• facebook
  • whatsapp
  • telegram

కష్టాల కడలిలో లంక ఎదురీత

విక్రమసింఘె తీరం చేర్చేనా?

 

 

తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక కష్టాల కడలిని ఎదురీదుతోంది. పూర్వ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పరారయ్యారు. ప్రభుత్వ నిర్వాకంపై ఆగ్రహించిన ప్రజానీకం కొలంబోలో అధ్యక్ష భవనం, సచివాలయంతో పాటు పలు ముఖ్యమైన ప్రభుత్వ భవనాలపై దాడి చేయడంతో అధ్యక్షుడు గొటబాయ పలాయనం చిత్తగించక తప్పలేదు. అధ్యక్ష పదవికి రాజీనామాను ఈ-మెయిల్‌ ద్వారా పార్లమెంటు స్పీకర్‌కు పంపారు. పదవీకాలం ముగియడానికి ముందే దేశాధ్యక్షుడు రాజీనామా చేసినట్లయితే, మిగిలిన పదవీ కాలానికి పార్లమెంటు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని శ్రీలంక రాజ్యాంగం నిర్దేశిస్తోంది. అందుకే జులై 20న గొటబాయ స్థానంలో రణిల్‌ విక్రమసింఘెను శ్రీలంక ఎనిమిదో అధ్యక్షుడిగా పార్లమెంటు ఎన్నుకుంది.

 

యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యూఎన్‌పీ) నాయకుడైన విక్రమసింఘె గతంలో ఆరుసార్లు ప్రధానమంత్రి పదవి నిర్వహించారు. కానీ, గత పార్లమెంటు ఎన్నికల్లో యూఎన్‌పీ అభ్యర్థులంతా ఓడిపోయారు. జాతీయ జాబితా నామినీగా విక్రమసింఘెను యూఎన్‌పీ నామినేట్‌ చేసినందువల్ల ఆయన పార్లమెంటులో అడుగుపెట్టగలిగారు. మే నెల తొమ్మిదో తేదీన ‘గొటా గో హోమ్‌’ అంటూ నిరసన ప్రదర్శనకు దిగిన ప్రజానీకంపై మహింద రాజపక్స నాయకత్వంలోని పాలక ‘శ్రీలంక పొదుజన పెరమున’ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబకడంతో మహింద ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దాంతో మే నెల 22న విక్రమసింఘెను కొత్త ప్రధానిగా అధ్యక్షుడు గొటబాయ నియమించారు. తరవాత ఆయన కూడా పరారవడంతో విక్రమసింఘె తాత్కాలిక అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేశారు. విక్రమసింఘెకు అత్యంత అనుభవజ్ఞుడు, మేధావిగా పేరుంది. రాజకీయ ఎత్తుగడలకు పేరుమోసిన నేత. రాజపక్స కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా పేరొందారు. ఆ కుటుంబ ఆశీస్సులతో అధ్యక్షుడైన విక్రమసింఘె నాయకత్వాన్ని అత్యధిక శ్రీలంక ప్రజానీకం అంగీకరించడంలేదు. అందుకే దేశమంతటా నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. విక్రమసింఘె అధ్యక్ష పదవిని చేపట్టి 24 గంటలైనా గడవకముందే శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న ప్రజలపై భద్రతాదళాలు పాశవికంగా విరుచుకుపడ్డాయి. ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచివేయడం ఆయనకు ఇదే మొదటిసారి కాదు. 1988-89లో యువజన వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు- పౌర సమస్యలపై శ్రీలంక యువత జరిపిన ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు. అప్పట్లో 60 వేల మంది యువతీ యువకులు మరణించారు.

 

ప్రస్తుత ప్రజా ఉద్యమానికి రాజపక్స కుటుంబ అవకతవక పాలన, దానివల్ల ముమ్మరించిన ఆర్థిక సంక్షోభమే మూల కారణం. చైనా నుంచి ఎడాపెడా అప్పులు తెచ్చి దుబారా చేసినందు వల్లే నేడు లంక అధోగతికి జారిపోయింది. లంక దుస్థితిపై భారత్‌తో పాటు ప్రధాన దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. రాజపక్స కుటుంబానికి మిత్రుడిగా ఉంటూనే విక్రమసింఘె వారిపై గుట్టుగా దుష్ప్రచారం చేశారనే విమర్శలున్నాయి. ఇందుకు సామాజిక మాధ్యమాలను, పౌర సంస్థలను తెలివిగా ఉపయోగించుకున్నారు. రాజపక్స పదవీచ్యుతికి దారితీసిన ‘గొటా గో హోమ్‌’ ఉద్యమానికి నాయకులంటూ ఎవరూ లేరు. అలాంటి నాయకత్వం లేని ఉద్యమాన్ని తానే తెర వెనక నుంచి ప్రేరేపించి అనుకున్నది సాధించాక భగ్నం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్లమెంటులో అత్యధిక సంఖ్యలో ఎంపీలు ప్రస్తుతం విక్రమసింఘెకు మద్దతు ఇస్తున్నారు. వారంతా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారేనని, అందరూ రాజీనామా చేసి కొత్తగా ఎన్నికలు జరిపించాలని ప్రజలు కోరుతున్నారు. విక్రమసింఘె ప్రభుత్వం వారి ఆకాంక్షలను విస్మరించడంతో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. విక్రమసింఘె భారత్‌ సహాయంతో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించాలని చూస్తున్నారు. అయితే ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాలంటే రాజకీయ సుస్థిరత అవసరం. ప్రస్తుతం లంకను పీడిస్తున్న పెట్రోలు, డీజిలు, వంటగ్యాస్‌, ఆహారం, మందుల కొరతలను తీర్చాలంటే విదేశ మారక ద్రవ్యం కావాలి. ఖాళీ అయిపోయిన విదేశీ ద్రవ్య నిల్వలను మళ్ళీ కూడబెట్టాలంటే బలమైన ప్రభుత్వం అవసరం. లంకను ఆదుకోవడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) అంగీకరించడం కొంతమేర సానుకూల పరిణామం. రాజకీయ సుస్థిరత ఉన్నప్పుడే దేశానికి మళ్ళీ పర్యాటకుల రాక మొదలవుతుంది. పర్యాటకుల ద్వారా సమకూరే విదేశ మారక ద్రవ్యం ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలంకకు ఎంతగానో అక్కరకొస్తుంది. దీనికి తోడు భారత్‌ వంటి మిత్రదేశాలు శ్రీలంకలో పెట్టుబడులు పెడితే దేశం వేగంగా కోలుకుంటుంది. మొత్తానికి సంక్షోభ సుడిలో చిక్కిన లంకను విక్రమసింఘె తీరం చేరుస్తారా అనేది అందరికీ ఆసక్తి కలిగించే అంశం!

 

- పియల్‌ దర్శన గురుగె

(న్యాయవాది, శ్రీలంకలో సామాజిక కార్యకర్త)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రూపాయి అంతర్జాతీయ కరెన్సీ కాగలదా?

‣ సంక్షోభంలో చైనా బ్యాంకులు

‣ తీర ప్రాంతానికి ప్రకృతి కాపలా!

‣ అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ

Posted Date: 29-07-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం