• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టాప్‌ 5 ఉద్యోగాలు ఇవే!

టీమ్‌లీజ్‌ సర్వేలో వెల్లడి

చదువులు పూర్తి చేసుకుని జాబ్‌ మార్కెట్‌లో అడుగుపెట్టే అభ్యర్థులకు సందేహం ఉంటుంది... ప్రస్తుతం సంస్థలు ఏ ఉద్యోగాలను అధికంగా భర్తీ చేస్తున్నాయా అని! 2022 పూర్తవుతున్న తరుణంలో ఆ ప్రశ్నకు జవాబుగా ఈ సర్వే వచ్చింది.


టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ అనే సంస్థ కొత్తగా ఉద్యోగాల్లోకి ప్రవేశించేవారి కోసం ఒక సర్వే నిర్వహించింది. తయారీ, సేవారంగం, టెక్నాలజీ సెక్టార్‌లో ఉన్న 865 చిన్న, మధ్యతరహా, పెద్దస్థాయి సంస్థలను ఇందులో భాగంగా ప్రశ్నించింది. ఆ జవాబుల ఆధారంగా ప్రస్తుతం కొత్తవారు ప్రవేశించేందుకు టాప్‌ 5 ఉద్యోగాలు ఏం ఉన్నాయో గుర్తించింది. అవేంటో మీరూ చూసేయండి. 


అఫిలియేట్‌ మార్కెటింగ్‌ స్పెషలిస్ట్‌ 


అఫిలియేట్‌ మార్కెట్‌ ప్రస్తుతం ఎన్నడూ లేనంతగా ఊపందుకుంది. ఒక సంస్థ ఉత్పత్తి లేదా సేవలకు మార్కెటింగ్‌ చేయడం ద్వారా వీరు కమీషన్‌ ఆర్జిస్తారు. వీరికి నచ్చిన ప్రొడక్ట్‌ను అనుకూలమైన చోట మార్కెట్‌ చేసే వీలుంటుంది. ప్రతి కొనుగోలుపైనా మార్జిన్‌ లభిస్తుంది. వ్యాపారంలో ఆసక్తి ఉన్నవారికీ, మార్కెట్‌పై పట్టు సాధించాలి అనుకునేవారికీ ఇది అనుకూలమైన రంగం. తమ ఉత్పత్తులను వేగంగా, తక్కువ ఖర్చుతో, ప్రయాస లేకుండా మార్కెట్‌ చేయాలి అనుకునే సంస్థలు ఈ స్పెషలిస్ట్‌లను నియమించుకుంటున్నాయి.


వెల్‌నెస్‌ స్పెషలిస్ట్‌


క్రమపద్ధతిలో సాగే జీవనశైలి గురించి ఇప్పుడు అవగాహన పెరుగుతోంది. వెల్‌నెస్‌ స్పెషలిస్ట్‌లకు తమ క్లయింట్‌కు శారీరక దృఢత్వ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, ఎవరి అవసరాలకు వారికి తగిన విధంగా వెల్‌నెస్‌ ప్రణాళికలు రచించడం లాంటివి చేస్తారు. వీరికి కౌన్సెలింగ్, ప్రవర్తనను అంచనా వేయడం, కోచింగ్‌ ఇవ్వడంపై అవగాహన ఉండటం ఉపకరిస్తుంది. మెడికల్‌ క్లినిక్‌లు, జిమ్‌లు, స్పాలు, కమ్యూనిటీ సెంటర్లు, ఇతర కార్పొరేట్‌ కంపెనీల్లో వీరిని నియమించుకుంటున్నారు. వ్యక్తుల ఆరోగ్య, మానసిక పరిస్థితిని అంచనా వేసి జీవనశైలిలో మార్పులు సూచించడం, మెరుగైన జీవన విధానాలను ప్రోత్సహించడం వీరి ప్రధాన విధి.


సైట్‌ రిలయబిలిటీ ఇంజినీర్‌


ఉత్తమమైన సిస్టమ్స్‌ను రూపొందించడం కోసం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ మెలకువలను ఐటీ ఇంజినీరింగ్‌ ప్రక్రియలతో కలిపేవారే సైట్‌ రిలయబిలిటీ ఇంజినీర్‌. వీరు అప్లికేషన్స్, డేటాబేస్, హార్డ్‌వేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌.. ఇలా అన్నింటినీ చూసుకోవాలి. వెర్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్స్, ఏడబ్ల్యూఎస్‌పై అవగాహన ఉన్నవారు ఇందులో మరింత రాణించగలరు. కోడింగ్‌పై ఆసక్తి ఉండి, డేటాబేస్‌ను అర్థం చేసుకున్న వారికి ఇది మంచి కెరియర్‌ ఎంపిక. 


మాలిక్యులర్‌ బయాలజిస్ట్‌


మనుషులు, జంతువులు, మొక్కల జన్యువులు - సంబంధాలపై అధ్యయనం చేసేదే మాలిక్యులర్‌ బయాలజీ. సెల్‌ టైప్స్, డీఎన్‌ఏ, మానిఫెస్టేషన్స్‌ వంటి వాటిని అధ్యయనం చేసేందుకు మాలిక్యులర్‌ బయాలజిస్టులు బయాలజీ, ఫిజియాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జెనెటిక్స్‌ వంటివి చదువుకుంటారు. వీరికి డీఎన్‌ఏ ఎక్స్‌ట్రాక్షన్, పాలిమర్స్‌ చెయిన్‌ రియాక్షన్‌లపై అవగాహన ఉండాలి. సెల్‌ పనితీరుపై అధ్యయనం చేసే ఈ నిపుణులకు అధిక డిమాండ్‌ ఉన్నట్లు  నివేదిక పేర్కొంది.


యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ రిసెర్చర్‌


వీరికి ప్రొడక్ట్‌ డిజైన్‌ ప్రక్రియలో సమాచారాన్ని సేకరించడం, అధ్యయనం చేయడం, అనలైజ్‌ చేయడం వంటి పనులుంటాయి. వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని తగిన సేవలు అందించడం వీరి విధి. విశ్లేషణ సామర్థ్యాలు అవసరం. ఏ ఉత్పత్తి అయినా అంతిమంగా వినియోగదారుల సంతృప్తి కోసమే. వాళ్లు ఉత్పత్తిని   ఎలా భావిస్తున్నారనేది అధ్యయనం చేసి, మెరుగైన సేవలు అందించేందుకు తోడ్పడేవారే యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ రిసెర్చర్‌.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇంటర్మీడియట్‌తో ఇవిగో ఉద్యోగాలు

‣ ఏపీ పోలీస్‌ కొలువుకు సిద్ధ‌మేనా?

‣ పోలీస్ ఉద్యోగాల మొయిన్స్‌లో మెర‌వాలంటే?

‣ కోడింగ్ రాక‌పోయినా ఐటీ ఉద్యోగం!

‣ స‌గం ప్ర‌శ్న‌లు స‌రిగా రాస్తే చాలు!

‣ ఎడ్యుకేష‌న్ లోన్‌ ఎలా తీసుకోవాలి?

‣ స‌మూహంలో స‌త్తా చూపించండి! 

‣ ఎన్‌సీఎల్‌  405 ఉద్యోగాలు!

‣ గెలుద్దాం గ్రూప్‌-4!

Posted Date : 10-12-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌