‣ పెద్దపెద్ద వ్యాపార సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు
ఏ పనైనా వందశాతం కచ్చితత్వంతో చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. కొన్నిసార్లు ఎంతో కొంత లోపం ఉండక మానదు. కానీ కొన్ని వేల మంది పనిచేసే సంస్థల్లో అందరి వద్దా ఇదే పరిస్థితి ఉంటే... ఆ ఎంతోకొంత లోపం కాస్తా పెద్ద కొండై కూర్చుంటుంది. అందుకే పనిలో కచ్చితత్వం అవసరం. ఆ పర్‌ఫెక్షన్ సాధించేందుకు సాయం చేసేదే... లీన్ 6 సిగ్మా మెథడాలజీ!
వివిధ పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రక్రియలో జరిగే జాప్యాన్ని నివారించడం, లోపాలను సవరించడం వంటి పనులకు లీన్ 6 సిగ్మాను ఉపయోగిస్తారు. పది లక్షల యూనిట్లకు 3.4 కంటే తక్కువ లోపాలు ఉండేలా చేయడం దీని లక్ష్యం. అలాగే ఇది సంస్థల వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుంది. ఉద్యోగుల్లో ఉత్పాదకతను, సంస్థ పట్ల విధేయతను పెంచుతూ లాభార్జనకు ఉపకరిస్తుంది.
‣ ఎప్పటికప్పుడు మారుతున్న మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మోటరోలా కంపెనీ ‘క్వాలిటీ మేనేజ్‌మెంట్ ప్రాసెసెస్’ అనే ప్రక్రియను 1986లోనే ప్రారంభించింది. ఏటికేడు దీన్ని నవీకరించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఇదే లీన్6 సిగ్మాలా అవతరించింది.
లీన్ 6 సిగ్మాలో ప్రధానంగా రెండు మెథడాలజీలు ఉన్నాయి. అవి డీఎంఏఐసీ, డీఎంఏడీవీ. ఇవి వేరువేరు పద్ధతులు పాటిస్తాయి.
1. DMAIC - ఇది డేటా ఆధారిత విధానం. వినియోగదారులకు మేలైన సేవలు అందించేందుకు ఇప్పటికే ఉన్న పద్ధతులు, వస్తువులను ఉపయోగిస్తుంది. ఇందులో D-డిఫైన్, M-మెజర్, A-ఎనాలిసిస్, I-ఇంప్రూవ్, C-కంట్రోల్ అన్న విషయాలను సూచిస్తాయి. వస్తు ఉత్పత్తి, సేవలు అందించే సంస్థల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు.
2. DMADV - ఇది వినియోగదారుడికి మేలైన సేవలు అందించడంలో నూతన పద్ధతులు కనిపెట్టేలా ప్రోత్సహిస్తుంది. ఇందులో D-డిఫైన్, M-మెజర్, A-ఎనాలిసిస్, D-డిజైన్, V-వ్యాలిడేట్‌ను సూచిస్తాయి. ఇప్పటికే ఉన్న పద్ధతులు సరిపోవడం లేదు అని భావించినప్పుడు దీన్ని వినియోగిస్తారు.
‣ ఈ రెండు మెథడాలజీలను విభిన్నమైన వ్యాపార రంగాల్లో ఉపయోగిస్తారు. వీటిని నేర్చుకోవాలి అనుకున్నవారు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్‌కు వెళ్లవచ్చు. ఇందులో కాజ్ అండ్ ఎఫెక్ట్ అనాలిసిస్, ఫ్లో చార్ట్, పరేటో చార్ట్, హిస్టోగ్రామ్, చెక్ షీట్, స్కాటర్ ప్లాట్, కంట్రోల్ చార్ట్ వంటి స్టాటిస్టికల్, డేటా ఎనాలిసిస్ టూల్స్ ఉన్నాయి.
ఈ దశాబ్దంలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది విపరీతంగా పెరిగింది. ఈ మారుతున్న దశలో కంపెనీలకు కొంత టెక్ సపోర్ట్ అవసరం అయ్యింది. 6 సిగ్మా ఇటువంటి అవసరాలను తీరుస్తోంది. ఇది మేనేజ్‌మెంట్ టూల్స్, టెక్నిక్‌ల కలయిక. డేటా ఆధారంగా పనిచేస్తుంది. దీని పేరులో గ్రీక్ గుర్తును ఉపయోగిస్తారు. ఇది కచ్చితత్వంతో కూడిన ప్రక్రియను సూచిస్తుంది. సమస్యను గుర్తించడం, దాన్ని పరిష్కరించడం ఇందులో ప్రధాన అంశాలు.
ఇందులో 5 ప్రధాన అంశాలు ఉన్నాయి.
వినియోగదారుడిపైనే దృష్టి: ‘వినియోగదారుడే ప్రధానం’ అనే సూత్రాన్ని 6 సిగ్మా పాటిస్తుంది. కస్టమర్ అవసరాలేంటి, ఆలోచనలేంటి, సంస్థ పట్ల ఎలా ఆకర్షితుణ్ని చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి... ఇలా అన్ని ప్రశ్నలకూ ఇందులో జవాబు దొరుకుతుంది. అంతిమంగా వీలైనంతగా వినియోగదారుడి సంతృప్తినీ, నమ్మకాన్నీ గెలుచుకునేలా ప్రోత్సహిస్తుంది.
వృథా తగ్గింపు: ఉత్పత్తి ప్రక్రియలో వృథా ఎక్కడ జరుగుతుందో గుర్తించేలా అంచనా వేస్తుంది. ఉన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఏచోట ముడి సరుకులు, పని గంటలు వృథా అవుతున్నాయనే విషయాన్ని గమనిస్తుంది.
సమస్య గుర్తింపు: ఒక్కసారి సమస్యను గుర్తిస్తే, లోపాలను సవరించేందుకు ఏం చేయాలో తెలుస్తుంది. ఉత్పత్తికి అదనపు విలువ జతచేయని ఏ అంశాన్నయినా విడిచి పెట్టేస్తుంది. ఇందుకు కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల ప్రక్రియలో ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.
భాగస్వామ్యం: ఈ పనిలో అందరినీ భాగస్వాములను చేస్తుంది. బృందంలో అంతా సమన్వయంతో పనిచేసినప్పుడు సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. అందుకే 6 సిగ్మా ప్రాథమికాంశాలపై సంస్థలు సభ్యులందరికీ అవగాహన కల్పిస్తున్నాయి. దీంతో ప్రాజెక్ట్‌ను రీ-డిజైన్ చేయాల్సిన అవసరం గానీ, వైఫల్యాలు గానీ రావడం తగ్గుతుంది.
మార్పును స్వీకరించడం:
6 సిగ్మా లక్ష్యాల్లో ‘బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్’ కూడా ఒకటి. అనవసర ప్రక్రియలు తొలగిస్తూ ఉన్నపుడు వ్యాపారం ఎప్పటికప్పుడు స్థిరపడుతుంది. ఆ సమయం, శ్రమను మరోచోట వినియోగించే అవకాశం కలుగుతుంది. పని కూడా తప్పులు లేకుండా జరుగుతుంది.
స్థాయిని సూచించే బెల్ట్
దీనిలో నైపుణ్య స్థాయిని మార్షల్ ఆర్ట్స్ మాదిరిగా బెల్ట్స్‌లా చెబుతారు. వైట్, యెల్లో, గ్రీన్, బ్లాక్, మాస్టర్ బ్లాక్ లెవెల్స్‌గా విభజించారు. ప్రారంభంలో వైట్ బెల్ట్‌తో మొదలుపెట్టి అంచెలంచెలుగా నేర్చుకోవాలి.
ఉద్యోగాలు
మాన్యుఫాక్చరింగ్ ఇంజినీర్లు, ఆపరేటింగ్ సిస్టం స్పెషలిస్ట్ వంటి పోస్టుల్లో ఈ నిపుణులు పనిచేయవచ్చు. ఇవేకాక 6 సిగ్మా అనలిస్ట్, బ్లాక్ బెల్ట్, కన్సల్టెంట్, డైరెక్టరేట్ ఆఫ్ ఆపరేషనల్ ఎక్సలెన్స్, ఫంక్షనల్ ప్రాజెక్ట్ లీడ్, ప్రాజెక్ట్ మేనేజర్, బిజినెస్ ప్రాసెస్ మేనేజర్ వంటి కొలువుల్లో పనిచేయవచ్చు.
తేడా ఏంటి?
6 సిగ్మా, లీన్‌కు మధ్య చిన్న తేడా ఉంది. లీన్ అనేది కేవలం ఉత్పత్తిపైనే కాకుండా కంపెనీలోని మొత్తం అన్ని వ్యవస్థలపైనా దృష్టి సారించే ప్రక్రియ. కానీ 6 సిగ్మా ప్రత్యేకంగా ఉత్పత్తిలో జరుగుతున్న జాప్యం, లోపాల నివారణకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. ఈ రెండింటి కలయికే లీన్ 6 సిగ్మా. ఇది మొత్తం ఉత్పత్తి, కంపెనీలో లోపాలు అన్నింటినిపైనా దృష్టి సారిస్తూ పనిచేస్తుంది.
‣ ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు దీన్ని నేర్చుకోవచ్చు. ఈ కోర్సులు ఆఫ్‌లైన్‌లో వివిధ ఇన్‌స్టిట్యూట్ల ద్వారానూ, ఆన్‌లైన్‌లో సింప్లీలెర్న్, కోర్సెరా వంటి వెబ్‌సైట్లలోనూ అందుబాటులో ఉన్నాయి.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఇంటర్మీడియట్‌తో ఇవిగో ఉద్యోగాలు
‣ ఏపీ పోలీస్ కొలువుకు సిద్ధమేనా?
‣ పోలీస్ ఉద్యోగాల మొయిన్స్‌లో మెరవాలంటే?
‣ కోడింగ్ రాకపోయినా ఐటీ ఉద్యోగం!
‣ సగం ప్రశ్నలు సరిగా రాస్తే చాలు!
‣ ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీసుకోవాలి?