• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం! 

విద్యార్థులూ, తాజా గ్రాడ్యుయేట్లూ తమ అభిరుచిమేరకు కెరియర్‌ను రూపొందించుకునే ప్రయత్నాల్లో ఉంటారు. వీరు వాస్తవ ప్రపంచ విలువైన అనుభవాన్ని గడించడానికి ఇంటర్న్ షిప్‌లు తోడ్పడతాయి. కొన్నిసార్లు వీటితో పూర్తి కాలపు ఉపాధికీ వీలుంటుంది.  ప్రధానంగా ఐటీ విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ల విషయంలో ఏయే   మెలకువలు పాటించాలో తెలుసుకుందాం! 


వాస్తవికమైన ఐటీ ప్రపంచాన్ని విద్యార్థులకు పరిచయం చేస్తుంది ఇంటర్న్‌షిప్‌. సవాళ్లతో కూడిన ప్రయాణంలో ఇక్కడ నేర్చుకునే అనుభవం ఉద్యోగ జీవితానికి సోపానమవుతుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌ లాంటి దిగ్గజ సంస్థలు ఇంటర్న్‌లకు విలువనిస్తాయి. వారికి మంచి స్టైపెండ్‌ను కూడా చెల్లిస్తాయి. కొత్తగా ప్రవేశించిన అడవిలో అనుభవాన్ని పొందే ప్రక్రియగా ఇంటర్న్‌షిప్‌ను చెప్పుకోవచ్చు. మేనేజర్లు/హెచ్‌ఆర్, లీడ్‌లు ఇంటర్న్‌లకు మార్గదర్శనం చేసే మెంటర్‌లు కూడా అని గుర్తుంచుకోవాలి. 


ఇంటర్న్‌షిప్‌లు ఉద్యోగార్థులకు శిక్షణగా ఉపయోగపడతాయి. నియామక సంస్థలు ఆశించే నైపుణ్యాలను వీరు సాధించడంలో సహాయపడతాయి. వివిధ రంగాలు, పరిశ్రమలను అన్వేషించి ఇంటర్న్‌లు తమకు ఏ కెరియర్‌ మార్గం బాగా సరిపోతుందో విశ్లేషించుకోవచ్చు.  కెరియర్లో విలువైన కాంటాక్టులను ఏర్పరచుకోవడానికి ఇంటర్న్‌షిప్‌లు ఒక అద్భుతమైన మార్గం. ప్రొఫెషనల్స్‌ను కలవడం, నిపుణుల నుంచి తెలుసుకోవడం ఇంటర్న్‌షిప్‌లో ప్రధాన అంశాలు. కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉండటం వల్ల వేగంగా ఎదగడానికి సహాయకారి అవుతుంది. కానీ ఇంటర్న్‌షిప్‌ అనేది శిక్షణకు ముగింపు ప్రక్రియ ఎన్నడూ కాదు. ఇంటర్న్‌లుగా చేరేవారు ‘జీరో’తో ప్రారంభించకుండా సంబంధిత అంశంలో కనీస పరిజ్ఞానం పెంచుకోవాలి. 


బహుళజాతి సంస్థల్లోనే ఇంటర్న్‌షిప్‌ చేయాలా? ఇదేమీ తప్పనిసరి కాదు. ఈ విషయంలో మంచి మెంటర్‌ను ఎంచుకుని, వారితో మాట్లాడండి. తక్కువ ఉద్యోగులున్న చిన్న కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ అవకాశం వచ్చినప్పటికీ వదులుకోకూడదు. ఇలాంటి సంస్థల్లో మీరు ఎక్కువ అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌.. ఏదైనా శ్రద్ధగా నేర్చుకోవడం ముఖ్యం.


ఎలా అధిగమించాలి?     

1 ఇంటర్న్‌లు వృత్తిపరమైన వాతావరణానికి కొత్తగా ఉంటారు. అకడమిక్‌ నేపథ్యం నుంచి ప్రొఫెషనల్‌ వర్క్‌ప్లేస్‌కు మారే క్రమం సహజంగానే కొన్ని సాధారణ పొరపాట్లకు దారి తీస్తుంది. అవి.. సముచితం కాని వస్త్రధారణ కావొచ్చు, పేలవమైన ఈ-మెయిల్‌ మర్యాదలు కావొచ్చు. కమ్యూనికేషన్‌ తీరులో లోపాలు కావొచ్చు. 

2 ఏదైనా సహాయం కోసం అడగాలంటే.. సీనియర్లు, మెంటర్లు చిన్నచూపు చూస్తారనే భయంతో ఇంటర్న్‌లు చొరవ చూపలేకపోతుంటారు. దీనివల్ల పొరపాట్లు, నేర్చుకునే అవకాశాలు కోల్పోవటం జరుగుతుంటాయి. 

3 చురుగ్గా ఉండాలి. చొరవతో వ్యవహరించాలి. సాధ్యమైన మరిన్ని బాధ్యతలను అడగాలి. నేర్చుకోవాలనే ఆసక్తిని చూపాలి. 

4 అయితే ఆకట్టుకోవాలనే ఆత్రుతతో ఇంటర్న్‌లు తాము నిర్వహించగలిగే దానికంటే ఎక్కువ పనులను తీసుకోవటం సరికాదు. ఫలితంగా అధిక పని భారం.. అలసట తప్పకపోవచ్చు.

5 ఇంటర్న్‌లు కొన్నిసార్లు సహోద్యోగులతో సంబంధాలను ఏర్పరచుకోకుండా తమకు కేటాయించిన పనులపై మాత్రమే దృష్టి పెడతారు. ఇది నెట్‌ వర్కింగ్‌ను నిర్లక్ష్యం చేయడం. దీనివల్ల భవిష్యత్‌ కెరియర్‌ అవకాశాలకు గండి పడవచ్చు. 

6 కంపెనీ సంస్కృతిని అర్థం చేసుకోవడానికీ, స్వీకరించడానికీ సంసిద్ధంగా ఉండాలి.  

7 సమర్థ సమయ నిర్వహణ నైపుణ్యాలు పెంచుకుంటే.. గడువు సమయంలోపు లక్ష్యాలను చేరుకోవటం సులువు అవుతుంది. 

8 పురోగతి, ఎదుర్కొన్న సవాళ్ల గురించి లీడ్‌లకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుండాలి. 

9 ఇంటర్న్‌షిప్‌ సమయంలో ఏమి సాధించాలనుకుంటున్నారో గుర్తించాలి. ఆ లక్ష్యాల కోసం పని చేయాలి.                 

ముందే చెప్పినట్టు- ఇంటర్న్‌షిప్‌ అంటే మెంటర్‌పై నమ్మకంతో అడవిలో ప్రయాణించడం లాంటిది. ప్రయాణాన్ని ఆస్వాదించాలి. నైపుణ్యాలు మెరుగ్గా నేర్చుకోవాలి. కేవలం సర్టిఫికెట్‌ కోసం ఇంటర్న్‌షిప్‌ చేయకూడదు. ఎందుకంటే.. సర్టిఫికెట్‌ పొందినవారందరికీ తగిన నైపుణ్యాలు ఉండాలని లేదు. అలాగే అర్హులైన వ్యక్తులందరూ సర్టిఫికెట్‌ పొందాల్సిన అవసరం లేదు.


- మధు వడ్లమాని

మిరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌



 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సోషల్‌ ట్రోలింగ్‌.. లైట్‌ తీసుకుందాం!

‣ ఐటీ ఎగ్జిక్యూటివ్‌గా అవకాశం

‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!

‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!

Posted Date : 21-05-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.