• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌లో చదివే విధానం ఏమిటంటే?

కొన్ని పద్ధతులు పాటిస్తే మంచి ఫలితాలు

ఆన్‌లైన్‌ లెర్నింగ్‌... గత రెండేళ్లలో విద్యారంగంలో వచ్చిన అతిపెద్ద మార్పు. గతంలో అడపాదడపా, అదీ ఉన్నత విద్యను అభ్యసించేవారు మాత్రమే ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవ్వడం, కోర్సులు చేయడం వంటివి చేసేవారు. 

కానీ కరోనా పుణ్యమాని ప్రాథమిక విద్య నుంచే పాఠాలు ఆన్‌లైన్‌లో చదువుకోవడం ప్రారంభమైంది. దీని ద్వారా ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునేవారికి మరిన్ని కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. దేశవిదేశాలకు సంబంధించి సంస్థల డిగ్రీలు చేసేందుకూ, కంటెంట్‌ను వినియోగించుకునేందుకూ అవకాశం దొరికింది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు...

ఇన్నాళ్లూ పుస్తకాలు నేరుగా చదవడం అలవాటైన విద్యార్థులకు ఈ ఆన్‌లైన్‌ క్లాసులు కొత్త. నేర్చుకునే విధానంలో దానికీ దీనికీ కొంత వ్యత్యాసం ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ట్యాబ్‌లు పంపిణీ చేసి డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో... భవిష్యత్తులో మరింతగా ఈ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ పెరుగుతుందని అంచనా... ముఖ్యంగా ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణలో! ఇది విద్యార్థులకు ఒక సంధి దశ. ఈ నేపథ్యంలో ఎటువంటి విధానాలు పాటిస్తే దీని ద్వారా వందశాతం ఫలితాలు అందుకోవచ్చు... ఏవిధంగా ఈ తరగతులను సద్వినియోగం చేసుకోవచ్చనే అంశాలను ఒకసారి పరిశీలిస్తే.

   చదువు ఎలా చదివినా ఏకాగ్రత, సమయం కేటాయించడం, పునశ్చరణ, నమూనా పరీక్షలు ముఖ్యం. అయితే ఆన్‌లైన్‌గా చదివేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మరింత సులభంగా, వేగంగా అనుకున్న లక్ష్యాలు సాధించే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు.


మామూలు తరగతిలాగానే...

ముఖ్యంగా ఆన్‌లైన్‌ పాఠాలు, తరగతులను పూర్తిస్థాయిలో మామూలు తరగతి మాదిరిగానే పరిగణించాలి. అందరితో క్లాసులో ఉన్నప్పుడు ఎంత శ్రద్ధగా ఉంటామో... ఇక్కడా అలాగే ఉండేందుకు ప్రయత్నించాలి. నలుగురితో ఉన్నప్పుడు అనిపించిన విధంగా ఒంటరిగా పాఠం వినడం అనిపించకపోవచ్చు. త్వరగా బోర్‌ కొట్టే అవకాశం కూడా ఉంటుంది. పైగా నేరుగా విన్నదానికీ తెరనుంచి విన్నదానికీ ఉండే తేడా ఉండనే ఉంది. అయితే.. వీటన్నింటినీ దాటుకుని వీలైనంత త్వరగా ఈ పద్ధతిని అలవరుచుకోవడం, చదవడాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా కోర్సుపై అధిక శ్రద్ధ చూపగలుగుతాం. దీని కోసం కడుతున్న ఫీజు, కేటాయిస్తున్న సమయం, ఇది మనకు ఎంత ముఖ్యమైన డిగ్రీ... ఇవన్నీ ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటే కొంతవరకైనా బోర్, కొత్త అనే భావన నుంచి బయటకు రాగలుగుతాం.


సమయం.. సద్వినియోగం

ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యేటప్పుడు ఉండే అతిపెద్ద సౌలభ్యం ఏమిటంటే.. మన టైమ్‌ మన చేతుల్లో ఉంటుంది. అనుకూల సమయంలో పాఠాలు చదివే వీలున్నప్పుడు.. మొదటి నుంచి పక్కా ప్రణాళికతో చదువుకునేందుకు ప్రయత్నించడం ఉపకరిస్తుంది. తరగతులు మొదలైనప్పటి నుంచే ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది లెక్క ప్రకారం నిర్ణయించుకుని పాటిస్తే... సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్న వాళ్లమవుతాం. తరగతులకు హాజరు కావడం, అసైన్‌మెంట్లు పూర్తిచేయడం, పునశ్చరణ, పరీక్షల సన్నద్ధత, ఇతర పనులకు తగిన విధంగా సమయాన్ని కేటాయించుకోవాలి.


ఒకేచోట స్థిరంగా...

ల్యాప్‌టాపే కదా అని ఇంట్లో ఎక్కడ అంటే అక్కడ కూర్చుని చదవడానికి ప్రయత్నిస్తే ఏకాగ్రత కుదరడం కష్టమైపోతుంది. గమనిస్తే.. చాలామందికి కొత్త చోటుకు వెళ్తే నిద్రపట్టదు. ఎందుకంటే మనకు అలవాటైన ప్రదేశంలో నిద్రపోవడానికి మన మెదడు ట్యూన్‌ అయ్యి ఉంటుంది.. హఠాత్తుగా మార్పు వస్తే ఒకపట్టాన నిద్రపోలేక ఇబ్బందిపడతాం. చదువు విషయంలోనూ అంతే. నిశ్శబ్దంగా, చక్కని గాలి వెలుతురు ఉండే చోట స్థిరంగా కూర్చుని చదువుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆ ప్రదేశాన్ని స్టడీ కోసం మాత్రమే వినియోగించాలి. అప్పుడు నెమ్మదిగా మనకు అక్కడ కూర్చోగానే చదవాలి అనే ఆలోచన, ఏకాగ్రత వచ్చేలా అలవాటుపడతాం. అలాగే మధ్యలో ఎటువంటి అంతరాయం కలగకుండా హైస్పీడ్‌ ఇంçర్నెట్, కావాల్సిన సాఫ్ట్‌వేర్లు, హెడ్‌ ఫోన్స్, ఇతర వస్తువులు అన్నీ ముందే అమర్చిపెట్టుకోవాలి.


నోట్స్‌... రికార్డ్‌

తరగతి జరుగుతున్నప్పుడు నోట్స్‌ రాసుకోవడం తప్పక చేయాల్సిన సాధన. అప్పుడే వినే అంశాలపై స్పష్టత ఉంటుంది, తర్వాత రివిజన్‌ చేసేటప్పుడు సులభంగానూ ఉంటుంది. అవసరం అనుకుంటే తరగతులను రికార్డ్‌ చేసుకుని సేవ్‌ చేసుకోవడం మంచిది. సందేహాలు ఉన్నా... మళ్లీ చూడాలి అనుకున్నా.. ఇవి బాగా ఉపయోగపడతాయి. ఎగ్జామ్‌ ప్రిపరేషన్‌ సమయంలోనూ పనికొస్తాయి.


సందేహాల నివృత్తి..

ఆన్‌లైన్‌ క్లాసులు జరిగేటప్పుడు సందేహాలు నివృత్తి చేసుకోవడం కొంచెం కష్టమైన పనే. అధ్యాపకులు నేరుగా ఉండకపోవడం వల్ల మన సందేహాలను ముఖాముఖి మాట్లాడే సందర్భంలోనూ, ఈ-మెయిల్‌ రూపంలోనూ అడగాలి... ఒక్కో చోట ఒక్కో పద్ధతి ఉంటుంది. ప్రతిసారీ ఇలా చేయడం కొంచెం కష్టం   కాబట్టి.. క్లాసుకు ముందే పాఠం మీద కొంత అవగాహన పొందడం, సొంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మేలు. అప్పటికీ తెలియకపోతే సహాయం చేసేందుకు అధ్యాపకులు ఎటూ ఉన్నారు. కానీ ముందే మనం తెలుసుకోవడం వల్ల అవగాహన పెరగడమే కాదు, సమయమూ ఆదా అవుతుంది.


నేర్చుకునే పద్ధతి...

కొంతమంది విజువల్‌ లెర్నర్స్‌ ఉంటారు... వీరికి ఏదైనా కళ్లతో చూస్తే ఎక్కువకాలం గుర్తుంటుంది.  మరికొందరు లిజనర్స్‌ ఉంటారు. వీరికి పాఠాలు పదే పదే వినడం వల్ల ఎక్కువగా గుర్తుంటుంది. మనకు ఏది ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుందో గుర్తించాల్సింది మనమే. అలాగే రోజులో ఏ సమయంలో చదివితే ఎక్కువ ఏకాగ్రత చూపగలుగుతున్నాం అనేది కూడా చెక్‌ చేసుకుని ఆ టైంలో చదవడానికి కూర్చోవడం మంచిది.


ప్రేరణ కోల్పోకుండా...

కంప్యూటర్‌ ముందు గంటల తరబడి కూర్చుని, అవతలివారు చెప్పేది వినేందుకు ప్రయత్నించడానికి మోటివేషన్‌ కావాలి. విసుగ్గా అనిపించినప్పుడు, అలసటగా అనిపించినప్పుడు... ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిఫ్రెష్డ్‌ మైండ్‌తో వెనక్కి వచ్చేలా చూడాలి. దీనికి చిన్నపాటి నడక, ఒక మంచి కాఫీ వంటివి ఉపకరిస్తాయి. ఏదేమైనా నేర్చుకోవడానికి నిరంతరం ప్రేరేపితమై ఉండాలి. ఏకాగ్రత చూపడమే అధిక ప్రాధాన్యంగా మారాలి. వేరే విషయాలపైకి ధ్యాస మళ్లకుండా జాగ్రత్తపడాలి. 

  క్లాసులకు హాజరుకాకపోవడం, అసైన్‌మెంట్లు వాయిదా వేయడం వంటివి అస్సలు చేయకూడదు. దానివల్ల మనం ఇతరుల కంటే వెనుకబడి క్రమపద్ధతిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

మరింత సమాచారం... మీ కోసం!

‣ 50,000 మందికి స్కాలర్‌షిప్‌లు!

‣ ఈ నైపుణ్యాల్లో మీకెంత పట్టు?

‣ ఇలా కాలాన్ని సద్వినియోగం చేసుకోండి!

‣ డిగ్రీతో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు

‣ మెయిన్‌లో విజయానికి మెలకువలు

‣ స్టడీ నోట్స్‌.. రెడీ రివిజన్‌!

Posted Date : 05-01-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌