‣ యూపీఎస్సీ - సీడీఎస్ఈ ప్రకటన విడుదల
రక్షణ రంగంలో సత్తా చాటాలనుకునేవారికి యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) అత్యుత్తమమైనది. డిగ్రీ పూర్తయినవారు, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవాళ్లు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలకూ అవకాశం ఉంది. ప్రకటన వెలువడిన నేపథ్యంలో సీడీఎస్ఈ 2023(1) వివరాలు..
యూపీఎస్సీ నిర్వహించే సీడీఎస్ఈ ప్రకటన ఏడాదికి రెండుసార్లు వెలువడుతుంది. ఒక్కో విడతలో దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది దీనికి పోటీ పడుతున్నారు. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. ఈ రెండింటిలోనూ 50 శాతం మార్కులు పొందితే ఉద్యోగం ఖాయమే. క్రమం తప్పకుండా ప్రకటనలు వెలువడతాయి. అందువల్ల సీడీఎస్‌ఈని లక్ష్యంగా చేసుకున్నవారు విజయాన్ని అందుకోవచ్చు.
ఇదే సన్నద్ధతతో సీడీఎస్‌ఈతో సమాన స్థాయిలో ఉండే.. యూపీఎస్సీ నిర్వహించే సీఏపీఎఫ్ పరీక్షనూ రాసుకోవచ్చు.
సీడీఎస్ఈ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఒక్కోటి 300 మార్కులకు ఉంటాయి. ఇంటర్వ్యూలో ఐదు రోజులపాటు వివిధ కోణాల్లో అభ్యర్థిని నిశితంగా గమనిస్తారు. పలు పరీక్షల ద్వారా వీరిని వడపోస్తారు. ఇలా అన్నింటా నెగ్గినవారినే శిక్షణలోకి తీసుకుని సానబెడతారు. వీరు తమ ప్రాధాన్యం, మెరిట్ అనుసరించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌ల్లో సేవలు అందించవచ్చు. ఎయిర్‌ఫోర్స్ ఫ్లయింగ్ బ్రాంచ్‌లో మెరుగైన ప్రతిభ చూపినవారు ఫైటర్ పైలట్‌గానూ రాణించవచ్చు. సీడీఎస్‌ఈతో త్రివిధ దళాల్లో ఏ సర్వీస్‌కి ఎంపికైనప్పటికీ సివిల్ సర్వెంట్లతో సమాన మూల వేతనం (లెవెల్ 10 పే) అందుకోవచ్చు. విధుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపినవారు భవిష్యత్తులో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లకు ఉన్నతాధికారి కావచ్చు.

పరీక్ష ఇలా...
ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ల్లో ఒక్కో పేపర్ వంద మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు రెండు గంటలు. మ్యాథ్స్‌లో 100, మిగిలిన రెండు పేపర్లలోనూ 120 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నలకు కేటాయించిన మార్కుల్లో మూడో వంతు తగ్గిస్తారు. ఇంగ్లిష్ విభాగం మినహా మిగిలిన ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్షలో అర్హత సాధించడానికి ప్రతి పేపర్లోనూ కనీసం 20 శాతం మార్కులు పొందాలి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ (ఓటీఏ) పోస్టులకు పరీక్ష, ఇంటర్వ్యూ ఒక్కోటీ 200 మార్కులకే ఉంటాయి. ఒక్క ఓటీఏ పోస్టులకే దరఖాస్తు చేసుకుంటే మ్యాథ్స్ పేపర్ రాయనవసరం లేదు.
ఈ విభాగాల్లో...
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్: పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు వస్తాయి. అరిథ్‌మెటిక్ (నంబర్ సిస్టమ్, ఎలిమెంటరీ నంబర్ థియరీ), ట్రిగనోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ అంశాల నుంచి వీటిని అడుగుతారు.
జనరల్ నాలెడ్జ్: దైనందిన జీవితానికి ముడిపడిన ప్రశ్నలు సంధిస్తారు. వర్తమాన అంశాలకు ప్రాధాన్యం. సైన్స్, టెక్నాలజీల్లో తాజా మార్పులపైనా కొన్ని ప్రశ్నలు వస్తాయి. భారతదేశ చరిత్ర, భౌగోళికశాస్త్రం అంశాల్లో అభ్యర్థి అవగాహనను పరీక్షిస్తారు.
ఇంగ్లిష్: అభ్యర్థి భాషను ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకునేలా ప్రశ్నలుంటాయి. కాంప్రహెన్షన్, ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, జంబుల్డ్ సెంటెన్స్, సెంటెన్స్ కరెక్షన్, సిననిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, స్పెలింగ్ మిస్టేక్స్, సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్, రిపోర్టెడ్ స్పీచ్‌ల నుంచి ప్రశ్నలు సంధిస్తారు.
శిక్షణ
అభ్యర్థి ఏ విభాగంలో ఎంపికైనప్పటికీ శిక్షణ కాలంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. మిలటరీ అకాడెమీకి ఎంపికైనవారికి ఇండియన్ మిలటరీ అకాడెమీ దేహ్రాదూన్‌లో 18 నెలల శిక్షణ ఉంటుంది. నేవల్ అకాడెమీలో చేరినవాళ్లకు సుమారు 18 నెలలు కేరళలోని ఎజిమాలలో శిక్షణ అందిస్తారు. ఎయిర్ ఫోర్స్ అకాడెమీ అయితే 18 నెలలు పైలట్ శిక్షణ నిర్వహిస్తారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు చెన్నైలో 11 నెలల శిక్షణ ఉంటుంది. ఇది విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి మద్రాస్ విశ్వవిద్యాలయం పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
ఉద్యోగంలో...
ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్, ఎయిర్ ఫోర్స్‌లో ఫ్లయింగ్/ గ్రౌండ్ డ్యూటీ (టిక్నికల్/ నాన్ టెక్నికల్) ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభమవుతుంది. ఈ మూడూ సమాన హోదా (లెవెల్ 10) ఉన్న ఉద్యోగాలే. రూ.56,100 మూలవేతనం లభిస్తుంది. మిలటరీ సర్వీస్ పే కింద అదనంగా రూ.15,500 చెల్లిస్తారు. డీఏ, హెచ్ఆర్ఏ, ప్రోత్సాహకాలు... అన్నీ కలిపి సుమారు రూ.లక్ష వేతనం పొందవచ్చు. రెండేళ్ల అనుభవంతో ఆర్మీలో కెప్టెన్, నేవీలో లెఫ్టినెంట్, ఎయిర్ ఫోర్స్‌లో ఫ్లయిట్ లెఫ్టినెంట్ హోదాలు సొంతం చేసుకోవచ్చు. ఆరేళ్లు విధుల్లో కొనసాగినవారు సంబంధిత దళాల్లో మేజర్/ లెఫ్టినెంట్ కమాండర్/ స్క్వాడ్రన్ లీడర్ గుర్తింపు పొందవచ్చు. 13 ఏళ్ల సేవలతో ఎయిర్ ఫోర్సులో వింగ్ కమాండర్ కావచ్చు. అదే నేవీలో కమాండర్, ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా అందుకోవచ్చు.

కటాఫ్...
2021 సీడీఎస్ఈ 1, 2 తుది ఫలితాలు గమినిస్తే పరీక్షలో 50 శాతం మార్కులు సాధించినవారు ఇంటర్వ్యూకి ఎంపికవుతున్నారు. అలాగే పరీక్ష, ఇంటర్వ్యూ రెండూ కలిపి 50 శాతం మార్కులు పొందితే ఎయిర్‌ఫోర్స్‌లో అవకాశం పొందవచ్చు. 45 శాతం మార్కులతో మిలటరీ అకాడెమీ, నేవల్ అకాడెమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీలో కాలు మోపవచ్చు. 2021 సీడీఎస్ఈ(2)లో తుది నియామకాల్లో (మొత్తం 600 మార్కులకు. ఓటీఏకు 400 మార్కులు) ఎయిర్ ఫోర్స్ 270, మిలటరీ అకాడెమీ 263, నేవల్ అకాడెమీ 256, ఓటీఏ మెన్ 183, ఓటీఏ ఉమెన్ 184 మార్కులు పొందినవారు అవకాశం దక్కించుకున్నారు.
ఎవరు అర్హులు?
మిలటరీ అకాడెమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ. నేవల్ అకాడెమీ ఉద్యోగాలకు బీటెక్. ఎయిర్ ఫోర్స్ పోస్టులకు ఏదైనా డిగ్రీ, ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతోన్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: ఇండియన్ మిలటరీ అకాడెమీ, నేవల్ అకాడెమీలకు జనవరి 2, 2000 - జనవరి 1, 2005 మధ్య జన్మించినవారు అర్హులు. ఎయిర్ ఫోర్స్ అకాడెమీకి జనవరి 2, 2000 - జనవరి 1, 2004 మధ్య జన్మించాలి. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి గరిష్ఠ వయసులో రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు జనవరి 2, 1999 - జనవరి 1, 2005 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 341. విభాగాల వారీ ఐఎంఏ-100, ఐఎన్ఏ-22, ఏఎఫ్ఏ-32, ఓటీఏ-187 (వీటిలో 170 పురుషులకు, 17 మహిళలకు)
ఆన్లైన్ దరఖాస్తులు: జనవరి 10 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు.
పరీక్ష తేదీ: ఏప్రిల్ 16
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.
వెబ్సైట్: https://upsc.gov.in/
సన్నద్ధత తీరు ఇదీ...
‣ ప్రకటనలో పేపర్ల వారీ పేర్కొన్న అంశాలను బాగా చదవాలి. తాజా అభ్యర్థులు ప్రాథమికాంశాల నుంచి సన్నద్ధత ప్రారంభించాలి. పరిమిత పుస్తకాలు ఎంచుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
‣ సీడీఎస్ఈ గత ప్రశ్నపత్రాలను బాగా అధ్యయనం చేయాలి. యూపీఎస్సీ వెబ్సైట్ నుంచి వీటిని పొందవచ్చు. జవాబులూ పొందుపరిచారు. ప్రశ్నపత్రంపై ప్రాథమిక అంచనాకు రావడానికి ఇవి ఉపయోగపడతాయి. ఆయా సబ్జెక్టుల/ విభాగాల వారీగా ఏయే అంశాల్లో దృష్టి సారించాలో తెలుస్తుంది.
‣ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ పేపర్‌ను ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయుల్లో గణిత నేపథ్యం ఉన్నవారు సులువుగానే ఎదుర్కోవచ్చు. సైన్స్, ఆర్ట్స్ విద్యార్థులు ముందుగా ప్రాథమికాంశాలను బాగా అధ్యయనం చేయాలి. అదనపు సమయం కేటాయించుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే మ్యాథ్స్ విద్యార్థులతో పోటీపడవచ్చు... సిలబస్‌లో పేర్కొన్న అంశాలను అనుసరించి... 8, 9, 10 తరగతుల గణితం పాఠ్య పుస్తకాలు బాగా చదవాలి.
‣ జనరల్ నాలెడ్జ్ కోసం భారతదేశ చరిత్ర, భౌగోళికశాస్త్రం, జాగ్రఫీ, పాలిటీ సబ్జెక్టులకు ఎన్సీఈఆర్టీ 8, 9, 10 తరగతుల పుస్తకాలు చదవాలి. లూసెంట్ లేదా అరిహంత్ జీకే పుస్తకాల్లో ఏదో ఒకటి చదువుకుంటే చాలు. సైన్స్ విభాగంలోని ప్రశ్నలకు ఎన్సీఈఆర్టీ 6-10 తరగతుల పుస్తకాల్లోని ముఖ్యాంశాలు చూసుకోవాలి. వర్తమాన అంశాలు, తాజా అభివృద్ధి కార్యక్రమాలు, నియామకాలు... తదితరాల నిమిత్తం ఏదైనా దినపత్రికను అనుసరించాలి. ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి.
‣ ఇంగ్లిష్‌లో ఎక్కువ ప్రశ్నలు హైస్కూల్ ఆంగ్ల పాఠ్యపుస్తకాల స్థాయిలోనే ఉంటాయి. 8, 9, 10 తరగతుల ఆంగ్ల పుస్తకాల్లోని వ్యాకరణాంశాలను బాగా చదువుకోవాలి. ఆంగ్లంపై పట్టు లేనివారు జనరల్ ఇంగ్లిష్ (పియర్సన్/ టాటా మెక్‌గ్రా హిల్స్) పుస్తకంలోని మాదిరి ప్రశ్నలు సాధన చేసి, ఎక్కువ మార్కులు పొందవచ్చు.
‣ పరీక్షకు ముందు వీలైనన్ని నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయడం తప్పనిసరి. సమయపాలనను పాటించాలి. ఫలితాలు విశ్లేషించుకోవాలి. ఏ అంశాలు/ విభాగాల్లో తప్పులు చేస్తున్నారో గమనించి, వాటికి తుది సన్నద్ధతలో ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇంటర్వ్యూ
ఇవి ఐదు రోజులు కొనసాగుతాయి. ఇందులో రెండు దశలుంటాయి. మొదటి దశలో అర్హత సాధిస్తేనే రెండోదానికి అవకాశం కల్పిస్తారు. తొలిరోజు స్టేజ్-1లో భాగంగా ఏదైనా చిత్రాన్ని చూపించి దాన్ని విశ్లేషించమంటారు. అభ్యర్థి జ్ఞాన నైపుణ్యం, అవగాహన సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ఈ విభాగంలో అర్హత సాధించినవారికి స్టేజ్-2లో భాగంగా నాలుగు రోజుల పాటు ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. సైకాలజీ టెస్టులతోపాటు పలు ఇతర అంశాల్లో అభ్యర్థిని పరిశీలిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణలోకి తీసుకుంటారు.
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ మెయిన్‌లో విజయానికి మెలకువలు
‣ స్టడీ నోట్స్.. రెడీ రివిజన్!
‣ విద్యా సంస్థలకు గ్రేడింగ్ ఎలా ఇస్తారు?