• facebook
  • twitter
  • whatsapp
  • telegram

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ డిగ్రీ కళాశాలలు

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకుల వెల్లడి

దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కువ మంది విద్యార్థులు చదువుతోన్న అండర్‌ గ్రాడ్యుయేట్‌(యూజీ) కోర్సుల్లో.. బీఏ, బీకాం, బీఎస్సీలదే ప్రథమ స్థానం. కొత్త కోర్సులు ఎన్ని వచ్చినప్పటికీ వీటి వన్నె ఆలాగే కొనసాగడం విశేషం. హస్తినలోని డిగ్రీ కళాశాలల్లో సీటు పొందాలంటే మామూలు విషయం కాదు. అలాగే నగరాల్లో డిగ్రీ కళాశాలల్లో సీటు కోసం విపరీతమైన పోటీ నెలకొంది. ఈ చదువులకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా కేంద్ర మావన వనరుల విభాగానికి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ఏటా కాలేజీల విభాగంలోనూ మేటి సంస్థల వివరాలను ప్రకటిస్తోంది. ఇటీవల వెలువరించిన 2022 ర్యాంకుల్లో మిరండా హౌస్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో దేశం, తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ కళాశాలల వివరాలు చూద్దాం...


దేశంలో యూజీ స్థాయిలో డిగ్రీ కళాశాలలే ఎక్కువ. సుమారు కోటి ఎనభై లక్షల మంది భారత్‌లో బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సులు చదువుతున్నారు. ఉత్తర భారత దేశంలో ఇవే క్రేజీ కోర్సులు. పేరున్న కళాశాలల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లూ నిర్వహిస్తున్నారు. వీరిని బహుళజాతి సంస్థలు ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. 


దిల్లీలోని మేటి విద్యా సంస్థల్లో చదువుకున్నవారికి ఇంచుమించు ఐఐటియన్లకు దక్కే ప్యాకేజీలు అందుతున్నాయి. గత ఏడాది వరకు దిల్లీలోని టాప్‌ కళాశాలల్లో యూజీ కోర్సుల్లో చేరాలంటే ప్లస్‌ 2లో 99 శాతం మార్కులు వచ్చినా సీటు గ్యారంటీ లేదు. మేటి డిగ్రీ కళాశాలలకు అడ్డాగా దేశ రాజధాని గుర్తింపు పొందింది. టాప్‌ ర్యాంకుల్లో ఎక్కువ సంస్థలు అక్కడ నుంచే నమోదవుతున్నాయి. 


కాలేజీల కేటగిరీలో 2017 నుంచి ర్యాంకులు కేటాయిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే వరుసగా ఆరేళ్లూ మిరండా హౌసే ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. బోధన, అభ్యసన వనరులు; పరిశోధనలు, వృత్తిగత నైపుణ్యాలు; గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకున్నవారు, విద్యార్థుల వైవిధ్యం, వారు చూపిన ప్రతిభ, సంబంధిత విద్యా సంస్థపై వివిధ వర్గాల నిపుణుల దృక్పథం..తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు కేటాయించారు.  


ప్రవేశం ఇలా..

ఈ సంవత్సరం నుంచి సెంట్రల్‌ యూనివర్సిటీస్‌ ఎంట్రన్స్‌ టెస్టు(సీయూఈటీ) అండర్‌ గ్రాడ్యుయేట్‌(యూజీ)తో దేశవ్యాప్తంగా ఉన్న పలు డిగ్రీ కళాశాలల్లో అవకాశం కల్పిస్తున్నారు. దిల్లీ పరిధిలోని కళాశాలలకు ఈ స్కోరే ప్రామాణికం. పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. 


తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంటర్మీడియట్‌/ప్లస్‌2లో సాధించే మార్కులే కీలకం. అలాగే తెలంగాణలో దోస్త్, ఏపీలో ఓఏఎండీసీ వెబ్‌సైట్ల ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. పేరున్న కొన్ని డీమ్డ్, అటానమస్‌ సంస్థలు పరీక్షతో అవకాశం కల్పిస్తున్నాయి. మిగిలినవాటికి నేరుగా ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో చేరిపోవచ్చు.


తెలుగు రాష్ట్రాల్లో...
విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీకి 94వ ర్యాంకు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇదొక్కటే దేశంలో టాప్‌-100లో నిలిచింది. 
లయోలా అకాడెమీ, హైదరాబాద్, సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్, హైదరాబాద్‌ ఈ రెండు సంస్థలూ టాప్‌ 101-150 బ్రాకెట్‌లో నిలిచాయి. 
బీవీ రాజు కాలేజ్, పశ్చిమ గోదావరి, భువన్స్‌ వివేకానంద సికింద్రాబాద్, రాజమండ్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిజాం కాలేజ్‌ హైదరాబాద్, యూనివర్సిటీ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌ కోఠి ఈ సంస్థలు 151-200 బ్రాకెట్‌లో చోటు పొందాయి. 

టాప్‌ డిగ్రీ కళాశాలలన్నీ వైవిధ్య సబ్జెక్టుల కాంబినేషన్‌తో బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీఎఫ్‌ఏ, బీవొక్‌ కోర్సులు అందిస్తున్నాయి. 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కోరుకున్న కోర్సులకు ఇదుగో ఇగ్నో!

‣ కొలువుకు కావాలి కొన్ని ప్రమాణాలు

‣ అగ్రికల్చర్‌ బ్యాంకులో ఆఫీసర్‌ ఉద్యోగాలు

‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం

‣ నీకు నువ్వు న‌చ్చ‌ట్లేదా?


 

Posted Date : 28-07-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌