవత్సరంలో పరిస్థితి దాదాపుగా సాధారణ స్థితికి వచ్చేస్తుందని అంచనా. అందువల్ల ఎక్కువ కంగారు పడాల్సిన పనిలేదు. కష్టపడేతత్వం, నిబద్ధత, ఆశావహ ధోరణి ఉన్నవారికి... అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి!


కారణాలేంటి?


ప్రస్తుత పరిస్థితికి చాలా కారణాలున్నాయి. కొవిడ్‌ తగ్గిన తర్వాత నెలకొన్న పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ఇతర దేశాల ఆర్థిక స్థితిగతులు... అన్నీ కలసి మాంద్యం ప్రభావానికి కారణమయ్యాయి. కరోనా సమయంలో ప్రజల జీవనశైలి మారడం వల్ల ఆన్‌లైన్‌ సేవలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీనివల్ల కంపెనీలపై ఒత్తిడి పెరిగి ఎక్కువ మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. ఆ సమయంలో లాభాలు కూడా బాగానే వచ్చాయి. 


   లాక్‌డౌన్లు ఎత్తేసిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. సాధారణ జీవనశైలి మొదలుకావడంతో కొన్ని కంపెనీల ఉత్పత్తులు/సేవలకు డిమాండ్‌ అమాంతం పడిపోయింది. దీనివల్ల ఖర్చులు భారమై... అనివార్యంగా ఉద్యోగులను తొలగించాల్సి వస్తోంది. అయితే ఇది ఇలాగే కొనసాగుతుంది అనుకోవడానికి లేదు. అతి త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి.


అప్‌స్కిలింగ్‌


అప్‌స్కిలింగ్‌ అనేది ఐటీలో చాలా ముఖ్యమైన లక్షణం. ఏటా కొత్త టెక్నాలజీ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ఎంతోకొంత నేర్చుకోగలిగితేనే పరిశ్రమ తాజా అవసరాలు ఎలా ఉన్నాయనేది అర్థమవుతుంది. వాటిని తెలుసుకోగలిగినప్పుడే మనమూ కెరియర్‌లో ఉన్నతిని ఆశించగలుగుతాం.


  రానున్న 5జీ టెక్నాలజీ ఒక విప్లవం. ఇది మన జీవనశైలిని ఎంతో ప్రభావితం చేయనుంది. దీనివల్ల మెషిన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఐవోటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) వినియోగం ఎక్కువ అవుతుంది. దీని గురించి అధ్యయనం చేయడం అవసరం. ప్రతి ఐటీ ఉద్యోగికీ దీనిపై అవగాహన ఉండాలి.


 డేటా అనేది నిధి వంటిది. దీన్ని మేనేజ్, ఎనలైజ్‌ చేయడం నేర్చుకుంటే చక్కటి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు.


 విదేశాలకు వెళ్లాలి అనుకునేవారు తగిన ఏర్పాట్లు ముందునుంచే చేసుకోవాలి. పాస్‌పోర్ట్, వీసా, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పనులపై శ్రద్ధ పెట్టాలి. చాలావరకూ మల్టీనేషనల్‌ కంపెనీలు ఇప్పుడు మనదేశంలో ఆఫీసులు తెరిచాయి. అందువల్ల నేరుగా విదేశాలకు వెళ్లి జాబ్‌ చేయాలి అనుకునేకంటే... ఇక్కడ ముందు ఉద్యోగం తెచ్చుకుని, రెండుమూడేళ్లు పనిచేసి అక్కడికి వెళ్లడం అన్నివిధాలా బావుంటుంది.


డాక్యుమెంటేషన్‌ నైపుణ్యాలు


అభ్యర్థికి ఉండాల్సిన మరో ముఖ్యమైన నైపుణ్యం డాక్యుమెంటేషన్‌ స్కిల్స్‌. ఒక ప్రాజెక్టులో పనిచేసేటప్పుడు క్లయింటుకు దాన్ని వివరించేలా వివిధ దశల్లో డాక్యుమెంటేషన్‌ అవసరం అవుతుంది. కానీ అభ్యర్థులకు దీని గురించి కనీసం తెలియడం లేదు. ఒక విషయాన్ని వీలైనంత తక్కువ మాటల్లో చక్కగా వివరించగలగడం ఒక కళ. పేజీలకు పేజీలు నివేదికలు చదివే సమయం పెద్దస్థాయి వ్యక్తుల వద్ద ఉండదు. అందువల్ల దీన్ని సాధన చేయాలి.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డిజిటల్‌ అక్షరాస్యత... మీకుందా?

‣ క్లిష్ట స‌మ‌యాల్లోనూ ఉద్యోగ సాధ‌న ఎలా?

‣ ఒక్క ఛాన్స్ కాదు... అనేక ఛాన్సులు!

‣ డిగ్రీతో ఐఐటీలో ఉద్యోగాలు

Posted Date : 22-11-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.