• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సోషల్‌ మీడియాలో సమయం వృథా అవుతోందా?

సోషల్‌ మీడియాకు అలవాటు పడిన యువత ఎన్నో సమస్యలతో ఇబ్బందిపడుతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఏకాగ్రతను కోల్పోవడం, నిద్రలేమి, సామాజిక ఒంటరితనం, ఒకచోట కూర్చోడానికే ఆసక్తి చూపడం.. ఇలాంటి సమస్యలు!  విలువైన సమయాన్ని వృథాచేసే ఈ అలవాటు నుంచి బయటపడాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా!

మనకు ఎంతో మంది నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వస్తుంది. మిత్రుల సంఖ్యను పెంచుకోవాలని భావించి వాళ్ల అభ్యర్థనను ఓకే చేస్తాం. దీంతో వారివైపు నుంచి వచ్చే నోటిఫికేషన్లు మన సమయాన్ని వృథా చేస్తాయి. అందువల్ల ఏమాత్రం పరిచయం లేనివారి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేయకపోవడమే మంచిది.  

ప్రతి చిన్న విషయాన్నీ, సంఘటననీ పోస్టు చేసే అలవాటు ఎక్కువ మందిలో ఉంటుంది. ఈ పోస్టులకు స్పందించినవారికి మళ్లీ సమాధానం ఇవ్వాల్సిరావడంతో సమయం వృథా అవుతుంది. అందువల్ల ఉపయోగంలేనివాటిని పోస్టు చేయడం అలాగే అనవరస పోస్టులకు స్పందించడం మానుకోవాలి. 

ఆన్‌లైన్‌ ప్రపంచంలో జరిగే సరికొత్త విషయాల సమాచారాన్ని నోటిఫికేషన్లు మనకు చేరవేస్తాయి. తరచూ వచ్చే ఈ ప్రకటనలు చదువు మీద నుంచి మన దృష్టిని ఇతర అనవసర విషయాల మీదకు మళ్లిస్తాయి. అవన్నీ చూడటం వల్ల సమయమెంతో వృథా అవుతుంది. ఆ తర్వాత ప్రశాంతంగా చదవలేకపోవచ్చు కూడా. కాబట్టి నోటిఫికేషన్లు రాకుండా ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకుంటే మంచిది.

సోషల్‌ మీడియాలో గడిపే సమయాన్ని తగ్గించుకోవాలి. రెండు, మూడు గంటలు గడిపే అలవాటు ఉంటే దాన్ని గంటకు కుదించుకోవచ్చు. రోజూ గంట చొప్పున.. వారానికి ఏడు గంటల సమయం ఆదా అవుతుంది. ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకూడదు. ఒకసారి పెంచితే ఆ తర్వాతి నుంచి అదే అలవాటుగా మారిపోతుంది. 

తరగతులు, ట్యూషన్లతో సమయం సరిపోవడంలేదని గతంలో వాయిదా వేసుకున్న పనులను ఇప్పుడు సరికొత్తగా మొదలుపెట్టొచ్చు. చదువుతోన్న కోర్సుకు ఉపయోగపడే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. పుస్తకాలు చదవడం, సంగీతం నేర్చుకోవడం, మొక్కలు పెంచడం... ఇలా ఏదైనా మనసుకు నచ్చిన అభిరుచిని ఎంచుకోవచ్చు. ఇలా సమయాన్ని వెచ్చించడం వల్ల మానసికానందం రెట్టింపు అవుతుంది. 

ఫోను లేదా ఫేస్‌బుక్‌లో పలకరించడం కాకుండా స్నేహితులనూ, బంధువులనూ నేరుగా కలవడానికి ప్రయత్నించవచ్చు. స్వయంగా కలుసుకోవడం వల్ల కష్టసుఖాలను కలబోసుకోవడానికీ అవకాశం ఉంటుంది. చదువు, ఉద్యోగానికి సంబంధించిన సలహాలూ, సూచనలూ తీసుకోవడానికి అనువుగానూ ఉంటుంది. ఇది మీ మానసికానందాన్ని రెట్టింపు చేయొచ్చు. 

చదువులో మెరుగుపడటానికి అవసరమైనవి లేదా కుటుంబానికి ఉపయోగపడే మంచి పనులూ చేయొచ్చు. అలా చేసినందుకు ప్రోత్సాహకరంగా మీకు మీరే బహుమతిని ఇచ్చుకోవచ్చు. అలాంటప్పుడు సోషల్‌ మీడియాలో రోజులా కాకుండా అదనంగా మరికాస్త సమయం గడపొచ్చు. అయితే మంచి ఫలితాన్ని ఇచ్చే పనిచేసినప్పుడు మాత్రమే మీకీ వెసులుబాటు ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. 

స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులో ఉన్న కొన్ని యాప్స్‌ను మీరు అసలు ఉపయోగించకపోవచ్చు. అలాంటప్పుడు వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలి. లేకపోతే వాటి మీద సమయాన్ని వృథా చేసే అవకాశం ఉంటుంది.

చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అద్భుతమైన ఈ టెక్నాలజీకి సృష్టికర్త మనిషి. అది ఎప్పుడూ మనిషి నియంత్రణలో ఉండాలిగానీ.. దాని నియంత్రణలో మనం ఉండకూడదు. 
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎల్‌ఐసీ హౌసింగ్‌లో కొలువులు

‣ శారీరక సామర్థ్య పరీక్షలకు సిద్ధమవుతున్నారా?

‣ ఇంజినీరింగ్‌కి ఐఐటీ - మద్రాస్‌ టాప్‌!

‣ ఆర్మీలో 191 టెక్నికల్‌ పోస్టులు

‣ సన్నద్ధతకు తుది మెరుగులు!

‣ ఒత్తిడిని వదిలించుకోవచ్చు!

‣ మీడియాలో ప్రవేశానికి కొన్ని కోర్సులు

Posted Date : 13-08-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌