ఏ ప్రసిద్ధ యూనివర్సిటీలో సీటు కోసం దరఖాస్తు చేసినా, పెద్ద కంపెనీలో ఉద్యోగానికి ప్రయత్నించినా... మన గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అలా చెప్పేటప్పుడు ఎదుటివారికి మన ప్రొఫైల్ ఆసక్తికరంగా అనిపించాలి అంటే... మనలో ఏదో ప్రత్యేకత ఉండాలి. ఆ వైవిధ్యమే మన ‘వావ్ ఫ్యాక్టర్’. విద్యార్థుల, అభ్యర్థుల అవకాశాలను ప్రభావితం చేయగలిగే సత్తా ఉన్న ఈ అంశం గురించి... వివరంగా తెలుసుకుందాం.
వావ్ ఫ్యాక్టర్ అంటే మనకు మాత్రమే సొంతమైన ఓ నైపుణ్యం, కళ. అది ఏదైనా కావొచ్చు... అందులో మనం ఉత్తమ ప్రతిభ కనబరిస్తే చాలు, అదే మన పట్ల ఎదుటివారికి సదభిప్రాయం కలిగిస్తుంది. ఒక అభ్యర్థి రెజ్యూమెలో ఇది అత్యంత ముఖ్యమైన, ఆకర్షణీయమైన, విలువైన అంశం అవుతుంది. అటువంటి లక్షణం ఉన్నప్పుడు రెజ్యూమె చూడగానే ఈ అంశం బాగా కనిపించేలా అధిక ప్రాధాన్యంతో రాయవచ్చు. ఇటీవల నియామక సంస్థలు అభ్యర్థులను వడపోయడంలో ఈ వావ్ ఫ్యాక్టర్‌ను గమనిస్తున్నాయి. అభ్యర్థిని ఎంచుకోవాలి అంటే, వారిలో ఏమిటంత ప్రత్యేకత అనేది చూస్తున్నాయి.
ఎలా రాయాలి..?
దీని గురించి రాసేటప్పుడు చెప్పే అంశం పట్ల స్పష్టత అవసరం. ఎంచుకున్న రంగంలో మన ప్రతిభ ఏమిటనేది విపులంగా చెప్పుకోగలగాలి. ఉదాహరణకు మీరు హాకీలో రాష్ట్రస్థాయి క్రీడాకారులైతే... ప్రధానంగా ఆడిన మ్యాచుల సంగతితోపాటు ఆ ఆటను ఎందుకు ఎంచుకున్నారు, దానిపై మీకున్న నిబద్ధత ఏమిటి? అందులో మీరు ఏవిధంగా ప్రత్యేకం అనే అంశాలను చెప్పొచ్చు. అదే మీకు సముద్ర జల కాలుష్య నియంత్రణపై పరిశోధనాసక్తి, అవగాహన ఉన్నాయనుకుంటే... దాని గురించి వివరించడమూ ఉపకరిస్తుంది. మీకు నచ్చిన, మీరు నమ్మిన విషయాల పట్ల ఎంత నిజాయతీగా ఉన్నారనేది ఇక్కడ ముఖ్యం. అలాగే ఇది వరకే ఒక చోట పనిచేసి, వేరే చోటికి మారాలి అనుకునేవారు అప్పటివరకూ కెరియర్‌లో వారు సాధించిన విజయాలు, నేర్చుకున్న అంశాల గురించి చెప్పొచ్చు.
నాయకత్వ లక్షణాలు..
అభ్యర్థిలో అందరూ కోరుకునే లక్షణం ఇది. మీ నాయకత్వ లక్షణాలను నిరూపించే ఏ విషయమైనా వావ్ ఫ్యాక్టర్ అవుతుంది.
స్కూల్, కాలేజీలో తరగతులు, విభాగాలకు నాయకత్వం వహించడం... బయట కూడా దీనికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం ఈ కోవకు చెందుతాయి.
విద్యార్థులైతే.. వారి కష్టపడేతత్వాన్ని, క్రమశిక్షణను, ప్రతిభను ప్రతిబింబించేలా వావ్ ఫ్యాక్టర్ ఉండాలి. అదే ఉద్యోగార్థులైతే.. నేర్చుకునే కుతూహలం, ఎటువంటి పరిస్థితుల్లోనైనా పనిచేయగలిగే సామర్థ్యం, సంస్థలో అమరిపోయే గుణం, నిర్ణయాలు తీసుకునే నేర్పు, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, పనిలో విలువలు పాటించడం, మానసికంగా బలంగా ఉండటం వంటి వాటిపై దృష్టి సారించాలి.
ఏమేం ఉండొచ్చు...
ప్రతిభను నిరూపించేవి..
వావ్ ఫ్యాక్టర్‌లో మీ ప్రతిభను ఇప్పటికే నిరూపించిన విషయాలకు చోటుంటుంది. టాప్ మార్కులు, సాధించిన సర్టిఫికెట్లు, క్రీడల్లో ప్రావీణ్యం, ఇతర వ్యాపకాల్లో సాధించిన బహుమతులు, స్కాలర్‌షిప్‌లు... ఇలా ఏవైనా కావొచ్చు. గమనిస్తే, చాలామంది విద్యార్థులు అసలు ఇవేవీ లేకుండానే డిగ్రీలు పూర్తి చేసేస్తుంటారు. అలాకాకుండా మీకు వీటిలో ఏదైనా లక్షణం ఉంటే, మీరు సాధారణ విద్యార్థుల కంటే భిన్నంగా కనిపించవచ్చు.
ప్రాజెక్టులు..
ఏ సబ్జెక్టు చదివే వారైనా.. సొంతంగా ప్రాజెక్టులు తయారుచేసేవారు ప్రత్యేకంగా నిలవగలరు. ఎందుకంటే ఇవి మీ సృజనాత్మకతను, ఆలోచనాశక్తిని, నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. దేన్నయినా సృష్టించగలిగే సామర్థ్యానికి గీటురాయిగా నిలుస్తాయి. యాప్‌లు, వీడియోగేమ్స్, డ్రోన్లు, రోబోట్లు, వ్యవసాయ పరికరాలు... ఇలాంటివి తయారుచేసే వారు ఈకోవకు చెందుతారు. టెక్నికల్ అంశాలపై ఆసక్తి లేనివారైతే రచననూ ప్రయత్నించవచ్చు. వార్తాపత్రికల్లో వ్యాసాలు, కథనాలు రాసేవారు... సొంతంగా కథలు రాయడం, షార్ట్ ఫిల్మ్‌లు లాంటివి తీసేవారూ ఈ విభాగంలోకే వస్తారు.
వైవిధ్యం..
అందరికీ సాధారణమైన జీవితం దొరకదు. కొందరు ఎన్నో సమస్యలను దాటాల్సి వస్తుంది. ధైర్యంగా వాటిని ఎదుర్కొని నిలబడ్డ వారు కొందరైతే... పోరాడలేక వెన్నుచూపేవారు ఎందరో! అలా కాకుండా కిందిస్థాయి నుంచి కష్టపడి పైకొచ్చిన విద్యార్థులు - అభ్యర్థులు నిజంగా వావ్ అనిపిస్తారు. ఇవి రెజ్యూమెలో రాయకపోయినా ముఖాముఖి సమయంలో సందర్భాన్నిబట్టి చెప్పడం అవతలివారికి మనపై సానుకూలతను పెంచుతుంది.

చివరిగా.. ఎవరికి వారే ప్రత్యేకమైన ఈ పోటీ ప్రపంచంలో మనమూ ఓ వావ్ ఫ్యాక్టర్‌ను అభివృద్ధి చేసుకోవడం అవసరం. అప్పుడే మన ప్రత్యేకత చాటుకోగలం!
మరింత సమాచారం... మీ కోసం!
‣ టిస్ కోర్సుల్లోకి ప్రవేశాలు ప్రారంభం
‣ అందరూ కామర్స్ కోర్సుల్లో చేరుతున్నారు!
‣ సందిగ్ధతను దాటి.. సన్నద్ధత వైపు!