• facebook
  • whatsapp
  • telegram

జీవవైవిధ్యం... మనుగడకు ఆధారం!

ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా...

 

 

మానవుడు విచక్షణారహితంగా అడ్డూఆపూ లేకుండా ప్రకృతి వనరులను కబళిస్తున్నాడు. మానవాళి అత్యాశ భూగోళంపై జీవవైవిధ్యానికి చేటు తెచ్చిపెడుతోంది. దురాశ దుఃఖానికి చేటు అనే పెద్దల మాట ప్రకారం- మొదట జీవవైవిధ్యం, తరవాత మానవ మనుగడ సంక్షోభంలో పడతాయి. కోరికలూ దుఃఖాన్ని తెచ్చిపెడతాయి. అంతులేని కోరికలను తీర్చుకోవడానికి మానవుడు భూ, మత్స్య వనరులను విచ్చలవిడిగా దోచుకుంటూ దుబారా చేస్తుండటంతో భూమండలంపై 25శాతం జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్నాయి. ప్రాకృతిక వనరులను, పర్యావరణాన్ని రక్షించుకోవడం ద్వారా భూగ్రహ జవసత్వాలను కాపాడుకోవాలని చాటుతూ ఏటా జులై 28వ తేదీన ‘ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్న అంశాలేవో గుర్తించి, నివారణ చర్యలు తీసుకోవాలి. ప్రకృతిలో జీవవైవిధ్యాన్ని సంరక్షించడం ద్వారానే మానవుడు తన మనుగడ నిలుపుకోగలుగుతాడు. వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేసి సుస్థిరాభివృద్ధి సాధించగలుగుతాడు. భూమండలం తిరిగి పూర్తి జవసత్వాలను సంతరించుకోవడానికి సాధనమవుతాడు. భూమాతను పరిరక్షించుకొంటే మన భావి తరాలూ సుఖసంతోషాలతో జీవించగలుగుతాయి. జీవవైవిధ్య రక్షణ ప్రకృతి ఉత్పాతాలను తగ్గిస్తుంది. వాతావరణ మార్పులను అదుపులోకి తెస్తుంది. ప్రజలకు స్థిరమైన జీవనాధారం కల్పిస్తుంది. ఆహారం, నీటి కొరతను తీరుస్తుంది. జీవవైవిధ్య సంరక్షణ అంటే సమస్త జంతు, వృక్ష జాతులను, ఇంధన వనరులను, భూ, వాయు, జల వనరులను కాపాడుకోవడం. జీవవైవిధ్య రక్షిత ప్రాంతాలకు భంగం కలగకుండా నిరంతరం జాగ్రత్తపడాలి. తద్వారా భూమండలంలో జీవకళ తొణికిసలాడేలా చూడాలి.

 

పంచభూతాల్లో దైవం

పురాతన భారత నాగరికత ప్రకృతిలో దైవాన్ని చూసింది. పర్యావరణ, జీవావరణ సమతుల్యతను కాపాడుకోవాలని మన రుషులు, దార్శనికులు ప్రబోధించారు. నదీనదాలు, పర్వతాలు, సరస్సులు, జంతువులు, పక్షులు, వృక్షాలు, గ్రహాలు, నక్షత్రాలు, పంచభూతాలు... అన్నీ భగవత్‌ స్వరూపాలేనని, వాటిని మనం ఆరాధించాలని వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, రామాయణ, భారత ఇతిహాసాలు బోధించాయి. ప్రాచీన భారతీయ స్మృతులు, వేదవేదాంగాలు సకల చరాచర జగత్తులో ప్రాణ శక్తిని వీక్షించాయి. అందుకే మనం పంచ భూతాల్లో దైవాన్ని చూస్తున్నాం. భానుడిని సూర్యదేవుడిగా, భూమిని మాతగా, గంగాయమున తదితర ఉత్తుంగ జలప్రవాహాలను నదీమ తల్లులుగా ఆరాధిస్తున్నాం. హిమాలయాలను రుషులు, దేవతల ఆవాసంగా పరిగణిస్తున్నాం. తులసి మొక్కను, రావి చెట్టును, గోమాతను పూజిస్తున్నాం. ప్రకృతిని వరాలు అందించే తల్లిగా కొలుస్తున్నాం.

 

భిల్లు, బిష్ణోయి వంటి భారతీయ గిరిజన తెగల జీవితాల్లో ప్రకృతి సంరక్షణ విడదీయరాని అంతర్భాగం. ప్రకృతి మనం జయించాల్సిన శత్రువు కాదని, అది జీవ ప్రదాత అని పూర్వీకులు నూరిపోశారు. దాన్ని మనం పెడచెవిన పెట్టి విచ్చలవిడిగా ప్రకృతి విధ్వంసాన్ని కొనసాగించడం వల్లనే వరదలు, తుపానులు, మట్టిపెళ్లలు, కొండ చరియలు విరిగిపడటం, భూకంపాల వంటి ఉత్పాతాలు తరచూ సంభవిస్తున్నాయి. వాతావరణంలో ఆకస్మికంగా విపరీత మార్పులు, భూఉష్ణోగ్రత పెరిగిపోవడం, సముద్రాలు వేడెక్కడం, హిమనదాల్లో మంచు కరిగిపోవడం, అడవుల్లో కార్చిచ్చులు పెరిగిపోవడం, వరదలు ఉద్ధృతం కావడం చూస్తూనే ఉన్నాం. ఇవి మానవుడి జీవనాధారాన్ని క్రమంగా దెబ్బ తీస్తున్నాయి. మానవుడి అనాలోచిత చర్యలే వాతావరణ వైపరీత్యాలకు దారితీస్తున్నాయి. ఇంధనాలు, పరిశ్రమలు, భూవనరుల వినియోగ తీరు, రవాణా, పట్టణ ప్రణాళికలు పర్యావరణానికి చేటు తెస్తున్నాయి. ఈ విధ్వంసకర కార్యకలాపాలను నియంత్రించడానికి ఇకనైనా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలి. శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధన వనరులకు మారాలి. క్యోటో, ప్యారిస్‌ ఒప్పందాలను చిత్తశుద్ధితో వేగంగా అమలు చేయాలి. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ జీవవైవిధ్య ప్రాతిపదిక లక్ష్యాలను అందుకోవాలన్నా, ప్రకృతితో సామరస్యంగా జీవించడమనే లక్ష్యాన్ని 2050కల్లా చేరుకోవాలన్నా మళ్ళీ మనం పూర్వులు ప్రవచించిన విలువలను శిరసా వహించాలి. ప్రకృతితో మమేకం కావాలి.

 

సాగర ప్రక్షాళన

ప్యారిస్‌లో 2021 జనవరిలో భూగోళ రక్షణకు జరిగిన శిఖరాగ్ర సభలో ప్రకృతి, ప్రజల రక్షణ కూటమిని ప్రారంభించారు. అందులో భారతదేశానికీ సభ్యత్వం ఉంది. 2030కల్లా కనీసం 30శాతం భూములు, 30శాతం జలవనరులను కాపాడతామని ఆ కూటమి సభ్యదేశాలు వాగ్దానం చేశాయి. తదనుగుణంగా భారతదేశం ఇటీవలే ‘స్వచ్ఛ సాగర్‌, సురక్షిత్‌ సాగర్‌’ పేరిట 75 రోజుల అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికింద దేశంలో 75 బీచ్‌ల సంరక్షణకు కార్యకలాపాలు నిర్వహించింది. సాగర ప్రక్షాళన, సంరక్షణ పట్ల తన నిబద్ధతను నిరూపించుకొంటోంది. ఈ ఏడాది జులై ఒకటో తేదీ నుంచి భారత ప్రభుత్వం ప్లాస్టిక్‌ కాలుష్య నిరోధక కార్యక్రమం ప్రారంభించింది. ప్లాస్టిక్‌ సంచుల ఉత్పత్తి, దిగుమతి, నిల్వ, పంపిణీ, విక్రయాలపైనా, ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ సంచులపైనా దేశవ్యాప్తంగా నిషేధం విధించింది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ సంచులను నిషేధించడం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్‌ అభియాన్‌లో అంతర్భాగం. ఈ లక్ష్య సాధనకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పౌరులు, స్వచ్ఛంద సంస్థలు కృతనిశ్చయంతో కృషి చేయాలి. వాతావరణ మార్పుల నిరోధక ఉద్యమంలో జీ 20 దేశాలు నాయకత్వ పాత్ర పోషించాలని ఐక్యరాజ్య సమితి పర్యావరణ రక్షణ సంస్థ (యూఎన్‌ఈపీ), ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) కోరాయి. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు వాతావరణ మార్పుల నిరోధం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనను తమ జాతీయ విధానాల్లో కీలక భాగం చేయాలి. స్థానిక ప్రభుత్వాల నిర్ణయాల్లోనూ ఈ లక్ష్యాలు ప్రతిబింబించాలి. భూమాతకు మనం కలిగించిన నష్టాన్ని భర్తీ చేయడానికి శీఘ్రమే కార్యాచరణ చేపట్టాలి. మానవుడి దురాశ ప్రకృతికి శాశ్వత నష్టం కలిగించకుండా సమతుల్యత, సంయమనం పాటించడం వ్యక్తులు, ప్రభుత్వాల విధ్యుక్త ధర్మం కావాలి.

 

అడవులకు నష్టం

అటవీ వనరుల సంరక్షణకు హుటాహుటిన నడుం బిగించాలి. గడచిన ఎనిమిది వేల సంవత్సరాల్లో భూమిపై అడవులు 45శాతం హరించుకుపోయాయి. ఇందులో అత్యధిక క్షయం గడచిన శతాబ్దంలోనే సంభవించింది. అటవీ భూములను పంట భూములుగా మార్చడం, పశువులు అతిగా మేయడం, అడవులు నరికి రోడ్లు, భవనాలు, పట్టణాలు నిర్మించడం, అటవీ భూముల్లో గనుల తవ్వకాలు, చమురు అన్వేషణ సాగించడం, మనుషులు పనిగట్టుకుని అడవులను తగలబెట్టడం, కాలుష్యం... అన్నీ కలగలసి అటవీ జీవవైవిధ్యాన్ని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ప్రతి ఏటా 1.3 కోట్ల హెక్టార్ల అడవులను నరికివేస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) లెక్కగట్టింది. వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తి అటవీ సంరక్షణకు మార్గదర్శకం కావాలి. ప్రకృతి సమతుల్యతను పునరుద్ధరించాలి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ డిగ్రీ కళాశాలలు

‣ కోరుకున్న కోర్సులకు ఇదుగో ఇగ్నో!

‣ ప‌క్కాగా ప‌రిచ‌యం!

‣ సరైన నిర్ణయం తీసుకోవడానికి కొన్ని సూత్రాలు

Posted Date: 29-07-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం