• facebook
  • whatsapp
  • telegram

హిమగిరులకు కాలుష్యం కాటు

ప్రమాదకరంగా ‘నల్లకర్బన’ ప్రభావం

 

 

శ్వేతవర్ణంలో తళతళ మెరిసే అందమైన హిమాలయాలు క్రమేపీ మసిబారుతున్నాయి. వాటిమీద నల్లటి బూడిద లాంటి పదార్థం (బ్లాక్‌ కార్బన్‌) పేరుకుపోతోంది. ఈ పదార్థం టన్నుల కొద్దీ హిమగిరుల మీద పడుతూ ఉండటంవల్ల మంచుపర్వతాలు నల్లబడటమే కాదు... ఇంతకుముందు కంటే మరింత వేగంగా కరిగిపోతున్నాయి కూడా! బ్లాక్‌ కార్బన్‌ అనేది పీఎం2.5 తరహా కాలుష్య పదార్థం. దీని జీవనకాలం చాలా తక్కువ. వాతావరణంలోకి విడుదలైన తరవాత కొన్ని రోజుల నుంచి వారాలపాటు మాత్రమే ఉంటుంది. ఈ తక్కువ సమయంలోనే వాతావరణం మీద, వ్యవసాయం, మానవ ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీన్ని ఎంత త్వరగా నియంత్రించగలిగితే భూతాపం అంతగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని నియంత్రణతో పంటల దిగుబడి పెరుగుతుందని, అకాల మరణాలు తగ్గుతాయని పలు పరిశోధనల్లో తేలింది. జీవవ్యర్థాలను, ఇళ్ల నుంచి వచ్చే చెత్తను బహిరంగంగా కాల్చడం, పాత డీజిల్‌ వాహనాల వినియోగం వంటివాటివల్ల ఇది ఉత్పత్తి అవుతోందన్నది శాస్త్రవేత్తల మాట. ఇది ఇతర కణాలు, వాయువులతో కలిసి వెలువడుతుంది. హరితవాయు ప్రభావానికీ మూడింట రెండొంతులు ఇదే కారణమని పలు శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. మంచుగడ్డల మీద పేరుకుపోతున్న నల్ల కర్బనం కాంతిని వేగంగా గ్రహించుకుని, పరిసరాల్లో తాపాన్ని పెంచుతుంది. బొగ్గుపులుసు వాయువు కంటే నల్లకర్బనం 460 నుంచి 1500 రెట్లు ఎక్కువగా వాతావరణాన్ని వేడెక్కిస్తుంది. ఈ కాలుష్య కారకం వల్ల హిమాలయాలతో పాటు ఆర్కిటిక్‌ మంచుపర్వతాలు కూడా ముందుకంటే మరింత వేగంగా కరిగిపోతున్నాయి.

 

నల్ల కర్బన ప్రభావం వల్ల హిమాలయ ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులు గణనీయంగా మారిపోతున్నాయి. ప్రపంచబ్యాంకు ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం తీరుతెన్నులు మారిపోవడంతో పాటు... నల్ల కర్బనం వల్ల హిమానీనదాలు, మంచుకొండలు వేగంగా కరిగిపోతున్నాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. హిమాలయాలు, కారకోరమ్‌, హిందూకుష్‌ పర్వతశ్రేణుల మీద పశ్చిమ ప్రాంతంలో ఏడాదికి 0.3 మీటర్ల మందాన మంచు కరుగుతోంది. తూర్పున ఏటా ఒక మీటరు మందంతో ఉన్న మంచు నీరుగా మారుతోందని నివేదిక వెల్లడించింది. సింధూనదీ పరీవాహక ప్రాంతంలో సుమారు 23.5 కోట్ల మంది నివసిస్తున్నారు. ఈ సంఖ్య 2050 నాటికి 50శాతం హెచ్చుతుందని, ఆ ప్రాంత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) అప్పటికి ఎనిమిది రెట్లు పెరుగుతుందని ప్రపంచబ్యాంకు నిపుణుల అంచనా. పెరుగుతున్న జనాభాకు, మానవ కార్యకలాపాలకు అనుగుణంగా ఇక్కడ మంచినీటి వనరులకు గణనీయంగా గిరాకీ ఎగబాకుతుంది. కానీ, శరవేగంగా కరుగుతున్న మంచుపర్వతాలు సింధూనదీ పరీవాహక ప్రాంతానికి తగినంతగా తాగునీరు ఇవ్వలేవని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్బన కాలుష్యం అక్కడి పర్యాటకంపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. హిమాలయాల ప్రాంతంలో నివసించేవారికి పర్యాటకమే ప్రధాన జీవనాధారం. కాలుష్యం పెచ్చరిల్లడంతో తమ జీవనోపాధి దెబ్బ తింటుందని వారు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు దేశార్థికానికీ ఇది నష్టదాయకమే.

 

హిమాచల్‌ప్రదేశ్‌లోని పార్వతి గ్లేసియర్‌ ప్రాంతంలో పర్వత శిఖరాగ్రాలపైన ఘనపు మీటరు ప్రాంతానికి 0.34 మైక్రోగ్రాముల నుంచి 0.56 మైక్రోగ్రాముల మేర నల్ల కర్బనం పేరుకుపోతోందని రెండేళ్ల క్రితమే ‘జీబీ పంత్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ సంస్థ హెచ్చరించింది. అదే పర్వతాల అడుగు భాగాన కాలుష్యం తీవ్రంగా ఉంది. పార్వతి, హమ్టా, బియాస్‌ కుండ్‌ హిమానీనదాల ప్రాంతంలో వరసగా నల్ల కర్బనం గాఢత ఘనపు మీటరుకు 796, 416, 431 మైక్రోగ్రాములుగా ఉంది! భారత్‌, చైనాల నుంచే ఎక్కువగా నల్ల కర్బన ఉద్గారాలు ఉంటున్నాయన్నది పరిశోధకుల మాట. ఈ కాలుష్యం బారి నుంచి బయటపడాలంటే ప్రభుత్వాలు ఇంధన వినియోగం విషయంలో మార్పులు చేసుకోవాలి. జీవవ్యర్థాల దహనానికీ నిర్దిష్ట నిబంధనలు విధించి, అమలు చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. లేనిపక్షంలో కోట్లాది ప్రజలకు ప్రాణాధారమైన మంచినీటిని అందిస్తున్న హిమాలయాల్లో భవిష్యత్తులో మంచు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది.

 

- రఘురాం
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సాధించాల్సింది కొండంత...

‣ న్యాయవ్యవస్థకు సాంకేతిక హంగులు

‣ సుబాబుల్‌ రైతుల కష్టాల సాగు

‣ నదీ తీరాల పరిరక్షణపై నిర్లక్ష్యం

‣ భారత్‌తో సంబంధాలు... జాన్సన్‌ ముద్ర

‣ విపత్తులతో ప్రపంచం విలవిల

Posted Date: 16-07-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం