• facebook
  • whatsapp
  • telegram

వైద్యరంగంలో సాంకేతిక విప్లవం

కృత్రిమమేధతో కొత్తపుంతలు

జన సంక్షేమానికి అగ్రాసనం వేసే ప్రజాస్వామ్య దేశాల్లో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడం ప్రభుత్వాల కర్తవ్యం. ఇప్పటికీ 60శాతం భారతీయులు ఆరోగ్య బీమా కానీ, ప్రభుత్వ జనారోగ్య పథకాలు కానీ అందక వైద్యం కోసం సొంత జేబుల నుంచి ఖర్చుపెట్టుకోవలసిన దుస్థితి నెలకొంది. స్వాతంత్య్రం సిద్ధించిన తరవాత ఈ 75 ఏళ్లలో ప్రభుత్వాలు ప్రజలకు కనీస ఆరోగ్య సేవలు అందించడానికి కృషి చేసినా, సంతృప్తికరమైన ఫలితాలు దక్కలేదు. ఇటీవలి సంవత్సరాల్లో కేంద్రం, రాష్ట్రాలు తమ స్థాయిలో చేపట్టిన అనేక పథకాలు సరైన ఫలితాలు ఇస్తుండటం స్వాగతించాల్సిన పరిణామం. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ప్రారంభమైన ఏడాదిలోనే దాదాపు కోటి మంది ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్సలు పొందారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షలదాకా ప్రధాన శస్త్రచికిత్సలు చేయించుకొనే సదుపాయం కల్పించింది. ఇవన్నీ ప్రోత్సాహకర పరిణామాలే. మున్ముందు మరింత మందికి, ముఖ్యంగా బలహీన వర్గాలవారికి మరిన్ని వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

రికార్డుల డిజిటలీకరణ

ఆరోగ్య సంరక్షణ సేవలు ఈ 21వ శతాబ్దంలో క్రమంగా డిజిటల్‌ రూపం సంతరించుకుంటున్నాయి. ఒక వ్యక్తికి గతంలో ఏయే వ్యాధులు వచ్చాయి, వాటికి ఏయే చికిత్సలు అందాయి, ప్రస్తుత పరిస్థితి ఏమిటనేది వెంటనే తెలుసుకుంటే సమర్థమైన చికిత్సను అందించడానికి వీలవుతుంది. ప్రస్తుతం రోగి సమాచారం అనేక దస్త్రాల్లో నిక్షిప్తమవుతోంది. ఆ సమాచారం మొత్తాన్నీ డిజిటల్‌ రూపంలో భద్రపరిస్తే చిటికెలో వైద్యుల కంప్యూటర్‌ తెరపై ప్రత్యక్షమవుతుంది. రోగి సమాచారాన్ని డిజిటల్‌ పద్ధతిలో వివిధ విభాగాల వైద్యులు తెలుసుకుని సమన్వయంతో చికిత్స మొదలు పెట్టగలుగుతారు. డిజిటల్‌ రికార్డులు వివిధ విభాగాలకు అందుబాటులోకి వస్తే సువ్యవస్థిత ఆరోగ్య సంరక్షణ యంత్రాంగం నెలకొంటుంది. దానికి కొవిన్‌ యాప్‌ చక్కని ఉదాహరణ. కొవిడ్‌ టీకాలు ప్రైవేటు ఆస్పత్రిలో వేశారా లేదా ప్రభుత్వ ఆస్పత్రిలో అందుకున్నారా అనేదాంతో నిమిత్తం లేకుండా టీకా వేసుకున్న వ్యక్తుల సమాచారం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొవిన్‌ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. బూస్టర్‌ డోసులు ఎప్పుడు వేయాలి, ఎక్కడ వేయాలనేది తెలుసుకునే సౌలభ్యం రోగికి, వైద్య సిబ్బందికి కలుగుతుంది.

ఇవాళ ప్రత్యేక చికిత్సలు అందించే ప్రతి పెద్ద ఆస్పత్రిలో రోగుల సమాచారం ఎల‌్రక్టానిక్‌ రికార్డుల (ఈఎంఆర్‌) రూపంలో నిక్షిప్తమై ఉండటం తప్పనిసరైంది. రోగి సమాచారం, పూర్వ చికిత్సలు, ఆరోగ్య బీమా, ప్రభుత్వ జనారోగ్య పథకాల నుంచి పొందిన లబ్ధి వివరాలన్నీ ఈఎంఆర్‌లో అనుసంధానమై ఉండాలి. నేడు 50శాతం పెద్ద ఆస్పత్రుల్లో మాత్రమే ఈఎంఆర్‌ సదుపాయం ఉందని అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలను అధ్యయనం చేసే భారత పరిశోధనా మండలి సర్వేలో తేలింది. ఈఎంఆర్‌ వల్ల రోగి జీవిత కాల ఆరోగ్య స్థితిగతులను వైద్యుడు తక్షణం అవగాహన చేసుకుని వేగంగా సమర్థ చికిత్సను అందించడం సాధ్యపడుతుంది. అంతేకాదు- దీర్ఘకాల వైద్య పరిశోధనలకు, కొత్త చికిత్సల ఆవిష్కారానికి సైతం ఆ సమాచారం తోడ్పడుతుంది. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ సరికొత్త విప్లవం తెస్తుందనే అంచనాలు దశాబ్ద కాలం నుంచే వినిపిస్తున్నాయి. ఇప్పుడవి నిజమయ్యే రోజు దగ్గరకొస్తోంది. వ్యక్తుల ఆరోగ్య సమాచారం డిజిటల్‌ రికార్డుల్లో భద్రపరచినప్పుడు దాన్ని అధ్యయనం చేసి సరైన చికిత్సలు సూచించే సత్తాను మెషీన్‌ లెర్నింగ్‌ అల్గొరిథమ్‌లు సంతరించుకుంటాయి. ఆ అల్గొరిథమ్‌లే కృత్రిమ మేధ (ఏఐ)కి పునాది. వైద్యరంగంలో కొత్త మార్పులు వస్తున్నకొద్దీ వాటికి అనుగుణంగా ఏఐ సాధనాలూ పరిణామం చెందుతున్నాయి. భవిష్యత్తులో వైద్య రంగ రూపాంతరీకరణలో ఏఐ కీలక పాత్ర పోషించనుంది.

దేశీయంగా తయారీ

వైద్య పరికరాలను స్వదేశంలోనే తయారు చేయడానికి మేకిన్‌ ఇండియా కింద కేంద్రం చొరవ తీసుకుంది. భారత్‌లో వైద్య సాధనాల మార్కెట్‌ ఏటా 37శాతం చక్రీయ వృద్ధి రేటు సాధించి 2025కల్లా అయిదు వేల కోట్ల డాలర్లకు (రూ.3.90 లక్షల కోట్లకు) చేరుకుంటుందని అంచనా. కరోనా మహమ్మారి మనల్ని స్వదేశంలోనే టీకాలు, పీపీఈలు, వెంటిలేటర్లు, ఇతర వైద్య చికిత్సా పరికరాలను ఉత్పత్తి చేసేలా పురిగొల్పింది. వాటిని స్వదేశంలో చౌక ధరలకు పెద్దయెత్తున ఉత్పత్తి చేసే సత్తా భారత్‌కు ఉంది. వెంటిలేటర్లు, కార్డియాక్‌ స్టెంట్లు, స్టెరిలైజేషన్‌ ఉత్పత్తులను అనేక భారతీయ కంపెనీలు ఉత్పత్తి చేయడం నేడు సుసాధ్యమే. ప్రభుత్వం, పరిశోధకులు, పరిశ్రమలు చేతులు కలిపితే భారతీయులకు చవకగా అనేక కీలక వైద్య పరికరాలు అందుబాటులోకి వస్తాయి.

సమన్వయం కీలకం

భారత్‌లో ఆది నుంచి వైద్యశాస్త్రం, యంత్రవిద్యల మధ్య సమన్వయం లేదు. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో వైద్యం, ఇంజినీరింగ్‌లను మేళవించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. వైద్యులు, వైద్య పరిశోధకులు చికిత్సా రంగానికి కావాల్సిన సాధనాలను ఇంజినీర్లకు తెలిపితే, వారు కొత్త సాంకేతికతలను, పరికరాలను రూపొందించగలగాలి. దానికి అవసరమైన మౌలిక వసతులను కల్పించాలి. భారతీయుల జన్యు లక్షణాలు, వారికి తరచూ సంక్రమించే వ్యాధులను ఆకళింపు చేసుకుని దేశీయంగానే పరిష్కారాలను ఆవిష్కరించాలి.

రోబోల హవా

రాబోయే రోజుల్లో శస్త్రచికిత్సలను రోబోలు కొత్త పుంతలు తొక్కించనున్నాయి. అసలు కత్తి గాటే పెట్టకుండా లేదా చిన్న రంధ్రం చేయడం ద్వారా శస్త్రచికిత్సను పూర్తిచేయడానికి రోబోలు ఉపకరిస్తాయి. శస్త్రచికిత్స సహాయక రోబోల వినియోగం నానాటికీ పెరుగుతూ వాటిపై వ్యయమూ తగ్గుతోంది. ఫలితంగా మరిన్ని ఆస్పత్రులు రోబోలను వినియోగించే వెసులుబాటు ఏర్పడనుంది.

చికిత్సలో చేదోడు

రోజులు గడిచేకొద్దీ కృత్రిమ మేధ (ఏఐ) మరింత కచ్చితత్వాన్ని సంతరించుకొంటోంది. జీర్ణకోశ వ్యాధులను ముందుగానే పసిగట్టి సకాలంలో సరైన చికిత్స అందించడానికి తోడ్పడే ఏఐ సాధనాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. దానివల్ల చికిత్స వ్యయమూ తగ్గుతుంది. వైద్యులు లేదా వైద్య సహాయక సిబ్బంది స్థానాన్ని కృత్రిమ మేధ ఆక్రమించదు. చికిత్సలో వారికి చేదోడుగా నిలుస్తుంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బలపడుతున్న ద్వైపాక్షిక బంధం

‣ రైతు ఆదాయం రెట్టింపయ్యేదెన్నడు?

‣ పర్యావరణ సూచీలో అట్టడుగున భారత్‌

‣ రాజ్యాంగ బద్ధతే ప్రామాణికం

Posted Date: 18-06-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం