• facebook
  • whatsapp
  • telegram

తీర ప్రాంతానికి ప్రకృతి కాపలా!

అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవం

 

 

ప్రపంచంలోని వివిధ రకాల అరణ్యాల్లో మడ అడవులది ప్రత్యేక ఆవరణ వ్యవస్థ. ఇవి నదులు, సముద్రాలు కలిసి ఏర్పడే ఉప్పుకయ్యలు, నదీముఖ ప్రాంతాల్లో ఏర్పడతాయి. మొక్కలు పెరగడానికి ఎంతో క్లిష్టతరమైన అంతర పోటు ప్రాంతాల్లో, సముద్రతీరంలోని ఉప్పునీటిలో, లవణీయత మధ్యస్తంగా ఉండే జలాల్లో విస్తరిస్తాయి. ప్రధానంగా, భూమధ్యరేఖకు ఇరువైపులా సుమారు 30 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్యలో ఏర్పడతాయి. మడ అడవులు లవణీయతను తట్టుకునే వృక్షజాతులను కలిగి ఉంటాయి. ఉప్పునీటిలో మునిగి ఉన్నా- లవణాలను వడగట్టడం, అధిక లవణాలను పత్రాల ద్వారా విసర్జించడం, అలల తాకిడిని తట్టుకునేలా వేళ్ల వ్యవస్థను కలిగి ఉంటాయి. ఇక్కడ పెరిగే మొక్కలు బురద, ఆక్సిజన్‌ తక్కువగా ఉండే పరిస్థితులకు తగిన అనుకూలతలను, శ్వాసించే వేళ్లు, లవణ గ్రంథులు తదితర ఏర్పాట్లు కలిగి ఉంటాయి.

 

ఉపయోగాలెన్నో...

మడ అడవుల ఆవరణ వ్యవస్థ ఎన్నో రక్షణాత్మక, ఉత్పాదక ఆర్థిక విధులను నిర్వర్తిస్తుంది. రక్షణాత్మక విధుల కారణంగా వీటికి తీరప్రాంత సైన్యమని, మౌన హరిత కాపలాదారులనే పేరుంది. ఉప్పుకయ్యలు, వాటిని ఆనుకుని ఉండే ప్రాంతాలకు ఎదురయ్యే తుపానుల ప్రభావాన్ని నిరోధిస్తాయి. తీర ప్రాంతాల్లో నేల కొట్టుకుపోకుండా కాపాడతాయి. నదుల ద్వారా వచ్చే అవక్షేపాలను సముద్రంలోకి చేరకుండా ఆపి, తద్వారా ఎన్నో సముద్ర జీవజాతులకు అవసరమైన గడ్డికి, పగడపు దీవులకు హాని కలగకుండా కాపాడతాయి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కోవడంలోనూ వీటి పాత్ర కీలకం. భూ ఆవరణ వ్యవస్థల కంటే ఈ ఆవరణ వ్యవస్థలు పదిరెట్లదాకా కర్బనాన్ని శోషించి నిల్వచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మడ అడవులు తుపానులు, సునామీలకు సహజ అవరోధకాలుగా పనిచేస్తాయి. 1999లో సంభవించిన ఒడిశా సూపర్‌ సైక్లోన్‌ సందర్భంగా ఒడిశా తీరం అపార ధన, ప్రాణ నష్టాన్ని చవిచూడగా, మడ అడవులను కలిగిన భీతార్‌కనికా ప్రాంతం సురక్షితంగా నిలిచింది. వంద మీటర్ల వెడల్పు ఉండే మడ అడవి ప్రాంతం నుంచి ప్రయాణించే తుపాను అల మూడింట రెండువంతుల శక్తిని కోల్పోయి బలహీనపడుతుంది. మడ అటవీ ఆవరణ వ్యవస్థలు ఆస్తి నష్టాన్ని నివారిస్తాయని, ప్రజలకు వరద ముప్పు తగ్గిస్తాయని ‘గ్లోబల్‌ మాంగ్రూవ్‌ అలయెన్స్‌’ సంస్థ రూపొందించిన ‘ప్రపంచ మడ అడవుల స్థితి నివేదిక-2021’ వెల్లడించింది. మడ అడవులు ఆర్థికంగా కీలకమైన మత్స్య, ఆల్చిప్ప జాతులకు అనువైన స్థావరాలు. విస్తారంగా వ్యాపించే మడజాతి మొక్కల వేళ్లు ఎన్నో సముద్ర, తీరప్రాంత చేపలు, ఆల్చిప్పజాతుల సంతానోత్పత్తికి అనుకూలంగా ఉంటాయి. స్థానిక, వలస పక్షులకూ నెలవులు. ఈ ఆవరణ వ్యవస్థతో స్థానికుల జీవనోపాధులూ ముడివడి ఉంటాయి. ఇంటినిర్మాణం, పడవల మరమ్మతులు తదితర అవసరాల కోసం వీటిలో లభ్యమయ్యే వృక్ష సంపద ఉపయోగపడుతుంది. ఇక్కడ దొరికే తేనె, పశుగ్రాసంతో పలు ప్రయోజనాలు సమకూరతాయి. ఈ ఆవరణ వ్యవస్థలు పర్యావరణ పర్యాటకానికి కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి.

 

ప్రపంచవ్యాప్తంగా 1996-2016 మధ్యకాలంలో 6,075 చ.కి.మీ.మేర మడ అడవులు నాశనమైనట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మయన్మార్‌లో తీవ్రస్థాయిలో నరికివేతకు గురవుతున్నాయి. ఇండొనేసియా, వియత్నాం, భారత్‌, బంగ్లాదేశ్‌లలో కూడా నష్టం అధికంగా ఉంటోంది. తీరప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, వ్యవసాయం, ఆవాసాల కోసం నరికివేత, ఆక్రమణలు వంటివి శాపాలుగా పరిణమిస్తున్నాయి. నీటి నాణ్యత, కాలుష్యం, సముద్రంలో కలిసే జలాలను ఇతర అవసరాల కోసం దారి మళ్ళించడం, చిత్తడి ప్రాంతాలను రొయ్యల పెంపకానికి మార్పిడి చేయడం వంటివీ మడ అడవుల మనుగడకు పెనుముప్పుగా మారుతున్నాయి. థాయ్‌లాండ్‌, ఇండొనేసియా, మెక్సికోల్లో రొయ్యల పెంపకం కేంద్రాలవల్ల పోగుపడే జీవ వ్యర్థాలు జలాల్ని విషపూరితంగా మార్చి ఇతర జీవులకూ నష్టం వాటిల్లజేస్తున్నాయి. సహజంగా సముద్రంలోకి వెళ్ళే నీటిని ఇతర అవసరాల కోసం మళ్ళించడం వల్ల నదీజలాల్లో తగ్గిన పరిమాణం  మడ ఆవరణ వ్యవస్థల్లో అధిక లవణీయతకు, మృత్తికా అవక్షేపాల తగ్గుదలకు దారితీస్తుంది. ఇదంతా మడజాతి వృక్షాలు అంతరించడానికి కారణమవుతోంది.

 

పునరుజ్జీవ చర్యలు

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలలో మడఅడవుల సుస్థిర యాజమాన్యంపై ఎం.ఎస్‌.స్వామినాథన్‌ పరిశోధక ఫౌండేషన్‌ ప్రాజెక్టు అధ్యయనం చేపట్టింది. మడ ఆడవులపై మానవ ఒత్తిళ్లు, మడ ఆవరణ వ్యవస్థల పునరుజ్జీవం, పునరావాసాలపై ఈ అధ్యయనం దృష్టి సారించింది. సమగ్ర సముద్రతీర యాజమాన్యం కింద కేంద్ర పర్యావరణ, అడవుల మంత్రిత్వశాఖ తీరప్రాంత రాష్ట్రాలకు మడ అడవుల్ని పెంచేందుకు సహకరిస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మడ అడవుల సంరక్షణ, నిర్వహణ, సర్వే, సరిహద్దుల నిర్ధారణ, స్థానిక ప్రజలకు ప్రత్యామ్నాయ, అదనపు ఉపాధుల కల్పన, రక్షణ చర్యలు, విద్య, అవగాహన కార్యక్రమాల వంటి వాటితో కూడిన కార్యాచరణ ప్రణాళిక అమలులో వివిధ రాష్ట్రాలకు సహాయం అందుతోంది. ఒక ప్రాంతంలోని మడఅడవులు నాశనమైతే అప్పటిదాకా మొక్కల వేళ్లు పట్టి ఉంచిన పోషకాలతో కూడిన మృత్తికల పొరలు దెబ్బతింటాయి. ఇతర అడవుల్లా వీటి పునరుద్ధరణ అంత తేలికైన పని కాదు. వీటికున్న ప్రాధాన్యం దృష్ట్యా ప్రస్తుతమున్న మడ అడవుల సంరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి. మడ అడవుల జీవవైవిధ్య పరిరక్షణలో తీరప్రాంత సమాజాలకు భాగస్వామ్యం కల్పించాలి. దెబ్బతిన్న మడ ఆవరణ వ్యవస్థల పునరుజ్జీవనానికి, మొక్కలు తిరిగి నాటడానికి తగిన చర్యలు తీసుకోవాలి. మడ ఆవరణ వ్యవస్థలకు విఘాతం కలిగించే అంశాలను గుర్తించి తాత్సరం చేయకుండా పరిష్కరించాలి.

 

ప్రపంచవ్యాప్తంగా మడ అడవులు 2021 నాటికి 1.36 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించాయి. ప్రపంచ మడ అడవుల విస్తీర్ణంలో 20 శాతానికిపైగా ఇండొనేసియాలోనే ఉన్నాయి. భారత్‌లో మడ అడవులు సుమారు 5000  చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి.

పశ్చిమ్‌ బెంగాల్‌లోని సుందర్‌బన్స్‌ మడ అడవులు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందాయి. ఇవి రాయల్‌ బెంగాల్‌ పులులు, ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు, నునుపు రోమపు నీటిపిల్లులు వంటి ఎన్నో జంతువులకు నెలవుగా వర్ధిల్లుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 580 చదరపు కిలోమీటర్ల  విస్తీర్ణంతో- ప్రధానంగా గోదావరి, కృష్ణానదీ ముఖద్వార ప్రాంతాల్లో మడ అడవులు  నెలకొన్నాయి. కొన్నిచోట్ల ఇవి క్షీణిస్తూ ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కోరింగ మడ అడవుల్ని రక్షితప్రాంతంగా గుర్తించారు.

మరక పిల్లి (ఫిషింగ్‌ క్యాట్‌) ఉనికి ఆరోగ్యకరమైన, నాణ్యమైన మడ ఆవరణ వ్యవస్థకు సంకేతంగా భావిస్తారు. కోరింగ అభయారణ్యంలో వీటిసంఖ్య 115దాకా ఉన్నట్లు అంచనా. ఈ పిల్లి జాతి సంరక్షణకు తగిన సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

 

- ఎం.రామ్‌మోహన్‌ 

(సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ

‣ ప్రజాస్వామ్యానికి ఊపిరులూదిన ఓటుహక్కు

‣ డ్రాగన్‌ చక్రబంధానికి విరుగుడు వ్యూహం

‣ వేగంగా చౌకగా... రవాణా!

‣ ‘కాట్సా’ కోరల నుంచి మినహాయింపు?

Posted Date: 29-07-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం