• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎంపికైతే ఉన్నత విద్య, బ్యాంకులో ఉద్యోగం!

500 పీఓ ఖాళీలతో ప్రకటన విడుదల

ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఒకటైన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 500 పీవో పోస్టులకు ప్రకటన విడుదలచేసింది. పరీక్ష, బృందచర్చ, ముఖాముఖిలో చూపిన ప్రతిభతో నియామకాలుంటాయి. ఇలా ఎంపికైనవారు ముందుగా ఏడాది వ్యవధి ఉండే పీజీడీబీఎఫ్‌ కోర్సు మణిపాల్‌ అకాడెమీలో పూర్తి చేయాలి. అనంతరం అసిస్టెంట్‌ మేనేజర్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఇదే తరహాలో ప్రైవేటు సంస్థ యాక్సిస్‌ బ్యాంకు ప్రకటన వెలువరించింది. ఆ వివరాలు చూద్దాం..

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పోస్టులకు ఫిబ్రవరి 25లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. తేదీ తర్వాత ప్రకటిస్తారు. పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175. మిగిలినవారికి రూ.850. మొత్తం 500 ఖాళీల్లో జనరల్‌ బ్యాంకింగ్‌ స్ట్రీమ్‌లో 350 క్రెడిట్‌ ఆఫీసర్, స్పెషల్‌ స్ట్రీమ్‌లో 150 ఐటీ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారు రూ.36,000 మూలవేతనం పొందవచ్చు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ఆలవెన్సులు అదనం. అన్నీ కలిపి సుమారు రూ.60,000 నెల వేతనం పొందవచ్చు. 

అర్హత: క్రెడిట్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీ ఆఫీసర్‌ ఉద్యోగాలకు కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో బీఈ/బీటెక్‌ లేదా ఇదే విభాగాల్లో పీజీ లేదా ఏదైనా డిగ్రీతోపాటు డీఓఈఏసీసీలో బీ లెవెల్‌ ఉత్తీర్ణత.

వయసు: రెండు పోస్టులకు ఫిబ్రవరి 1, 2023 నాటికి 20 నుంచి 29 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు మినహాయింపు. 

వెబ్‌సైట్‌: https://bankofindia.co.in/recruitment-notice

ఈ రెండు పరీక్షలూ తాజా గ్రాడ్యుయేట్లు, ప్రస్తుతం చివరి సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారికి మంచి అవకాశం. వీటిద్వారా ఉన్నత విద్య, ఉద్యోగం రెండూ దక్కుతాయి. బ్యాంకు కార్యకలాపాలపై చక్కని పట్టుకోసం ఈ కోర్సు ఉపయోగపడుతుంది. అలాగే ఈ ప్రకటనలకు దరఖాస్తు చేసుకుని సన్నద్ధమైనవాళ్లు భవిష్యత్తులో ఇతర బ్యాంకుల నుంచి వెలువడే ఇదే తరహా పరీక్షలను సులువుగా ఎదుర్కోవచ్చు. ఈ విధానంలో అవకాశం వచ్చినవారు పీజీ డిప్లొమా తర్వాత మణిపాల్‌ సంస్థ నుంచే మరో ఏడాది కోర్సు ఆన్‌లైన్‌/దూరవిద్యలో పూర్తిచేసుకుని ఎంబీఏ (బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌) పట్టానూ పుచ్చుకోవచ్చు. 

ఎంపిక ఇలా..

ఆబ్జెక్టివ్‌ విధానంలో మొత్తం 155 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 200 మార్కులు. వ్యవధి 3 గంటలు. డిస్క్రిప్టివ్‌లో 2 ప్రశ్నలకు 25 మార్కులు. వీటిని అర గంటలో పూర్తిచేయాలి. ఆబ్జెక్టివ్‌ విభాగంలోని ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, డిస్క్రిప్టివ్‌ ఇంగ్లిష్‌ పేపర్లలో అర్హత సాధిస్తే సరిపోతుంది. వీటిలో సాధించిన మార్కులు తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. ఆబ్జెక్టివ్‌ పరీక్షలో అర్హత సాధించడానికి జనరల్, ఈడబ్ల్యుఎస్‌లు 40 శాతం మార్కులు పొందాలి. మిగిలినవారైతే 35 శాతం అవసరం. తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో పావు శాతం తగ్గిస్తారు. అర్హుల జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్లు అనుసరించి కొంతమందిని బృందచర్చకు పిలుస్తారు. దీనికి 40 మార్కులు. ఇందులో అర్హత సాధించడానికి జనరల్, ఈడబ్ల్యుఎస్‌లు 40 శాతం మార్కులు పొందాలి. మిగిలినవారైతే 35 శాతం అవసరం. ఇందులో అర్హులకు ఇంటర్వ్యూ 60 మార్కులకు ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత కోసం జనరల్, ఈడబ్ల్యుఎస్‌లు 40 శాతం, మిగిలినవారైతే 35 శాతం మార్కులు అవసరం. తుది నియామకాలు ఆన్‌లైన్‌ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల మెరిట్, రిజర్వేషన్లు అనుసరించి ఉంటాయి. 

కోర్సు స్వరూపం

ఎంపికైనవారికి పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ (పీజీడీబీఎఫ్‌) కోర్సు ఏప్రిల్‌ మొదటి వారంలో మణిపాల్‌ క్యాంపస్‌లో ప్రారంభమవుతుంది. కోర్సు ఫీజు రూ.3.5 లక్షలు. జీఎస్‌టీ అదనం. ఇందులో భాగంగా వసతి, భోజన సౌకర్యాలుంటాయి. రుణం పొందవచ్చు. ఏడాది కోర్సు అనంతరం ప్రతి నెల కొంత మొత్తం చొప్పున సులభ వాయిదాల్లో చెల్లించాలి. కనీసం మూడేళ్లు విధుల్లో కొనసాగుతామని రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలి. వ్యవధి తీరిన తర్వాత దీన్ని తిరిగి చెల్లిస్తారు. ఐదేళ్లు సర్వీస్‌ పూర్తిచేసుకున్నవారికి కోర్సు ఫీజు వెనక్కి ఇచ్చేస్తారు. కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో 4 ట్రైమిస్టర్లు ఉంటాయి. మొదటి 3 ట్రైమిస్టర్లకు నెలకు రూ.2500 స్టైపెండ్‌ చెల్లిస్తారు. చివరి ట్రైమిస్టర్‌ (జాబ్‌ ట్రైనింగ్‌) ఏదైనా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖలో ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.15,000 స్టైపెండ్‌ అందుతుంది. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారిని అసిస్టెంట్‌ మేనేజర్‌ (స్కేల్‌-1) హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.

సన్నద్ధత..

ఇప్పటికే ఐబీపీఎస్‌ బ్యాంకు పీవో పరీక్షలు రాస్తున్నవారు అదే సన్నద్ధతో ఈ పరీక్షలనూ ఎదుర్కోవచ్చు. 

ఇటీవలే గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన తాజా అభ్యర్థులు ముందుగా పరీక్షలో పేర్కొన్న విభాగాలకు సంబంధించి ప్రాథమికాంశాలతో అధ్యయనం ప్రారంభించాలి. అనంతరం ఎక్కువ మార్కులు సాధించడానికి అనువైన అంశాలను పూర్తిచేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన అంశాలు అధ్యయనం చేయాలి. 

సన్నద్ధత పూర్తయిన తర్వాత వీలైనన్ని మాదిరి ప్రశ్నలు, మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేయాలి. దీనివల్ల పరీక్ష విధానానికి అలవాటు పడటమే కాకుండా నిర్ణీత సమయంలో ఏ విభాగంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో తెలుస్తుంది. దాని ప్రకారం ఎంత వేగంతో సమాధానం ఇవ్వాలో అర్థం చేసుకుని, సన్నద్ధత మెరుగుపరచుకోవాలి. 

సమాధానం రాబట్టడానికి ఎక్కువ సమయం తీసుకునే విభాగం/ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. అలాగే ఎక్కడ తప్పులు చేస్తున్నారో గుర్తించి, వాటిని తర్వాత పరీక్షలో పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇలా మాదిరి ప్రశ్నపత్రాలను విశ్లేషించుకుంటూ పరీక్షకు సిద్ధమైతే తక్కువ వ్యవధిలోనే అంశాలు, సమయ పాలనపై పట్టు సాధించవచ్చు. 

రుణాత్మక మార్కులు ఉన్నందున ఏ మాత్రం తెలియని ప్రశ్నను వదిలేయడమే మంచిది. 

ఆబ్జెక్టివ్‌ పరీక్షతోనే డిస్క్రిప్టివ్‌ పరీక్ష రాయాలి. కాబట్టి దాన్నీ ఇప్పటి నుంచే సాధన చేయాలి. 

ఎక్కువ మార్కులు పొందడానికి డేటా ఎనాలసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌కు అధిక ప్రాధాన్యమివ్వాలి. దీని తర్వాత రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ ప్రాధాన్యమైనది. ఈ రెండు విభాగాల్లో మెరుగైన మార్కులు పొందినవారు తర్వాత దశకు చేరుకోగలరు. అయితే నిర్ణీత వ్యవధిలో ఈ విభాగాల్లో ప్రశ్నలకు సమాధానం గుర్తించడానికి గణిత సూత్రాలు, అనువర్తనం, షార్ట్‌ కట్‌ మెథడ్స్‌ వీటిని బాగా తెలుసుకోవాలి. 

వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను సాధన చేయాలి. ఐబీపీఎస్, ఎస్‌బీఐ పీవో పాత ప్రశ్నపత్రాలను నిశితంగా గమనించాలి. దీనిద్వారా ప్రశ్నలు ఏ స్థాయిలో అడుగుతున్నారు, సన్నద్ధత ఎలా ఉంది, ఏ అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయాలి, వేటికి ఎంత సమయం కేటాయించాలి.. మొదలైనవి తెలుసుకోవచ్చు.  

యాక్సిస్‌ యంగ్‌ బ్యాంకర్‌..

ప్రైవేటు సంస్థల్లో ముఖ్యమైన యాక్సిస్‌ బ్యాంకు సైతం బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తరహా ప్రకటన విడుదలచేసింది. యంగ్‌ బ్యాంకర్స్‌ ప్రోగ్రామ్‌ పేరుతో కోర్సుతోపాటు ఉద్యోగాన్ని అందిస్తోంది. పరీక్ష, ఇంటర్వ్యూతో నియామకాలుంటాయి. ఇలా అవకాశం వచ్చినవారు మణిపాల్‌లో కోర్సు పూర్తిచేయాలి. అనంతరం వీరిని యాక్సిస్‌ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. 

అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత. ప్రస్తుతం చివరి సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంపిక: పరీక్ష, ఇంటర్వ్యూలతో

ఈ అంశాల్లో: వెర్బల్‌ ఎబిలిటీ, ఎనలిటికల్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్, లిజనింగ్‌ కాంప్రహెన్షన్‌ విభాగాల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు. ఇందులో ప్రావీణ్యం చూపినవారికి వీడియో ఇంటర్వ్యూ నిర్వహించి తుది నియామకానికి ఖరారు చేస్తారు. ఇలా అవకాశం వచ్చినవారు మణిపాల్‌ సంస్థలో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ కోర్సు పూర్తిచేయాలి. మొత్తం ఫీజు రూ.3.89 లక్షలు. ఇందులో భాగంగానే వసతి, భోజనం, ఆండ్రాయిడ్‌ ట్యాబ్‌ అందిస్తారు. వీరు 6 నెలలు తరగతి గది శిక్షణ పొందుతారు. 3 నెలలు ఏదైనా యాక్సిస్‌ కార్యాలయంలో ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. మరో 3 నెలల ఆన్‌ జాబ్‌ శిక్షణ పొందుతారు. మొదటి 6 నెలలు రూ.5000  స్టైపెండ్‌ ప్రతి నెలా అందుకుంటారు. 3 నెలల ఇంటర్న్‌షిప్‌లో నెలకు రూ.12,000 పొందుతారు. ఈ 9 నెలల కోర్సు, ఇంటర్న్‌షిప్‌ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ కేటాయిస్తారు. అన్ని ప్రోత్సాహకాలూ కలిపి వీరు ఏడాదికి రూ.4.42 లక్షల వేతనం అందుకోవచ్చు. 

వెబ్‌సైట్‌: https://axisbankybp.online-ap1.com/
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ మేటి స్కోరుకు ఇదిగో రూటు!

‣ డిజిట‌ల్ ఉప‌వాసం ఉంటే మేలు!

‣ మాన‌సికంగా దృఢంగా ఉన్నారా?

‣ కేంద్రీయ సంస్థ‌ల్లో యూజీ.. పీజీ!

‣ ప్రాంగణ ఎంపికలకు.. పక్కా సంసిద్ధత

‣ మీ లెర్నింగ్‌ స్టైల్‌ ఏంటి?

Posted Date : 20-02-2023 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం