• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇలా కాలాన్ని సద్వినియోగం చేసుకోండి!

అందరికీ ఉన్నది ఇరవై నాలుగు గంటలే. అయినా కొందరికే ఎందుకు సరిపోతుంది? చాలామందికి చాలడం లేదు ఎందుకు? సమయం మిగలక ఎక్కువమంది ఎందుకు సతమతం అవుతున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే మనం కొన్ని విషయాల గురించి తెలుసుకోవాల్సిందే!

విద్యార్థులు ప్రతిరోజూ చేయాల్సిన పనులు చాలానే ఉంటాయి. ఉదయాన్నే తరగతులకు హాజరుకావాలి. ఆ తర్వాత చాలామందికి ట్యూషన్లూ ఉంటాయి. అవి కూడా పూర్తయిన తర్వాత మళ్లీ కాసేపు చదువుకుని నిద్రపోతుంటారు. ఇవే కాకుండా... ఆటపాటలూ, సినిమాలూ, స్నేహితులతో షికారు, సోషల్‌ మీడియాలో బిజీగా గడపడం... లాంటివీ ఉండనే ఉంటాయి. చేయాల్సిన పనులెన్నో ఉన్నా సమయం వృథా కాకుండా ఉండాలంటే అనుసరించాల్సిన మెలకువలు తెలుసుకుందాం... 

ప్రణాళిక: ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్లడం చాలా కష్టం. ఏయే సబ్జెక్టులు చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎంతసేపు చదవాలి... అనే విషయాల్లో స్పష్టత ఉండాలి. ఏయే సబ్జెక్టులకు ఎంత సమయాన్ని కేటాయించాలో ప్రణాళిక వేసుకోవాలి. దాని ప్రకారం పరీక్షలకు సిద్ధంకావాలి. ఉదాహరణకు రోజూ మూడు సబ్జెక్టుల్లో మూడు అధ్యాయాలను చదవాలని ప్లాన్‌ వేసుకున్నారు అనుకుందాం. దాని ప్రకారం అవి చదివేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని మర్నాటికి వాయిదా వేయకూడదు. ఎందుకంటే మర్నాడు ఏమేం చదవాలనేదానికీ మీ దగ్గర ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది. ఈరోజు ప్రణాళిక తప్పడం వల్ల రేపటి ప్లాన్‌ పాడవకూడదు. కాబట్టి ఏరోజు చదవాల్సిన వాటిని ఆరోజే పూర్తిచేయడం ఎంతో అవసరం. ఇలా చేస్తే సమయం సరిపోకపోవడం, వృథా కావడం లాంటి సమస్యలు ఉండవు. 

అమూల్యం: సమయం ఎంతో విలువైంది. అనవసరంగా కాలాన్ని వృథా చేస్తే నష్టపోయేది మనమే. తెలిసిచేసినా, తెలియక చేసినా... వృథా చేసిన కాలాన్ని తిరిగి పొందలేం. ముఖ్యంగా విద్యార్థి దశలో దీనికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. నిర్దేశిత లక్ష్యాలను సాధించాలంటే ప్రతి నిమిషమూ అమూల్యమైందే. ఈ విషయాన్ని గుర్తించడం సమయపాలనకు తొలి అడుగు లాంటిది. చిన్నచిన్న పనులకు సమయం వృథా అవుతుందని భావిస్తే... కుటుంబ సభ్యుల సాయం తీసుకోవచ్చు. ఉదాహరణకు అసైన్‌మెంట్లను ప్రూఫ్‌ రీడింగ్‌ చేయడాన్ని వారికి అప్పగించొచ్చు. ఆ సమయంలో మీరు మరో ముఖ్యమైన అధ్యాయం చదువుకోవచ్చు. 

ఏకాగ్రత: కొంతమంది విద్యార్థులు ఒక్క అధ్యాయాన్ని చదవడానికి కూడా గంటలకొద్దీ సమయాన్ని తీసుకుంటారు. ఎందుకంటే ఒకపక్క చదువుతూనే మరోపక్క మొబైల్‌ ఫోన్లో స్నేహితులకు మెసేజ్‌లు పంపుతుంటారు. కంప్యూటర్‌పైన చదువుతున్నప్పుడు మరో వెబ్‌సైట్‌లో వేరే పేజీనీ తెరుస్తుంటారు. దీంతో వేగంగా చదవలేకపోతారు. కాబట్టి చదివేటప్పుడు సెల్‌ఫోన్‌ను స్విచ్చాఫ్‌ చేయడం, మరో వెబ్‌సైట్‌ చూడకపోవడం మంచిది. మీ దృష్టిని ఒక్క పని మీద మాత్రమే కేంద్రీకరించాలి. 

ప్రదేశం: సమయపాలనలో చదువుకునే చోటుకూ ప్రాధాన్యం ఉంటుంది. గాలీ, వెలుతురుతో నిశ్శబ్దంగా ఉండే చోటును ఎంపికచేసుకోవాలి. అక్కడ కూర్చుని ఎక్కువ గంటలపాటు చదివినా ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉండేలా చూసుకోవాలి. మంచం లేదా సోఫా మీద కూర్చుని చదివితే నిద్ర రావచ్చు. చదవడానికి కుర్చీ, టేబుల్‌ను ఉపయోగిస్తే మంచిది. ఎదురుగా గడియారాన్ని అమర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏ సబ్జెక్టుకు ఎంత సమయాన్ని వినియోగిస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. చదివేటప్పుడు ముఖ్యమైన పాయింట్లను హైలైట్‌ చేయడానికి వీలుగా పెన్ను/మార్కర్‌ అందుబాటులో పెట్టుకోవాలి. అవసరమయ్యే వస్తువుల కోసం పదేపదే వేరే గదిలోకి వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ఇలాచేసినా సమయం వృథా అవుతుంది. చదివే చోటును తరచూ మార్చకూడదు. రోజూ ఒకేచోట కూర్చుని చదవడం వల్ల... అక్కడికి వెళ్లగానే చదవాలనే మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఇతర విషయాలేవీ మీకు గుర్తుకు రావు.

విభజన: ఏమేం చదవాలనేది ప్రణాళిక వేసుకోవడం తెలిసిందే. అయితే దీన్ని నెల, వారం, రోజులవారీగా విభజించుకుంటే మంచిది. దీంతో ఏరోజు పనులను ఆ రోజే పూర్తిచేయగలుగుతారు. ఒకరోజు అనుకున్నట్టుగా చేయలేకపోయినా... ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోగలుగుతారు. 

నిద్ర: సమయపాలనను పాటించడంలో నిద్రకూ ప్రాధాన్యం ఉంటుంది. కొందరు విద్యార్థులు అర్ధరాత్రి వరకూ చదివి ఉదయాన్నే నిద్ర లేస్తారు. లేదా మధ్యాహ్నం వరకూ నిద్రపోతూనే ఉంటారు. ఇలా నిద్రించే సమయాలు మారడం వల్ల దాని ప్రభావం చదువు మీదా పడుతుంది. నిద్రా సమయాలను కచ్చితంగా పాటిస్తే చదవడానికి వేసుకున్న ప్రణాళికనూ తప్పకుండా పాటించగలుగుతారు. సమయం వృథా అయ్యే సమస్యే ఉండదు. అలాగే తగినంత నిద్ర ఉండేలానూ చూసుకోవాలి. సుమారు ఆరేడు గంటపాటు నిద్రపోతే శారీరకంగా తగిన విశ్రాంతిని పొందుతారు. దాంతో మర్నాడు మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది.

ప్రాధాన్యాలు: చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. వాటిల్లో అతి ముఖ్యమైనవి, ముఖ్యమైనవి, ప్రస్తుతం చేయకపోయినా ఎలాంటి ఇబ్బందీలేనివీ కొన్ని ఉంటాయి. పనులను వాటి స్వభావాన్ని బట్టి విభజించుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రతి పనికీ కొంత సమయాన్ని కేటాయించగలుగుతారు. అలాగే అన్నింటినీ ఒకేసారి చేయాలని కంగారుపడాల్సి అవసరం ఉండదు. దాంతో ఒత్తిడికీ గురికాకుండానూ ఉండగలుగుతారు. ఉదాహరణకు విద్యార్థులుగా మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని అంటే.. చదువుకోవడమే. కాబట్టి ముందుగా దానికే సమయాన్ని కేటాయించాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే ఆరోగ్యం ఎంతో అవసరం. దాని కోసం వ్యాయామం చేయాలి. అంటే వ్యాయామమూ ముఖ్యమైందే. కాబట్టి దీనికీ తగినంత సమయాన్ని కేటాయించగలగాలి. స్నేహితులతో బయటకు వెళ్లడం, సినిమాలు, సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండటం... ఇలాంటివన్నీ వేసవి సెలవుల్లోనూ చేయొచ్చు. అలాగే వీటిని వాయిదా వేయడం వల్ల ఎలాంటి నష్టమూ జరగదు. కాబట్టి వీటిని పరీక్షల తర్వాత చేసినా ఎలాంటి సమస్యా ఉండదు.
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ డిగ్రీతో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు

‣ మెయిన్‌లో విజయానికి మెలకువలు

‣ స్టడీ నోట్స్‌.. రెడీ రివిజన్‌!

‣ ఉచితంగా డిగ్రీ + ఉద్యోగం!

‣ విద్యా సంస్థలకు గ్రేడింగ్‌ ఎలా ఇస్తారు?

‣ టిస్‌ కోర్సుల్లోకి ప్రవేశాలు ప్రారంభం

‣ వావ్‌..! అనిపిస్తారా?

Posted Date : 29-12-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.