• facebook
  • whatsapp
  • telegram

నదీ తీరాల పరిరక్షణపై నిర్లక్ష్యం

ఏటా తప్పని విపరిణామాలు

 

 

భూవాతావరణంలో జరిగే పెనుమార్పులు జలావరణాన్నీ ప్రభావితం చేస్తున్నాయి. పర్యావరణానికి ప్రతిబంధకమైన అలాంటి అసహజ పరిణామాలవల్లే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విపత్తులు చోటుచేసుకుంటున్నాయి. భారత్‌లో ప్రస్తుతం ముంబయి, అస్సామ్‌లలో వరదలు, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో విరిగిపడుతున్న కొండచరియలు, రుతుపవనాలువచ్చినా నిండని జలాశయాలు... ఇవన్నీ ఆ విపరిణామాల సంకేతాలేనని నిపుణులు అంటున్నారు. ఈ ఉపద్రవాలను నియంత్రించేందుకు ఆయా నదుల పరీవాహక ప్రాంతాల్లో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉంది. 21వ శతాబ్దపు అత్యంత క్లిష్టమైన సవాళ్లలో నదీ పరీవాహక ప్రాంతాల పునరుద్ధరణ ఒకటని గుర్తించినా ప్రభుత్వాలు అవసరమైన చర్యలకు పూనుకోవడం లేదు. అనాదిగా నదీ ప్రవాహాలకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం, నదీ తీర ప్రాంతాల్లో పెచ్చుమీరిన మానవ కార్యకలాపాలు సైతం ఇందుకు ప్రధాన ప్రతిబంధకాలుగా మారాయి.

 

అనర్థాలెన్నో...

పరీవాహక ప్రాంతాల్లో వస్తున్న మార్పుల వల్ల కొన్నేళ్లుగా భూఉపరితల ప్రవాహాలు బలహీనపడుతున్నాయి. నీటిని నిల్వ చేసేందుకు భారీ జలాశయాలను నిర్మించినా- నదులకు సహజ ప్రవాహాలు తగ్గిపోవడం, డ్యామ్‌ల నిర్వహణ లోపభూయిష్ఠంగా ఉండటంవంటి కారణాలతో నీరు త్వరగా అడుగంటుతోంది. అడవుల క్షయీకరణవల్ల భూగర్భ జల మట్టాలు తగ్గడం కూడా జలాశయాల్లోని నీరు వేగంగా తరిగిపోయేందుకు కారణమని నిపుణుల అంచనా. ఇసుక తవ్వకాల వల్ల కృష్ణా బేసిన్‌లోని రిజర్వాయర్ల నీటి మట్టం గణనీయంగా తగ్గింది. గతంలో పుష్కలంగా సాగునీటిని అందించిన కృష్ణానది- ఇటీవలి కాలంలో ఒక్క కారుకూ పూర్తి   ఆయకట్టును తడపలేకపోతోంది. ఇండోర్‌లోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ శాస్త్రవేత్తల బృందం దేశంలో 55 పరీవాహక ప్రాంతాలను అధ్యయనం చేసి, వరద ప్రవాహ ప్రాంతాల్లో సహజ అడవులు తగ్గడమే ప్రకృతి విపత్తులకు కారణమని తేల్చింది. కృష్ణా బేసిన్‌లోని కర్ణాటకలో 2015 నుంచి 2021 మధ్య 1,355.26 హెక్టార్లలో అడవులు మాయమయ్యాయి. నాలుగు దశాబ్దాల కాలంలో గోదావరి బేసిన్‌లో బంజరు భూమి 50శాతం తగ్గింది. అటవీ భూవిస్తీర్ణం 23.1శాతం నుంచి 15శాతానికి పడిపోయింది. ఆ స్థానంలో నర్సరీల్లో పెంచిన మొక్కలతో కృత్రిమ అడవులను అభివృద్ధి చేసినా- అవి వరద వేగాన్ని కట్టడి చేయలేకపోతున్నాయి. పెద్దయెత్తున అడవులను కోల్పోయిన కావేరీ బేసిన్‌ 40శాతం వరదను నష్టపోయింది. ఈ ప్రాంతాలు ఎక్కువగా కాఫీ తోటలయ్యాయి. కృత్రిమ అడవులు, కాఫీ తోటలు- నీరు నిల్వ ఉండేందుకు, మట్టిని పట్టి ఉంచేందుకు పూర్తిస్థాయిలో ఉపయోగపడవు. ఈ కారణాలతో ఈ బేసిన్‌లో 70శాతం నేల కోతకు గురైంది. గోదావరి పరీవాహకంలోనూ పల్లపు భూ విస్తీర్ణం 11.9శాతం నుంచి 58శాతానికి పెరిగింది. వ్యవసాయ భూమి 6.5శాతం నుంచి 16.1శాతానికి పెరిగినట్లు ‘ఇంటర్నేషనల్‌ వాటర్‌ అసోసియేషన్‌’ వెల్లడించింది. దేశంలోని 22 నదీప్రాంతాల్లో 16 చోట్ల నేలలో నీటిని పట్టి ఉంచే గుణం చాలా తక్కువగా ఉన్నట్లు ‘సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌’ హెచ్చరించింది.  

 

కుంచించుకుపోతున్న ప్రవాహమార్గం

పట్టణీకరణ, పారిశ్రామికీకరణ పరీవాహక ప్రాంతాలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. నదీప్రాంత అభివృద్ధి పథకాలను చేపడుతున్నా ప్రయోజనం ఉండటంలేదు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఆ పనుల వల్ల ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గోమతి నదిలోకి వచ్చే సహజ ప్రవాహాలు చాలావరకు దెబ్బతిన్నాయి. సగటున 285 మీటర్ల వెడల్పుతో ప్రవహించే గోమతిని 100-130 మీటర్లకే పరిమితం చేస్తూ కాంక్రీటు గోడలు కట్టేశారు. అహ్మదాబాద్‌లో సబర్మతి నది రెండువైపులా ఏకంగా 10   కి.మీ. పొడవునా కాంక్రీటు కట్ట కట్టారు. గోదావరి ప్రాంత అభివృద్ధి పేరిట నాందేడ్‌లో, మూసీపై హైదరాబాద్‌లో కాంక్రీటు కట్టలు కట్టి- నదులను కాల్వల్లా మారుస్తున్నారు. ఇది వరద నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి పనుల్లో భాగంగా చెబుతున్నారు. కానీ, ఇదంతా నదీగర్భాన్ని కూడా ఆర్థిక వనరుగా మార్చుకునే యత్నమేనని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ‘గంగ’ విషయంలో డాల్ఫిన్‌లు తిరుగాడే చోట కనీసం వరద అంచనా వేయకుండా నిర్మాణాలు చేశారు. పైగా ఈ కట్టపై కాలిబాటలు, పార్కులు నిర్మించి విదేశాల్లో మాదిరి సుందరీకరణ కార్యక్రమాలు చేశామంటూ నేతలు ప్రచారాలు చేసుకోవడం దురదృష్టకరం. పరీవాహక ప్రాంతాల్లో మానవ ఆధిపత్యాన్ని, అసహజ పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసినప్పుడే- పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు వీలవుతుంది. శ్రీశైలం వంటి జలాశయాలను ఇంకా కొన్నేళ్లు ఉపయోగించుకోవాలంటే సరిగ్గా పర్యవేక్షించగలిగే బృందాలను నియమించాలి. వరద వేగాన్ని నియంత్రించి భూమిని జలసంపన్నం చేసేలా సహజ అడవులను రక్షించాలి. వాగులు మూసుకుపోకుండా చూడటంలో స్వచ్ఛంద సంస్థలు బాధ్యత తీసుకోవాలి. నీటి ప్రవాహాలను అడ్డుకోగలిగే మొక్కల పెంపకంపై దృష్టి పెట్టాలి. నదీ తీర అడవుల్ని రక్షించేందుకు ప్రత్యేక చట్టాలు తేవాలి. తపతి ప్రవాహాలు కాపాడేందుకు సాత్పూరా శ్రేణిలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ఇప్పటికే చర్యలు చేపట్టాయి. కర్ణాటక కూడా ‘నీటి కోసం అడవులు’ అనే కార్యక్రమాన్ని చేపట్టి నదుల ఒడ్డున అడవుల రక్షణ, కొత్తగా మొక్కల పెంపకం చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తితో ఈ ప్రయత్నం సాగితేనే జీవనదులు కళకళలాడుతాయి.

 

వనరుల  దోపిడి

ఇసుక, గనుల తవ్వకాలతో నదుల పరీవాహక ప్రాంతాలు కుంచించుకుపోతున్నాయి.

కర్ణాటకలో పెద్ద సంఖ్యలో ఉన్న ఇనుప ఖనిజం గనులు అడవులను తీవ్రస్థాయిలో దెబ్బతీశాయి. బళ్లారి జిల్లాలో 10,598 హెక్టార్ల పరిధిలో పలు గనులు విస్తరించి ఉన్నాయి. ఈ జిల్లా ఉపగ్రహ చిత్రాలు చూస్తే అటవీ భూమి ఉండాల్సిన చాలా ప్రాంతాల్లో భారీ మైనింగ్‌ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. వేల హెక్టార్లలో అనధికారిక గనుల తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ విధ్వంసాన్ని కర్ణాటక లోకాయుక్త గుర్తించి, హెచ్చరించినా- కట్టడి చేసే ప్రయత్నాలే జరగలేదు. ఫలితంగా తుంగభద్రలో చేరే చిన్నచిన్న వాగులూ కనుమరుగయ్యాయి.

హిమాలయ నదుల పరీవాహకాలమీదా గనుల తవ్వకాల దుష్ప్రభావం అధికంగా ఉంది. ఉత్తరాఖండ్‌లో 2021లో వరదలు సంభవించడానికి కారణం అక్కడి గౌలా నది (గంగా ఉపనది) పరిసరాల్లో, నదీగర్భంలో తవ్వకాలేనని ఆ రాష్ట్ర విపత్తు స్పందన దళం గుర్తించింది.

2016 నాటికి గంగానదిలో ఇసుక చాలావరకు హరించుకుపోయింది. నీరు లేకపోవడంతో బిహార్‌లో నదీగర్భం మీదుగా రాకపోకలు సాగాయి. ఆ తరవాత రికార్డు స్థాయి వరద గ్రామాలను ముంచెత్తింది.

పరీవాహక ప్రాంతం ధ్వంసం కారణంగా ‘నర్మద’లో కలిసే 60 సహజ ప్రవాహాలు ఇప్పుడు ఉనికిలో లేవు.

 

- బండపల్లి స్టాలిన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భారత్‌తో సంబంధాలు... జాన్సన్‌ ముద్ర

‣ విపత్తులతో ప్రపంచం విలవిల

‣ సమాన హక్కులే ప్రజాబలం

‣ బడుగులపై ఆగని అకృత్యాలు

‣ టెక్‌ కంపెనీల కట్టడికి అడుగులు

‣ లొసుగులమయం... జీఎస్టీ విధానం!

Posted Date: 16-07-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం