• facebook
  • whatsapp
  • telegram

పశ్చిమాసియాతో బలపడుతున్న బంధం

భారత్‌కు ఉపకరించనున్న ఐ2యూ2

కొవిడ్‌ విజృంభణ, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వంటి ఉపద్రవాలతో సరఫరా గొలుసులు విచ్ఛిన్నమై ప్రపంచం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో అంతర్జాతీయ రాజకీయ యవనికపై ‘ఐ2యూ2’ కూటమి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పర్యావరణ మార్పులపై పోరాటంతో పాటు అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వం, ఆహార భద్రత తదితర అంశాల్లో భవిష్యత్‌ కార్యాచరణపై ప్రపంచానికి అది మార్గదర్శనం చేస్తుందన్న ఆకాంక్ష వ్యక్తమవుతోంది. ఉద్రిక్తతలతో అట్టుడికే పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు మెరుగుపడేందుకూ తోడ్పడుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇండియా, ఇజ్రాయెల్‌, అమెరికా, యూఏఈల పేర్లలోని తొలి అక్షరాల కలయికే ‘ఐ2యూ2’. భారత విదేశాంగ విధానాల్లో రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రధాన భూమిక పోషించే అవకాశాలున్నాయి. పశ్చిమాసియాలో చైనా దూకుడుకు ముకుతాడు వేసేందుకు దిల్లీకి ‘ఐ2యూ2’ ఉపకరించే ఆస్కారం ఉంది.

ఇండియాకు మేలు

అమెరికా చొరవతో 2020లో అబ్రహాం ఒప్పందాలు కుదరడాన్ని పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాల్లో కీలక మలుపుగా చెప్పవచ్చు. వాటి ఫలితంగా యూఏఈ, బహ్రెయిన్‌, సూడాన్‌, మొరాకో వంటి అరబ్‌ దేశాలతో ఇజ్రాయెల్‌ దౌత్య సంబంధాలకు బాటలు పడ్డాయి. వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి పరిస్థితులు మెరుగయ్యాయి. ప్రాంతీయంగా బలమైన శక్తులుగా ఉన్న ఇజ్రాయెల్‌, యూఏఈలను అబ్రహాం ఒప్పందాలు ఏకతాటిపైకి తెచ్చాయి. వాటి ఆలంబనగా 2021 అక్టోబరులో ‘ఐ2యూ2’ అవతరించింది. దాన్ని పశ్చిమాసియా ‘క్వాడ్‌’గా అభివర్ణిస్తున్నారు. ఇరాన్‌తో ముప్పు పొంచి ఉండటంతో పలు గల్ఫ్‌ దేశాలు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఏళ్లుగా ఆసక్తి చూపుతున్నాయి. వాషింగ్టన్‌ వాటికి మద్దతుగా మాట్లాడుతున్నా, రక్షణ సహకారంపై రాతపూర్వక హామీలిచ్చిన దాఖలాలు లేవు. అఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాలు అర్ధాంతరంగా వైదొలగడం గల్ఫ్‌ దేశాలకు ఆందోళన కలిగించింది. భవిష్యత్తులో ఇరాన్‌తో సైనిక ఘర్షణ తలెత్తితే తమనూ అలాగే వదిలేస్తారేమోనని అవి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రష్యా, చైనాలతో సన్నిహిత సంబంధాలకు యపశ్చిమాసియాతో బలపడుతున్న బంధం భారత్‌కు ఉపకరించనున్న ‘ఐ2యూ2’త్నిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా చమురు సరఫరాకు ఆటంకం వాటిల్లకుండా ఉత్పత్తిని పెంచాలని వాషింగ్టన్‌ ఇచ్చిన పిలుపును సౌదీతోపాటు యూఏఈ నిరాకరించింది. దాంతో, గల్ఫ్‌ దేశాలతో సంబంధాలను తిరిగి గాడినపెట్టే ప్రయత్నాల్లో భాగంగా బైడెన్‌ సర్కారు ‘ఐ2యూ2’కు ప్రాధాన్యమిస్తోంది. ప్రధానంగా నీరు, ఇంధనం, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం, ఆహార భద్రత రంగాల్లో పరస్పర సహకారం తమ లక్ష్యమని కొత్త కూటమి ఉద్ఘాటించింది.

పశ్చిమాసియాలో 80-90 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఒక్క యూఏఈలోనే వారి సంఖ్య పాతిక లక్షలు. 2017లోనే గల్ఫ్‌ దేశాల నుంచి భారత్‌కు ప్రవాసుల ద్వారా 3,800 కోట్ల డాలర్లు వచ్చాయి. అరబ్‌ దేశాల నుంచి చమురు సరఫరాపై భారత్‌ అధికంగానే ఆధారపడుతోంది. జమ్మూకశ్మీర్‌ విషయంలో అవి పాకిస్థాన్‌ వైపు మొగ్గకుండా నివారించడమూ ఆవశ్యకమే. వాటన్నింటి దృష్ట్యా దశాబ్దాలపాటు అటు అరబ్‌ దేశాలకు, ఇటు ఇజ్రాయెల్‌కు దిల్లీ సమదూరం పాటిస్తూ వచ్చింది. మోదీ సర్కారు వచ్చాక పరిస్థితుల్లో మార్పు కనిపించింది. ఇరుపక్షాలతో భారత్‌ వ్యూహాత్మక సహకార సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. ‘ఐ2యూ2’ కారణంగా పశ్చిమాసియాతో మన బంధం మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. ఇండియాలో 200 కోట్ల డాలర్లతో హైటెక్‌ ఫుడ్‌ పార్కులను ఏర్పాటు చేయడానికి ఇటీవల జరిగిన కూటమి శిఖరాగ్ర సదస్సులో యూఏఈ ముందుకు రావడం స్వాగతించదగిన పరిణామం. ఈ ఆహార పార్కులు భారత వ్యవసాయ రంగానికి సాంకేతికంగా దన్నుగా నిలుస్తాయి. భారత్‌, యూఏఈ మధ్య కొన్నేళ్లుగా చర్చల్లోనే నానుతున్న ఆహార నడవా ప్రాజెక్టుకు ఫుడ్‌ పార్కులతో ఊపు వచ్చే అవకాశం ఉంది.

చైనా దూకుడు

కొత్త కూటమిలో ఇండియా మినహా మిగిలిన సభ్యదేశాలతో ఇరాన్‌కు సత్సంబంధాలు లేవు. అబ్రహాం ఒప్పందాలతో పశ్చిమాసియాలో పరిస్థితులు కొంత మెరుగుపడ్డా, ఇప్పటికీ అక్కడ ఉద్రిక్తతలు చల్లారలేదు. ఇరాన్‌, దాని వ్యతిరేక వర్గంగా పశ్చిమాసియా చీలిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ‘ఐ2యూ2’ను తన వ్యతిరేక కూటమిగా టెహ్రాన్‌ భావించే అవకాశం లేకపోలేదు. దానిపై దిల్లీ చురుగ్గా వ్యవహరించి, ఇరాన్‌ లక్ష్యంగా కొత్త కూటమి అవతరించలేదని ఆ దేశానికి తెలియజెప్పాలి. పశ్చిమాసియాలో తన ప్రాభవాన్ని పెంచుకొనేందుకు చైనా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇజ్రాయెల్‌లో హైఫా ఓడరేవు విస్తరణ పనులను డ్రాగన్‌ చేపట్టింది. మధ్యధరా సముద్రంలో జెరూసలెం ఏకైక నౌకాశ్రయమైన అష్డాడ్‌నూ అదే నిర్మిస్తోంది. 5జీ ప్రాజెక్టు కోసం చైనా సంస్థ హువావై సహాయాన్ని యూఏఈ తీసుకుంది. ఈ పరిస్థితుల్లో డ్రాగన్‌ ప్రాబల్యాన్ని తగిస్తూ, పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు ‘ఐ2యూ2’ను దిల్లీ సమర్థంగా వినియోగించుకోవాలి.

- ఎం.నవీన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గర్భ విచ్ఛిత్తి నిర్ణయాధికారం ఆమెదే!

‣ డ్రాగన్‌తో సఖ్యత సాధ్యమేనా?

‣ పట్టాలు తప్పిన ప్రపంచ ప్రగతి

‣ హక్కుల సాకుతో ‘ఆకస్‌’ అక్కసు!

‣ కొత్తపుంతలు తొక్కుతున్న రోదసి శోధన

Posted Date: 19-07-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం