• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భ‌యాన్ని త‌రిమేయండి!

కొంతమంది విద్యార్థులు చదువంటే భయపడుతుంటారు. కాలేజీకి వెళ్లాలన్నా, తరగతుల్లో కూర్చోవాలన్నా, పరీక్షలన్నా తెలియని ఆందోళన వారిని ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా అప్పుడే కొత్త ఊరికి మారినవారు, అప్పటివరకూ ఒకచోట చదివి పెద్ద విద్యాసంస్థలకు వెళ్లినవారు, సబ్జెక్టు అంటే భయం ఉన్నవారిలో ఇటువంటి భావన సహజం. అయితే కాస్త ప్రయత్నిస్తే... దీన్ని అధిగమించడం పెద్ద విషయమేమీ కాదు.


భయం ఏదీ లేనట్లుగా బయటకు కనిపిస్తే... అంతా మామూలైపోతుంది అనుకుంటారు కొందరు. కానీ భయం అనేది నిజం. మానసికంగానూ శారీరకంగానూ ఇది మనపై ప్రభావం చూపగలదు. అందుకే ముందు మనం ఆందోళనలో ఉన్నామన్న విషయాన్ని అంగీకరించాలి. ఆ తర్వాత దాన్ని దాటేందుకు ప్రయత్నించాలి. లేదని మనల్ని మనమే మోసం చేసుకోకూడదు.  


మన ఆప్తులు మనకు తోడుగా ఉన్నారనే భరోసా చాలా ధైర్యాన్నిస్తుంది. ముఖ్యంగా ఇటువంటి సమయంలో వారి సాయం తీసుకోవడం అవసరం. మాటద్వారానైనా, స్పర్శతోనైనా వారి నుంచి వచ్చే ఊరడింపు మనలో ఉన్న ఆందోళనలను చాలావరకూ తగ్గిస్తుంది. అందువల్ల ఇతరుల సాయం అడగవచ్చు.


ఏ పనిచేసినా ముందే పూర్తిగా దానికి సన్నద్ధం కాకపోతే... విఫలమయ్యేందుకు అవకాశాలు పెరగడం మాత్రమే కాదు, ఆ మొత్తం ప్రక్రియ అంతా భయం భయంగా సాగుతుంది. సబ్జెక్టు అంటే భయమైతే.. క్లాసుకు ముందే కొంత చదువుకుని వెళ్లడం, క్యాంపస్‌ అంటే భయమేస్తుంటే.. ఆ పరిసరాలను ముందే అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించడం...  ఇలా మనల్ని ఏ అంశం భయపెడుతుంటే దాన్ని ముందే ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తే చాలావరకూ ఆ భయం మనల్ని వీడిపోతుంది.


మనం ఏం చేయాలి అనుకుంటున్నామో, అంతిమంగా లక్ష్యం ఏంటో... దాని గురించే ఆలోచించినప్పుడు ఆ దారిలో ఎదురయ్యే చిన్న చిన్న భయాల గురించి పెద్దగా ఆలోచించడం మానేస్తారు. పట్టా పుచ్చుకుని, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌తో బయటకు రావాలనుకునేటప్పుడు ఆ క్రమంలో కలిగే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ధైర్యం తెచ్చుకుంటారు.


మనకు భయం కలిగించే పనో, సందర్భమో ఎదురవుతున్నప్పుడు... వెంటనే మనకు బాగా సంతోషం కలిగించే విషయాలను ఆలోచించాం అనుకోండి, ఆ భయం ప్రభావం తగ్గుతుంది. మీ కుక్కపిల్ల ముద్దు మొహమో, అమ్మ చేసిన పాయసమో, బెస్ట్‌ ఫ్రెండ్‌ చేసిన అల్లరో గుర్తు చేసుకుంటే తెలియకుండానే పెదాలపై చిరునవ్వు మెదులుతుంది. ఆ భయప్రభావం అదే తగ్గిపోతుంది.


అన్నింటికీ మించి ఏ పని చేసినా పాజిటివ్‌ దృక్పథంతో ఉండటం అవసరం. ‘ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు చాలా భయం... ’ ఇలాంటి ఆలోచనలు రావని కాదు, కానీ వాటి నుంచి ఎంత త్వరగా బయటపడి మనసును దృఢంగా ఉంచుకుంటే అంత త్వరగా అనుకున్న లక్ష్యాలను చేరుకోగలం. 


ఏ పనిచేసినా కొత్తలో కొంత భయం ఉండటం సహజం. అది అందరికీ కలిగేదే. రోజులు గడిచేకొద్దీ అది అలవాటు అయిపోతే ఆ భయం కూడా తగ్గిపోతుంది. ఈ విషయం మనసులో ఉంచుకుంటే ఈ భయాలను సులువుగా అధిగమించేయవచ్చు!

మరింత సమాచారం ... మీ కోసం!

‣ లోతుగా ఆలోచిస్తేనే ఉద్యోగం!

‣ ఎలా నెగ్గాలి సివిల్స్ ఇంట‌ర్వ్యూ?

‣ కోడింగ్ రాక‌పోయినా ఐటీ ఉద్యోగం!

‣ స‌గం ప్ర‌శ్న‌లు స‌రిగా రాస్తే చాలు!

‣ ఎడ్యుకేష‌న్ లోన్‌ ఎలా తీసుకోవాలి?

‣ స‌మూహంలో స‌త్తా చూపించండి! 

‣ ఎన్‌సీఎల్‌  405 ఉద్యోగాలు!

Posted Date : 15-12-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌