‣ ఉన్నత కొలువులకు దారి చూపే ఎన్‌డీఏ పరీక్ష
రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగానికి అవకాశం వచ్చింది! ఇంటర్మీడియట్ అర్హతతోనే అబ్బాయిలతో పాటు అమ్మాయిలూ పోటీ పడవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపి డిఫెన్స్ అకాడెమీలో చేరిపోవచ్చు. అక్కడే శిక్షణ పొందుతూ బీఏ/బీఎస్సీ/బీటెక్ ఉచితంగా చదువుకోవచ్చు. అనంతరం లెవెల్-10 వేతనంతో ఆర్మీ/ నేవీ/ ఏర్‌ఫోర్స్‌ల్లో సేవలు అందిస్తూ భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. తాజాగా వెలువడిన నేషనల్ డిఫెన్స్ అకాడెమీ అండ్ నేవల్ అకాడెమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ) 2022(2) ప్రకటన వివరాలు చూద్దాం!
తక్కువ విద్యార్హతతో అత్యున్నత భవిష్యత్తు అందించే పరీక్షలు కొన్నే ఉంటాయి. వాటిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నిర్వహించే ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ ముఖ్యమైంది. మెరికల్లాంటి యువతను సానబెట్టి, రక్షణ ఉద్యోగాలు అందించే లక్ష్యంతో యూపీఎస్‌సీ ఏడాదికి రెండుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఇందులో ఎంపికైనవారు పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్‌డీఏ)లో బీటెక్, బీఎస్సీ, బీఏ కోర్సులు ఉచితంగా చదువుకుంటూ ప్రాథమిక శిక్షణ పొందవచ్చు. వసతి, భోజనం, బట్టలు...అన్నీ ఎన్‌డీఏ చూసుకుంటుంది. నేవల్ అకాడెమీ(ఎన్‌ఎ)కు ఎంపికైనవాళ్లు కేరళలోని ఎజమాళలో బీటెక్ విద్య అభ్యసిస్తారు. ఎన్‌డీఏ, ఎన్‌ఏల్లో విజయవంతంగా చదువు పూర్తిచేసుకున్నవారికి జేఎన్‌యూ, న్యూదిల్లీ పట్టాలను ప్రదానం చేస్తుంది. అనంతరం ట్రేడ్ శిక్షణ సంబంధిత కేంద్రాల్లో అందిస్తారు. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్ అందుతుంది.
శిక్షణ పూర్తిచేసుకున్నవారు ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్, ఏర్ ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్ (పైలట్)/ గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభిస్తారు. ఈ మూడూ సమాన స్థాయి ఉద్యోగాలు. అందరికీ ఒకటే పేస్కేల్ అమలవుతుంది. మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం పొందవచ్చు.
ఎంపిక ఇలా...

పరీక్షలో అర్హత పొందిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో యూపీఎస్‌సీ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తుంది. ఈ విభాగానికీ 900 మార్కులు కేటాయించారు. ఇందులో భాగంగా గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్, గ్రూప్ ప్లానింగ్, అవుట్‌డోర్ గ్రూప్ టాస్క్‌లు ఉంటాయి. ఐదు రోజులపాటు రెండంచెల్లో వీటిని నిర్వహిస్తారు. తొలిరోజు పరీక్షల్లో అర్హత సాధించినవారికే మిగిలిన నాలుగు రోజుల టాస్క్, ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. రాత పరీక్ష, సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
40 శాతంతో విజయం
రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో 40 శాతం మార్కులు సాధించినవారు ఎన్‌డీఏలో అవకాశం పొందవచ్చు. 2021(1) పరీక్షలో 900కు గానూ 343, ఆపైన మార్కులు పొందినవారు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. అంతకు ముందు అంటే 2020(2) పరీక్షలో కటాఫ్ 355గా ఉంది. 2019 కటాఫ్ 346 మార్కులే. అందువల్ల 40 శాతం మార్కులు పొందితే ఇంటర్వ్యూకు అర్హత లభిస్తుంది. తుది నియామకాల్లో 720 మార్కులు పొందినవారికి అవకాశాలుంటాయి. అంటే పరీక్ష, ఇంటర్వ్యూల్లో కలుపుకుని 1800కు గానూ 40 శాతం (720) మార్కులు పొందినవారు శిక్షణకు ఎంపిక కావచ్చు.
శ్రద్ధగా సన్నద్ధమైతే ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా ఎంపీసీ విద్యార్థులకు ఈ పరీక్ష అనుకూలం. ఈ గ్రూప్ నుంచే 460 (పేపర్ 1లో మ్యాథ్స్ 300, పేపర్ 2లో ఫిజిక్స్, కెమిస్ట్రీ 160) మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఆర్ట్స్, బైపీసీ గ్రూపు విద్యార్థులు విజయానికి గట్టి కృషి తప్పనిసరి. పరీక్షలో అర్హతకు సబ్జెక్టులవారీ కనీసం 25 శాతం మార్కులు పొందాలి.
సన్నద్ధత ఎలా?
‣ సబ్జెక్టులవారీ పాఠ్యాంశాలను ప్రకటనలో పేర్కొన్నారు. వాటి ప్రకారం సీబీఎస్‌ఈ 10, 11, 12 తరగతుల పుస్తకాలను బాగా అధ్యయనం చేయాలి. ముందుగా ప్రాథమికాంశాలపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం 8,9,10 తరగతుల మ్యాథ్స్, సైన్స్, సోషల్ పాఠ్యపుస్తకాలు చదువుతూ ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి.
‣ పాఠ్యాంశాలు చదవడం పూర్తయిన తర్వాత పాత ప్రశ్నపత్రాలు పరిశీలించాలి. ఇవన్నీ యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, ఏ చాప్టర్లకు ప్రాధాన్యం ఉందో గమనించి పరీక్ష కోణంలో తుది సన్నద్ధత కొనసాగించాలి.
‣ అధ్యయనం పూర్తయిన తర్వాత మాక్ పరీక్షలు రాయాలి. ఒక్కో పరీక్ష పూర్తయిన వెంటనే ఫలితాలు విశ్లేషించుకోవాలి. వాటి ప్రకారం వెనుకబడిన సబ్జెక్టులు/ పాఠ్యాంశాలకు ప్రాధాన్యమిచ్చి చదువుకోవాలి. తర్వాత రాసే మాక్ పరీక్షల ద్వారా మెరుగుపడ్డారా, లేదా తెలుసుకుని ఇంకా ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకోవాలి. వీటిని వాస్తవ పరీక్షల్లా భావించి, సమయానికీ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇబ్బంది పెడుతోన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. మ్యాథ్స్ విభాగంలో పలు ప్రశ్నలకు సమయం సరిపోకపోవచ్చు. వీలైనన్ని మాదిరి ప్రశ్నల సాధనతో వేగం, కచ్చితత్వాన్ని అందుకోవచ్చు.
‣ పరీక్షలో రుణాత్మక మార్కులున్నందున ఏ మాత్రం అవగాహన లేని ప్రశ్నల జోలికి వెళ్లకపోవటమే మంచిది. కొన్ని ప్రశ్నలకు జవాబు రాబట్టడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఇలాంటివాటిని ఆఖరులో సమయం మిగిలితేనే ప్రయత్నించాలి.
ఎన్‌డీఏ ఎందుకంటే..
రక్షణ రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఈ పరీక్ష దారి చూపుతుంది. భవిష్యత్తులో ఆర్మీ/ నేవీ/ ఏర్‌ఫోర్స్‌లకు చీఫ్ కావచ్చు. శిక్షణ అనంతరం నేరుగా లెవెల్-10 హోదా అంటే సివిల్ సర్వెంట్లతో సమాన పే స్కేల్ పొందవచ్చు. విధుల్లో చేరినవాళ్లు రెండేళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న తర్వాత పదోన్నతి పొందవచ్చు. ఆరేళ్ల తర్వాత మరొకటి, పదమూడేళ్లకు మరో ప్రమోషన్ అందుతుంది. 13 ఏళ్లు పనిచేసినవాళ్లు ఆర్మీ, నేవీ, ఏర్ ఫోర్స్‌ల్లో వరుసగా... లెఫ్టినెంట్ కల్నల్, కమాండర్, వింగ్ కమాండర్ స్థాయికి చేరుకుంటారు. ఎన్నో ప్రోత్సాహకాలు ఉద్యోగులతోపాటు కుటుంబ సభ్యులకూ వర్తిస్తాయి.
ఏటా రెండుసార్లు ఎన్‌డీఏ నిర్వహిస్తున్నారు. సుమారు 19 1/2 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఇంటర్ తర్వాత ఆసక్తి ఉన్నవారు కనీసం ఆరేడుసార్లు పరీక్ష రాసుకోవచ్చు. గట్టిగా ప్రయత్నిస్తే తొలి ప్రయత్నంలోనే నెగ్గవచ్చు. మిగిలినవారికి రెండుమూడు ప్రయత్నాలతో విజయం సాధ్యమే. పైలట్ అవ్వాలనే ఆశయం ఉన్నవారికి ఎన్‌డీఏ మంచి మార్గం!
1. గణితంలోని ప్రాథమికాంశాలు, సూత్రాలు, అనువర్తనంపై దృష్టి సారించాలి. ఈ పేపర్‌లో మ్యాట్రిసెస్ అండ్ డిటెర్మినెంట్స్ నుంచి 30, ట్రిగనోమెట్రీ- 30, కాలిక్యులస్- 20, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్- 20, ప్రాబబిలిటీ- 10, కాంప్లెక్స్ నంబర్స్ నుంచి 10 వరకు ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల వీటిని అధిక ప్రాధాన్యంతో చదవాలి.
2. ఫిజిక్స్‌లో కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు అడుగుతున్నారు. సూత్రాలు, అనువర్తనంపై అవగాహన పెంచుకోవాలి.
3. రసాయనశాస్త్రంలో మూలకాల వర్గీకరణ, సమ్మేళనాలు, మిశ్రమాలపై దృష్టి సారించాలి.
4. కరెంట్ అఫైర్స్ విభాగంలో జనవరి 2022 నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో నెలకొన్న కీలక పరిణామాలపై ప్రశ్నలు రావచ్చు. వార్తాపత్రికలు చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలను రాసుకోవాలి.
5. ఇంగ్లిష్ విభాగంలోని ప్రశ్నలు అభ్యర్థి భాషను ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకునేలా వస్తాయి. వ్యాకరణం, పదసంపదలకు ప్రాధాన్యం ఉంది. ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయించుకుని వీలైనన్ని కొత్త పదాలను తెలుసుకోవాలి. వాక్యంలోని పదాలు ఒక క్రమంలో అమర్చమనే ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. అర్థాలు, వ్యతిరేకపదాలు, తప్పుని గుర్తించడం, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, కాంప్రహెన్షన్, ఖాళీని పూరించడం...వీటిలో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి.
ఏ పుస్తకాలు చదవటం మేలు?
‣ టాటా మెక్ గ్రాహిల్స్, అరిహంత్ పబ్లిషర్ల ఎన్‌డీఏ పుస్తకాలు
‣ లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ జీకే ప్రశ్నలకు ఉపయోగం.
‣ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు ఇంటర్ పాఠ్యపుస్తకాలు సరిపోతాయి.
‣ చరిత్ర, భూగోళశాస్త్రం, జనరల్ సైన్స్ విభాగాల్లోని ప్రశ్నలకు ఆయా సబ్జెక్టుల్లో ఎన్‌సీఈఆర్‌టీ 8, 9, 10 తరగతులతోపాటు ప్లస్ 1, 2 పుస్తకాలు ప్రయోజనకరం.
ముఖ్య సమాచారం
మొత్తం ఖాళీలు: 400. వీటిలో నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో 370 (ఆర్మీ 208 (వీటిలో 10 మహిళలకు), నేవీ 42(ఇందులో 3 మహిళలకు), ఏర్ ఫోర్స్ మొత్తం 120 ఇందులో 92 ఫ్లయింగ్ (3 మహిళలకు), గ్రౌండ్ డ్యూటీస్ టెక్నికల్ 18(2 మహిళలకు), గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్నికల్ 10(2 మహిళలకు)) ఉన్నాయి. నేవల్ అకాడెమీ (10+2 క్యాడెట్ స్కీం)లో 30 ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ పురుషులకే.
అర్హత: ఆర్మీ వింగ్ పోస్టులకు ఏదైనా గ్రూప్‌తో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఏర్ ఫోర్స్, నేవల్ వింగ్స్ (ఎన్‌డీఏ), 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ఖాళీలకు ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జనవరి 2, 2004 కంటే ముందు; జనవరి 1, 2007 తర్వాత జన్మించినవారు అనర్హులు. శారీరక ప్రమాణాలు: కనీస ఎత్తు 157 సెం.మీ., ఏర్‌ఫోర్స్‌కు 162.5 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగిన బరువు అవసరం.ఆన్‌లైన్ దరఖాస్తులు: జూన్ 7 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు.
పరీక్ష తేదీ: సెప్టెంబరు 4
ఏపీ, తెలంగాణల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, తిరుపతి
వెబ్‌సైట్: https://upsc.gov.in/
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ డిజిటల్ గేమింగ్‌కు ఉజ్జ్వల భవిత
‣ టెన్త్‌తో పోస్టల్ ఉద్యోగాలు
‣ టైమ్స్ ర్యాంకింగ్‌లో కలకత్తా వర్సిటీ టాప్!
‣ ఇఫ్లూ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన
‣ సౌకర్యంగా చదువుకోడానికి ఈ-బుక్‌రీడర్