• facebook
  • whatsapp
  • telegram

గుక్కెడు గంగకూ కరవే!

తాగునీటి పథకాలు దాహార్తి తీరుస్తున్నాయా?

 

 

దేశ ఆర్థిక పురోగమనానికి, ఆరోగ్యవంతమైన, శక్తిమంతమైన మానవ వనరుల అభివృద్ధికి సురక్షిత తాగునీటి సరఫరా కీలకం. అందుకే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచే తాగునీటి పథకాలకు పంచవర్ష ప్రణాళికల్లో పెద్దపీట దక్కింది. 40 ఏళ్లలో 90శాతం భారత జనాభాకు సురక్షిత తాగునీటిని అందించాలని 1949లో భోర్‌ కమిటీ సూచించింది. 1969లో ‘యునిసెఫ్‌’ సాంకేతిక సహాయంతో జాతీయ గ్రామీణ తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1972-73లో చేపట్టిన సత్వర గ్రామీణ నీటి సరఫరా కార్యక్రమం- దేశంలో మొట్టమొదటి భారీ నీటి పంపిణీ పథకం. సమస్యాత్మక గ్రామాలకు ఇందులో ప్రాధాన్యం కల్పించారు. 1987లో మొట్టమొదటి జాతీయ నీటి విధానానికి రూపకల్పన చేశారు. 1991లో రాజీవ్‌గాంధీ జాతీయ తాగునీటి మిషన్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. 1994లో తాగునీటి సరఫరా బాధ్యతలను పంచాయతీరాజ్‌, పురపాలక సంస్థలపై మోపారు. 1999లో తాగునీటి సరఫరాకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. 2002లో పౌరభాగస్వామ్యం ప్రాతిపదికగా ‘స్వజలధార’ పథకాన్ని ప్రారంభించారు. 2005లో చేపట్టిన ‘భారత్‌ నిర్మాణ్‌ కార్యక్రమం’ అప్పటిదాకా నీటి సరఫరా లేని ఆవాసాలకు అయిదేళ్లలో తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

పాక్షిక ఫలితాలు 

గతంలో ఉన్న సత్వర గ్రామీణ నీటి సరఫరా పథకాన్ని 2009లో జాతీయ గ్రామీణ తాగునీటి పథకంగా మార్చారు. గ్రామీణులకు తగినంత, సురక్షిత తాగునీటిని అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో నీటి అందుబాటు, నాణ్యత వంటి ప్రధాన సమస్యలను అధిగమించాలని నిర్ణయించారు. 12వ ప్రణాళిక కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా స్థాయులను పెంచాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. నల్లాల ద్వారా నీటిని సరఫరా చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. 12వ ప్రణాళికలో ఫ్లోరైడ్‌, ఆర్సెనిక్‌ ప్రభావిత ప్రాంతాలకు సురక్షిత తాగునీటిని అందించడంపై దృష్టి సారించారు. భారత ప్రమాణాల సంస్థ నిబంధనలకు అనుగుణంగా తాగునీటి నాణ్యత విధివిధానాలను రూపొందించారు. రోజూ ప్రతి వ్యక్తికీ నిర్దిష్టంగా సురక్షితమైన తాగునీటిని అందించాలని జాతీయ గ్రామీణ తాగునీటి పథకం నిర్దేశించింది. 2019లో జలశక్తి అభియాన్‌ కార్యక్రమాన్ని కేంద్రం రెండు దశల్లో నీటి సమస్య ఉన్న 259 జిల్లాల్లో ప్రారంభించింది. ప్రతిఇంటికీ నల్లా నీటి పథకాన్ని ‘హర్‌ ఘర్‌ జల్‌’ పేరుతో ప్రధానమంత్రి ప్రారంభించారు. వందశాతం నివాసాలకు సురక్షిత తాగునీటిని అందించాలనే లక్ష్యంతో తెలంగాణలో ‘మిషన్‌ భగీరథ’ చేపట్టారు.

 

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చేపట్టిన పలు తాగునీటి పథకాలు పాక్షిక ఫలితాలనే అందించాయి. రూ.66 వేల కోట్లు వెచ్చించిన సత్వర గ్రామీణ నీటి సరఫరా పథకంలో 7.98 లక్షల నివాస ప్రాంతాలకు రక్షిత తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, 6.65 లక్షల నివాస ప్రాంతాలకే అందించగలిగారు. ‘తాగునీటి సరఫరా’ ప్రాధాన్యాంశంగా ఉన్న భారత్‌ నిర్మాణ్‌ కార్యక్రమం రెండు దశల్లో 3.97 లక్షల ఆవాసాలకుగాను 1.31 లక్షల ఆవాసాలకే పూర్తిస్థాయిలో సురక్షిత తాగునీరు అందించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 12వ ప్రణాళికా కాలంలో పట్టణ ప్రాంతాల తాగునీటి కల్పనకు ‘నర్మ్‌’ పేరిట రెండో దశ పథకాన్ని ప్రవేశపెట్టారు. పట్టణాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సేవలను నిరంతరాయంగా అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 2015లో ఎంపిక చేసిన 500 నగరాల్లో పట్టణ మౌలిక వసతుల కల్పనలో భాగంగా మంచినీటి సరఫరా, మురుగు నీటిపారుదల వ్యవస్థ, హరిత స్థలాలు, వరద నివారణ వ్యవస్థల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ‘అమృత్‌’ పథకాన్ని ప్రవేశపెట్టింది. పట్టణాల్లో 24 గంటల నీటి సరఫరా లక్ష్యాన్ని స్థానిక సంస్థలు అందుకోలేకపోతున్నాయి. దేశంలో 10లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన 35 పట్టణాల్లో తగినంత మేర నీటి సరఫరా జరగడం లేదు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దేశంలో తాగునీటి సరఫరా జరగడం లేదని ప్రపంచబ్యాంకు అధ్యయనం స్పష్టం చేసింది.

 

వనరుల సద్వినియోగం 

నీటి అందుబాటుకు, అవసరానికి మధ్య ఏటికేడు అంతరం పెరిగి కొరత అధికమవుతోంది. ఈ సమస్యను అధిగమించి, నిరంతర తాగునీటి లభ్యతకు స్థానిక నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మరమ్మతులు, పూడికతీత చేపట్టాలి. మురుగు నీరు కలవకుండా చూడాలి. చెరువులు కుంటలు ఆక్రమణల పాలవ్వకుండా చర్యలు తీసుకోవాలి. దేశవ్యాప్తంగా సగం తాగునీటి అవసరాలకు భూగర్భ జలాలే ఆధారం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వ్యవసాయం, పారిశ్రామికీకరణ మూలంగా భూగర్భ జలం తగ్గుతోంది. భూగర్భ జలాల పెంపుదలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇంకుడు గుంతలు, బోరు రీఛార్జి ప్రక్రియల్ని ప్రోత్సహించాలి. వర్షపు నీటిని ఒడిసి పట్టాలి. పట్టణాల్లో వర్షపు నీటిని నిల్వ చేసే భూగర్భ ట్యాంకులను నిర్మించాల్సిన అవసరం ఉంది. నూతన సాంకేతిక పద్ధతుల్లో నీటి సరఫరా నిర్వహణ వ్యవస్థలను పటిష్ఠపరచడమూ తప్పనిసరి. పట్టణాలు, నగరాల్లో 30శాతం తాగునీరు లీకేజీల ద్వారా వృథాగా పోతోంది. లీకేజీల నివారణకు నాణ్యమైన పైపులైన్లు వేయాలి. సురక్షిత తాగునీటి లభ్యతకు అధునాతన శుద్ధి ప్రక్రియలు, యంత్రాలు, రసాయనాలతో నిరంతర నిర్వహణ చేపట్టాలి. ప్రాణావసరమైన నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. నీటి సరఫరా, నిర్వహణ వ్యవస్థల సామర్థ్యాలను మెరుగుపరచడం అత్యంత ఆవశ్యకం. అందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రజలకు నాణ్యమైన జీవజలాన్ని సరఫరా చేసినప్పుడే ఆరోగ్యవంతమైన మానవ వనరుల నిర్మాణం జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుంది.

 

ఏళ్లు గడిచినా...

దశాబ్దాలు గడిచినా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మెరుగైన, సరిపడినంత తాగునీరు అందించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వాలు అందుకోలేకపోయాయి. గిరిజన ప్రాంతాల్లో మంచినీటి కోసం ఇప్పటికీ కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. అటవీ, కొండ ప్రాంతాల్లో అధునాతన సాంకేతికతలను జోడించి ప్రత్యేక నీటి సరఫరా, నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మెరుగైన తాగునీరు పొందుతున్నా, సరిపడినంతగా దక్కడం లేదు. మెరుగైన, సురక్షితమైన, సరిపడినంత తాగునీరు గృహావరణంలోనే లభ్యం కావడం- నీటి సరఫరా, నిర్వహణ వ్యవస్థల సమర్థతను, పటిష్ఠతను సూచిస్తుంది. ఇలా గృహావరణంలోనే మెరుగైన తాగునీటిని పొందగలిగే వారి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో 46.1శాతం, పట్టణ ప్రాంతాల్లో 76.8శాతం దాకా ఉన్నట్లు జాతీయ నమూనా సర్వే 69వ రౌండ్‌ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
 


********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వర్ధమాన దేశాల ‘వాణిజ్య సమరం’

‣ ఏటా తప్పని విత్తన గండం

‣ పోరుబాటలో ఆకాశనేత్రం

‣ కడగండ్ల సేద్యం

‣ దేశ రక్షణలో మేలిమి పథమేనా?

‣ ముసురుతున్న అణుభయాలు

‣ వైద్యరంగంలో సాంకేతిక విప్లవం

Posted Date: 29-06-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం