• facebook
  • whatsapp
  • telegram

ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!

కెరియర్‌ సక్సెస్‌కు సూచనలు

‘అనుకున్నట్టుగా మంచి మార్కులు రావేమో.. కోరుకున్న కోర్సు చదవలేనేమో.. స్నేహితులందరూ ప్రముఖ కాలేజీలో చేరి.. నాకు మాత్రం సీటు రాదేమో..’ ఎంతోమంది విద్యార్థులు నిరంతరం ఇలాంటి ఆలోచనలు చేస్తూనే ఉంటారు. వీటికి ఒక అంతమంటూ ఉండదు. ఇలాంటివారిలో మీరూ ఉన్నారా? 


ఎప్పుడో ఒకసారి ప్రతికూల ఆలోచనలు ఎవరికైనా వస్తాయి. అది సహజం కూడా. కానీ కొంతమంది మాత్రం నిరంతరం ఇలాగే ఆలోచిస్తుంటారు. ఈ సమస్యను తేలిగ్గా తీసుకుని అలాగే వదిలేస్తే... కుంగుబాటుకు గురయ్యే అవకాశాలూ ఎక్కువే. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏంచేయాలో 



తెలుసుకుందామా...

నిరాశాపూరితమైన ఆలోచనల వల్ల ఉత్సాహంగా చదువును కొనసాగించలేరు. అంతేకాదు ఇతర పనులేవీ చేయాలనిపించదు కూడా. ఒకసారి వీటి నుంచి బయటపడితే స్పష్టంగా, సూటిగా ఆలోచిస్తూ అనుకున్నది సాధించగలుగుతారు. 

ఇలాంటి ఆలోచనల నుంచి దృష్టిని కొంత పక్కకు మరల్చడానికి మెదడుకు పనిపెట్టే పజిల్స్‌ బాగా ఉపయోగపడతాయి. తార్కికంగా ఆలోచిస్తూ వీటిని సాధించడం వల్ల ఏకాగ్రతా పెరుగుతుంది. దాంతో చదివినవి వెంటనే మర్చిపోయే ఇబ్బందీ ఉండదు. 

కొన్ని సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలామంది ఇబ్బందిపడుతుంటారు. ఇలాంటప్పుడు నమ్మకస్తులైన స్నేహితులూ, కుటుంబపెద్దలతో బాధను పంచుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. ఇబ్బంది గురించి నలుగురితోనూ చెప్పడం వల్ల మనసు కాస్త కుదుటపడుతుంది. అంతేకాదు వాళ్లిచ్చే సూచనలూ, సలహాల నుంచి అనుకూలంగా ఉన్నవాటిని ఎంచుకుని పాటించవచ్చు కూడా. 

నిరంతరం వచ్చే ఆలోచనలను పేపర్‌ మీద రాసుకోవడమూ మంచి పద్ధతే. ఇలాచేయడం వల్ల కొంత భారం దిగిపోతుంది. ఆందోళన, ఒత్తిడుల నుంచి ఉపశమనమూ లభిస్తుంది. క్రమపద్ధతిలో సమస్యను పరిష్కరించగలుగుతారు. ఉదాహరణకు తక్కువ మార్కులు వచ్చాయి అనుకునే కంటే.. ఇంకొంచెం కష్టపడితే ఎక్కువ మార్కులు వచ్చేవి కదా.. అని అనుకోవడంలో సానుకూలత కనిపిస్తుంది. 

‣ మీరు తీసుకున్న పొరపాటు నిర్ణయాలు.. వాటి వల్ల కలిగిన నష్టాలను పదేపదే గుర్తుచేసేవాళ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఒకపక్క మీరు ప్రతికూలతతో ఇబ్బంది పడటం, మరోపక్క మీ తప్పులను గుర్తుచేసేవాళ్లు పక్కనే ఉండటం వల్ల దిగులు మరింత పెరుగుతుందేగాని తగ్గదు. అలాగే ప్రతి విషయాన్నీ తలకిందులుగా ఆలోచించే వ్యక్తులు సోషల్‌ మీడియాలోనూ ఉండొచ్చు. వారిని అనుసరించకపోవడమే మంచిది. 

దృష్టి కోణం మార్చుకోవడం వల్ల కూడా ఆలోచనల తీవ్రతను తగ్గించుకోవచ్చు. సమస్యను కాకుండా పరిష్కారం గురించి ఆలోచిస్తే దాని తీవ్రతను కొంతవరకూ నియంత్రించవచ్చు. ఉదాహరణకు తక్కువ మార్కులు వచ్చినప్పుడు.. ఈసారి ట్యూషన్‌లో చేరి ఎక్కువ మార్కులు సంపాదిస్తాననే సంకల్పం అలాంటిదే. 

రోజూ ఇష్టంగా వ్యాయామం చేయడం చాలా మేలు చేస్తుంది. దీనివల్ల డోపమైన్‌గా వ్యవహరించే ‘హాపీ హార్మోన్లు’ విడుదలై రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అలాగే ధ్యానం చేయడంతోనూ ఆలోచనలను నియంత్రించుకోవచ్చు.

నవ్వు ఆరోగ్యానికి మంచిదని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టుగా కూర్చోకుండా.. సానుకూల ఆలోచనలు చేస్తూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి.  
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ టెక్స్‌టైల్‌ కమిటీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ కొలువులు!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!

‣ భవిష్యత్తును నిర్ణయించేది.. ప్రత్యేకతలే!

‣ భవిష్యత్తులో ఎంఎల్‌-ఏఐ ఉద్యోగాల తుపాన్‌!

‣ పొరపాట్లు దిద్దుకుంటే పక్కాగా గెలుపు బాటే!

Posted Date: 17-05-2024


 

ఆలోచన

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం