• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు

ఎన్‌డీఏ ప్రకటన విడుదల
 

ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోనే మేటి భవిష్యత్తుకు మార్గం సుగమం చేసుకోవచ్చు. ఉన్నత విద్య పూర్తిచేసుకుని, ఉద్యోగంలోనూ చేరిపోవచ్చు. ఇందుకు యూపీఎస్‌సీ నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ అండ్‌ నేవల్‌ అకాడెమీ (ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ) పరీక్ష దారిచూపుతుంది. దీనిలో నెగ్గినవారు బీఏ, బీఎస్సీ, బీటెక్‌లలో నచ్చిన కోర్సు ఉచితంగా చదువుకోవచ్చు. శిక్షణ అనంతరం లెవెల్‌-10 వేతనశ్రేణితో ఆర్మీ/నేవీ/ఎయిర్‌ ఫోర్స్‌లలో సేవలు అందించవచ్చు. మహిళలూ అర్హులే. ఇటీవలే వెలువడిన ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ - 2024(2) ప్రకటన పూర్తి వివరాలు..


దేశ రక్షణలో భాగస్వాములు కావాలని ఆశించే యువతరానికి.. ఎన్‌డీఏ అత్యుత్తమమైనది. మెరికల్లాంటి యువతను సానబెట్టి, లక్షణమైన రక్షణ ఉద్యోగాలు అందించే లక్ష్యంతో యూపీఎస్‌సీ ఏడాదికి రెండుసార్లు ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ పరీక్షను నిర్వహిస్తోంది. ఇందులో ఎంపికైనవారు పుణెలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ (ఎన్‌డీఏ)లో బీటెక్, బీఎస్సీ, బీఏ కోర్సులు ఉచితంగా చదువుకుంటూ రక్షణలో ప్రాథమిక శిక్షణ పొందవచ్చు. వసతి, భోజనం, దుస్తులు...అన్నీ దాదాపు ఉచితమే. నేవల్‌ అకాడెమీ (ఎన్‌ఏ)కి ఎంపికైనవాళ్లు కేరళలోని ఎజమాళలో బీటెక్‌ విద్య అభ్యసిస్తారు. ఎన్‌డీఏ, ఎన్‌ఎల్లో విజయవంతంగా చదువు పూర్తిచేసుకున్నవారికి జేఎన్‌యూ, న్యూదిల్లీ డిగ్రీలను ప్రదానం చేస్తుంది. అనంతరం ట్రేడ్‌ శిక్షణ సంబంధిత కేంద్రాల్లో అందిస్తారు. ఈ సమయంలో ప్రతినెలా రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. 


శిక్షణ పూర్తిచేసుకున్నవారు ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్‌ లెఫ్టినెంట్, ఎయిర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ (పైలట్‌)/ గ్రౌండ్‌ డ్యూటీ ఆఫీసర్‌ హోదాతో విధులు నిర్వర్తిస్తారు. ఇవన్నీ సమాన స్థాయి ఉద్యోగాలే. అందరికీ లెవెల్‌-10 వేతనాలు చెల్లిస్తారు. వీరు మొదటి నెల నుంచే రూ.లక్షకుపైగా జీతం, పలు ప్రోత్సాహకాలూ పొందుతారు. రెండేళ్ల సేవలతోనే ప్రమోషన్‌ పొందవచ్చు. ఆరేళ్లకు మరొకటి, పదమూడేళ్లకు మరో పదోన్నతి దక్కుతాయి. అనంతరం ప్రతిభ, అనుభవం ప్రాతిపదికన ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. భవిష్యత్తులో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు అత్యున్నత అధికారి, త్రివిధ దళాలకు అధిపతీ కావచ్చు. 


   ఎంపిక...   

పరీక్ష, ఇంటర్వ్యూల్లో ప్రతిభతో నియామకాలుంటాయి. పరీక్షలో రెండు పేపర్ల నుంచి 900 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఒక్కో పేపర్‌ వ్యవధి రెండున్నర గంటలు. పేపర్‌-1 మ్యాథ్స్‌ 300 మార్కులకు ఉంటుంది. మొత్తం 120 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండున్నర మార్కులు. పేపర్‌-2లో జనరల్‌ ఎబిలిటీ విభాగం నుంచి 150 ప్రశ్నలు 600 మార్కులకు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. ఇందులో పార్ట్‌- ఎ ఇంగ్లిష్‌కు 200, పార్ట్‌ బి జనరల్‌ నాలెడ్జ్‌కి 400 మార్కులు. ఇంగ్లిష్‌లో 50, జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో.. ఫిజిక్స్‌ 25, కెమిస్ట్రీ 15, జనరల్‌ సైన్స్‌ 10, చరిత్ర, స్వాతంత్య్రోద్యమాలు 20, భూగోళశాస్త్రం 20, వర్తమానాంశాల నుంచి 10 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో మూడో వంతు తగ్గిస్తారు. 


పరీక్షలో అర్హతకు సబ్జెక్టులవారీ కనీస మార్కులు (20 లేదా 25 శాతం) పొందాలి ఇలా అర్హత సాధించినవారి జాబితా నుంచి మెరిట్‌ ప్రకారం కొంతమందికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్టులు యూపీఎస్‌సీ నిర్వహిస్తుంది. ఈ విభాగానికీ 900 మార్కులు కేటాయించారు. ఇందులో.. గ్రూప్‌ టెస్టులు, గ్రూప్‌ డిస్కషన్, గ్రూప్‌ ప్లానింగ్, అవుట్‌డోర్‌ గ్రూప్‌ టాస్కుల్లో ప్రతిభ చూపాలి. వీటిని రెండంచెల్లో ఐదు రోజులు నిర్వహిస్తారు. తొలిరోజు పరీక్షల్లో అర్హత సాధించినవారికే మిగిలిన నాలుగు రోజుల టాస్క్, ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. రాత పరీక్ష, సర్వీస్‌ సెలక్షÛన్‌ బోర్డు ఇంటర్వ్యూల్లో వచ్చిన మొత్తం మార్కుల మెరిట్‌తో తుది నియామకాలుంటాయి. ఎంపికైనవారికి జులై, 2025 నుంచి శిక్షణ, తరగతులు ప్రారంభమవుతాయి.  


   విజయానికి 40..  

పరీక్ష, ఇంటర్వ్యూల్లో 40 శాతం మార్కులతో ఎన్‌డీఏలో అవకాశం పొందవచ్చు. 2023(2) పరీక్షలో 900కి 292 మార్కులు పొందినవారు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. శిక్షణకు అవకాశం వచ్చిన చివరి అభ్యర్థి పొందిన మార్కులు 656. 2023(1) పరీక్షలో 301 మార్కులతో ఇంటర్వ్యూకు, 664 మార్కులు పొందిన వారు ఏదో ఒక విభాగానికి ఎంపికయ్యారు. అంటే పరీక్షలో 900కి 40 శాతం (360 మార్కులు) పొందితే ఇంటర్వ్యూకు, పరీక్ష + ఇంటర్వ్యూల్లో 1800కి 40 శాతం (720) మార్కులు పొందినవారు ఏదో ఒక సర్వీస్‌కు ఎంపిక కావచ్చు. 


ఎన్‌డీఏ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్నవారు గరిష్ఠ వయః పరిమితిని పరిగణనలోకి తీసుకుంటే కనీసం ఆరేడుసార్లు రాసుకోవచ్చు. అందువల్ల దీన్నే లక్ష్యంగా చేసుకుని, శ్రద్ధగా సన్నద్ధమైతే విజయవంతం కావచ్చు. 

ఎంపీసీ విద్యార్థులకు ఈ పరీక్ష అనువైనది. పేపర్‌-1లో మ్యాథ్స్‌ 300, పేపర్‌ 2లో ఫిజిక్స్, కెమిస్ట్రీ 160 మొత్తం 460 మార్కులకు ఈ గ్రూపు సబ్జెక్టుల నుంచే ప్రశ్నలొస్తాయి. మిగిలిన గ్రూపుల విద్యార్థులు విజయానికి గట్టి కృషి చేయడం తప్పనిసరి. ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ సన్నద్ధతతో ఇతర డిఫెన్స్, పోటీ పరీక్షలను ఎదుర్కోవడం తేలికవుతుంది. 


   సన్నద్ధత   

నోటిఫికేషన్‌లో సిలబస్‌ వివరంగా పేర్కొన్నారు. వాటి ప్రకారం సీబీఎస్‌ఈ 10, 11, 12 తరగతుల పుస్తకాలను బాగా అధ్యయనం చేయాలి. ముందుగా ప్రాథమికాంశాలపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం 8,9,10 తరగతుల మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ పాఠ్యపుస్తకాలు చదువుతూ ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి.  

 పాత ప్రశ్నపత్రాలు పరిశీలించాలి. వీటిని యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు. సబ్జెక్టు ప్రశ్నలు ఏ చాప్టర్ల నుంచి, ఏ స్థాయిలో అడుగుతున్నారు, చాప్టర్లకు లభిస్తోన్న ప్రాధాన్యం  ఇవన్నీ గమనించి, సన్నద్థతను మెరుగుపరచుకోవాలి. 

 అధ్యయనం పూర్తయిన తర్వాత వీలైనన్ని నమూనా పరీక్షలు రాయాలి. పరీక్ష పూర్తయిన వెంటనే ఫలితాలు విశ్లేషించుకోవాలి. వాటి ప్రకారం వెనుకబడిన సబ్జెక్టులు/ పాఠ్యాంశాలకు ప్రాధాన్యమివ్వాలి. తర్వాత రాసే పరీక్షల్లో తప్పులు పునరావృతం కాకుండా చూసుకుని, ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకోవాలి. 

 ఇబ్బంది పెడుతోన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. మాథ్స్‌ ప్రశ్నలకు సమయం సరిపోకపోవచ్చు. వీలైనన్ని మాదిరి ప్రశ్నల సాధనతో వేగం, కచ్చితత్వాన్ని అందుకోవచ్చు.

 రుణాత్మక మార్కులు ఉన్నందువల్ల అవగాహన లేని ప్రశ్నలను వదిలేయాలి. అలాగే సమాధానం కోసం ఎక్కువ వ్యవధి తీసుకునే ప్రశ్నలను పరీక్ష చివరలోనే, సమయం మిగిలితేనే ప్రయత్నించాలి. 

 పరీక్షకు పది రోజుల ముందు నుంచీ పూర్తి సమయాన్ని రివిజన్‌ కోసమే వెచ్చించాలి. 


   సబ్జెక్టులవారీగా...   

గణితం: ప్రాథమికాంశాలు, సూత్రాలు, అనువర్తనంపై దృష్టి సారించాలి. ఈ పేపర్‌లో ప్రశ్నలు 8 చాప్టర్ల నుంచి వస్తున్నాయి. పాత ప్రశ్నపత్రాలు గమనించి ఎక్కువ ప్రశ్నలు వస్తోన్న అధ్యాయాలకు అధిక ప్రాధాన్యమివ్వాలి.  

ఫిజిక్స్‌: కాన్సెప్ట్‌ ఆధారిత ప్రశ్నలు అడుగుతున్నారు. సూత్రాలు, అనువర్తనంపై అవగాహన పెంచుకోవాలి.

రసాయనశాస్త్రం: మూలకాల వర్గీకరణ, సమ్మేళనాలు, మిశ్రమాలపై దృష్టి సారించాలి. 

ఇంగ్లిష్‌: అభ్యర్థి భాషను ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకునేలా ప్రశ్నలు వస్తాయి. వ్యాకరణం, పదసంపదకు ప్రాధాన్యం. వీలైనన్ని కొత్త పదాలను తెలుసుకోవాలి. వాక్యంలోని పదాలు ఒక క్రమంలో అమర్చగలగాలి. అర్థాలు, వ్యతిరేకాలు, తప్పుని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, కాంప్రహెన్షన్, ఖాళీని పూరించడం...వీటిలో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి.  

కరెంట్‌ అఫైర్స్‌: జనవరి 2024 నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న కీలక పరిణామాలపై ప్రశ్నలు రావచ్చు. పత్రికలు చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలను రాసుకుని, పరీక్షకు ముందు మరోసారి చదవాలి.


   ఉపయోగపడే పుస్తకాలు    

టాటా మెక్‌ గ్రాహిల్స్, అరిహంత్‌ పబ్లిషర్ల ఎన్‌డీఏ పుస్తకాలు

 లూసెంట్స్‌ జనరల్‌ నాలెడ్జ్‌ 

 మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల పాఠ్యపుస్తకాలు

 చరిత్ర, భూగోళశాస్త్రం, జనరల్‌ సైన్స్‌ విభాగాల కోసం ఎన్‌సీఈఆర్‌టీ 8, 9, 10 తరగతులతోపాటు ప్లస్‌ 1, 2 పుస్తకాలు.


   ముఖ్య వివరాలు   

ఖాళీలు: 404. వీటిలో నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీలో 370 (ఆర్మీ 208 (10 మహిళలకు), నేవీ 42 (6 మహిళలకు), ఎయిర్‌ ఫోర్స్‌ మొత్తం 120 ఇందులో 92 ఫ్లైయింగ్‌ (2 మహిళలకు), గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ 18 (2 మహిళలకు), గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్‌ 10 (2 మహిళలకు)) ఉన్నాయి. నేవల్‌ అకాడెమీ (10+2 క్యాడెట్‌ స్కీం)లో 34 (5 మహిళలకు) ఖాళీలు ఉన్నాయి. 

అర్హత: ఆర్మీ వింగ్‌కు ఏదైనా గ్రూపుతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్‌ ఫోర్స్, నేవల్‌ వింగ్స్‌ (ఎన్‌డీఏ), 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ (ఇండియన్‌ నేవల్‌ అకాడమీ)లకు ఎంపీసీ గ్రూపుతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరంలో ఉన్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. 

వయసు: జనవరి 2, 2006 - జనవరి 1, 2009 మధ్య జన్మించినవారు అర్హులు.  

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జూన్‌ 4 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు మినహాయించారు.

పరీక్ష తేదీ: సెప్టెంబరు 1

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌.  

వెబ్‌సైట్‌: https://upsc.gov.in/


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!

‣ సోషల్‌ ట్రోలింగ్‌.. లైట్‌ తీసుకుందాం!

‣ ఐటీ ఎగ్జిక్యూటివ్‌గా అవకాశం

‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!

‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!

‣ టెక్స్‌టైల్‌ కమిటీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ కొలువులు!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!

Posted Date : 22-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌