• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఫెయిల్ అయ్యారా... ఏం పర్లేదు!

గుర్తుంచుకోండి... గెలుపోటములు తాత్కాలికం

ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయ్‌. పాసైనవాళ్లంతా మెడిసిన్, ఇంజినీరింగ్, లా, ఒకేషనల్‌ కోర్సులు... ఇలా వేటిలో చేరాలా అని ఆలోచిస్తుంటారు. విజేతలను ప్రపంచం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. వాళ్లకు అందరి ప్రశంసలూ అందుతాయి. కానీ ఫెయిల్‌ అయినవాళ్ల సంగతి ఏమిటి? వారి గురించి ఒక్కసారి ఆలోచిద్దామా....

అపజయానికి ఎన్నో కారణాలుంటాయి. పరీక్షల సమయానికి విద్యార్థి ఆరోగ్యం సరిగాలేకపోవచ్చు. లేదా కుటుంబసభ్యుల అనారోగ్యం, ఆకస్మిక మరణం వారిని లక్ష్యం నుంచి వెనక్కు నెట్టొచ్చు. 

ఫెయిలైన తర్వాత కుటుంబసభ్యులు కోప్పడతారనో.. స్నేహితులు, బంధువులు ఎగతాళి చేస్తారనో.. చాలామంది విద్యార్థులు భయపడుతుంటారు. ఆ అవమానాన్ని తట్టుకోలేమనే భయంతో ప్రతికూల ఆలోచనలు చేస్తుంటారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. 

నిజానికి గెలుపోటములు తాత్కాలికమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చీకటి రాత్రి అలాగే శాశ్వతంగా ఉండిపోదు. దాని వెంట వెలుగూ వస్తుంది. వైఫల్యానికి కారణాలను తెలుసుకుని మధ్యంతర పరీక్షలకు సిద్ధంకావాలి. 

అన్నిటికంటే ముఖ్యమైంది మన ప్రాణం. మనమంటూ జీవించి ఉంటే... ఈరోజుకాక పోతే రేపు విజయం మన బానిస అవుతుంది. క్షణికావేశంలో విపరీత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎంతో అమూల్యమైన జీవితాన్ని కోల్పోతాం. 

‘తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలనీ... తరిమేవాళ్లను హితులుగ తలచి ముందుకెళ్లాలని...’ కన్నీళ్లను తుడిచే ఇలాంటి స్ఫూర్తిదాయక గీతాలను వినొచ్చు. బాధను మరిపించి మనసుకు సాంత్వన అందించే పాటలు మనకెన్నో ఉన్నాయి. మనసుకు దగ్గరైన స్నేహితులతో బాధను పంచుకుంటే బాధ సగం తగ్గినట్టే.

ఇదే చివరి అపజయం అనుకుని సానుకూల దృక్పథంతో ప్రయత్నించడం మొదలుపెట్టాలి. ఆత్మవిశ్వాసం ముందు వైఫల్యం తలవంచుతుంది. ఆ తర్వాత విజయాల పరంపర కొనసాగుతుంది. 

చివరిగా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంతోమంది కుబేరులు, వివిధ రంగాల్లో పేరొందిన ప్రముఖులు ఉన్నత చదువులు చదివినవారు కాదు. అయినా... వాళ్లంతా ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని అందులో అద్భుతాలు సృష్టించారు. ప్రయత్నిస్తే మీరూ అలా కాగలరు! 

మంచి మార్కులు తెచ్చుకున్న నేస్తాలను కలిసి పరీక్ష రాయడంలోని కొన్ని మెలకువలనూ నేర్చుకోవచ్చు. వారి సహాయంతో ఈసారి బాగా రాసి విజయం సాధించవచ్చు. 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇంటర్‌లో ఏ గ్రూప్‌ను ఎంచుకోవాలి?

‣ స్వయంగా నేర్చుకుందాం

‣ మారిన పరిస్థితుల కోసం మరో వ్యూహం

‣ ఈడీ, జూనియర్‌ అసిస్టెంట్స్‌ పరీక్షలకు ఇదుగో వ్యూహం

‣ టెన్త్‌ తర్వాత ఏం చేయాలి? ఎలా నిర్ణయించుకోవాలి?

‣ ఉందా...మీకు రెండో మెదడు?

‣ స్నేహితుల ఒత్తిడిని తట్టుకోవాలంటే?

Posted Date : 29-06-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌