‣ నిపుణుల సూచనలు
తొమ్మిది లక్షలకుపైగా అభ్యర్థులు హాజరయ్యే అవకాశమున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష తేదీ సమీపిస్తోంది. ఇటీవల జరిగిన ఎస్‌ఐ పరీక్ష నేపథ్యంలో ప్రధానంగా ఏ అంశాలపై దృష్టిపెట్టాలి? సన్నద్ధతకు తుది మెరుగులు ఎలా దిద్దుకోవాలి?
ఎస్‌ఐ పరీక్షలో చాలామంది విద్యార్థులు కొత్త ప్రశ్నలను చూసి పూర్తిగా చదవకుండానే అయోమయానికి గురయ్యారు. కానిస్టేబుల్ పరీక్షలో అభ్యర్థులు ఈ పొరపాటు చేయకూడదు. ఎలాంటి ఒత్తిడికీ గురికాకుండా ప్రశ్నను పూర్తిగా చదివి జవాబు రాయడానికి సిద్ధం కావాలి. ఇప్పుడున్న సమయం తక్కువ కాబట్టి కొత్తగా ఏ అంశాలూ చదవడానికి ప్రయత్నం చేయకూడదు. చదివిన వాటినే బాగా పునశ్చరణ చేసుకోవాలి. మాదిరి ప్రశ్నపత్రాలకు జవాబులు రాసి ప్రతి సబ్జెక్టుపైనా అవగాహన పెంచుకోవాలి.
ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉండే సబ్జెక్టులు...
‣ అరిథ్‌మెటిక్ అండ్ రీజనింగ్
‣ ఇంగ్లిష్
‣ తెలంగాణ చరిత్ర
‣ ఇండియన్ పాలిటీ
‣ కరెంట్ అఫైర్స్
ఈ సబ్జెక్టుల నుంచి 120కి పైగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటి మీద దృష్టి పెడితే కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌ను సులువుగా పాసవ్వొచ్చు.
ఏ అంశాలు ముఖ్యమైనవి?
కరెంట్ అఫైర్స్: జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, అవార్డులు, బహుమతులు, క్రీడలు, విజేతలు, వార్తల్లోని వ్యక్తులు, ప్రధాన నియామకాలు, ప్రముఖ వ్యక్తుల మరణాలు, రాజీనామాలు, ప్రముఖుల పర్యటనలు, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, శాస్త్ర సాంకేతిక విశేషాలు. తీవ్రవాద సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ సామాజికాభివృద్ధి కార్యక్రమాలు, ప్రధాన ఉద్యమాలు, క్షిపణులు, పురాతన కట్టడాలు.. మొదలైన అంశాలను కూడా చదవాలి. వీటి కోసం ప్రముఖ దినపత్రికలు, టీవీలోని ముఖ్యమైన వార్తలను నోట్ చేసుకోవాలి.
రీజనింగ్: ఎస్‌ఐ పరీక్షను దృష్టిలో ఉంచుకుంటే ఊహనాలు (అసంప్షన్స్), ప్రకటనలు, తీర్మానాలు, తార్కికవాదం అనే అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయి. వీటికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. సులభంగా మార్కులు సాధించే దిశాత్మక పరీక్ష, కోడింగ్, డీకోడింగ్, పరిమాణ పరీక్ష, ర్యాంకింగ్ పరీక్ష, మిస్సింగ్ నంబర్, పోలిక, భిన్న పరీక్ష, గణిత పరీక్షలు, అక్షరమాల, నంబర్ సిరీస్, లాజికల్ వెన్ చిత్రాలను చూసుకోవాలి. నాన్‌వెర్బల్ రీజనింగ్‌లో పాచికలు, దర్పణ (అద్దం) ప్రతిబింబాలు, నీటి ప్రతిబింబాలు, శ్రేణులు, పోలిక పరీక్ష, భిన్న పరీక్ష మొదలైనవి ముఖ్యమైనవి.
తెలంగాణ చరిత్ర, ఉద్యమ చరిత్ర: పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో ప్రముఖ పాత్ర పోషించే వాటిలో.. తెలంగాణలోని వివిధ జాతరలు, పండగలు... ఇంకా శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు, ముల్కీ-నాన్‌ముల్కీ అంశాలు, నిజాం హైదరాబాద్ సంస్థానం విలీనం-పరిణామాలు, ముల్కీ ఉద్యమం, 1953 ఎస్‌ఆర్‌సీ, పెద్ద మనుషుల ఒప్పందం, జై ఆంధ్ర ఉద్యమం, ఆర్టికల్ 371-డి, 1980-2000 వరకు ఆవిర్భవించిన పార్టీలు, 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం నుంచి 2014లో తెలంగాణ వచ్చేవరకు ముఖ్య పరిణామాల మీద శ్రద్ధ పెట్టాలి.
‣ భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ సంస్కరణలు, కేంద్ర, రాష్ట్ర పాలనా వ్యవస్థలు, ఐరాస, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఎన్నికలు, మంత్రిమండలి, ఆర్థిక కమిషన్లు, పంచవర్ష ప్రణాళిక, బడ్జెట్, జనాభా వృద్ధిరేటు మొదలైన అంశాలను చదవాలి.
జనరల్‌సైన్స్: మానవ నిర్మాణం, వ్యాధులు, రక్త గ్రూపులు, విటమిన్లు, ఉపగ్రహాలు, భారత రక్షణ వ్యవస్థలోని యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, పరిశోధనలు.. తదితర అంశాలపై ప్రశ్నలు అడగొచ్చు.
ఇంగ్లిష్ విభాగం: పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, టెన్సెస్, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ స్పీచ్.. మొదలైనవి
చదివిన అంశాలను రోజూ పునశ్చరణ చేసుకుంటూ పరీక్షలోపు రెండు లేదా మూడు రోజులకు ఒకసారి మాక్ టెస్టులు రాయాలి. ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నారో గుర్తించి వాటి మీద ఎక్కువ సమయం వెచ్చించాలి. ఒక టెస్టులో చేసిన తప్పులు ఇంకో టెస్టులో పునరా¦వృతం కాకుండా చూసుకుంటే భయం పోతుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది.
రైల్వే ఉద్యోగం చేస్తూనే ప్రిపరేషన్

2016 నోటిఫికేషన్‌లో మా అక్క రాజోలి రాజేశ్వరి సివిల్ ఎస్‌ఐగా ఉద్యోగం సాధించింది. తన స్ఫూర్తితో పోలీస్ ఉద్యోగం సాధించాలని కష్టపడ్డాను. అక్క ద్వారా మెలకువలు నేర్చుకుని, సందేహాలు తీర్చుకుని సన్నద్ధత కొనసాగించాను. ఒకపక్క రైల్వే ఉద్యోగం, మరోపక్క ప్రిపరేషన్ కష్టతరంగా మారింది. నోటిఫికేషన్ వచ్చాక రైల్వే ఉద్యోగానికి సెలవు పెట్టి రోజూ 8-12 గంటలు చదివాను.
సిలబస్ పూర్తిచేయడం, రివిజన్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాను. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పుస్తకం మాత్రమే చదివాను. ‘ఈనాడు’ వార్తాపత్రికలో వచ్చే కరెంట్ అఫైర్స్ బాగా ఉపయోగపడ్డాయి. మొబైల్‌ఫోన్‌ను దాదాపు 5 నెలలపాటు స్విచాఫ్ చేశాను. సమయం వృథా కావడానికి ఫోనే ముఖ్యమైన కారణం అనుకున్నాను. సిలబస్‌లో ఉన్నవి మాత్రమే చదవడం, మల్టిపుల్ ఛాయిస్ బిట్ల్ల సాధన, ఎక్కువసార్లు పునశ్చరణ బాగా ఉపయోగపడ్డాయి. సమయం తక్కువ కావడంతో మాక్ టెస్టులు ఎక్కువగా రాయలేకపోయాను. దీనివల్ల ఎస్‌ఐ అవ్వాలనే లక్ష్యాన్ని సాధించలేకపోయాను. మాక్ టెస్టులు రాసి ఉంటే టైమ్ మేనేజ్‌మెంట్ తెలిసేది; ఎస్‌ఐ ఉద్యోగం వచ్చేదని అర్థమైంది.
తర్వాత 2018 కానిస్టేబుల్ పరీక్షలో 126 మార్కులతో ఫైర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. సరైన ప్రణాళిక వేసుకున్నప్పటికీ సమయం తక్కువ కావడంతో ఎస్‌ఐ ఉద్యోగం కొంచెంలో తప్పిపోయింది. పోటీ పరీక్షల్లో సమయం చాలా విలువైందని అర్థమైంది.
- రాజోలి అనిల్‌కుమార్, ఫైర్ కానిస్టేబుల్, కర్నూలు జిల్లా
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ సోషల్ మీడియాలో సమయం వృథా అవుతోందా?