• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నీకు నువ్వు న‌చ్చ‌ట్లేదా?

‘నా స్నేహితులందరూ బాగా చదువుతారు. అందరికీ మంచి మార్కులే వస్తాయి. చూడ్డానికీ బాగుంటారు. అందరిలోనూ నేనే వెనకబడ్డా.. నా పరిస్థితే దారుణంగా ఉంది...’ ఇలా ఇతరులతో పోల్చుకుని బాధపడేవాళ్లలో మీరూ ఉన్నారా? అయితే మీకు ‘సెల్ఫ్‌ యాక్సెప్‌టెన్స్‌’ (స్వీయ అంగీకారం) నైపుణ్యం లేనట్లే. 


నిజానికి ఎంతోమంది తమను తాము యథాతథంగా అంగీకరించలేరు. ఇతరులతో తమను పోల్చుకుని వాళ్లకున్న నైపుణ్యాలు, తెలివితేటలు తమకు లేవని బాధపడుతుంటారు. ఈ క్రమంలో ఆత్మన్యూనతకు గురవుతూ అనేక ఇబ్బందులనూ ఎదుర్కొంటారు. ఈ సమస్యను ఎలా అధిగమించాలంటే... 


మనం ప్రతికూలంగా ఆలోచించడం మొదలుపెడితే మన మెదడు క్రమంగా అలాంటి ఆలోచనలకే పరిమితమవుతుంది. ఆ తర్వాత ఇదే అలవాటుపడుతుంది కూడా. కొంతకాలం తర్వాత మనల్ని మనమే నిందించుకోవడం మొదలుపెడతాం. అందుకే ముందుగా మన పట్ల మనం సానుకూలంగా స్పందించడాన్ని అలవాటు చేసుకోవాలి. 


కొన్ని సందర్భాల్లో మనల్ని మనం క్షమించుకోవాలి కూడా. ‘నేనలా ప్రవర్తించాను కాబట్టి ఇక దేనికీ పనికిరాను’ అని వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేయకూడదు. ఒక్కోసారి అనుకోకుండా పొరపాట్లూ, తప్పులూ చేస్తుంటాం. వాటిని పెద్ద మనసుతో సమీక్షించుకోవాలి. ఒకవేళ ఎదుటివాళ్లే తప్పు చేసి మనల్ని మన్నించమని అడిగితే క్షమిస్తాం కదా... అలాగే మన తప్పులనూ మనం మన్నించుకోవాలి. అయితే ఇదే సాకుగా తీసుకుని తప్పులు చేయడానికి అలవాటు పడటం మాత్రం మంచిది కాదు.


రోజూ మనకు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. వాటిలో ప్రతికూల, సానుకూల ఆలోచనలు రెండూ ఉంటాయి. సానుకూల ఆలోచనలు వచ్చినట్టుగానే ప్రతికూల ఆలోచనలూ వస్తుంటాయి. అయితే దాన్నో పెద్ద తప్పుగా భావించి మనల్ని మనం నిందించుకోకూడదు.   


అందరికంటే నేనే ముందు ఉండాలనే తాపత్రయాన్ని కాస్త తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆ వేగంలో ఎక్కువ పొరపాట్లు చేసి.. ఆ తర్వాత మనం ఎందుకూ పనికిరామని ప్రతికూల ధోరణిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. 


అనుకోని పొరపాట్లు, వాటిని సరిదిద్దుకోవడం ఇవన్నీ సాధారణంగా అందరి విషయంలోనూ జరుగుతుంటాయి. వీటిని భూతద్దంలో చూస్తూ మనల్ని మనం నిందించుకోవడం స్వీయ అంగీకార ధోరణికి అవరోధంగా మారుతుంది.


ప్రతి విషయంలోనూ ఇతరులతో పోల్చుకోవడం వల్ల మనల్ని మనం యథాతథంగా అంగీకరించలేం. ఇదో పెద్ద సవాలుగా మారుతుంది కూడా. కాబట్టి వీలైనంత త్వరగా ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి. స్వీయ అంగీకారం నైపుణ్యాన్ని అలవరుచుకుంటే ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది. 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

‣ న‌వ్విస్తే జీతం ఇస్తారు!

‣ శిక్ష‌ణ లేదు సొంత నోట్స్‌తో సాధించా!

‣ ఏదైనా ఎక్స్‌ట్రా చేయండి!

‣ పీజీసెట్‌కి సిద్ధమేనా?

Posted Date : 20-07-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.