• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సోషల్‌ ట్రోలింగ్‌.. లైట్‌ తీసుకుందాం!

లైట్‌ తీస్కో.. భయ్యా లైట్‌ తీస్కో... ఆ మధ్య బాగా హిట్టయిన పాట. విద్యార్థులు మళ్లీ ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన పాట. బంగారు భవితకోసం కష్టపడి చదివే విద్యార్థులను ‘అకడమిక్‌ ట్రోలింగ్‌’ భూతం తరుముతోంది. ఎక్కువ మార్కులొస్తే అన్ని ఎలా వచ్చాయి అంటారు, తక్కువ వస్తే ఇంతేనా సామర్థ్యం అంటారు.. కొందరు మరింత ముందుకెళ్లి విద్యార్థుల రూపురేఖలపైనా కామెంట్లు చేస్తూ వారిని మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మరి వీటిని ఎదుర్కొని నిలబడేదెలా?


అసలే చదువుల ఒత్తిళ్లు.. ఉరుకులు పరుగులు. ఇతరులతో సమానంగా ఎదగాలనే ఆశతో ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుకుంటూ ఉంటారు. ఇటువంటి సమయంలో సోషల్‌ మీడియా ద్వారా ఎదురయ్యే విమర్శలు, ప్రతికూల వ్యాఖ్యలు ఎదుర్కోవడం మరో పెద్ద ఒత్తిడి అయిపోతోంది. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో పదోతరగతి ఫలితాల్లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించిన విద్యార్థినిని అభినందించడం మానేసి.. తన రూపురేఖలపై కొందరు చేసిన దుష్ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఎంతో కష్టపడి చదివి మొదటి ర్యాంకు తెచ్చుకున్న ఆ అమ్మాయి ఇటువంటి పరిస్థితులకు ఎంత తల్లడిల్లి ఉంటుంది? అయితే తాను ఇటువంటి వాటిని పట్టించుకోవడం లేదనీ, చదువు మీదే దృష్టిపెట్టాననీ నవ్వుతూ చెప్పేసింది. ఆమె ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని ఉంటే తన జీవితం ఏమయ్యేది?


ఎదుటివారిని విమర్శించడం, వెక్కిరించడం అనేది సమాజంలో ఎప్పుడూ ఉంది. ఒకప్పుడు విద్యార్థులు స్నేహితుల నుంచి, దూరపు బంధువుల నుంచి ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేవారు. కానీ ఇప్పుడు ఇది డిజిటల్‌ ఫార్మాట్‌కు మారింది. కంప్యూటర్‌ తెర వెనుక ఉన్నాం, మనల్ని ఎవరూ గమనించరు అనే నమ్మకంతో కొందరు ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉంటారు. దురదృష్టవశాత్తూ ఇటువంటి ట్రోలింగ్‌కు విద్యార్థులు ఎక్కువగా గురికావాల్సి వస్తోంది. అందుకే వారు దీనిపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి.


‣ ఈ ఆన్‌లైన్‌ వేధింపుల వల్ల విద్యార్థులు మానసికంగా ఎంతగానో నలిగిపోతుంటారు. నిజానికి ఆన్‌లైన్‌లో ఇలా ఇతరుల మీద బురద చల్లేవారు తమ నిజజీవితంలో ‘ఐడెంటిటీ క్రైసిస్‌’తో బాధపడుతుంటారు. ఏదోవిధంగా అందరూ తనను గుర్తించాలి అనే ఆలోచనతో ఉంటారు. సొంతంగా ఏదైనా సాధించి ఆ గుర్తింపు పొందే యోగ్యత లేనివారు.. అప్పటికే ఏదో విధంగా విజేతలైన వారిని విమర్శించడం ద్వారా గుర్తింపు పొందాలని కోరుకుంటారు. ఎవరికైనా ప్రాముఖ్యం పెరుగుతుందని అనిపిస్తే వారిని వెనక్కి లాగాలని ప్రయత్నిస్తూ ఉంటారు. లైక్‌లు, కామెంట్లు, షేర్ల కోసం అవతలివారు మనిషి అని మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది ఒకరకమైన మానసిక లోపం.


ఏం చేయాలి?: ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే.. సమాజంలో ఎన్నో రకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులుంటారు. కొందరి ఆలోచనా ధోరణి విపరీత పద్ధతుల్లో ఉంటుంది. వాస్తవాలను పట్టించుకోకుండా తాము అనుకున్నదే నిజమని నమ్మే వారికి కొదవ లేదు. ఇటువంటి వారిని మనం మార్చలేం, కానీ దూరంగా ఉండగలం. వారి నుంచి మనకు రక్షణ కల్పించేది మనం ఏర్పరుచుకునే ఆత్మస్థైర్యం మాత్రమే. నేటి పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాల నుంచి పూర్తిగా దూరంగా ఉండటం సాధ్యం కాదు. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాడటం ద్వారా ఇటువంటి మానసిక దాడుల నుంచి బయటపడగలం.


ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌.. మాధ్యమం ఏదైనా ప్రైవసీ సెట్టింగ్స్‌ ఉన్నాయి. మన ప్రొఫైల్‌ను ఎవరు చూడవచ్చు, ఎవరు చూడకూడదు.. ఇలా లాకింగ్‌ను ఉపయోగించుకోవడం ద్వారా కొంతవరకూ రక్షణ పొందవచ్చు.

అన్నింటికీ మించి విద్యార్థులు ట్రోలింగ్‌ సెన్సిటివిటీని తగ్గించుకోవాలి. రెజిలియన్స్‌ నైపుణ్యం (స్థితప్రజ్ఞత) పెంచుకునే  ప్రయత్నం చేయాలి. అవతలి వారు అనేవి మాటలు మాత్రమే.. దాన్ని మనం మనసుకు తీసుకుంటేనే అది మనపై ప్రభావం చూపగలదు. అదే వదిలేస్తే అది ఎటువంటి ప్రభావమూ చూపలేదు. 

ఇందుకు మనం చేయాల్సిందల్లా అలా వదిలేయడం నేర్చుకోవడం. అయితే ఇది చెప్పినంత సులభమైన పనైతే కాదు, చాలా కసరత్తు అవసరం. నేటి విద్యార్థులు ఇతర నైపుణ్యాలను ఎలాగైతే సాధన చేస్తున్నారో దీన్ని కూడా అలాగే చేయడం ద్వారా వయసు పెరిగేకొద్దీ వారు మరింత దృఢంగా తయారవుతారు.

19 నుంచి 25 విద్యార్థుల భవితను మలుపు తిప్పే వయసు. ఇటువంటి సమయంలో ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇస్తూ జీవితాన్ని పాడుచేసుకోకుండా మనకోసం మనం జీవించడం నేర్చుకోవాలి.

విద్యార్థుల్లో చదివేవారు, చదవనివారు, భిన్న మనస్థత్వాల వారూ ఉంటారు. అందరి పట్లా ఇతరులకు ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. మనం ఎదుటివారికి నచ్చకపోతే అది వారి సమస్య. ఏదో అన్నారని మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మనపై మనకు నియంత్రణ పెరగాలి. మన ఆలోచనలు, మాటలు, చేతలు అన్నీ మన అధీÅనంలోనే ఉండాలి. అందుకు నిరంతర సాధన చేయాలి

‣ ఇప్పుడు ముఖాలు, గొంతులు మార్చేలా ఎన్నో యాప్‌లు వచ్చేశాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. మనం కూడా కనిపించిదల్లా ఫార్వర్డ్‌ చేయడం, విషప్రచారాలను పంచుకోవడం సరికాదు. కొన్నిసార్లు ఇది న్యాయపరమైన ఇబ్బందులను తెచ్చిపెట్టగలదు. మన ఫోన్‌లో ఏ యాప్‌కి ఎంతవరకూ పర్మిషన్‌ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు అనేది చూసుకోవాలి. డిజిటల్‌ డిపెండెన్సీను తగ్గించుకోవాలి. ప్రఖ్యాత సైకాలజిస్ట్‌ విలియం జేమ్స్‌ చెప్పిన ‘స్టార్వేషన్‌ ఆఫ్‌ అప్రిషియేషన్‌’ బారిన పడకూడదు. దానితో బాధపడేవారి ఆలోచనలు, అభిప్రాయాలకు విలువ ఇవ్వకూడదు. డీసెంటిసైజేషన్‌ను సాధన చేయాలి. మన పట్ల మనమే బాధ్యత తీసుకోవాలి. అనవసర విషయాలకు, మన చేతుల్లో లేని అంశాలకు స్పందించడం తగ్గించుకోవాలి. ఎమోషనల్‌ ఎలాస్టిసిటీ పెంచుకోవాలి. ఒక రబ్బర్‌బాండ్‌ ఎంత లాగినా వదిలిన వెంటనే తన యథాస్థితికి వచ్చేస్తుంది. అలాగే ఒక విషయం మనల్ని ఎంత బాధపెట్టినా, దాన్ని వదిలేసి మన యథాస్థితికి వచ్చేయడానికి ప్రయత్నించాలి.

విమర్శ ఏదైనా ఆలోచన వరకే ఉండాలి, మనసుకు చేరకూడదు. గొప్పగొప్ప నాయకుల దగ్గర్నుంచి సాధారణ వ్యక్తుల వరకూ అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత ట్రోలింగ్‌కు గురవుతూనే ఉంటారు, ఇది సాధారణం. స్పందిస్తేనే డిప్రెషన్, యాంగ్జైటీ వంటివి చుట్టుముడతాయి. అదే వదిలేస్తే ఏ బాధా ఉండదు. తిట్టుకుంటూ నిలబడటం కాదు, తట్టుకుని నిలబడాలి. విద్యార్థులంతా ఇది సాధన చేయడం ద్వారా జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను ధైర్యంగా ఎదుర్కో గలరు. 

విద్యార్థులు ఈ సమయంలో మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మనం ఏదైనా ఇబ్బందికి గురైతే మనకంటే ఎక్కువగా తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు నలిగిపోతారు.

అదే ధైర్యంగా ఉండటం ద్వారా వారికి ఆ బాధ కలగకుండా చూసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో కనెక్ట్‌ అవుతున్నాం, జీవితం గురించి ఎవరికి సమాచారం ఇస్తున్నాం అనేది గమనించుకోవాలి. స్క్రీన్‌ టైమ్‌ను తగ్గించుకోవడం, డిజిటల్‌ ఫాస్టింగ్‌ చేయడం.. ఇవన్నీ అవసరం.

- డాక్టర్‌ క్రాంతికార్, సైకాలజిస్ట్, హిప్నోథెరపిస్ట్‌ 

 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీ ఎగ్జిక్యూటివ్‌గా అవకాశం

‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!

‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!

‣ టెక్స్‌టైల్‌ కమిటీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ కొలువులు!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!

Posted Date : 21-05-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.