• facebook
  • whatsapp
  • telegram

జోరెత్తుతున్న పార్టీ ఫిరాయింపులు

గోవా కాంగ్రెస్‌లో ఇక్కట్లు

ఇటీవల గోవా విపక్ష కాంగ్రెస్‌ నిలువునా చీలిపోయే దిశగా సాగిన పరిణామాలు రాజకీయాల్ని మరోసారి వేడెక్కించాయి. పరిస్థితి వెంటనే సద్దుమణిగినట్లు కనిపించినా, తాజాగా రాష్ట్రపతి ఎన్నికల ముంగిట తమ ఎమ్మెల్యేల్లో కొంతమందిని కాంగ్రెస్‌ పార్టీ చెన్నైకి తరలించడం సమస్య తీవ్రతకు సంకేతంగా నిలుస్తోంది. ఇటీవల మహారాష్ట్రలో అధికార శివసేన పార్టీ నిలువునా చీలి, భాజపా సహాయంతో చీలిక వర్గం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే గోవా కాంగ్రెస్‌లో ఫిరాయింపులకు తెరలేవడం కలకలం రేపింది. గోవాలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ తమ పార్టీ అభ్యర్థులను దేవాలయాలు, చర్చిలు, మసీదులకు తీసుకెళ్ళి ఎన్నికల్లో గెలిచిన తరవాత పార్టీని వీడబోమంటూ ప్రమాణాలు చేయించింది. వారితో అఫిడవిట్లపై సంతకాలు కూడా తీసుకొంది. అయినప్పటికీ ఇటీవలి చీలికల పరిణామాలతో ప్రమాణాల ప్రక్రియ ఎన్నికల గిమ్మిక్కుగానే మిగిలిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రాన్నే కోల్పోతోంది. పలు రాష్ట్రాల్లో అధికార పార్టీలు సుస్థిర ఆధిక్యం సముపార్జించుకోవడానికి- కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే తేలికపాటి లక్ష్యాలుగా మారుతున్నారు.

నలభై స్థానాలున్న గోవా అసెంబ్లీలో మెజారిటీకి 21 స్థానాలు అవసరం. ఇటీవలి ఎన్నికల్లో 20 స్థానాలు గెలిచిన భాజపా అతిపెద్ద ఏకైక పార్టీగా ఇతరుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 11 సీట్లతో కాంగ్రెస్‌ రెండోస్థానానికి పరిమితమైంది. 25 మందిదాకా ఎమ్మెల్యేల మద్దతుతో సర్కారు సాఫీగానే నడుస్తున్నా, కాంగ్రెస్‌ నుంచి తిరుగుబాటు నేతలను కలుపుకోవడం ద్వారా మరింతగా స్థిరపడాలనే దిశగా కమలదళం యత్నిస్తున్నట్లు విదితమవుతోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో మూడింట రెండోవంతుగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలను చీల్చడానికి యత్నించిందని, అయితే ఆరుగురు ఎమ్మెల్యేలు తమతోనే ఉండిపోయారని కాంగ్రెస్‌ పార్టీ గోవా వ్యవహారాల ఇన్‌ఛార్జి దినేష్‌ గుండూరావు వెల్లడించడం విశేషం. అయిదుగురు ఎమ్మెల్యేలు భాజపాతో సంప్రదింపుల్లో ఉన్నారని, తమ పార్టీ నేతలు మైఖేల్‌ లోబో, దిగంబర్‌ కామత్‌ల నేతృత్వంలోనే కుట్ర జరిగినట్లు ఆరోపించారు. కాంగ్రెస్‌లో తిరుగుబాట్లకు తమకేమీ సంబంధం లేదని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ వ్యాఖ్యానించగా- ఎవరైనా చేరాలనుకుంటే ఆహ్వానిస్తామని, పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సదానంద చెబుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి దక్షిణగోవాలో బలం పెంచుకోవాలనేది కమలదళం యత్నం. 2019లో ఆ స్థానాన్ని గెలవలేకపోయిన భాజపా, ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌కు అయిదురుగు ఎమ్మెల్యేలు ఉండటంతో తీవ్రంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి రాజీనామా చేయించి, గెలిపించే దిశగానూ యోచిస్తున్నా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సుముఖత కనబరచడం లేదు. ఫిరాయింపు చట్టం నిబంధనలు వర్తించకుండా అవసరమైన సంఖ్యతో భాజపాలో చేరి అధికారంలో కొనసాగాలన్నదే వారి వ్యూహంగా తెలుస్తోంది. కాంగ్రెస్‌కు గట్టి పట్టు, బలం ఉన్న స్థానాల్లో గెలిచిన కారణంగా, ఇప్పుడు రాజీనామా చేసి, తిరిగి గెలవడం కూడా అంత తేలికైన వ్యవహారం కాదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. క్రితంసారి కాంగ్రెస్‌ నుంచి బయటికివెళ్ళిన ఎమ్మెల్యేల్లో పలువురు తమ స్థానాల్ని కోల్పోయారు.

ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి వ్యవహారాలకు అడ్డుకట్ట పడాలంటే ఫిరాయింపుల నిరోధక చట్టం పదునెక్కాల్సిందే. ఆ దిశగా మరింత బలంగా అడుగులు పడాల్సిన అవసరం ఉంది. ఫిరాయింపుల చట్టంపై పరిశీలనకు 2019లో రాజస్థాన్‌ అసెంబ్లీ స్పీకర్‌ జోషీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినా ఏమీ తేలలేదు. చట్ట సవరణకు సంబంధించి ఆ కమిటీ ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. ఫిరాయింపులపై వేటు విషయంలో సభాధ్యక్షులకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని, అలాకాకుండా రాజకీయ పార్టీల అధినేతలకే అధికారాలు కట్టబెట్టాలంటూ రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 2019లో గోవాలో కాంగ్రెస్‌కున్న పదిహేను మంది ఎమ్మెల్యేల్లో పదిమంది భాజపాలో చేరగా, వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ, ఈ ఏడాది ఫిబ్రవరిలో బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఫిరాయింపుల్ని అడ్డుకోవాలంటే న్యాయపరమైన నిర్ణయాలూ సకాలంలో జరగాల్సి ఉంటుంది. దేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టం పటిష్ఠీకరణపై దృష్టిసారించినట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా తాజాగా శాసనసభల స్పీకర్ల సమావేశం సందర్భంగా స్పష్టం చేశారు. చట్టంలో అవసరమైన సవరణలు చేపట్టేందుకు స్పీకర్లు, రాజ్యాంగ నిపుణులు, న్యాయకోవిదులు, ఇతర భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ప్రయత్నాలు ఏవైనా, చట్టంలో మౌలిక మార్పులు అందుబాటులోకి వస్తేనే రాజకీయ కప్పగంతులకు అడ్డుకట్ట పడుతుంది.

 

- డీఎస్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విరుచుకుపడుతున్న విపత్తులు

‣ సహకార బలిమి... రైతుకు కలిమి!

‣ పశ్చిమాసియాతో బలపడుతున్న బంధం

‣ గర్భ విచ్ఛిత్తి నిర్ణయాధికారం ఆమెదే!

Posted Date: 22-07-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం