‣ ఎస్ఐ ప్రాథమిక పరీక్ష చివరి దశ ప్రిపరేషన్‌కి సూచనలు
తెలంగాణలో ఎస్.ఐ., కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఆగస్టు 7, 21 తేదీల్లో జరగబోతున్నాయి. ఎస్.ఐ. ప్రిలిమ్స్‌కు 2.5 లక్షలమందీ, కానిస్టేబుల్ పరీక్షకు 7 లక్షలమందీ అభ్యర్థులు హాజరవుతారని ప్రాథమిక అంచనా. సుమారు 17 వేల పోస్టులకు 9.5 లక్షల మంది అభ్యర్థులు మొదటి వడపోత పరీక్షలో (ప్రిలిమ్స్) తమ అదృష్టాన్ని పరీక్షించు కోనున్నారు. ఇప్పుడున్న వ్యవధిలో సన్నద్ధతను పదును పెట్టుకునేందుకు నిపుణుల సూచనలు ఇవిగో!
సుమారు 17 వేల పోస్టులకు 9.5 లక్షలమంది అభ్యర్థులు అంటే పోటీ ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు పరీక్షలకూ వ్యవధి తక్కువగా ఉంది. ప్రతి నిమిషాన్నీ ఒడిసి పట్టుకుని.. సరైన పద్ధతిలో సన్నద్ధతను కొనసాగిస్తే ప్రిలిమ్స్‌లో సులభంగా విజయం సాధించవచ్చు.
ఏ సబ్జెక్టులు చదవాలి?
‣ ఉన్న సమయం తక్కువ. ఇప్పుడు నేను అన్ని సబ్జెక్టులూ చదవుతానంటే వ్యవధి సరిపోదు. కాబట్టి ఆవేశంతో కాకుండా ఆలోచనతో సన్నద్ధత మొదలుపెట్టండి.
‣ నిజానికి ప్రిలిమ్స్ పాసవ్వాలంటే అన్ని సబ్జెక్టులూ చదవాల్సిన అవసరం లేదు. ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉన్న తక్కువ సబ్జెక్టులు ఎంచుకుంటే ప్రిలిమ్స్‌లో మీరు 50 శాతం గట్టెక్కినట్టే.
‣ ఇలా చూసుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించే, చదివితే సులువుగా ఉండే సబ్జెక్టులు-
1) ఆప్టిట్యూడ్, రీజనింగ్ 2) కరెంట్ అఫైర్స్ 3) తెలంగాణ ఉద్యమం 4) ఇండియన్ హిస్టరీ.
‣ ఈ సబ్జెక్టుల నుంచి ఎస్.ఐ.పరీక్షలో సుమారు 160 ప్రశ్నలు, కానిస్టేబుల్ పరీక్షలో 110కి పైగా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి వీటి మీద దృష్టిపెట్టి సన్నద్ధమైతే ఎస్.ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించవచ్చు.
ఎన్ని గంటలు?
‣ ఇది అభ్యర్థి వ్యక్తిగత ఎంపికపై ఆధారపడి ఉంటుంది. కానీ పరీక్ష సమయం దగ్గరపడుతోంది. కాబట్టి కనీసం 8 గంటలు చదివేలా ప్రణాళిక వేసుకోవాలి.
‣ ఒక్కో సబ్జెక్టుకు కనీసం గంటన్నర కేటాయించాలి.
‣ రాత్రి పడుకునే ముందు కనీసం ఒక గంట, ఉదయం నుంచి చదివిన దాన్ని రివిజన్ (పునశ్చరణ) చేసుకోవటం మేలు.
ఏం చదవాలి?
ఆప్టిట్యూడ్‌లో 20 టాపిక్స్, రీజనింగ్‌లో 25 టాపిక్స్ ఉంటాయి కానీ...
ఆప్టిట్యూడ్‌లో ముఖ్యమైనవి: నంబర్ సిస్టమ్, యావరేజెస్, ఏజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్టనర్‌షిప్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్స్, క్యాలెండర్, సింపుల్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొదలైనవి.
రీజనింగ్‌లో ముఖ్యమైనవి: కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్స్, సిరీస్, ఆల్ఫబెట్ టెస్ట్, ర్యాంకింగ్ టెస్ట్, పజిల్స్, సిలాజిజమ్స్, స్టేట్‌మెంట్ అసమ్షన్స్..
ఈ టాపిక్స్ నుంచే 80 శాతం ప్రశ్నలు వస్తాయి. కాబట్టి వీటిపై ప్రధానంగా దృష్టి పెట్టాలి.
కరెంట్ అఫైర్స్
‣ కనీసం చివరి 9 నెలల కరెంట్ అఫైర్స్ చదవాలి. వీటిలో ముఖ్యంగా జాతీయ-అంతర్జాతీయ ముఖ్య సదస్సులు, జాతీయ, అంతర్జాతీయ ముఖ్య నియామకాలు, అవార్డులు, క్రీడల ముఖ్య సమాచారం, బడ్జెట్, నోబెల్, ఆస్కార్ అవార్డులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, శ్రీలంక సంక్షోభం, కొవిడ్‌పై సమగ్ర సమాచారం మొదలైనవి.
‣ కరెంట్ అఫైర్స్‌ని సబ్జెక్టుతో అనుసంధానించి చదివితే అదనంగా 5-10 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు: ఇటీవల తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ఇది చదివేటప్పుడు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఆయన నియామకం జరిగింది, ఆయనతో ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారు? అనే విషయాలను కూడా చదివితే అదనపు మార్కులు వస్తాయి.
తెలంగాణ ఉద్యమం
ఈ ఉద్యమం ఎస్.ఐ., పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల్లో ప్రధానమైనది. - తెలంగాణలోని వివిధ జాతరలు, పండగలు - ముల్కీ-నాన్ ముల్కీ అంశాలు, నిజాం .
‣ హైదరాబాద్ సంస్థానం విలీనం- పరిణామాలు.
‣ 1952 ముల్కీ ఉద్యమం, 1953-ఎస్‌ఆర్‌సీ, 1956
‣ పెద్ద మనుషుల ఒప్పందం, 1969
‣ తెలంగాణ ఉద్యమ గమనం, జై ఆంధ్రా ఉద్యమం, ఆర్టికల్ 371-డి, 1980-2000 వరకు ఆవిర్భవించిన పార్టీలు, 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి 2014 తెలంగాణ వచ్చే వరకు ముఖ్యమైన పరిణామాల మీద శ్రద్ధపెట్టాలి.
భారతదేశ చరిత్ర
భారత చరిత్రలో బుద్ధిజం, జైనిజం, మౌర్యులు, గుప్తులు, దిల్లీ సుల్తానులు, మొగలులు, భక్తి ఉద్యమం, 1857 సిపాయిల తిరుగుబాటు, అతివాదులు,. మితవాదులు, గాంధీయుగం నుంచి 1947 వరకు జరిగిన పరిణామాల మీద దృష్టి పెట్టాలి.
రివిజన్ ఎలా చేయాలి?
‣ చదివినదాన్ని ఏరోజుకారోజు కనీసం గంట పాటు రివిజన్ చేసుకోవాలి.
‣ పరీక్ష లోపు రెండు రోజులకోసారి మాక్ టెస్టులు రాయాలి.
‣ మాక్ టెస్టులు రాశాక ఏ సబ్జెక్టుల్లో, ఏ టాపిక్స్‌లో బలహీనంగా ఉన్నారో గమనించి వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి.
‣ ఒక మాక్‌టెస్టులో చేసిన తప్పులను ఇంకో మాక్ టెస్టులో పునరావృతం చేయకుండా ఉండాలి. అప్పుడు మార్కులు పెరగడంతోపాటు ప్రిలిమ్స్ పరీక్ష అంటే భయం పోయి మీపై మీకు నమ్మకం పెరుగుతుంది.
ప్రణాళికతో సాధించా!
మాది వనపర్తి జిల్లా, గోపాల్‌పేట మండలంలోని ఏదుట్ల గ్రామం. ప్రభుత్వ పాఠశాలలో చదివాను. 2012లో బీటెక్ చేశాను. బ్యాంకులో పీఓ ఉద్యోగం చేస్తూనే 2016లో ఎస్.ఐ. నియామక పరీక్షకు దరఖాస్తు చేశాను.
‣ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకూ విధి నిర్వహణ ఉండటంతో చదవటానికి సమయం దొరికేది కాదు. అయినప్పటికీ రోజూ 3-4 గంటలూ, సెలవు రోజుల్లో 8-10 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించేవాణ్ని.
‣ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌లపై పట్టు ఉండటంతో ఎక్కువ కష్టపడకుండానే (పేపర్ క్లిష్టంగా ఉన్నప్పటికీ ) ప్రిలిమ్స్‌లో 140+ మార్కులు వచ్చాయి.
‣ దాంతో నామీద నాకు నమ్మకం ఏర్పడింది. ఈవెంట్స్‌లో ఎక్కువ స్కోరు చేయలేకపోయాను. జస్ట్ పాస్ అయ్యాను.
‣ తర్వాత మెయిన్స్‌కు 2 నెలల సమయం దొరకటంతో కోచింగ్‌కు వెళ్లకుండా షెడ్యూల్ తయారుచేసుకుని చదివాను.
‣ పద్ధతి ప్రకారం చదువుతూ వారానికోసారి గ్రాండ్ టెస్ట్ రాశాను. మార్కులు రాని అంశాల్లో లోటుపాట్లు సరిచేసుకున్నా.
‣ మాక్ టెస్టులు ఎక్కువ రాయడంతో నాకు తెలియకుండానే ఎగ్జామ్‌లో టైమ్ మేనేజ్‌మెంట్, సబ్జెక్టులో పర్‌ఫెక్షన్ పెరిగింది. నాకు ఈజీగా అనిపించిన సబ్జెక్టులకు తక్కువ సమయం, కష్టంగా అనిపించే వాటికి ఎక్కువ సమయం కేటాయించాను. ఎక్కువసార్లు రివిజన్ చేసేవాడిని.
‣ పరీక్ష దగ్గరపడినప్పుడు సబ్జెక్టులు చదవడం పక్కన పెట్టి రివిజన్ చేశాను. మాక్ టెస్ట్‌లు రాశాను.
‣ ఇవి పరీక్షలో నాకు చాలా సాయపడ్డాయి. మెయిన్స్‌లో మ్యాథ్స్‌లో 160, జీఎస్‌లో 120.. మొత్తం 280 మార్కులు వచ్చాయి.
‣ ఆర్.ఎస్.ఐ.గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆక్టోపస్‌లో పనిచేస్తున్నాను.
కోచింగ్‌కు వెళ్లకపోయినా సరైన ప్రణాళిక రూపొందించుకుని...
దాన్ని పూర్తిస్థాయిలో ఆచరణలో పెట్టాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని నిబద్ధతతో కృషిచేస్తే కొలువు సాధించవచ్చు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం