• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక పురోగమనానికి బ్రిక్స్‌ భరోసా

ఆసక్తి రేకెత్తించిన శిఖరాగ్ర సదస్సు

ఉక్రెయిన్‌ సంక్షోభంతో ప్రపంచ రాజకీయాలు వేడెక్కాయి. అంతర్జాతీయ స్థాయిలో తమ పట్టు నిరూపించుకోవడానికి అమెరికా, రష్యా, చైనా పోటీ పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చైనా అధ్యక్షతన గతవారం వర్చువల్‌ విధానంలో జరిగిన బ్రిక్స్‌ 14వ శిఖరాగ్ర సదస్సు సర్వత్రా ఆసక్తి రేకెత్తించింది. ఆ సమావేశం ఇండియా అనుసరిస్తున్న తటస్థ దౌత్యనీతికి పరీక్షగా నిలిచింది. చైనా, రష్యా సభ్యదేశాలుగా ఉన్న నేపథ్యంలో అమెరికాకు వ్యతిరేకంగా కూటమి వ్యాఖ్యలు చేస్తుందేమోనన్న అంచనాలు వెలువడ్డాయి. అయితే- క్వాడ్‌ తరహాలోనే ఇక్కడా దిల్లీ వ్యూహాత్మకంగా వ్యవహరించి, అలాంటి పరిణామాలేవీ చోటుచేసుకోకుండా అడ్డుకోగలిగింది. పశ్చిమ దేశాలు, బ్రిక్స్‌ మధ్య సమతౌల్యాన్ని పాటించడంలో సఫలీకృతమైంది. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధానికి ముగింపు పలికి వివాదాలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు దోహదపడతామంటూ బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ దేశాలు ముక్తకంఠంతో ప్రకటించడం మరో కీలక పరిణామం.

విస్తృతంగా చర్చలు

ఉక్రెయిన్‌ సంక్షోభంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. రష్యాపై అమెరికా సహా పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు భారీగా పెరిగాయి. ఆహారం, ఎరువుల కొరత వేధిస్తోంది. ఫలితంగా అనేక వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో సమావేశమైన బ్రిక్స్‌ దేశాధినేతలు కీవ్‌-మాస్కో యుద్ధం సహా పలు కీలక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించి ఉమ్మడి తీర్మానాన్ని విడుదల చేశారు. ఉక్రెయిన్‌లో మానవతా సాయం అందించేందుకు ఐక్యరాజ్య సమితి, రెడ్‌ క్రాస్‌ వంటి సంస్థలు చేస్తున్న కృషికి అందులో మద్దతు ప్రకటించారు. అన్ని దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలను తాము గౌరవిస్తామని ముక్తకంఠంతో ఉద్ఘాటించారు. విభేదాల పరిష్కారానికి చర్చలే సరైన మార్గమని సూచిస్తూ, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య చర్చలకు సహకరించేందుకు ముందుకొచ్చారు. కొవిడ్‌ మహమ్మారి దెబ్బకు అతలాకుతలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడానికి కలిసికట్టుగా కృషిచేయాలని తీర్మానించుకున్నారు. ఇందుకోసం డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ, హరిత ఇంధనం, మౌలిక వసతుల కల్పన వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోనున్నారు. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు కట్టుబడి ఉంటూ మౌలిక వసతులను అభివృద్ధి చేసుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులను కూటమి గుర్తించింది. వాటిని అధిగమించేందుకుగాను- ‘న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ)’ ద్వారా సభ్యదేశాలకు 2022-26 మధ్యకాలంలో మూడు వేల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. అందులో 40శాతం నిధులను భూతాపాన్ని తగ్గించేందుకే వెచ్చించనున్నారు. డాలరుకు ప్రత్యామ్నాయంగా రిజర్వు కరెన్సీని ఏర్పాటు చేసుకుందామని తాజా సదస్సులో పుతిన్‌ ప్రతిపాదించారు. దానికి సభ్యదేశాలు ప్రస్తుతానికైతే ఆమోదముద్ర వేయలేదు. ప్రధాని మోదీ వర్ధమాన దేశాలకు చేయూత అందించడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధి పట్టాలెక్కించడం, కొవిడ్‌ టీకాల పంపిణీ ఆవశ్యకత గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. డిజిటల్‌ ఆర్థిక రంగంలో పరస్పర సహకారం పెంపునకు కృషి చేయాలని పిలుపిచ్చారు. రష్యాపై ఆంక్షల కారణంగా ఇబ్బంది పడుతున్న పేద, వర్ధమాన దేశాలకు బ్రిక్స్‌ సదస్సు జరిగిన తీరు ఒకింత ఉత్సాహాన్ని అందిస్తోందనడంలో సందేహం లేదు.

పట్టు కోసం డ్రాగన్‌ తహతహ

ఆంక్షల కారణంగా రష్యా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. పశ్చిమ దేశాలు, బ్రిక్స్‌ మధ్య సంబంధాల్లో సమతుల్యత పాటించేందుకు భారత్‌ కృషి చేస్తోంది. ఇదే అదనుగా కూటమిని తన నియంత్రణలోకి తీసుకునేందుకు బీజింగ్‌ ప్రణాళికలు రచిస్తున్నట్లు కనిపిస్తోంది. తన అధ్యక్షతన జరిగిన తాజా సదస్సుకు డ్రాగన్‌ 13 బ్రిక్స్‌యేతర దేశాలను ఆహ్వానించింది. మరిన్ని వర్ధమాన దేశాలకు కూటమిలో భాగస్వామ్యం కల్పించాల్సిన ఆవశ్యకతను సహచర దేశాధినేతలతో చర్చల్లో జిన్‌పింగ్‌ ప్రముఖంగా ప్రస్తావించారు. ముఖ్యంగా అర్జెంటీనా, ఈజిప్టు, థాయ్‌లాండ్‌, ఇండొనేసియా, కజఖ్‌స్థాన్‌, సౌదీ అరేబియా, నైజీరియా, సెనెగల్‌, యూఏఈలకు బ్రిక్స్‌ సభ్యత్వం ఇప్పించాలని చైనా తహతహలాడుతోంది. తద్వారా అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ సంస్థలకు బ్రిక్స్‌ను దీటుగా నిలబెట్టాలని డ్రాగన్‌ భావిస్తోంది. ఈ పరిణామాలపై దిల్లీ కన్నేసి ఉంచాలి. బ్రిక్స్‌తో సంబంధాలు ఎంత ముఖ్యమో, అమెరికా సహా పశ్చిమ దేశాలతో అనుబంధమూ అంతే ముఖ్యమన్న సంగతి ఇండియా గుర్తుంచుకోవాలి. ఈ కూటమి సదస్సులో పాల్గొన్న కొన్ని రోజులకే మోదీ జి-7 శిఖరాగ్ర సదస్సుకూ హాజరవడం బ్రిక్స్‌, పశ్చిమ దేశాల మధ్య సంబంధాలను సమతౌల్యం చేసుకునేందుకు ఇండియా చేస్తున్న కృషికి నిదర్శనం. బ్రిక్స్‌ అమెరికా వ్యతిరేక కూటమిగా అవతరించకుండా ఉండేలా కూటమి సభ్యదేశాలు జాగ్రత్తపడాలి. అంతర్జాతీయ స్థాయిలో కూటమికి ప్రాధాన్యం పెంచేందుకూ ప్రయత్నించాలి. ఎన్‌డీబీ ద్వారా ఇతర దేశాలకూ నిధులు సమకూరుస్తూ వాటి అభివృద్ధికి బాసటగా నిలవాలి. వర్ధమాన దేశాలకు ప్రత్యామ్నాయ ప్రగతి మార్గాలు అందించగల ఆర్థిక/వాణిజ్య కూటమిగా ఉంటామంటూ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.

- నవీన్‌కుమార్‌ గౌడ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వరదల బీభత్సం... జనజీవనం అస్తవ్యస్తం!

‣ అఫ్గాన్‌కు భారత్‌ ఆపన్నహస్తం

‣ 5జీ రాకకు వేళాయె...

‣ రాష్ట్రాల అసంతృప్తి గళం

‣ తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట

‣ చేయూత అందిస్తే దేశానికే పెన్నిధులు

‣ సముద్ర సంపదపై సాంకేతిక నేత్రం

Posted Date: 02-07-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం