• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డిజిటల్‌ గేమింగ్‌కు ఉజ్జ్వల భవిత

పటిష్ఠ కార్యాచరణ కీలకం

‘డిజిటల్‌ గేమింగ్‌ రంగంలో భారత్‌ అగ్రగామిగా మారాలి... మనదేశ సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా ఆకర్షణీయమైన డిజిటల్‌ గేములను ఆవిష్కరించాలి’ అని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో పిలుపిచ్చారు. యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్‌ (ఏవీజీసీ) రంగంలో ప్రపంచ మార్కెట్‌ అవసరాలను తీర్చగలిగే సాధన సంపత్తిని భారత్‌ సమకూర్చుకోవడానికి ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ఏడాది బడ్జెట్‌ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు ప్రత్యేక విధానాలతో గేమింగ్‌ రంగంలో ఉపాధికి ఊతమిచ్చే దిశగా సాగుతున్నాయి. ఇండియాలో గేమింగ్‌ రంగాన్ని అభివృద్ధి చేస్తే దాదాపు 20 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించవచ్చని కన్సల్టింగ్‌ సేవల సంస్థ డెలాయిట్‌ చెబుతోంది. గేమింగ్‌ రంగంలో మేధాసంపత్తి హక్కుల (ఐపీఆర్‌) సృష్టి అత్యంత కీలకం. అంతర్జాతీయంగా తీవ్ర పోటీ ఉన్న ఈ రంగంలో పేరు ప్రతిష్ఠలు సంపాదించాలంటే ఇతర దేశాల్లో ఎక్కడా లేని, మనకు మాత్రమే ప్రత్యేకమైన సాధన సంపత్తిని సమకూర్చుకోవాలి. అందుకోసం నాణ్యమైన మానవ వనరులను అభివృద్ధి చేసుకోవాలి. ప్రోత్సాహకాలు అందించి గేమింగ్‌ కంపెనీలు, అంకుర సంస్థలకు అండగా నిలవాలి.

చాలా ఏళ్లుగా గేమింగ్‌లో మేధాసంపత్తి గురించి భారత్‌ ఆలోచించలేదు. దాన్ని సేవారంగానికి చెందిన వస్తువుగానే పరిగణించింది. యాజమాన్య ఉత్పత్తుల (ప్రొప్రైటరీ ప్రొడక్ట్స్‌)కు మాత్రమే అధిక విలువ లభిస్తుంది. భారత్‌ నుంచి ఏటా ఆవిష్కరిస్తున్న డిజిటల్‌ క్రీడలు చాలా తక్కువ. వాటి నాణ్యతా అంతంతే. గేముల అభివృద్ధి, ఆవిష్కరణకు విదేశీ సంస్థలు కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. అత్యాధునిక సాంకేతికతను ఆవిష్కరించి డిజిటల్‌ ఆటల్లో వినియోగిస్తున్నాయి. నిపుణులైన మానవ వనరులను ఈ రంగంలోకి ఆకర్షిస్తున్నాయి. ఈ విషయంలో భారత్‌ చాలా వెనకబడి ఉంది. గేమింగ్‌ సాంకేతికతపై తగినంత శిక్షణ ఇచ్చే విద్యాసంస్థలకు భారత్‌లో చాలా కొరత ఉంది. దీనిపై వెంటనే దృష్టి సారించాలి.

ప్రస్తుతం గేమింగ్‌ రంగాన్ని మొబైల్‌ ఫోన్లు శాసిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 85శాతం వాటిలోనే ఆటలు ఆడుతున్నారు. భారత గేమింగ్‌ మార్కెట్లో మొబైల్‌ వాటా 50శాతానికి మించిపోయింది. మొబైల్‌ ఫోన్ల వాడకం అధికంగా ఉన్న ఇండియాలో అది ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ రంగంలో ఇండియా విశ్వగురువు కాగలదనే ధీమాకు అదే ఆధారం. అత్యాధునిక సాంకేతికతతో మొబైల్‌ క్రీడలను ఆవిష్కరించి, వాటిని ప్రపంచ మార్కెట్‌కు అందించే అద్భుతమైన అవకాశం భారత్‌కు ఉంది. దాన్ని గుర్తించి అటు ప్రభుత్వం, ఇటు పరిశ్రమ పరంగా గట్టి ప్రయత్నాలు జరగాలి.

కొవిడ్‌ మహమ్మారి వల్ల ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమైనప్పుడు గేమింగ్‌కు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా 270కోట్ల మంది డిజిటల్‌ క్రీడలతో కాలం గడిపినట్లు పరిశీలనలు చాటుతున్నాయి. ఆ సంఖ్య 400 కోట్లకు మించిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. కేవలం పిల్లలు, యువకులే కాకుండా అన్ని వయసుల వారు, మహిళలు సైతం ఇటీవలి కాలంలో గేమింగ్‌పై ఆసక్తి పెంచుకుంటున్నారు. దానికి తగినట్లు కొత్త డిజిటల్‌ క్రీడల ఆవిష్కరణకు పలు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ రంగంలోని అంకుర సంస్థలకు గత ఏడాదిన్నర కాలంలో రూ.12,000 కోట్ల పెట్టుబడి సమకూరింది. దీన్నిబట్టి ఈ రంగంపై పెట్టుబడిదారుల్లో ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది. సేవల రంగం చోదక శక్తిగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థలో ఐటీ పాత్ర కీలకమైంది. గేమింగ్‌, యానిమేషన్‌, వీఎఫ్‌ఎక్స్‌ విభాగమూ అంతటి సత్తా కలిగినవే. స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగితే ఈ రంగంలో అపార అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అదేసమయంలో విద్యార్థులపై మానసికంగా ప్రతికూల ప్రభావం చూపే ఆటలపట్ల అప్రమత్తం కావాలి. చిన్నారుల భవిష్యత్తుకు నష్టం వాటిల్లని విధంగా గేమింగ్‌ రంగాన్ని తీర్చిదిద్దాలి. 

- ఎల్‌.మారుతీశంకర్‌ 

(డిజిటల్‌ గేమింగ్‌ రంగ నిపుణులు)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గణితంలో గరిష్ఠ మార్కులు

‣ టెన్త్‌తో పోస్టల్‌ ఉద్యోగాలు

‣ టైమ్స్‌ ర్యాంకింగ్‌లో కలకత్తా వర్సిటీ టాప్‌!

‣ ఇఫ్లూ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన

‣ సౌకర్యంగా చదువుకోడానికి ఈ-బుక్‌రీడర్‌

‣ బహు భాషలు నేర్చుకుంటే..!

Posted Date : 23-05-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌