• facebook
  • whatsapp
  • telegram

కడగండ్ల సేద్యం

రైతుల పంట విరామం

హరిత విప్లవం తరవాత భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. అనేక పంటల ఉత్పత్తుల్లో దేశం స్వయంసమృద్ధిని సాధించి, ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుంది. ఆనకట్టలు, కాలువలు, చెరువుల నిర్మాణంతో నీటి వసతి సమకూరి ఆహార పంటల సాగు భారీగా పెరిగింది. ధాన్యం ఉత్పత్తి జోరందుకుంది. అయినా, నేటికీ రైతులకు సాగు కష్టాలు మాత్రం తీరడం లేదు. వివిధ కారణాలతో పంటల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతుండటం, పెట్టుబడి వ్యయం పెరగడం మన దేశ రైతులకు పెద్ద సవాలుగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా రైతుల ఆదాయాన్ని మాత్రం పెంచలేకపోతున్నాయి. సాగు గిట్టుబాటు కాక దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతులు పంట విరామం (క్రాప్‌ హాలిడే) ప్రకటిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ, కడప, కర్నూలు జిల్లాల రైతులు సైతం ఆ దిశగా అడుగులు వేయడం ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల రైతులు ప్రకటించిన పంట విరామం అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతమూ అలాంటి పరిస్థితులే ఆవిష్కృతమవుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వాలు దృష్టిసారించి సాగును లాభసాటిగా మార్చకపోతే దేశవ్యాప్తంగా ఆహార ఉత్పత్తికి విరామం ఇచ్చే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఇది దేశ ఆహార భద్రతకు పెనుముప్పుగా పరిణమిస్తుంది. ఆహార ద్రవ్యోల్బణం ఏర్పడి సామాజిక అశాంతికి దారి తీస్తుంది. 

గిట్టుబాటు కాని వ్యవసాయం

సాగు గిట్టుబాటు కాకపోవడంతో కర్షకులు పంట విరామానికి మొగ్గుచూపుతున్నారు. ఇందుకు పలు కారణాలు తోడవుతున్నాయి. సరైన మద్దతు ధర దక్కకపోవడం, ఎరువులు, పురుగుమందులు, కూలీలు, ఇతర ఖర్చులు భారీగా పెరగడం, సీజన్‌లో కూలీల కొరత, అసమర్థ పంటల సేకరణ వంటివి సాగును భారంగా మారుస్తున్నాయి. కాలువలు, డ్రైనేజీల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, లోపభూయిష్ఠమైన పంటల బీమా పథకాలు, బీమా చెల్లింపుల్లో జాప్యం, నష్టాల్ని భర్తీచేసే స్థాయిలో పరిహారాలు లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు, తుపానులు, తెగుళ్లతో దిగుబడి తగ్గడం, పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు సరిపడా సౌకర్యాలు లేకపోవడం వంటివీ రైతులను కడగండ్లలోకి నెడుతున్నాయి. వర్షాధార, కరవు పీడిత ప్రాంతాలతో సంబంధం లేకుండా సాగుకు నీటివసతి ఉన్న చోట్లా పంట విరామం ప్రకటిస్తుండటం సమస్య తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. పంజాబ్‌, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గతంలోనూ పంట విరామాలు ప్రకటించారు. వరి మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆహార పంట. కొద్దికాలంగా వరి సాగుకు పెట్టుబడి పెరిగిపోతోంది. ఎకరానికి దాదాపు రూ.40 వేలు ఖర్చవుతోంది. వివిధ కారణాలతో దిగుబడులు తగ్గుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఎకరానికి సగటు దిగుబడి 22-25 క్వింటాళ్లు ఉండగా కొన్ని రాష్ట్రాల్లో అంతకంటే తక్కువగా నమోదవుతోంది. ప్రభుత్వం 2021-22లో వరి సాధారణ రకానికి మద్దతు ధరను రూ.1,940 ప్రకటించగా 2022-23 సీజన్‌కు మరో రూ.100 పెంచింది. ఈ ధర దక్కినా రైతుకు మిగిలేది నామమాత్రమే. చాలామంది రైతులకు మద్దతు ధరే దక్కడం లేదు. ఫలితంగా నష్టాలు అనివార్యమవుతున్నాయి. చేసేది లేక అన్నదాతలు కాడి వదిలేస్తున్నారు. సొంతభూమి ఉన్న రైతులే ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, కౌలుదారుల పరిస్థితి మరింత అధ్వానం. కొన్ని ప్రాంతాల్లో వరి పొలాల్ని కౌలుకు తీసుకునేందుకూ ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితులన్నీ అన్నదాతలను పంట విరామంవైపు నడిపిస్తున్నాయి.

సత్వరమే పరిష్కారం

వరి సాగును లాభసాటిగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలి. నారు విత్తే దగ్గర నుంచి పంట సేకరణ దాకా అంతా సాఫీగా సాగాలి. ప్రతి రైతుకూ మద్దతు ధర దక్కాలి. పెట్టుబడి వ్యయానికి అనుగుణంగా మద్దతు ధరలు నిర్ణయించాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వాలూ చొరవ చూపాలి. అవసరమైతే బోనస్‌ ప్రకటించి పంటను సేకరించాలి. మద్దతు ధరపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నెపం మోపి పొద్దుపుచ్చకుండా రైతుకు మేలు చేసేలా వ్యవహరించాలి. ధాన్యం సేకరించిన తరవాత వెంటనే డబ్బులు చెల్లించాలి. పంటల బీమాను సమర్థంగా అమలు చేయాలి. పంట నష్టపోతే పెట్టుబడి మొత్తం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ప్రకృతి విపత్తులు, తెగుళ్లతో పంట కోల్పోతే ఉదారంగా ఆదుకోవాలి. నష్టపరిహారం చెల్లించడంతో పాటు మళ్ళీ పంట వేయడానికి విత్తనాలు, ఎరువులను రాయితీపై సరఫరా చేయాలి. నీటి పారుదల వ్యవస్థను సమర్థంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలి. డ్రెయిన్‌లు, పంట కాలువల్లో ఎప్పటికప్పుడు పూడిక తీయించాలి. సాగుపరమైన సమస్యలన్నింటినీ ప్రభుత్వాలు సత్వరమే పరిష్కరించాలి. లేదంటే ప్రస్తుతం కొన్ని ప్రాంతాలు, కొన్ని పంటలకే పరిమితమైన పంటవిరామం దేశమంతటికీ విస్తరిస్తుంది. ఆ పరిస్థితి రాకముందే యుద్ధప్రాతిపదికన కార్యాచరణ ప్రారంభించాలి.

- డి.సతీష్‌బాబు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ దేశ రక్షణలో మేలిమి పథమేనా?

‣ ముసురుతున్న అణుభయాలు

‣ వైద్యరంగంలో సాంకేతిక విప్లవం

‣ బలపడుతున్న ద్వైపాక్షిక బంధం

‣ రైతు ఆదాయం రెట్టింపయ్యేదెన్నడు?

‣ పర్యావరణ సూచీలో అట్టడుగున భారత్‌

‣ రాజ్యాంగ బద్ధతే ప్రామాణికం

Posted Date: 22-06-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం