• facebook
  • whatsapp
  • telegram

సముద్ర సంపదపై సాంకేతిక నేత్రం

ఖనిజ వనరుల వెలికితీతకు వ్యూహాలు

సముద్ర గర్భంలో దాగిన అపార ఖనిజ వనరులను వెలికితీసి, సుస్థిర వినియోగంలోకి తీసుకురావడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ‘సముద్రయాన్‌’ ప్రాజెక్టును ప్రారంభించారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం, జాతీయ సముద్ర సాంకేతిక పరిజ్ఞాన సంస్థ(ఎన్‌ఐఓటీ), ఇస్రోల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రూపుదిద్దుకొంది. 2024లో తుది ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇందులో విజయం సాధిస్తే సముద్ర గర్భాల అన్వేషణలో రాణిస్తున్న దేశాల సరసన భారత్‌ కూడా నిలుస్తుంది. ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేసిన అమెరికా, ఫ్రాన్స్‌, చైనా, జపాన్‌, రష్యాలతో పోటీ పడేందుకు మనదేశం చురుగ్గా ముందుకు కదులుతోంది. అంతరిక్ష, రోదసి ప్రయోగాలతో ప్రపంచ దేశాల్లో ప్రత్యేకత సాధించినట్లుగానే, సముద్ర జలాన్వేషణలోనూ ముందంజ వేయాలని శాస్త్రవేత్తలు మానవ సహిత సముద్ర జలాన్వేషణ వాహనం ‘మత్య్స-6000’ను రూపొందించారు. సముద్ర గర్భాన్ని ఆరు వేల అడుగుల లోతున అన్వేషించే లక్ష్యంతో దీన్ని తీర్చిదిద్దారు. ఇది గురుత్వాకర్షణ తప్ప మిగతా విషయాల్లో అంతరిక్ష వ్యోమనౌకలను పోలి ఉంటుంది. ముగ్గురు ఆక్వానాట్స్‌ను ఒకేసారి ఆరువేల మీటర్ల లోతుకు తీసుకెళ్ళే సామర్థ్యం కలిగి ఉంటుంది. సముద్రం అడుగున ఉండే విపరీతమైన ఒత్తిడిని తట్టుకునేందుకు వీలుగా ఇస్రో ఈ క్యాప్సూల్‌ తయారీలో టైటానియం లోహాన్ని ఉపయోగించింది. ప్రస్తుతం హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో ప్రయోగపరీక్షలు నిర్వహిస్తున్నారు. 2024లో పూర్తిస్థాయిలో సముద్రం అడుగు భాగానికి చేరుతుంది. సముద్ర ఉపరితలంతో సంబంధాలు లేకుండా రిమోట్‌ సాయంతో సొంతంగా పనిచేసే ‘మత్య్స’లో అత్యవసర సందర్భాల కోసం 96 గంటలపాటు ఆక్సిజన్‌ సరఫరా జరిగే ఏర్పాట్లు ఉన్నాయి. ఇందులో ప్రయాణించే వాళ్లకు వ్యోమనౌకల తరహాలో ప్రత్యేక సూట్ల అవసరం ఉండదు. సాధారణ ఆహారాన్నే తీసుకోవచ్చు.

మద్రాస్‌ ఐఐటీ ప్రాంగణంలో 1993లో చిన్న విభాగంగా మొదలైన ఎన్‌ఐఓటీ ప్రస్తుతం వేలచ్చేరిలో 50 ఎకరాల్లో విస్తరించింది. మంచినీటి సదుపాయం తక్కువగా ఉండే ద్వీపాలకు ఉప్పునీటిని శుద్ధిచేసి తాగునీటిని అందించే ప్లాంట్ల రూపకల్పన, సునామీ హెచ్చరికలు, వాతావరణ మార్పుల పరిశీలన వంటి విధులు నిర్వర్తించే ఎన్‌ఐఓటీ నాలుగువేల కోట్ల రూపాయల వ్యయంతో సముద్రయాన్‌ను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. సముద్ర గర్భాలను లోతుగా అన్వేషించడంలో రష్యా, అమెరికా, ఫ్రాన్స్‌, చైనా, జపాన్‌ పలు ప్రయోగాలు చేశాయి. అమెరికాకు చెందిన ‘డీఎస్‌వీ ఆల్విన్‌’ సబ్‌మెర్సిబుల్‌్ నౌక 1800 మీటర్ల లోతుకు వెళ్ళింది. అమెరికా పంపిన ‘ట్రైటాన్‌’ పదివేల మీటర్ల కంటే దిగువకు వెళ్ళి సముద్ర గర్భ సమాచారాన్ని సేకరించింది. జపాన్‌ ‘షింకాయ్‌’, రష్యా ‘మిర్‌’ను పంపాయి. చైనా ‘ఫెండవుజ్‌’ను, ఆస్ట్రేలియా ‘డీప్‌ సీ ఛాలెంజర్‌’ను ప్రయోగించింది. 2024లో సముద్రగర్భంలోకి వెళ్తున్న మత్య్స-6000లో ప్రయాణించడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇదంత తేలిక కాదు. తగినంత శారీరక సామర్థ్యం కలిగి ఉండాలి. భారతీయ నౌకాదళం సాయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నారు.

సముద్ర గర్భం ఎన్నో అరుదైన, విలువైన ఖనిజాలకు నిలయమన్న సంగతి తెలిసిందే. సముద్రంలో తవ్వకాల ద్వారా అక్కడ పుష్కలంగా ఉండే పాలీమెటాలిక్‌ మాంగనీస్‌ నాడ్యూల్స్‌, గ్యాస్‌ హైడ్రేట్స్‌, హైడ్రోథెర్మల్‌ సల్ఫైడ్స్‌, కోబాల్ట్‌ క్రస్ట్‌లను వెలికితీయాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ముఖ్యంగా శిలాజ ఇంధనాల కారణంగా తలెత్తే కాలుష్యాన్ని తగ్గించి, హరిత ఇంధనాలను ప్రోత్సహించేందుకు ఈ ఖనిజాలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంతరిక్ష యాత్రల మాదిరిగానే ఇక్కడా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి ఉపాధిమార్గాలు, ఆదాయ వనరులు పెంచుకొనే దిశగానూ ఆలోచనలున్నాయి. అంతరిక్ష ప్రయోగాల్లో ఒకసారి ఉపయోగించిన వ్యౌమనౌకలను తిరిగి యథాతథంగా ఉపయోగించడం సాధ్యంకాదు. ఇందులో అలాంటి సమస్య ఉండనందువల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రయోజనాలు పొందాలని ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ కార్యక్రమం విజయవంతమైతే భవిష్యత్తులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.

- శ్రీసత్యవాణి గొర్లె
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గుక్కెడు గంగకూ కరవే!

‣ వర్ధమాన దేశాల ‘వాణిజ్య సమరం’

‣ ఏటా తప్పని విత్తన గండం

‣ పోరుబాటలో ఆకాశనేత్రం

Posted Date: 29-06-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం