• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సరైన నిర్ణయం తీసుకోవడానికి కొన్ని సూత్రాలు

‘ఆ కాలేజీ బాగుంది... కానీ ఈ కాలేజీ ఇంటికి దగ్గరగా ఉంది..’

‘ఈ కోర్సులో చేరితే త్వరగా ఉద్యోగం వస్తుంది. కానీ అందులో ఒక సబ్జెక్ట్‌ నాకు నచ్చదు’

‘ఇక్కడే మంచి యూనివర్సిటీలో చేరాలో, లేక విదేశాలకు వెళ్లాలో అర్థం కావడం లేదు’

అందరికీ ఏదో సందర్భంలో ఈ తికమక ఎదురయ్యేదే. కానీ విద్యార్థులకు ఇది డైలమా సీజన్‌ అని చెప్పొచ్చు. ఏటా విద్యాసంస్థల్లో ప్రవేశాలు నిర్వహించే సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక విద్యార్థులతోపాటు తల్లిదండ్రులూ ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడి చాలా ఆలోచిస్తూ ఉంటారు. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలో, సరైన నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందామా!

అవగాహన..

ఉన్న ప్రతి అవకాశం అంగీకరించదగినదే అయ్యి, ఏది ఎంచుకోవాలో తెలియనప్పుడు కలిగే మానసిక స్థితే డైలమా. దీన్ని పూర్తిగా అర్థం చేసుకుని, మంచిచెడులు బేరీజు వేసుకుంటేనే సరైన నిర్ణయం తీసుకోగలం. ఇందుకోసం ముందు ఒకచోట మన ఆలోచనలు అన్నింటినీ వివరంగా రాసుకోవాలి. ఆప్షన్‌ ‘ఏ’ తీసుకుంటే ‘ఎక్స్‌’ లాభాలు ఉంటాయి, ఆప్షన్‌ ‘బీ’ తీసుకుంటే ‘వై’ నష్టం కలిగే అవకాశం ఉంది... ఇలా రాసుకుంటే పరిస్థితిపై పూర్తిగా అవగాహన వస్తుంది. దీన్నే ‘కాస్ట్‌ బెనిఫిట్‌ అనాలిసిస్‌’ అని కూడా అంటారు.

సమాచారం

కొన్నిసార్లు నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నప్పుడు అదనపు సమాచార సేకరణ ఉపయోగపడుతుంది. అంటే మీకున్న చాయిస్‌ల గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నారో లేదో సరిచూసుకోండి. నిపుణుల సలహా తీసుకోవడం, ఆన్‌లైన్‌లో వెతకడం, సీనియర్ల అభిప్రాయం తెలుసుకోవడం వంటివి ఇందుకు ఉపకరిస్తాయి. వందశాతం ఇన్ఫర్మేషన్‌ ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు మరింత పకడ్బందీగా ఉంటాయి.

ఆసక్తి..

ప్రతి అవకాశంలోనూ మనకు కొన్ని ఆసక్తులు ఉంటాయి. అవేంటనేది గమనించాలి. ఇష్టమైనదాన్నే ఎంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదాహరణకు అమ్మ మీకు బాగా నచ్చిన వంటకాలు రెండు చేేసిందే అనుకోండి, మొదట మీకు రెండింటిలో చాలా చాలా ఇష్టమైనదాన్నే తింటారు కదా! తర్వాతే రెండోది రుచిచూస్తారు. ఇక్కడ మొదటి దాన్ని ఎంచుకునేలా మిమ్మల్ని ప్రోత్సహించింది దానిపై మీకున్న ఆసక్తి. డైలమా విషయంలో కూడా ఇదే సూత్రాన్ని పాటించవచ్చు.

స్థిరత్వం

డైలమా మనల్ని ఎంతగా ఆలోచనలో పడేస్తుందంటే ఓ పట్టాన నిర్ణయాన్ని తీసుకోనివ్వదు. కానీ అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాక మళ్లీ దాన్నుంచి వెనక్కి వెళ్లడం సరికాదు, ఒకేసారి అన్ని పనులూ చేయలేం కదా! అందుకే చేసుకున్న ఎంపికలో స్థిరత్వం అవసరం. ఇంకే ఇతర విషయాలూ ఆలోచించకుండా దానికే కట్టుబడి ఉండటం వల్ల సమస్యను పూర్తిగా అధిగమించి ఆనందంగా ముందడుగు వేయగలం!
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స‌వాళ్లు ఎదురైనా స‌న్న‌ద్ధ‌త ఆప‌లేదు!

‣ ప‌ట్టు ప‌ట్టు.. ప్రిలిమ్స్ హిట్‌!

‣ చదువు కోసం విదేశాలకు వెళ్లేముందు..!

‣ మెరుగైన కొలువుకు మెడికల్‌ కోడింగ్‌

‣ అవరోధాలు ఎదురైనా ఆపేదేలేదు!

‣ మళ్లీ అగ్రస్థానంలో ఐఐఎస్సీ

‣ సైన్స్‌ బోధనలో.. పరిశోధనలో!

Posted Date : 27-07-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌