• facebook
  • whatsapp
  • telegram

కొత్తపుంతలు తొక్కుతున్న రోదసి శోధన

స్వతంత్ర భారతావనిలో సాంకేతిక విప్లవం

 

 

రోదసి విజ్ఞాన ఫలాలను సామాన్యుడికి అందించడంలో భారతదేశం ఎవరికీ తీసిపోదని విక్రమ్‌ సారాభాయ్‌ స్వాతంత్య్రం వచ్చిన తొలి దశాబ్దాల్లోనే ఉద్ఘాటించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్థాపనకు బీజం వేసిన సారాభాయ్‌ రోదసిలో భారతదేశ విజయాలకు నాంది పలికారు. 1969లో ఏర్పాటైన ఇస్రో 1975లో అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి ఉపగ్రహ సాయంతో టెలివిజన్‌ ద్వారా విద్యాబోధన (సైట్‌) కార్యక్రమాన్ని చేపట్టింది. నాసాకు చెందిన ఏటీఎస్‌-5 ఉపగ్రహం నుంచి ప్రసారమయ్యే విద్యా కార్యక్రమాలను అందుకోవడానికి మారుమూల గ్రామాలకు కూడా టెలివిజన్‌ సెట్లను అందించారు. అదే ఏడాది భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్టను భూకక్ష్యలోకి ప్రయోగించారు. ‘సైట్‌’ కార్యక్రమం కింద ఆరు రాష్ట్రాల్లో 2,400 గ్రామాలకు ఏడాదిపాటు ఉపగ్రహం నుంచి టీవీలకు విద్యా కార్యక్రమాలను ప్రసారం చేశారు. సైట్‌ విజయంతో ఇస్రో 1980ల నుంచి సొంతంగా ఇన్శాట్‌ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను తయారుచేసుకోసాగింది. వీటి సాయంతో గ్రామీణ పాఠశాలలకు స్థానిక భాషల్లోనే నిపుణులతో పాఠాలు బోధించగలుగుతున్నారు. సౌర ఘటాలతో పాఠశాల టీవీ సెట్లకు విద్యుత్తు అందిస్తున్నారు. భారతీయ వ్యవసాయ రంగానికి ఉపగ్రహాలు అందించే వాతావరణ సమాచారం కీలకంగా మారింది. భూగర్భ, ఉపరితల నీటి వనరులు, పంట దిగుబడి అంచనా, సీజన్లవారీ నీటి లభ్యత ఇత్యాది అంశాలను నిర్ధారించడానికి ఉపగ్రహాలు తోడ్పడుతున్నాయి. ఇస్రో రూపొందించిన దృష్టి, సృష్టి అనే మొబైల్‌ యాప్‌లు వ్యవసాయ రంగంలో ఎంతగానో అక్కరకొస్తున్నాయి. దేశమంతటా భూతలం మీద, నదీ పరీవాహక ప్రాంతాల్లో సెన్సర్లతో కూడిన స్వయంచాలిత కేంద్రాలను ఇస్రో నెలకొల్పింది. అవి నీటి ప్రవాహం, తేమ, గాలుల వేగం, అవి వీస్తున్న దిక్కు, వర్షపాత వివరాలను గంటకు ఒకసారి సేకరిస్తాయి. ఈ సమాచారాన్ని డిజిటల్‌ రూపంలోకి మార్చి ఉపగ్రహం ద్వారా వాతావరణ శాఖకు ప్రసారం చేస్తారు. వ్యవసాయం, ప్రకృతి ఉత్పాతాల విషయంలో ముందస్తు చర్యలకు ఆ సమాచారం తోడ్పడుతోంది.

 

అడుగడుగునా ప్రయోజనకరం

సౌరశక్తి వల్ల కమ్యూనికేషన్‌ వ్యవస్థలపై పడే ఒత్తిడిని అంచనా వేసి వాటిని కాపాడుకోవడంలో ఉపగ్రహాల నుంచి అందే సమాచారం కీలకపాత్ర పోషిస్తోంది. సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే ఫొటోవోల్టాయిక్‌ ఘటాల క్షేత్రాలను ఏర్పరచడానికి ఉపగ్రహాలు ఉపకరిస్తున్నాయి. అటవీ విస్తీర్ణాన్ని గమనించడం ద్వారా పర్యావరణ రక్షణలో, ఖనిజ వనరుల శోధనలో ఉపగ్రహాలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. పట్టణాలు, నగరాల్లో రోడ్ల నిర్మాణం, జలాశయాల అనుసంధానం, పట్టణాభివృద్ధి ప్రణాళికా రచన వంటి కార్యక్రమాలకు ఇస్రో కార్టోశాట్‌ ఉపగ్రహం అందించే సమాచారం, మ్యాపులు, ఛాయాచిత్రాలు తోడ్పడుతున్నాయి. ఇస్రో ఉపగ్రహాలు పరారుణ, మైక్రోవేవ్‌, ఆప్టికల్‌ బ్యాండ్‌లలో భూఉపరితలాన్ని నిరంతరం పరిశీలిస్తుంటాయి. తుపానులు, వరదలు, కార్చిచ్చులు, కొండ చరియలు విరిగిపడటం, భూకంపాల వంటి ప్రకృతి ఉత్పాతాలను ముందే పసిగట్టడానికి, అవి సంభవించినప్పుడు సహాయక చర్యలు తీసుకోవడానికి సహాయపడుతున్నాయి. హిమాలయాలు, ధ్రువప్రాంతాలు, సముద్రాల్లో మంచు హెచ్చుతగ్గులను ఉపగ్రహాలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. తుపానులు సంభవించినప్పుడు హెలికాప్టర్లు, విమానాలు, నౌకలు బీకన్‌ అనే పరికరాల ద్వారా తమ ఉనికిని సమీప భూకక్ష్యలో తిరిగే ఉపగ్రహాలకు అందజేస్తాయి. తద్వారా వాటి కోసం గాలించి, ఆపద నుంచి రక్షించడం వీలవుతుంది. హిందూ మహాసముద్రంలో ఆపదలో చిక్కుకొన్న నౌకలను రక్షించడంలో జీశాట్‌, ఇన్శాట్‌ ఉపగ్రహాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. దక్షిణాసియాలో నేపాల్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, అఫ్గానిస్థాన్‌, శ్రీలంక, మాల్దీవులకు కమ్యూనికేషన్‌ సేవలు అందించడానికి ఇస్రో ప్రత్యేకంగా జీశాట్‌-7 ఉపగ్రహాన్ని ప్రయోగించింది.

 

సొంత నావిగేషన్‌ వ్యవస్థ

అమెరికా రూపొందించిన జీపీఎస్‌ వ్యవస్థ మీదనే పూర్తిగా ఆధారపడటం మంచిది కాదు. అమెరికన్లు తలచుకుంటే ఎక్కడైనా ఎప్పుడైనా జీపీఎస్‌ సేవలను ఆపివేయగలరు. అందుకే భారతదేశం సొంత ఉపగ్రహ నావిగేషన్‌ వ్యవస్థ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ను రంగంలోకి దింపుతోంది. ఈ వ్యవస్థలో ఏడు ఉపగ్రహాలు కక్ష్యలో తిరుగుతూ భారత భూభాగంలోనే కాదు, దాని చుట్టుపక్కల 1,500 కిలోమీటర్ల పరిధి వరకు విమానాలు, నౌకలు, వాహనాలకు పథనిర్దేశం చేయగలవు. సమీప భూకక్ష్యలో వందలు, వేల ఉపగ్రహాలను ప్రవేశపెట్టి ఇంటి పైకప్పు యాంటెన్నా ద్వారా కమ్యూనికేషన్‌, ఇంటర్నెట్‌ సేవలను అందించడానికి ఎలాన్‌ మస్క్‌ వంటివారు రంగంలోకి దిగారు. ఇస్రో కూడా ఇటువంటి ఉపగ్రహాలను ప్రయోగించడానికి సన్నాహాలు చేసుకొంటోంది. భారతీయ వ్యోమగాములు కక్ష్య నుంచి భూతల కేంద్రంతో దృశ్యశ్రవణ రూపంలో సంభాషించడానికి తోడ్పడే ప్రత్యేక ఐడీఆర్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహ వ్యవస్థను ఇస్రో సమకూర్చుకోనున్నది. ఈ వ్యవస్థ త్వరలో సాకారమయ్యే గగన్‌యాన్‌ కార్యక్రమానికి కీలకమవుతుంది. అంతరిక్ష ఆధారిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఇస్రో భారత పారిశ్రామిక రంగానికి చేయూత ఇస్తోంది. ప్రజలకు అందుబాటు ధరలకే ఆధునిక అంతరిక్ష సేవలను అందించడానికి పునాది వేస్తోంది.

 

జనజీవనంలోకి చొచ్చుకుపోయి...

జనజీవితంలో పలు పార్శ్వాలు ఉపగ్రహాల వల్ల ప్రయోజనం పొందుతున్నాయి. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నగరాల్లోని పెద్ద ఆస్పత్రులతో అనుసంధానించి రోగులకు టెలీ మెడిసిన్‌ సేవలు అందించడానికి ఇస్రో అన్ని రాష్ట్రాల్లో పైలట్‌ ప్రాజెక్టు చేపట్టింది.‣ టీవీ కేంద్రాల్లో విద్యుత్‌ సరఫరా బంద్‌ అయితే ఇళ్లలో ప్రసారాలూ నిలిచిపోతాయి. దీన్ని అధిగమించడానికి డిష్‌ యాంటెన్నాలకు నేరుగా ఉపగ్రహ టీవీ ప్రసారాలను అందిస్తున్నారు. నేటి డిజిటల్‌ విప్లవం వల్ల ఓ మోస్తరు సామర్థ్యం గల ఉపగ్రహం ద్వారా 15-20 ఏళ్లపాటు 350 టీవీ ఛానళ్లను ప్రసారం చేయవచ్చు.

వాన వచ్చినా, పొగమంచు కమ్మేసినా విమానాలు కిందకు దిగడానికి, పైకి ఎగిరి ప్రయాణించడానికి జీపీఎస్‌ ఆధారిత గగన్‌ పథనిర్దేశక (నావిగేషన్‌) సేవలు తోడ్పడుతున్నాయి. ఈ సేవలకు జీశాట్‌ ఉపగ్రహాలే ఆధారం. నిర్మానుష్య ప్రాంతాల్లో రైళ్ల రాకపోకల గురించి హెచ్చరించే పరికరాలను కూడా ఉపగ్రహ సాయంతో పనిచేయిస్తున్నారు.

బ్యాంకునూ ఏటీఎమ్‌నూ ఉపగ్రహం ద్వారా అనుసంధానిస్తారు కాబట్టి వినియోగదారులు ఎక్కడినుంచైనా సరే... బ్యాంకు ఖాతా నుంచి డెబిట్‌ కార్డు ద్వారా నగదు తీసుకోగలుగుతున్నారు. వార్తా పత్రికలు కూడా డిజిటల్‌ రూపంలో దేశదేశాలకు క్షణాల్లో అందుతున్నాయి.

ఇన్శాట్‌ ఉపగ్రహాలు అందుబాటులోకి రావడానికి ముందు పెద్దనగరాలు, పట్టణాల్లో మాత్రమే యూహెచ్‌ఎఫ్‌ బ్యాండ్‌ ద్వారా దూరదర్శన్‌ టీవీ సేవలు అందేవి. ఇప్పుడు టీవీ ప్రసారాలు ఇన్శాట్‌ ఉపగ్రహాల ద్వారా వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన కేంద్రాలకు నేరుగా వస్తున్నాయి.

 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రూపాయి నేలచూపులు

‣ హిమగిరులకు కాలుష్యం కాటు

‣ సాధించాల్సింది కొండంత...

‣ న్యాయవ్యవస్థకు సాంకేతిక హంగులు

Posted Date: 18-07-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం