• facebook
  • whatsapp
  • telegram

మేనేజ్‌మెంట్‌ విద్యలో ఆకర్షణీయ కోర్సులు

మేనేజ్‌మెంట్‌ రంగంలో రాణించేందుకు సహకరించేలా, విద్యార్థుల్లో నూతన నైపుణ్యాలు పెంపొందించేలా ఉన్న కోర్సులకు ఇప్పుడు డిమాండ్‌ పెరుగుతోంది. వీటిలో బీబీఏ రిటైల్‌ ఆపరేషన్స్, లాజిస్టిక్స్‌ ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికే కొన్ని కళాశాలల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉండగా... తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని ప్రభుత్వ కళాశాలల్లో వీటిని ప్రవేశపెడుతున్నారు. మరి ఈ డిగ్రీల గురించి పూర్తి వివరాలు.. ఉద్యోగావకాశాల గురించి తెలుసుకుందామా...

బీబీఏ రిటైల్‌ ఆపరేషన్స్‌

బీబీఏ రిటైల్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ విద్యను అందించడంతోపాటు రిటైల్‌ రంగంలో ప్రాథమిక అంశాలను నేర్పిస్తుంది. రిటైల్‌ ఇండస్ట్రీలో ప్రవేశించాలనే ఆసక్తి ఉన్నవారికి ఇది చక్కగా నప్పుతుంది. ఈ కోర్సును పూర్తిచేసిన వారు ‘రిటైల్‌ మేనేజర్‌’గా కెరియర్‌ను ప్రారంభిస్తారు. రిటైల్‌ మేనేజర్‌ ప్రధాన విధి వినియోగదారులకు మెరుగైన సేవలు అందేలా చూడటం. స్టోర్‌ను విజయవంతంగా నడిపించడం, కొనుగోలుదారుల అవసరాలు తెలుసుకోవడం, సంస్థను లాభాలబాట పట్టించడం.

కోర్సులో భాగంగా విద్యార్థులు మేనేజ్‌మెంట్‌లో మౌలిక అంశాలతోపాటు ఎకనామిక్స్, ఐటీ, రిటైల్, స్టాటిస్టిక్స్, మార్కెటింగ్, బిజినెస్‌ లా, వెండర్‌ మేనేజ్‌మెంట్, కస్టమర్‌ ప్రవర్తన, స్టోర్‌ లొకేషన్‌ గుర్తించడం, డిజైన్, ఫ్రాంచైజీ, వేర్‌హౌస్‌ మేనేజ్‌మెంట్, ఈ-బిజినెస్, బ్రాండింగ్, డిజిటల్‌ మార్కెటింగ్, రిస్క్‌ అండ్‌ ఇన్స్యూరెన్స్‌ వంటి అంశాలన్నింటినీ ప్రాథమికంగా నేర్చుకుంటారు.

ఈ కోర్సును పూర్తిచేసినవారు డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్, సూపర్‌మార్కెట్స్, అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీలు, రిటైల్‌ అవుట్‌లెట్లు, ఎక్స్‌పోర్ట్‌ హౌసెస్, మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీల్లో కెరియర్‌ను మొదలుపెట్టొచ్చు. ప్రభుత్వ రంగంలో బ్యాంకింగ్, రైల్వేస్, వంటివాటిలో చేరేందుకు ప్రయత్నించవచ్చు. ఐటీసీ రిటైల్, స్పెన్సర్స్, లైఫ్‌ స్టైల్, బిగ్‌బజార్, పేంటలూన్స్‌ వంటి ప్రముఖ సంస్థలు వీరిని ఉద్యోగంలోకి తీసుకుంటాయి.

బీబీఏ లాజిస్టిక్స్‌

వ్యాపారంలో వస్తువుల నిర్వహణ - రవాణా గురించి నేర్పించేదే బీబీఏ లాజిస్టిక్స్‌. విక్రయించాల్సిన వస్తువులను ప్రణాళికాబద్ధంగా, జాగ్రత్తగా ఎగుమతులు, దిగుమతులు, నిల్వ చేయడం వంటి పనులుంటాయి. వస్తు నిర్వహణలో ప్రాథమిక అంశాలతోపాటు మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్, సప్లై గొలుసు, రిస్క్, విదేశీ వర్తకం వంటి అంశాలపై తరగతులుంటాయి. అన్ని సంస్థలకూ తాము విక్రయించాల్సిన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల లాజిస్టిక్స్‌లో చేరినవారికి చక్కని అవకాశాలున్నాయి. 

ఇంటర్‌లో మ్యాథమెటిక్స్, అకౌంట్స్, బిజినెస్‌ స్టడీస్, ఎకనమిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదువుకున్నవారు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. దేశంలోని ప్రధాన యూనివర్సిటీలు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి ప్రవేశాలు ఇస్తున్నాయి. కొన్నింటిలో ఇంటర్‌ మార్కుల ఆధారంగా నేరుగా చేరొచ్చు. బీబీఏ లాజిస్టిక్స్‌ చదివినవారు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు. షిప్పింగ్‌ కంపెనీలు, పోర్టులు, హార్బర్లు, రైలు - రోడ్డు రవాణా సంస్థలు, లాజిస్టిక్‌ కంపెనీలు, ఎంఎన్‌సీల్లో లాజిస్టిక్స్‌ మేనేజర్‌గా కెరియర్‌ను మొదలుపెట్టొచ్చు. సప్లై చెయిన్‌ మేనేజర్, ఇన్వెంటరీ కంట్రోల్‌ మేనేజర్, వేర్‌హౌస్‌ మేనేజర్‌ తదితర పోస్టుల్లో స్థిరపడొచ్చు. యాక్సెంచర్, నోకియా, టొయోటా, సేఫ్‌ ఎక్స్‌ప్రెస్‌ లాజిస్టిక్స్‌ వంటి సంస్థలు వీరిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి.

దేశవ్యాప్తంగా ఈ కోర్సులు అమిటీ, లవ్లీ ప్రొఫెషనల్‌ వంటి విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో కస్తూరిబా గాంధీ డిగ్రీ, పీజీ కాలేజ్‌ ఫర్‌ విమెన్‌తోపాటు పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో వీటిని చదువుకోవచ్చు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంలోని వీఎస్‌కే జీడీసీ, జీడీసీ (మహిళా), రాజమహేంద్రవరం, పాలకొల్లు, విజయవాడ, ఎల్‌హెచ్‌ఆర్‌ జీడీసీ మైలవరం, జీడీసీ (మహిళా) - గుంటూరులో ఈ కోర్సులను ప్రవేశపెట్టారు.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఫెయిల్ అయ్యారా... ఏం పర్లేదు!

‣ ఇంటర్‌లో ఏ గ్రూప్‌ను ఎంచుకోవాలి?

‣ స్వయంగా నేర్చుకుందాం

‣ మారిన పరిస్థితుల కోసం మరో వ్యూహం

‣ ఈడీ, జూనియర్‌ అసిస్టెంట్స్‌ పరీక్షలకు ఇదుగో వ్యూహం

‣ టెన్త్‌ తర్వాత ఏం చేయాలి? ఎలా నిర్ణయించుకోవాలి?

‣ ఉందా...మీకు రెండో మెదడు?

‣ స్నేహితుల ఒత్తిడిని తట్టుకోవాలంటే?

Posted Date: 01-07-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌