• facebook
  • whatsapp
  • telegram

అప్పుల కుప్పతో లంక తిప్పలు

భారత్‌ ఆపన్న హస్తం

స్వాతంత్య్రం వచ్చిన 74 ఏళ్లకు శ్రీలంక కనీవినీ ఎరగని సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశాలకు చెల్లించాల్సిన 5,100 కోట్ల డాలర్ల అప్పుల కిస్తీలను కట్టలేమని ఈ ఏప్రిల్‌లో శ్రీలంక కేంద్ర బ్యాంకు గవర్నర్‌ చేతులెత్తేశారు. తరవాత గతంలో విడుదల చేసిన రెండు అంతర్జాతీయ బాండ్లకూ చెల్లింపులు జరపలేనని శ్రీలంక ప్రకటించింది. దాంతో లంక అంతర్జాతీయ రుణ రేటింగ్‌ పడిపోయింది. నేడు శ్రీలంకలో పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌లకు తీవ్ర కొరత ఏర్పడింది. ఆరోగ్య సేవలు, పోలీసుల వంటి అత్యవసర సర్వీసులకు తప్ప మిగిలిన వారికి ఇంధన విక్రయాలను ప్రభుత్వం నిలిపివేసింది. జులై 22న కానీ ఇంధన విక్రయాలను పునరుద్ధరించలేమని ప్రభుత్వ రంగంలోని సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ప్రకటించింది. అయినా, ఎప్పుడో ఒకప్పుడు ఎంతోకొంత చమురు రాకపోతుందా అనే ఆశతో జనం పెట్రోలు బంకుల ముందు బారులు తీరి గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.

తీవ్ర సంక్షోభం

శ్రీలంకలో 2019తో పోలిస్తే ప్రస్తుతం ఇంధన ధరలు మూడు రెట్లు పెరిగాయి. ఆహార సరఫరా పూర్తిగా విచ్ఛిన్నమైంది. ప్రజల అవసరాలకు సరిపడినంత ఆహారం అక్కడ అందుబాటులో లేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్న లేదా విదేశాలు ఉచితంగా ఇచ్చిన ఆహార ధాన్యాలే లంకకు శరణ్యమవుతున్నాయి. 2022 ఆరంభంలో రూ.60 ఉన్న రొట్టె ధర ఇప్పుడు రూ.160కి చేరింది. ఇంధనం, ఆహార కొరతవల్ల నేడు ప్రపంచంలో అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైన దేశాల్లో శ్రీలంక రెండో స్థానంలో నిలుస్తోంది. మందుల కొరతా తీవ్రంగా ఉండటంతో లంకలో ఆరోగ్యపరమైన ఎమర్జన్సీ ఏర్పడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. శ్రీలంక ప్రజలు ప్రభుత్వ రవాణా సేవలపైనే అధికంగా ఆధారపడతారు. నేడు రైలు, బస్సు సర్వీసులు స్తంభించిపోయాయి. ఇంధనం లేక ప్రభుత్వోద్యోగులు సైతం ఇళ్ల నుంచే విధులు నిర్వర్తించాలని సూచించారు. సిబ్బంది కొరత వల్ల చాలా ప్రభుత్వ కార్యాలయాలు వారానికి రెండు మూడు రోజులే పనిచేస్తున్నాయి.

గతంలో డాలరుతో శ్రీలంక రూపాయి మారకం విలువ పడిపోయినా, కేంద్ర బ్యాంకు గవర్నర్‌ ఆ విలువను రూ.200గా నిర్ణయించారు. దాన్ని నిలబెట్టడానికి దాదాపు 500 కోట్ల డాలర్ల విదేశీ కరెన్సీని ఖర్చు చేశారు. దాంతో విదేశీ కరెన్సీ లావాదేవీలు నల్లబజారుకు మారిపోయాయి. ప్రవాస శ్రీలంక పౌరులు ఇళ్లకు డబ్బు పంపడానికి హవాలా మార్గాన్ని ఎంచుకొన్నారు. ఏతావతా లంక ఖజానాలోని విదేశీ ద్రవ్యమంతా హరించుకుపోయింది. మరోవైపు దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స రసాయన ఎరువులు, క్రిమినాశనుల దిగుమతులను నిలిపివేసి రైతులంతా సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టాలని గతంలో ఆదేశించారు. ఫలితంగా దిగుబడులు పడిపోయి ఆహార ధాన్యాలు, పండ్లు కూరగాయలకు విపరీతమైన కొరత ఏర్పడింది. గొటబాయ మాజీ సైన్యాధికారి. ఆయన ప్రభుత్వంలో కుటుంబ సభ్యులు, మాజీ సైన్యాధికారులు, అవినీతిపరులైన అధికారులదే పెత్తనం. కొవిడ్‌ కాలంలో టీకాల కొనుగోలులో అవినీతి జరిగిందని పత్రికలు ఎలుగెత్తినా, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. గొటబాయ మాజీ అమెరికన్‌ పౌరుడు. మాజీ ఆర్థిక మంత్రి బసిల్‌ రాజపక్సకు ద్వంద్వ పౌరసత్వం ఉంది. ఆయన శ్రీలంక పౌరుడేకానీ, అమెరికన్‌ జాతీయురాలిని పెళ్ళాడారు. మాజీ ప్రధానమంత్రి మహింద రాజపక్స చైనాతో సన్నిహితంగా మెలిగారు. ప్రస్తుత ప్రధానమంత్రి రణిల్‌ అమెరికాకు సన్నిహితుడు. దక్షిణాసియాలో శ్రీలంకతోపాటు అఫ్గానిస్థాన్‌ తీవ్ర సంక్షోభంలో ఉంది. పాకిస్థాన్‌, నేపాల్‌ సైతం రేపోమాపో అదేదారి పట్టబోతున్నాయి. దక్షిణాసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌పైనా ఈ సంక్షోభాల ప్రభావం పడక మానదు.

పెట్టుబడులు అవసరం

గతంలో చైనా దగ్గర భారీగా అప్పులు తీసుకొని రుణ ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక- ఇప్పుడు అమెరికా గుప్పిట్లోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది. వాషింగ్టన్‌ ఇటీవల ప్రకటించిన మిలీనియం ఛాలెంజ్‌ కార్పొరేషన్‌ (ఎంసీసీ) దానికి ఒక సంకేతం. ట్రింకోమలీ నుంచి మన్నార్‌దాకా విస్తరించిన భూములపై అమెరికన్ల కన్ను పడింది. వాటిలో అమూల్యమైన సహజ వనరులు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఎంసీసీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన గొటబాయ- ప్రస్తుతం శ్రీలంకను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఎంసీసీని ఆశ్రయించే అవకాశం ఉంది. ఇలా అమెరికా, చైనాల కుమ్ములాటలో శ్రీలంక బలయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇండియా ఇప్పటికే లంకకు ఆహారం, మందులు, ఇంధనం సరఫరా చేసి ఆదుకుంది. లంక వాసులకు, భారతీయులకు చారిత్రకంగా, సాంస్కృతికంగా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇండియా కేవలం సహాయం అందించి సరిపెట్టుకోకుండా లంకలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. తద్వారా పూర్తిగా అమెరికా, చైనాలపైనే ఆధారపడాల్సిన అగత్యాన్ని లంకకు తప్పించాలి. భారతీయ కంపెనీలు, వ్యాపారులు లంకలో పెట్టుబడులు పెడితే ఉభయులకూ శ్రేయోదాయకమవుతుంది.

- పియల్‌ దర్శన గురుగె 

(న్యాయవాది, శ్రీలంకలో సామాజిక కార్యకర్త)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కష్టకాలంలో ఆదుకోని పంటల బీమా

‣ సోనియా కుటుంబానికే పాదాక్రాంతం

‣ వసుధైక కుటుంబానికి అసలైన ఆలంబన

‣ కశ్మీర్‌పై అల్‌ఖైదా దుష్టనేత్రం

‣ ఆర్థిక పురోగమనానికి బ్రిక్స్‌ భరోసా

‣ వరదల బీభత్సం... జనజీవనం అస్తవ్యస్తం!

‣ అఫ్గాన్‌కు భారత్‌ ఆపన్నహస్తం

‣ 5జీ రాకకు వేళాయె...

Posted Date: 08-07-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం