• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎక్కువ పరీక్షలు రాశా.. తప్పులు సరిచేసుకున్నా!

జేఈఈ మెయిన్‌ విజేత సూచనలు

వీలైనన్ని ఎక్కువ పరీక్షలు రాస్తూ... ఏ ఒక్క ప్రశ్నకూ తప్పు జవాబు ఇచ్చే అవకాశం లేకుండా తన సన్నద్ధత సాగిందని చెబుతున్నాడు జేఈఈ పరీక్షలో మెరిసిన కొయ్యన సుహాస్‌. శ్రీకాకుళానికి చెందిన ఇతడు... జేఈఈ మెయిన్స్‌ తొలి సెషన్‌లో 100 పర్సంటైల్‌ సాధించాడు. తన విజయానికి కారణమేంటో, సన్నద్ధతలో పాటించిన మెలకువలేంటో తన మాటల్లోనే...  


విజయవాడ శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో ఏడో తరగతిలో చేరిననాటి నుంచి జేఈఈ ఫౌండేషన్‌ కోర్సు నేర్పించేవారు. ఇంటర్‌ రెండేళ్లు ఈ పరీక్ష కోసం పూర్తిస్థాయి సమయం కేటాయించాను. రోజూ మ్యాథ్స్‌ 4 గంటలు, ఫిజిక్స్‌ 4 గంటలు, కెమిస్ట్రీ 6 గంటలపాటు చదివేవాడిని. క్లాసులో పాఠాలు చెప్పేటప్పుడు షార్ట్‌ నోట్స్‌ రాసుకునేవాడిని. తరగతి అయిపోగానే ఏమైనా సందేహాలు ఉంటే లెక్చరర్‌లను అడిగి తెలుసుకునేవాడిని. సబ్జెక్ట్‌ కోసం పూర్తిగా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలపైనే ఆధారపడ్డాను. వాటిలో ప్రతి వాక్యాన్నీ చదువుకున్నాను.


కాలేజీలో ఇచ్చే నోట్సులను కూడా అదనంగా చదివాను. ప్రతిరోజూ ఆరోజు చదివిన టాపిక్స్‌ను రివిజన్‌ చేసేందుకు కొంత సమయం కేటాయించాను. కాలేజీలో తప్పనిసరిగా రోజుకో మాక్‌ టెస్ట్‌ నిర్వహించేవారు. అందులో ఒక్క బిట్‌ తప్పు రాసినా... మొత్తం ఆ టాపిక్‌ మళ్లీ చదువుకుని బాగా నేర్చుకునేవాణ్ని. పరీక్ష ఆన్‌లైన్‌లో రాయాలి కాబట్టి వారానికి ఒకరోజు ఆ విధానంలో సాధన చేశాను.


ఏ సబ్జెక్టు ఎలా...


మ్యాథమెటిక్స్‌లో కొన్ని లెక్కలకు ఎక్కువ సమయం పడుతుంది. పెద్దవే అయినా సరే తప్పక చేయాలి. మళ్లీ మళ్లీ చేయడం ద్వారా వాటిని తొందరగా ఎలా చేయాలో అర్థం అవుతుంది, షార్ట్‌ కట్‌ తెలుస్తుంది. ప్రశ్న చదవడంలో కానీ, లెక్క చేసే క్రమంలో కానీ తప్పు జరగకుండా జాగ్రత్తపడ్డాను. ఇచ్చిన గడువులో ప్రశ్నలన్నీ రాయాలంటే ఎక్కువగా సాధన చేయడం ఒక్కటే మార్గం. ఫిజిక్స్‌లో ఎక్కువగా ఇంటర్‌ రెండో ఏడాది పాఠాలకు ప్రాధాన్యం ఉంటుంది. మొదటి సంవత్సరంలో కొన్ని టాపిక్స్‌ మాత్రం బాగా సన్నద్ధమవ్వాలి. రొటేషన్, వర్క్, పవర్, ఎనర్జీ, కైనమెటిక్స్, వేవ్‌ మోషన్, సెమీ కండక్టర్స్, కమ్యూనికేషన్‌ సిస్టమ్స్, ఈఎం వేవ్స్‌ అంశాలపై బాగా దృష్టిపెట్టాను. కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఫిజికల్‌ కెమిస్ట్రీలకు నోట్స్‌ చదివాను. ఇన్‌ఆర్గానిక్‌ మాత్రం పూర్తిగా ఎన్‌సీఈఆర్‌టీ పైన ఆధారపడ్డాను. 


పరీక్షకు ఇరవై రోజుల ముందు పూర్తిగా మాక్‌టెస్టులు రాయడం మొదలుపెట్టాను. మొత్తం 3 గంటల పేపర్‌లో మ్యాథ్స్‌ 1 గంటా 10 నిమిషాలు, ఫిజిక్స్‌ 1 గంట, కెమిస్ట్రీ 40 నిమిషాల్లో రాసేలా సాధన చేశాను. మిగతా 10 నిమిషాలు చివరిగా అన్నీ సరిచూసుకోవడానికి ఉపయోగించాను. కెమిస్ట్రీలో గుర్తుంచుకుని సమాధానం ఇచ్చే (మెమొరీ బేస్డ్‌) ప్రశ్నలు ఉంటాయి కాబట్టి దానికి తక్కువ సమయం కేటాయించి మిగతా వాటికి టైం మిగుల్చుకున్నాను. 290 మార్కులు వచ్చినందున సెకెండ్‌ సెషన్‌లో మళ్లీ పరీక్ష రాసి 300 మార్కులు తెచ్చుకునేందుకు ప్రిపేర్‌ అవుతున్నాను.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పది పాసైతే ప్రభుత్వ ఉద్యోగాలు

‣ మెయిన్‌లో మెరిసేందుకు మ‌రో అవ‌కాశం!

‣ ప్రావీణ్యం పెంచే వృత్తి విద్య

‣ అర్థం చేసుకుంటూ చ‌దివితే..!

‣ దేశ రాజ‌ధానిలో కానిస్టేబుల్ ఉద్యోగాలు

‣ విశ్వాసం ఉంటే విలువ త‌గ్గ‌దు!

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

Posted Date : 20-07-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌