• facebook
  • whatsapp
  • telegram

కశ్మీర్‌పై అల్‌ఖైదా దుష్టనేత్రం

భారత్‌ అప్రమత్తత కీలకం

మహమ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు భారత్‌పై ఉగ్రదాడులు చేస్తామని హెచ్చరించడానికి చాలా ముందే భారత ఉపఖండంలోని అల్‌ఖైదా శాఖ (ఏక్యూఐఎస్‌) దుష్ట నేత్రం కశ్మీర్‌పై పడింది. ఏక్యూఐఎస్‌ అధికార పత్రిక నవాయే అఫ్గాన్‌ పేరును 2020లో నవాయే ఘజ్వాయే హింద్‌గా మార్చడం దానికి నిదర్శనమని ఐక్యరాజ్య సమితి ఇటీవల హెచ్చరించింది. అల్‌ఖైదా అధిపతి ఐమన్‌ మహమ్మద్‌ రబీ అల్‌ జవాహిరి ఇటీవల విడుదల చేసిన వీడియో సందేశం- కశ్మీర్‌తో పాటు భారత్‌లో ఇతర ప్రాంతాలపైనా ఉగ్ర సంస్థ కుతంత్రాలు పన్నుతున్నట్లు రూఢి చేసింది. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లకు అల్‌ఖైదా మద్దతు పలుకుతోంది. అమెరికా నాయకత్వంలోని సేనలతో పోరాటంలో అనేకమంది అల్‌ఖైదా నాయకులు హతమయ్యారు. వారిలో ఏక్యూఐఎస్‌ అధిపతి ఆసిఫ్‌ ఉమర్‌ సైతం ఉన్నాడు.

నాలుగు అంచెల వ్యవస్థ

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఉమర్‌ నాయకత్వంలో భారత్‌లో పాతుకుపోవాలని గతంలో ఏక్యూఐఎస్‌ ప్రయత్నించింది. అతడు సామాజిక మాధ్యమాల ద్వారా అనేకమందిని రిక్రూట్‌ చేసుకునేవాడు. వారిని దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం దేశంలోని వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసింది. ఏక్యూఐఎస్‌ అనుబంధ విభాగాలైన స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి), ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం)లు దేశంలో పలు ఉగ్రదాడులు జరిపాయి. భారత భద్రతా సంస్థలు ఆ ఉగ్ర బృందాలను విచ్ఛిన్నం చేశాయి. అల్‌ఖైదాకు మరో అనుబంధ విభాగమైన అన్సార్‌ ఘజ్వత్‌ ఉల్‌ హింద్‌ (ఏజీహెచ్‌) కశ్మీర్‌ను ఇస్లామిక్‌ ఖలీఫా రాజ్యంలో విలీనం చేయాలని లక్షిస్తోంది. ఏజీహెచ్‌కు తగిన సంఖ్యలో కార్యకర్తలు దొరక్క భారత్‌లో వేళ్లూనుకోలేకపోయింది. భద్రతా సంస్థలు 2021లో లఖ్‌నవూలోని ఏజీహెచ్‌ యంత్రాంగాన్ని ధ్వంసం చేశాయి. ఇప్పుడు కశ్మీర్‌పై అల్‌ఖైదా దృష్టి సారించింది. అది అందించే ధన, ఆయుధ సహాయంతో ఏజీహెచ్‌ కశ్మీర్‌లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తోంది. విదేశీ ముష్కరులతో పాటు భారత్‌లో ఇతర ప్రాంతాల నుంచీ ఉగ్రవాదులను నియమించుకోవడానికి ఏజీహెచ్‌ నడుంకడుతోంది.

అల్‌ఖైదా ఆర్థికంగా గతంలో ఉన్నంత బలంగా లేదు. 2015 అక్టోబర్‌లో కాందహార్‌లోని ఏక్యూఐఎస్‌ స్థావరంపై అమెరికా-అఫ్గాన్‌ సేనలు దాడి చేయడంతో చాలామంది ఉగ్రవాదులు మరణించారు. అందువల్ల అది ఇప్పట్లో దాడులు చేయగల స్థితిలో లేదు. ఆలోగా హక్కానీ నెట్‌వర్క్‌, అఫ్గాన్‌ తాలిబన్లతో చేతులు కలిపి కోల్పోయిన బలాన్ని కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. అల్‌ఖైదా కీలక నాయకులు, ఏక్యూఐఎస్‌ వంటి అనుబంధ సంస్థలు ఇంకా అఫ్గాన్‌లోనే తిష్ఠవేసి ఉండటం చూస్తే- తాలిబన్లతో అల్‌ఖైదా సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో అర్థమవుతుంది. మరోవైపు 370 అధికరణ రద్దు తరవాతి నుంచి కశ్మీర్‌లో భద్రతాదళాల దాడులతో బలహీనపడిన ఉగ్రవాదులు- విదేశాల నుంచి ఆర్థిక, ఆయుధ సహాయం, అఫ్గానిస్థాన్‌ నుంచి కొత్త సభ్యులను పొంది మళ్ళీ బలపడాలని చూస్తున్నారు.

అల్‌ఖైదా ఉగ్ర ఉద్యమంలో నాలుగు అంచెలు ఉన్నాయని ఉగ్రవాద నిరోధ నిపుణుడు బ్రూస్‌ హాఫ్‌మన్‌ వివరించారు. అవి- అల్‌ఖైదా కేంద్ర నాయకత్వం, అల్‌ఖైదా అనుబంధ సంస్థలు, అల్‌ఖైదా స్థానిక కార్యకర్తలు, అల్‌ఖైదా యంత్రాంగం. అమెరికాపై 9/11 దాడికి ఉగ్రవాదులను పురమాయించింది అల్‌ఖైదా కేంద్ర నాయకత్వమే. అల్‌ఖైదా నుంచి డబ్బు, ఆయుధాలు, శిక్షణ, ఇతర సహాయం పొందిన ఉగ్రవాదులు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేస్తారు. పాకిస్థాన్‌ స్థావరంగా కశ్మీర్‌లో కార్యకలాపాలు సాగించే హర్కత్‌ ఉల్‌ ముజాహిదీన్‌, జైషే మహమ్మద్‌, లష్కరే తొయిబా వంటివి అనుబంధ సంస్థల కిందకు వస్తాయి. అల్‌ఖైదాతో పరోక్షంగానైనా కొంత సంబంధాలు ఉండి, గుప్త బృందాలుగా మసలుకొంటూ పైనుంచి ఆదేశాలు అందగానే దాడికి దిగేవారిని స్థానిక కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఆయా దేశాల్లోని తీవ్రవాద బృందాలు స్వతంత్రంగా వ్యవహరిస్తూ అదనుచూసుకుని దాడులకు దిగుతుంటాయి. అవన్నీ అల్‌ఖైదా యంత్రాంగం కిందకు వస్తాయి. స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో రైలు పేలుళ్లకు పాల్పడింది ఆ బృందాలే. లాడెన్‌ మరణానంతరం ఆ వ్యవస్థ క్షీణించినా, అఫ్గానిస్థాన్‌లో వేళ్లూనుకున్న తరవాత జవాహిరి పూర్వ వ్యవస్థను నిర్మించడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. దాన్నిముందే గుర్తించి అల్‌ఖైదాను ఎదుర్కోవడానికి భారత్‌ తగిన ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి.

దౌత్య పరంగా ఒత్తిడి

అఫ్గాన్‌ నుంచి అమెరికా సేనలు నిష్క్రమించగానే భారత్‌లో కశ్మీర్‌, రష్యాలో చెచెన్యా, చైనాలో షింజియాంగ్‌ వంటి ప్రాంతాల విముక్తికి అంతర్జాతీయ జిహాద్‌ చేపడతానని అల్‌ఖైదా ప్రకటించింది. కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలకు పాక్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ తోడ్పడుతోంది. కశ్మీర్‌లో అల్‌ఖైదా జోరు పెంచితే తమకు లాభమని పాకిస్థాన్‌, చైనాలు భావిస్తున్నాయి. కశ్మీర్‌ విషయంలో భారత్‌ తలమునకలైతే వాస్తవాధీన రేఖ వెంబడి, హిందూ మహాసముద్రంలోనూ తనకు పోటీ ఉండదని చైనా అంచనా. తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్‌ ప్రైవేటు సైన్యం సాదత్‌- అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోంది. కశ్మీర్‌ సమస్యపై భారత్‌ను ఎర్డొగాన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అఫ్గాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వంతో భారత్‌ సంబంధాలు కొనసాగిస్తూనే తుర్కియే, పాక్‌, చైనా కార్యకలాపాలపై దౌత్యపరంగా ఒత్తిడి పెంచాలి. అఫ్గాన్‌ను ఇస్లామిక్‌ జిహాదీలు భారత వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా ఉపయోగించకుండా తాలిబన్లు చర్యలు తీసుకునేలా నచ్చజెప్పాలి. కశ్మీర్‌లో కేవలం ఉగ్రవాదులను నిర్మూలిస్తే సరిపోదు. అక్కడి ప్రజల మౌలిక అవసరాలను తీరుస్తూ విద్య, ఉపాధి సౌకర్యాలను విస్తరించాలి. మహిళలకు సాధికారత కల్పిస్తూ జన హృదయాలను గెలవాలి. కశ్మీరీ యువత ఉగ్రవాదుల ఉచ్చులో పడకుండా నివారించడం అత్యంత కీలకం.

స్వతంత్రంగా దాడులు

శత్రువును చిత్తు చేయాలంటే అతడి ఆలోచనా విధానాన్ని, వేసే ఎత్తులను పసిగట్టాలి. ఒసామా బిన్‌ లాడెన్‌ అల్‌ఖైదాను నిర్మించిన తీరును అర్థం చేసుకోవాలి. అల్‌ఖైదా ఒకే కేంద్రీకృత నాయకత్వం కింద పనిచేసే సంస్థ కాదు. దాని అనుబంధ విభాగాలు చాలా ఉన్నాయి. అవి వేటికవి స్వతంత్రంగా దాడులు నిర్వహించే సామర్థ్యాన్ని సంతరించుకోవాలన్నది లాడెన్‌ వ్యూహం. అనుబంధ సంస్థలు కేంద్ర నాయకత్వంతో సంబంధాలు తెగిపోయిన సమయంలోనూ సొంతంగా కార్యకలాపాలను సాగించగలుగుతాయి. అమెరికా దాడుల్లో 75శాతం అల్‌ఖైదా ఉన్నత నాయకులు హతమవడమో, పట్టుబడటమో జరిగినా- అనుబంధ విభాగాలు ఉగ్ర కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. లాడెన్‌ నిర్మించిన పలు అంచెల వ్యవస్థ వల్లనే ఇది సాధ్యపడుతోంది.
 


********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆర్థిక పురోగమనానికి బ్రిక్స్‌ భరోసా

‣ వరదల బీభత్సం... జనజీవనం అస్తవ్యస్తం!

‣ అఫ్గాన్‌కు భారత్‌ ఆపన్నహస్తం

‣ 5జీ రాకకు వేళాయె...

Posted Date: 02-07-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం