• facebook
  • whatsapp
  • telegram

సందేహాలు వదిలేసి పరీక్షలకు సిద్ధంకండి!

అవరోధాలను అధిగమించేందుకు నిపుణుల సూచనలు

ఉద్యోగ సాధనకు సాగించే పోటీ పరీక్షల ప్రయాణంలో రకరకాల సందేహాలు రావటం సహజం. నోటిఫికేషన్‌ వెలువడిన తేదీ నుంచి ఉద్యోగంలో చేరేంతవరకు అభ్యర్థులకు ఏవో కొన్ని అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి. అవి పాలనాపరమైనవి కావొచ్చు, సమయ పరమైనవీ, న్యాయస్థానపరమైనవీ కూడా కావొచ్చు. అభ్యర్థులు వీటన్నిటిపై సరైన అవగాహన ఏర్పరచుకుంటే సందేహాలు వేధించవు. లక్ష్యం నుంచి వెనక్కి లాగవు. అందుకే స్థిర సంకల్పంతో నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు సాగినప్పుడే పోటీ పరీక్షల్లో నెగ్గే కొలువు కొట్టే అవకాశాలు పెరుగుతాయి! 

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 4, ఎండోమెంట్‌ ఆఫీసర్స్‌. ఉద్యోగ పరీక్షల మెయిన్స్‌ను ఎప్పుడు నిర్వహిస్తారు అనే విషయంలో స్పష్టత లేనందున అభ్యర్థుల్లో చాలా ఒత్తిడి ఉంది. గ్రూప్‌ 2 పరీక్ష ద్వారా పరిపాలనలోకి ప్రవేశించాలనుకునే నిరుద్యోగులు ప్రధానంగా అసలు నోటిఫికేషన్‌ వస్తుందా రాదా అనే సందిగ్ధతకు గురవుతున్నారు. దానితోపాటు పోస్టుల సంఖ్య మరీ తక్కువ ఉండటం కూడా వారిని ఆందోళనలోకి నెడుతోంది.

టెట్‌ పరీక్ష పూర్తవటం, వేలాది ఉపాధ్యాయ ఉద్యోగాలు ఉన్నాయనే వార్తలు వచ్చిన నేపథ్యంలో డీఎస్సీ పరీక్షపై స్పష్టత లేక ఈ కొలువుల ఆశావహులు కూడా ఏం చేయాలనే విషయంలో అవగాహన కొరవడి ఇబ్బంది పడుతున్నారు.

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలైనప్పటికీ వయసు పరిమితి నిబంధన వల్ల అందరికీ అవకాశం లభించడం లేదు. అదే సందర్భంలో ఫిబ్రవరిలో ప్రిలిమినరీ, మేలో మెయిన్స్‌ అనే వార్తలు ఆశావహుల్లో గందరగోళానికి కారణమవుతున్నాయి.

గ్రూప్‌ 1 ప్రిలిమినరీ జనవరి 8న నిర్వహించబోతున్నారు. అయితే అదే సందర్భంలో మెయిన్స్, తదనంతర అంశాలపై స్పష్టత లేక గ్రూప్‌ 1 ఆశావహులు కూడా సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితులు పోటీ పరీక్షల అభ్యర్థులను తికమక పెడుతున్నాయి. .  

డీఎస్సీ

టెట్‌ పరీక్ష ముగిసింది. మార్కుల ప్రకటన కూడా జరిగింది. ఇక డీఎస్సీ తరువాయి అనుకుంటున్న తరుణంలో రకరకాల వార్తలు రావడంతో టీచర్‌ అభ్యర్థులు అసలు డీఎస్సీ పరీక్ష పెడతారా.. పెట్టరా అనే సందేహంతో సతమతమవుతున్నారు. డీఎస్సీ పరీక్ష పోటీని ఎదుర్కోవాలంటే కచ్చితంగా లోతైన ప్రిపరేషన్‌ తప్పనిసరి. 10,000కు పైగా ఖాళీలు ఉండవచ్చు అని వస్తున్న అంచనాల నేపథ్యంలో ఆశావహులు 5 లక్షల పైగా ఉండటంతో పోటీ తీవ్రత చాలా ఎక్కువగా ఉండవచ్చు. అయితే నోటిఫికేషన్‌ విడుదల కచ్చితంగా లేకపోవటంతో అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

అభ్యర్థులకు తమ గ్రహణ, స్మృతి సామర్ధ్యాలపై బలంగా నమ్మకం ఉంటే డీఎస్సీ నోటిఫికేషన్‌ రావటానికి రెండు మూడు నెలల ముందు నుంచీ సన్నద్ధమైతే సరిపోతుంది. ప్రస్తుతం గ్రూప్‌ 4, ఎస్‌.ఐ. లాంటి పరీక్షలకు తయారవడం బహుముఖ ప్రణాళికగా అమలు చేయవచ్చు.

గ్రూప్‌ 4, ఎండోమెంట్‌ ఆఫీసర్స్‌ 

ఈ పరీక్షల ప్రిలిమినరీ పూర్తయింది. మెయిన్స్‌ అర్హుల జాబితా కూడా వచ్చింది. కానీ మెయిన్స్‌ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు. ఎప్పటికప్పుడు వచ్చే నెల.. ఆ పై నెల పరీక్షలు నిర్వహిస్తారని ఎదురుచూసిన ఆశావహుల్లో తీవ్ర నిరాశ ఏర్పడింది. మెయిన్స్‌ పరీక్ష పూర్తయితే అవకాశాలను బట్టి మరో ఉద్యోగం వెతుక్కోవటం, మరేదైనా ప్రయత్నాలు చేయటం అనే ఆలోచనకు పరీక్షల తేదీల అస్పష్టత గండి కొడుతోంది. ఏం చేయాలో పాలు పోని పరిస్థితి. అభ్యర్థుల్లో కొంతమంది ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షలు రాసే అవకాశం ఉంది. కానీ సిలబస్‌లో తేడాల వల్ల ఏదో ఒక దానిపైనే దృష్టి పెట్టాలి.

మరి దీనికి పరిష్కారం? జనరల్‌ స్టడీస్‌ లాంటి విభాగాలు అన్ని పరీక్షలకూ కామన్‌గానే ఉంటాయి. అయితే ప్రిలిమినరీ దాటారు కనుక ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా పరీక్షల మెయిన్స్‌కు నిరంతరం అధ్యయనం చేస్తూనే ప్రిపేర్‌ అవటం మంచిది. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ లాంటి పరీక్షలకు అవకాశం ఉంటే జనరల్‌ స్టడీస్‌ మొత్తం ప్రిలిమినరీలో ఉపయోగపడుతుంది. కాబట్టి ఆందోళన చెందకుండా ఎస్‌ఐ పరీక్షకు కూడా సిద్ధపడటమే మంచిది. డీఎస్సీ అర్హత కలిగిన అభ్యర్థులు కూడా ప్రస్తుతం గ్రూప్‌ 4పైనే దృష్టి పెట్టడం మేలు. ఎస్‌ఐ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారనేది ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. అందువల్ల అందుబాటులో ఉన్న పరీక్షలపై దృష్టి పెట్టడం మంచిది. ఒకవేళ డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంటే కనీసం మూడు నెలల ముందుగానే ఆ సమాచారం బయటకు వస్తుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

గ్రూప్‌ 1

గ్రూప్‌ 1 సీరియస్‌ అభ్యర్థులు ప్రిలిమ్స్‌ ముగిసిన తర్వాత వెంటనే గ్రూప్‌ 1 మెయిన్స్‌పై పూర్తి శ్రద్ధ పెట్టడం మంచిది. టాప్‌ ర్యాంకులు  తెచ్చుకున్నప్పుడే RDO, DY SP మొదలైన ఉత్తమ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇతర నోటిఫికేషన్లు వస్తున్న ఉద్యోగాల కోసం గ్రూప్‌ 1 నుంచి విరమిస్తున్న ఇతరుల ప్రభావంతో చాలామంది పోటీ నుంచి నిష్క్రమిస్తున్నారు. గుంపు మనస్తత్వంతో ఇలా ఇతరులను అనుసరించటం సరి కాదు. ఉద్యోగాల అంతిమ ఎంపిక అనేది మెరిట్‌ అభ్యర్థుల మధ్య మాత్రమే ఉంటుంది. ఆ మెరిట్‌ అభ్యర్థుల్లో, ఆయా రిజర్వేషన్‌ కేటగిరీల మెరిట్‌లో కూడా నిలబడాలంటే తప్పనిసరిగా పట్టుదలతో వ్యవహరించాలి. గ్రూప్‌ 1 మెయిన్స్‌ లోని 5 పేపర్లలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచినప్పుడే టాప్‌ ర్యాంకర్లుగా నిలిచే అవకాశం ఉంటుంది.

చక్కని దస్తూరి, భావ వ్యక్తీకరణ, సమయ నిర్వహణ, సరైన కంటెంట్‌ మాత్రమే గ్రూప్‌ 1 తరహా పరీక్షల్లో అంతిమ విజయాన్ని అందిస్తాయి. అందువల్ల గ్రూప్‌ 1ని లక్ష్యంగా నిర్ణయించుకున్న అభ్యర్థులు ప్రస్తుతం కొనసాగుతున్న సందిగ్ధతలో నుంచి బయటపడాలి. మెయిన్స్‌ పరీక్షలు ఎప్పుడు జరిగినా అత్యుత్తమ ప్రతిభను కనబర్చాలంటే నిరంతర ప్రిపరేషనే ఏకైక మార్గం. 

గ్రూప్‌ 2

గ్రూప్‌ 2 ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఎప్పుడు వస్తుంది? ఎన్ని ఉద్యోగాలు ఉంటాయనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే ఈ నోటిఫికేషన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్షల ద్వారా పరిపాలన ఉద్యోగాల్లో చేరేందుకు అత్యుత్తమ అవకాశాన్ని కల్పిస్తుంది. అందువల్ల ఈ పరీక్షపై చాలామంది అభ్యర్థులు దృష్టి పెడుతుంటారు.

గ్రూప్‌ 2 అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్న మరొక అంశం- పోస్టుల సంఖ్య తక్కువగా ఉండటం. ఈ కారణంగా ఆందోళన చెందకుండా పట్టుదలతో నిరంతర అధ్యయనం చేసినప్పుడే విజయావకాశాలు మెరుగుపడతాయి.

వీరిని కలవరపెడుతున్న మరో అంశం.. ప్రభుత్వానికి అందిన సిలబస్‌లో మార్పులు. ప్రభుత్వానికి పంపిన సిలబస్‌ను పరిశీలించినప్పుడు గ్రూప్‌ 2 అభ్యర్థులు మరీ ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏమీలేదు. గత సిలబస్‌ని పునర్నిర్మాణం చేస్తున్నట్లుగా ఉంది కానీ పూర్తిగా కొత్త సిలబస్‌గా భావించనక్కర్లేదు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దానిలో చదవవలసిన అంశాలు పరిమితమే కాబట్టి సులభంగానే ఈ సమస్యను అధిగమించవచ్చు. అలాగే ఎకానమీ వల్ల కలుగుతున్న క్లిష్టత కూడా తగ్గుతుంది. ఈ మార్పులూ చేర్పులూ ప్రభుత్వం అంగీకరించినప్పుడే అమలవుతాయి. అందుకని ప్రస్తుతం ఉన్న సిలబస్‌ను పకడ్బందీగా చదవడం అత్యంత అవసరం.

ఎస్‌ఐ, కానిస్టేబుల్స్‌

ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలకు సమయం తక్కువగా ఉండటం వల్ల వేరే ఇతర ఆలోచనలు లేకుండా వాటికి పకడ్బందీగా ప్రిపేర్‌ అవటమే సరైన నిర్ణయం. సన్నద్ధం అవ్వబోయేముందు శారీరక దార్ఢ్య పరీక్షలు ఎదుర్కోగలమా లేదా అనేది అంచనా వేసుకోండి. ఏమాత్రం సందేహం ఉన్నా గ్రూప్‌ 4, ఇతర పరీక్షల ప్రిపరేషన్‌ కొనసాగించండి. గ్రూప్‌ 4 మెయిన్స్‌కు కూడా అర్హత పొందివుంటే.. జనరల్‌ స్టడీస్‌ విభాగం కామన్‌ కాబట్టి పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదు. ప్రస్తుతం పోలీసు ఉద్యోగాలపైనే దృష్టి పెట్టడం సరైన నిర్ణయం అవుతుంది.

చాలామంది పీజీ/ ఇతరత్రా ఉన్నతస్థాయి విద్యార్హతల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయా అకడమిక్‌ పరీక్షలు సాధారణంగా ఏప్రిల్‌ తర్వాత ఉంటాయి. ఇలాంటివారు ఆ పరీక్షలు ఎదుర్కోవాలా, ఈ పోటీ పరీక్షలు ఎదుర్కోవాలా అనే విషయంలో అస్పష్టతతో ఉన్నారు. ఏ కోర్సులో అయినా ఫైనలియర్‌ పరీక్షలు మాత్రమే రాస్తున్న అభ్యర్థులయితే ఆ కోర్సు పూర్తిచేసుకోవడానికి ప్రయత్నించాలి. కోర్సు పరీక్షలు 2023 చివరి నాలుగు మాసాల్లో రాసే అవకాశం ఉంటే ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్లపై దృష్టి పెట్టడం మంచిది. ఈ ఉద్యోగాల్లో చాలామంది అభ్యర్థులు స్థిరపడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని జారవిడుచుకోవటం తెలివైన నిర్ణయం కాబోదు. తప్పదనుకుంటే అకడమిక్‌ పరీక్షలను వదులుకోవడమే మంచిది.
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ అంద‌రి కోసం ఆన్‌లైన్ లైబ్ర‌రీ

‣ ఎలా నెగ్గాలి సివిల్స్ ఇంట‌ర్వ్యూ?

‣ భ‌యాన్ని త‌రిమేయండి!

‣ లోతుగా ఆలోచిస్తేనే ఉద్యోగం!

‣ లెక్చ‌ర‌ర్ ఉద్యోగం సాధించాలంటే?

‣ ఐవీ లీగ్ అంటే ఏమిటి?

Posted Date : 19-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌