• facebook
  • whatsapp
  • telegram

వేగంగా చౌకగా... రవాణా!

హైవేలతో జిల్లాల అనుసంధానం

దేశార్థిక వృద్ధిలో రోడ్డు రవాణా కీలక పాత్ర పోషిస్తుంది. సరకుల రవాణాలో జాతీయ రహదారులు (ఎన్‌హెచ్‌లు) కీలకంగా నిలుస్తున్నాయి. ఇండియా మొత్తం రోడ్ల విస్తరణలో ఎన్‌హెచ్‌లు రెండు శాతమే. కానీ, మొత్తం రోడ్డు రవాణాలో వాటి వాటా 40శాతం దాకా ఉంది. ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో చిన్న పట్టణాలు సైతం వస్తు ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రజల అవసరాల మేరకు ఆహార ధాన్యాలు, పండ్లు, ఇతరాలను ఎప్పటికప్పుడు నిర్దేశిత ప్రాంతాలకు త్వరితగతిన చేరవేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ తరుణంలో సరకుల రవాణాలో వేగం పెంచేందుకు అన్ని జిల్లాలను నాలుగు వరసల జాతీయ రహదారులతో అనుసంధానించడంపై కేంద్రం దృష్టి సారించింది.

దేశీయంగా రహదారులను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు 1998లో జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌హెచ్‌డీపీ) ప్రారంభించారు. ఎన్‌హెచ్‌డీపీ తొలి దశలో భాగంగా దిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కతాలను కలుపుతూ స్వర్ణ చతుర్భుజి, ఉత్తర-దక్షిణ, తూర్పు-పశ్చిమ రహదారి కారిడార్లను అభివృద్ధి చేశారు. అవి పెద్ద సంఖ్యలో జిల్లాలను నాలుగు వరసల జాతీయ రహదారులతో కలిపాయి. అనంతరం కేంద్రం 2015లో భారత్‌మాలా పరియోజన కార్యక్రమాన్ని తెచ్చింది. అందులో భాగంగా 65 వేల కిలోమీటర్ల పరిధిలో జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తొలి దశలో 2017-22 మధ్యకాలంలో రూ.5.35 లక్షల కోట్ల వ్యయంతో 35 వేల కిలోమీటర్ల పరిధిలో హైవే ప్రాజెక్టులను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 550 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానించడం, వాహనాల వేగాన్ని 20-25శాతం పెంచడం, రవాణా ఖర్చును 5-6శాతం తగ్గించడం భారత్‌మాలా పరియోజన ఆశయాలు. వచ్చే అయిదేళ్లలో అన్ని జిల్లాలను నాలుగు వరసల జాతీయ రహదారులతో అనుసంధానిస్తామని ఇటీవల భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు తెలిపారు. ఫలితంగా సరకుల రవాణాలో వేగం పుంజుకోనుంది. ఇప్పటిదాకా 35 వేల కిలోమీటర్ల ఎన్‌హెచ్‌ వ్యవస్థలను నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ వరసలకు విస్తరించినట్లు అధికారులు వెల్లడించారు. మరో 20 వేల కిలోమీటర్ల పరిధిలో పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. జిల్లాల అనుసంధానానికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.23వేల కోట్ల విలువైన తొమ్మిది ఎన్‌హెచ్‌ ప్రాజెక్టులను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. వాటి పొడవు 865 కిలోమీటర్లు. వాటిలో భాగంగా మంచిర్యాల్‌- వరంగల్‌, జగిత్యాల్‌-కరీంనగర్‌ తదితర రహదారులను నాలుగు, ఆరు లేన్లకు విస్తరించనున్నారు. ప్రతిష్ఠాత్మక హైదరాబాద్‌ ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్‌)సైతం వాటిలో భాగం. ఆంధ్రప్రదేశ్‌కూ కేంద్రం ఇటీవల పదకొండు జాతీయ రహదారులను కేటాయించింది. 31 రాష్ట్ర రహదారులను ఎన్‌హెచ్‌లుగా ఆధునికీకరించాలని భావిస్తోంది. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అదనపు ఎన్‌హెచ్‌లను కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

గోతులు వంటివి లేకుండా సరైన భద్రతా ప్రమాణాలతో రహదారులను నిర్మించడం ఎన్‌హెచ్‌డీపీ లక్ష్యం. ఇటీవలి కాలంలో జాతీయ రహదారులు నిత్యం రక్తమోడుతున్నాయి. 2020లో ఎన్‌హెచ్‌లపై జరిగిన ప్రమాదాల్లో దాదాపు 48 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. అంతకు ముందు ఏడాది 54 వేల మంది మరణించారు. రోడ్డు ప్రమాదాలకు వాహనాల నమూనా, వాటి కండిషన్‌, రహదారి నిర్మాణంలో ఇంజినీరింగ్‌ లోపాలు, అతివేగం ప్రధాన కారణాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. మద్యం, మాదకద్రవ్యాల మత్తులో వాహనాలు నడపడం, రహదారి నియమాల ఉల్లంఘన వంటివీ యాక్సిడెంట్లకు కారణాలుగా తెలియజెప్పారు. రహదారి భద్రతను పెంచేందుకు వాటి నమూనా రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ... ఇలా అన్ని దశల్లో నిపుణులతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కానీ, ఎన్‌హెచ్‌లు నిత్యం పెద్ద సంఖ్యలో ప్రాణాలను కబళిస్తూనే ఉన్నాయి. వాటిపై పెద్దయెత్తున ఏర్పడుతున్న గోతులు వాహనదారుల భద్రతకు ప్రమాదకరంగా మారాయి. గోతులకు ఎప్పటికప్పుడు మరమ్మతులు నిర్వహించాలి. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు తగిన ఏర్పాట్లు చేయడంతోపాటు, అందరూ రహదారి నియమాలు పాటించేలా చూడాలి. కొత్తగా అభివృద్ధి చేస్తున్న రహదారుల విషయంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం తప్పనిసరి. రోడ్లు రక్తసిక్తం కావడాన్ని నివారించకపోతే, వస్తువుల రవాణాలో సాధించిన ప్రగతి అసమగ్రంగానే మిగులుతుందని పాలకులు గుర్తించాలి.

- ఎం.వేణు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ‘కాట్సా’ కోరల నుంచి మినహాయింపు?

‣ పర్యావరణ లక్ష్యాలకు తూట్లు

‣ సాగు లాభానికి సూక్ష్మ సాంకేతికత

‣ న్యాయ వ్యవస్థపై కేసుల భారం

‣ జోరెత్తుతున్న పార్టీ ఫిరాయింపులు

Posted Date: 23-07-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం