• facebook
  • whatsapp
  • telegram

వరదల బీభత్సం... జనజీవనం అస్తవ్యస్తం!

పర్యావరణ పరిరక్షణతోనే నష్ట నియంత్రణ సాధ్యం

ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంతోనే వరద పోటెత్తి అస్సాం భీతావహ దుస్థితిని చవిచూసింది. చైనా, బంగ్లాదేశ్‌లకు వరదలు తీవ్రస్థాయిలో ఆస్తి, ప్రాణనష్టం కలిగించాయి. వేలమంది నిరాశ్రయులయ్యారు. అస్సామ్‌లో బ్రహ్మపుత్ర, బరాక్‌ నదుల ఉద్ధృతి మూలంగా కొండ చరియలు విరిగిపడి వందమందికిపైగానే మృత్యువాత పడ్డారు. అక్కడ 35 జిల్లాల్లో 30 జిల్లాలను వరదలు ముంచెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మూడు లక్షల మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారు. మూడు లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. బంగ్లాదేశ్‌ సిల్హెట్‌, సునామ్‌గంజ్‌ ప్రాంతాల్లో వరద తాకిడికి పలువురు మృతి చెందగా, కోటి మంది తమ నివాసాల్లోకి నీరు చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దక్షిణ చైనాలో తలెత్తిన వరదలు షెన్‌ జెన్‌ ప్రాంతానికి తీవ్ర నష్టం కలిగించాయి. విపత్తులను పూర్తిస్థాయిలో ఎదుర్కోవడం సాధ్యం కాకపోయినా, ముందుజాగ్రత్త చర్యల ద్వారా ప్రమాద, నష్ట నివారణను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. పర్యావరణ వ్యవస్థలను సంరక్షించుకోవడంతో పాటు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావడం, సమర్థమైన అత్యవసర సేవల ద్వారా ప్రకృతి విపత్తుల నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంది.

ప్రణాళికల రూపకల్పనలో జాప్యం

విచ్చలవిడిగా సాగుతున్న అడవుల విధ్వంసం, సున్నితమైన ప్రకృతి వ్యవస్థలకు కలిగిస్తున్న హాని, వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు- తుపానులు, వరదల రూపంలో ముంచెత్తుతున్నాయి. భారత్‌లో ఏటా మూడుకోట్ల మంది వరకు వరదల బారిన పడుతున్నారని అంచనా. విపత్తులను ముందే పసిగట్టి నష్టప్రభావాన్ని కట్టడి చేసేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. అయినా తుపానులు, వరదలతో ఏర్పడే నష్టతీవ్రతను తగ్గించే చర్యలు ఆశాజనకంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. విచక్షణారహితంగా సాగుతున్న ఇసుక తవ్వకాలు నదుల సహజ ప్రవాహ గమనాన్ని దెబ్బతీస్తున్నాయి. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో దశాబ్దాల నాటి డ్రైనేజీ వ్యవస్థలు ఇప్పటికీ మెరుగుపడకపోవడంతో వరద నీరు ప్రజాజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. సాగు, విద్యుత్‌ అవసరాల పేరుతో నదీ ప్రవాహాలకు అడ్డుగా నిర్మిస్తున్న భారీ జలాశయాలవల్ల ఊహించని వరద తాకిడి పెరిగింది. పర్వత ప్రాంతాల్లోని పర్యావరణ వ్యవస్థలకు జరుగుతున్న విపరీత నష్టం కారణంగానూ వరదల ముప్పు పెరుగుతున్నట్లు అనేక అధ్యయనాలు చాటుతున్నాయి. వరదలు, తుపానులతో పాటు భూకంపాలు, కార్చిచ్చుల వంటి విపత్తులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థంగా ఎదుర్కొనేందుకు విపత్తుల యాజమాన్య చట్టం-2005 తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం సమగ్ర ప్రణాళికను రూపొందించడానికి కొన్నేళ్లు పట్టింది. 2019లో ఆమోదించిన ప్రణాళికను కేంద్ర, రాష్ట్రాలు సమగ్రంగా కార్యాచరణలోకి తీసుకురావడంలో కాలయాపన చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ చట్టం మేరకు విపత్తులను ఎదుర్కొనేందుకు 2021-22లో కేంద్ర ప్రభుత్వం తన వాటాను రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో విడుదల చేయలేదు. ఏటా వరదల తాకిడి ఎక్కువగా ఉండే అస్సామ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, కేరళ సహా 17 రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేయనేలేదు. చట్టప్రకారం విధిగా విడుదల చేయాల్సిన నిధుల వాటాను ముందస్తుగా ఇవ్వకుండా విపత్తులు ఏర్పడ్డాక విడుదల చేస్తున్నారు. మరోపక్క విపత్తులకు కారణమయ్యే వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించుకునేందుకు క్షేత్రస్థాయి నుంచి ప్రణాళికల అవసరం ఉన్నా, వాటి రూపకల్పనలో విపరీత జాప్యం చోటుచేసుకుంటోంది.

స్థానికుల భాగస్వామ్యం ముఖ్యం

వరదలు, తుపానుల వంటి విపత్తుల సమయంలో సర్వం కోల్పోయిన బాధితులకు తాత్కాలిక సాయం తప్ప, పునరావాస కల్పనలో న్యాయం అందడం లేదు. వరదల విపత్తును ఎదుర్కోవడానికి అస్సామ్‌లో తీసుకోవాల్సిన విధానపరమైన చర్యల విషయంలో గతేడాది ఆగస్టులోనే పార్లమెంటరీ స్థాయీసంఘం కీలక సిఫార్సులు చేసింది. నదీ పరివాహక ప్రాంతాల్లో రక్షణ కట్టలను ఏర్పాటు చేయాలని, నదుల గమనం గతి తప్పకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని సూచించింది. అస్సామ్‌లో వరద నియంత్రణ కోసం బ్రహ్మపుత్ర నది వెంబడి నిర్మించిన రక్షిత నిర్మాణాల్లో అధిక శాతం 50 ఏళ్ల క్రితం నాటివే. ఈశాన్య రాష్ట్రాల్లో నదీ పరీవాహక ప్రాంతాల ఎగువన అధిక సంఖ్యలో సైరన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జాతీయ విపత్తు సహాయక నిధుల కేటాయింపులో నదుల కోత నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వరదల సమయంలో చర్యలు చేపట్టే బ్రహ్మపుత్ర బోర్డులో సరిపడా సిబ్బంది లేకపోవడం విచారకరం. ఈశాన్య రాష్ట్రాలతో పాటు తూర్పు, పశ్చిమ కనుమలు, హిమాలయ ప్రాంతాల్లో వరదలు తలెత్తకుండా డ్యామ్‌లు, జల విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు, ఖనిజ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంలో నియంత్రణ పాటించాలి. పర్యావరణ, సామాజిక నష్ట ప్రభావాల అంచనా, నష్ట భర్తీ సమగ్రంగా చేపట్టాలి. భవిష్యత్‌ ప్రమాదాలను ఎదుర్కొనే వ్యూహాలను పూర్తిగా విశ్లేషించిన తరవాతే అభివృద్ధి ప్రాజెక్టులను అనుమతించాలి. ప్రకృతి విపత్తు కమిటీల్లో స్థానికుల భాగస్వామ్యం పెంచి వారిని సుశిక్షితులుగా తీర్చిదిద్దాలి. పర్వత శ్రేణుల్లోని అడవులు, నదుల పరిరక్షణలో స్థానికులకు అవకాశం కల్పించాలి. అప్పుడే విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం, పౌరసమాజంలో భవిష్యత్తుపై భరోసా ఇనుమడిస్తాయి.

కనిపించని కార్యాచరణ

గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల పరిధిలో విస్తరించిన పశ్చిమ కనుమల పరిరక్షణ, వరద ముప్పును ముందస్తుగా ఎదుర్కోవడం కోసం పుష్కర కాలం క్రితమే అడుగులు పడినా కార్యాచరణకు నోచుకోలేదు.

వివిధ కమిటీల సిఫార్సులను సకాలంలో పరిగణించి ఉంటే వరదల తీవ్రత తగ్గే అవకాశం ఉండేదని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒడిశా, ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించిన తూర్పు కనుమల పరిస్థితి కూడా ఇంతే.

ఒడిశా, ఏపీ పరిధిలోని కనుమల్లో లేటరైట్‌, బాక్సైట్‌ వంటి ఖనిజ తవ్వకాల మూలంగా అడవులకు తీరని నష్టం కలుగుతోంది. గోదావరి, వంశధార, నాగావళి తదితర నదుల గమనం మారి భీకర వరదలు సంభవిస్తున్నాయి.

నదుల ప్రవాహ స్థితి మారడం మూలంగా భవిష్యత్తులో వరద ప్రమాదాలను అంచనా వేయలేమని నిపుణులు చెబుతున్నారు. తూర్పు కనుమల్లో భవిష్యత్‌ ప్రమాదాలను నివారించే ముందస్తు అధ్యయనాలు చేపట్టేందుకు సైతం ప్రభుత్వాలు ఆసక్తి చూపడంలేదు.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రపంచ దృక్పథంతో నలంద కోర్సులు

‣ 'మహీంద్రా'లో కొత్త ఎంటెక్‌ కోర్సులు

‣ సరిహద్దు రహదారుల సంస్థలో ఉద్యోగాలు

‣ మేనేజ్‌మెంట్‌ విద్యలో ఆకర్షణీయ కోర్సులు

Posted Date: 02-07-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం