• facebook
  • whatsapp
  • telegram

బడుగులపై ఆగని అకృత్యాలు

వేధింపుల నిరోధక చట్టం అమలులో అడ్డంకులు

 

 

పాలకులు అసమానతలను రూపుమాపి, సమసమాజం వైపు దేశాన్ని నడిపించాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఆకాంక్షించారు. దేశ జనాభాలో దాదాపు 17శాతంగా ఉన్న దళితుల భద్రత, సంరక్షణకు ఆయా ప్రభుత్వాలు చట్టాలను చేస్తూ వస్తున్నాయి. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరిట 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను నిర్వహించుకుంటున్న వేళ దేశంలో ఎస్‌సీ, ఎస్‌టీలపై పెరుగుతున్న దాడులపై కేంద్ర హోంశాఖ ఇటీవల ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్‌సీ, ఎస్‌టీలపై వేధింపుల కేసుల విచారణను వేగవంతం చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ఆ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి పలు మార్గదర్శకాలను సైతం అందించింది.

 

రాజీవ్‌ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో రూపొందించిన ఎస్‌సీ, ఎస్‌టీ వేధింపుల (అట్రాసిటీ) నిరోధక చట్టానికి కాలానుగుణంగా సవరణలు చేశారు. అయితే, ఆ చట్టం కింద ఫిర్యాదుల దాఖలు మొదలు సరైన న్యాయం దక్కేదాకా బాధితులు చాలా అడ్డంకులు ఎదుర్కొంటున్నారని సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే వ్యాఖ్యానించింది. దేశీయంగా ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో దళితులపై అధికంగా అకృత్యాలు, దాడులు జరుగుతున్నట్లు జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) 2020 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే కాలానికి దేశంలో ఎస్‌సీలపై జరిగిన నేరాల్లో ఏపీ వాటా 4.5శాతం, తెలంగాణ వాటా 3.7శాతం. ఎస్‌టీలపై అత్యధికంగా దాడులు జరిగిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ సైతం ఉంది. దేశవ్యాప్తంగా 2019తో పోలిస్తే 2020లో ఎస్‌సీలపై 9.4శాతం, ఎస్‌టీలపై 9.3శాతం చొప్పున అకృత్యాలు పెరిగాయి. భారత్‌లో 2019లో ఎస్‌సీలపై దాదాపు 46వేల నేరాలు వెలుగు చూశాయి. 2020లో వాటి సంఖ్య 50 వేలు దాటింది. 2019లో ఎస్‌టీలపై ఏడున్నర వేలకు పైగా అకృత్యాలు నమోదయ్యాయి. మరుసటి ఏడాది అవి ఎనిమిది వేలకు పైగా ఎగబాకాయి. మరోవైపు భారత్‌లో దళితులపై అకృత్యాలు, వేధింపులు పెరుగుతున్నా కేసుల నమోదు మాత్రం తగ్గుతోంది. 2014 నుంచి 2016 దాకా నేరాల సంఖ్య ఇతోధికమైనా, ఛార్జిషీట్లు 92శాతం నుంచి 78శాతానికి పడిపోయాయి. పోలీసు స్థాయిలో పెండింగ్‌ కేసులు ఏటా 10శాతం పెరుగుతూ వస్తున్నాయి. పోలీసు శాఖలో వేధిస్తున్న సిబ్బంది కొరత, పని ఒత్తిడి వంటి కారణాలతో కేసుల విచారణ వేగంగా సాగడంలేదు. అట్రాసిటీ కేసుల విషయంలో ఖాకీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జాతీయ ఎస్‌సీ కమిషన్‌ గతంలో దుయ్యబట్టింది.

 

న్యాయస్థానాలు, లేదా సమాజంలోని పెద్దల జోక్యం లేనిదే అట్రాసిటీ కేసులు నమోదు చేయలేని పరిస్థితులు ప్రస్తుతం దేశీయంగా నెలకొన్నాయి. అగ్ర వర్ణాల నుంచి ప్రతిదాడులు ఉంటాయన్న భయం, చట్టంపై అవగాహన లేమి, పోలీసుల నిర్లక్ష్యం వంటి కారణాలతో చాలా కేసులు నీరుగారిపోతున్నాయి. దానికి అడ్డుకట్ట పడాలంటే రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అత్యున్నత స్థాయి విజిలెన్స్‌ కమిటీ సమావేశాలు ఏటా కనీసం రెండుసార్లు జరగాలి. వాటిని సరిగ్గా నిర్వహించకపోవడంవల్ల బాధితులకు పరిహారం మంజూరులోనూ ఆలస్యమవుతోంది. రాజస్థాన్‌లో పరిహారం చెల్లింపులకు అక్కడి సాంఘిక సంక్షేమ శాఖ ఆన్‌లైన్‌ పోర్టల్‌ను రూపొందించింది. మిగిలిన రాష్ట్రాలూ ఆ విధానాన్ని అందిపుచ్చుకోవాలి. ఎస్‌సీ, ఎస్‌టీలపై అకృత్యాల నిరోధక చట్టం కింద గరిష్ఠంగా రెండు నెలల్లో కేసులను పరిష్కరించే విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి. ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అట్రాసిటీ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలను కొలువుతీర్చారు. ఆ కేసుల విషయంలో అధికార యంత్రాంగానికి సరైన అవగాహన కల్పించాల్సిన అవసరమూ ఉంది. ముఖ్యంగా ఎఫ్‌ఐఆర్‌ల నమోదు పకడ్బందీగా లేకపోతే బాధితులకు సరైన న్యాయం దక్కదు. కోర్టు ఆదేశాల మేరకు నమోదయ్యే కేసులపై ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి. ఎస్‌సీ, ఎస్‌టీలపై వేధింపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వాలు వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సూచించింది. పాలకులు, అధికారులు చిత్తశుద్ధితో ముందడుగు వేస్తేనే బాధితులకు సత్వర న్యాయం దక్కుతుంది. అలాగే దళితులపై అకృత్యాల నివారణ సాధ్యమవుతుంది.

 

- కె.శ్రీనివాసరావు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ టెక్‌ కంపెనీల కట్టడికి అడుగులు

‣ లొసుగులమయం... జీఎస్టీ విధానం!

‣ ఇంటిపోరుతో సతమతమవుతున్న ఇజ్రాయెల్‌

‣ గదిలోపల పొంచిఉన్న ముప్పు

‣ మరో ప్రచ్ఛన్న యుద్ధానికి నాంది

‣ అప్పుల కుప్పతో లంక తిప్పలు

Posted Date: 08-07-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం