• facebook
  • whatsapp
  • telegram

మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి ఎన్‌మాట్‌ మార్గం!

 అర్హత: డిగ్రీ    ప్రకటన విడుదల

 

 

దేశంలోని ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లలో మేనేజ్‌మెంట్‌ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఎన్‌మాట్‌ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైంది. దీనిలో మంచి స్కోరు సాధించడం ద్వారా ఉన్నతమైన కెరియర్‌ను నిర్మించుకోవచ్చు. పూర్తి వివరాలు మీకోసం...

 

 

అర్హత: ఏదైనా డిగ్రీ


దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 10 

 

పరీక్ష తేదీలు: అక్టోబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 19 వరకూ జరుగుతాయి.

 

ఎన్‌మాట్‌ పరీక్షను గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ కౌన్సెల్‌ (జీఎంఏసీ) నిర్వహిస్తోంది. ఈ మార్కులను మనదేశంలో 68 సంస్థల్లో ప్రవేశాలకు ప్రాతిపదికగా తీసుకుంటారు. సౌత్‌ ఆఫ్రికా, ఫిలిప్పీన్స్, నైజీరియా, మొరాకో వంటి దేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకూ ఈ స్కోరు ఉపయోగపడుతుంది. భారత్‌లో ఎన్‌ఎంఐఎంఎస్‌ (నార్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌)తోపాటు కె.జె.సోమయ్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ - ముంబై, టి.ఏ.పాయ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (టీఏపీఎంఐ) - మణిపాల్, గీతం తదితర పేరొందిన సంస్థల్లో ఈ స్కోరు ద్వారా ప్రవేశం పొందవచ్చు.


పరీక్ష: ఎన్‌మాట్‌ పరీక్షలో 3 సెక్షన్లు ఉంటాయి.


1. లాంగ్వేజ్‌ స్కిల్స్‌


2. లాజికల్‌ రీజనింగ్‌


3. క్వాంటిటేటివ్‌ స్కిల్స్‌


 పరీక్షలో ఈ సెక్షన్లు ఏ వరుసలో రావాలో విద్యార్థి ఎంచుకునే అవకాశం ఉంటుంది. తప్పు జవాబులకు నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు. 


  ఒక ఏడాదిలో ఎన్‌మాట్‌ పరీక్షను మూడుసార్లు రాసేందుకు అవకాశం ఉంది. పరీక్ష రాసే రోజు, సమయం, ప్రాంతం ఇలా అన్నింటినీ విద్యార్థి ఎంచుకునే సౌలభ్యం ఇచ్చారు. 


  పరీక్ష రాసిన తర్వాత ఆ మార్కులతో కాలేజీలకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి. ఫలితాలు చూసుకున్నాకే ఈ ప్రక్రియ మొదలుకావడం వల్ల ఏ కళాశాలలకు దరఖాస్తు చేస్తే సీటు వస్తుందో విద్యార్థికి ముందే అవగాహన ఉంటుంది. 


   చాలామంది విద్యార్థులు మూడుసార్లు రాయవచ్చు కదా అనే ఉద్దేశంతో మొదటిసారి అంతగా ఫోకస్‌ లేకుండా రాసేస్తుంటారు. కానీ ఇది అంత మంచి పద్ధతి కాదు. ఒకటే అవకాశం ఉంది, ఎలా అయినా పాసై తీరాలి అనుకుంటేనే తొలి ప్రయత్నంలోనే మంచి స్కోరు సాధించగలుగుతారు. ప్రతి ప్రయత్నానికి విడివిడిగా ఫీజు కట్టాల్సి ఉంటుందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి.


సెంటర్‌లో రాస్తే మేలు


అలాగే పరీక్షను ఎగ్జామ్‌సెంటర్‌లో లేదా ఇంట్లో నుంచైనాకానీ రాసే అవకాశం ఉంది. అయితే ఇంటికంటే కూడా పరీక్షా కేంద్రంలో రాయడమే మంచిది. ఎందుకంటే ఇంట్లో, మన గదిలో ఉండి రాసేదానికీ, కేంద్రంలో అందరి మధ్యా రాయటానికి మనం చూపించే శ్రద్ధలో చాలా తేడా ఉంటుంది. పైగా ఇంట్లో నెట్‌ కనెక్షన్‌లోకానీ, సిస్టంలోకానీ ఏదైనా సమస్య వస్తే మొత్తం పరీక్షకి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. అదే సెంటర్‌లో అయితే ఆ బాధ్యతలన్నీ అధికారులు చూసుకుంటారు.


పరీక్ష ఎలా ఉంటుంది?


విద్యార్థులు మొదట తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే... ఇది కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ కాదు, కంప్యూటర్‌ అడాప్టివ్‌ టెస్ట్‌. ఈ రెండింటికీ మధ్య స్పష్టమైన తేడా ఉంది. విద్యార్థిని పరీక్షించే ఈ సాఫ్ట్‌వేర్‌ కాస్త భిన్నంగా పనిచేస్తుంది. ఇందులో ప్రశ్నల సంఖ్య, కఠినత్వం స్థాయి, ఒక్కో సెక్షన్‌కు కేటాయించిన సమయం ముందుగానే నిర్ణయించి ఉంటుంది. కానీ ప్రశ్నలు ఆర్డర్‌లో ఉండవు. అలాగే ఒకసారి ఒక ప్రశ్న మాత్రమే కనిపిస్తుంది. దానికి జవాబు రాశాకే వేరే ప్రశ్నకు వెళ్లే అవకాశం ఉంటుంది. స్కిప్‌ చేయడానికి కుదరదు. 


     ఒక ప్రశ్నకు విద్యార్థి జవాబు ఇచ్చినదాన్ని బట్టి వచ్చే ప్రశ్న ఆధారపడి ఉంటుంది. (ఉదాహరణకు వెర్బల్‌ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడంలో విద్యార్థికి అంతగా ప్రావీణ్యం లేదని సాఫ్ట్‌వేర్‌ గమనిస్తే... అప్పుడది ఆ విభాగంలో సులువైన ప్రశ్నలు ఇవ్వడం మొదలుపెడుతుంది). ప్రశ్న స్థాయిని బట్టి ఇచ్చే మార్కులు ఆధారపడి ఉంటాయి. అంటే అధికస్కోరు సాధించిన వ్యక్తి ఎక్కువ కఠినత్వం ఉన్న ప్రశ్నలు రాసి ఉంటారు. తక్కువ స్కోరు ఉన్నవారు సులువైన ప్రశ్నలు రాసి ఉంటారు. ఈ విధానంలో తొలుత అడిగే ప్రశ్నలకు ఎక్కువ వెయిటేజీ ఉంటుంది. దీని ఉద్దేశం విద్యార్థి సరైన జవాబులు రాయడమే. కానీ సులువైన ప్రశ్నలకు తక్కువ మార్కులు వస్తాయన్నమాట. అలాగే అటెంప్ట్‌ చేయని ప్రశ్నలకు పెనాల్టీ మార్కులు ఉంటాయి.


ఎలా సన్నద్ధమవ్వాలి?


లాంగ్వేజ్‌ స్కిల్స్‌ : ఇందులో రీడింగ్‌ కాంప్ర  హెన్షన్, పేరా ఫార్మింగ్, ఎర్రర్‌ ఐడెంటిఫికేషన్, ప్రెపొజిషన్స్, సెంటెన్స్‌ కంప్లీషన్, ఎనాలజీ వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. విద్యార్థులు ఈ విభాగం బాగా రాయాలనుకుంటే ముందు ఇంగ్లిష్‌ చదవడం చక్కగా సాధన చేయాలి. ఎందుకంటే విభిన్న పదాలు, వాక్యనిర్మాణం తెలియకుండా ఈ ప్రశ్నలకు జవాబులివ్వటం సాధ్యం కాదు. గ్రామర్‌ నేర్చుకోవడంతోపాటు సాధన తప్పనిసరి.


లాజికల్‌ రీజనింగ్‌: క్రిటికల్‌ రీజనింగ్, అనలైటికల్‌ పజిల్స్, డిడక్షన్స్, ఇతర రీజనింగ్‌ విభాగాల్లో ఈ ప్రశ్నలు అడుగుతారు. క్రిటికల్‌ రీజనింగ్‌ విద్యార్థుల పఠన సామర్థ్యాలను పరీక్షించేదిగా ఉంటుంది. ఇతర టాపిక్‌ల నుంచి అడిగే ప్రశ్నలకు విద్యార్థులు ఎంతగా టెస్టులు రాస్తే అంత మంచిది. ఇది తెలివితేటలు ఉన్నవారికంటే బాగా సాధన చేసినవారు ఎక్కువగా స్కోరు చేయగలిగే విభాగం. అందువల్ల విద్యార్థులు దృష్టిపెట్టి చదవాలి.


క్వాంటిటేటివ్‌ స్కిల్స్‌: నంబర్‌ ప్రాపర్టీస్, అరిథ్‌మెటిక్, ఆల్జీబ్రా, ప్రోబబిలిటీ, డీఐ గ్రాఫ్స్‌ - ఛార్ట్స్, డేటా సఫిషియన్సీ వంటి అంశాలు చదువుకోవాలి. చాలావరకూ ప్రశ్నలు ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌పై అడిగే అవకాశం ఉంటుంది. నంబర్స్, జామెట్రీ, లాగరిథమ్స్, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌ వంటి అంశాలపై దృష్టిపెట్టాలి. వీటి గురించి ప్రాథమిక అంశాల నుంచి నేర్చుకోవాలి. తర్వాత మాదిరి ప్రశ్నలు చూసి అవగాహన పెంచుకోవాలి. అతి సులభమైన ప్రశ్నల నుంచి అత్యంత క్లిష్టమైనవి వరకు అన్నింటినీ సాధన చేయాలి.


పూర్తిగా అన్ని సెక్షన్ల మీద పట్టు సాధించాక పూర్తిస్థాయి మాక్‌టెస్టులు వీలైనన్ని రాయాలి. ప్రతి తప్పునూ సమీక్షించుకుంటూ బాగా సాధన చేస్తే... ఈ పరీక్షలో తప్పకుండా మంచి స్కోరు సాధించగలుగుతారు.


ఇతర వివరాలకు వెబ్‌సైట్‌:  https://register.nmat.org

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అన్ని విభాగాలకు సమ ప్రాధాన్యం!

‣ జేఈఈ స్కోరుతో బీటెక్‌ డిగ్రీ, ఆర్మీ కొలువు

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

 

Posted Date: 01-09-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌