• facebook
  • whatsapp
  • telegram

దేశ రక్షణలో మేలిమి పథమేనా?

‘అగ్నిపథ్‌’పై అనుమానాలు, ఆందోళనలు

 

 

సైనిక సంస్కరణల్లో భాగంగా మోదీ సర్కారు ప్రకటించిన ‘అగ్నిపథ్‌’ పథకం జాతీయ స్థాయిలో ఆందోళనకు కారణం అవుతోంది. చాలామంది మాజీ సైనికాధికారులు ఈ నిర్ణయాన్ని తొందరపాటు చర్యగా అభివర్ణిస్తున్నారు. భారత సైన్యం ఏటా దాదాపు 60 వేల మందిని కొత్తగా దళాల్లోకి తీసుకొంటుంది. కొవిడ్‌ వ్యాప్తి కారణంగా రెండేళ్ల నుంచి నియామకాలు జరగలేదు. ఫలితంగా 2021 డిసెంబర్‌ నాటికి 1.04 లక్షల ఖాళీలు ఉన్నట్లు రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్‌భట్‌ పార్లమెంటుకు వెల్లడించారు. వాటిలో జవాన్లు, జేసీఓల పోస్టులు 97 వేల దాకా ఉన్నాయి. వాటిపై ఆశలు పెట్టుకొని దేశవ్యాప్తంగా లక్షల మంది సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో సాధారణ నియామకాలను ఆపేసి కేంద్రం ‘అగ్నిపథ్‌’ పథకాన్ని ప్రకటించింది. దానికింద నియమితులయ్యే ‘అగ్నివీరుల’ వయోపరిమితిని 17.5-21 ఏళ్లుగా నిర్ణయించింది. ఈ ఏడాది 45 వేల మందిని ఈ పద్ధతిలో తీసుకొంటామని చెబుతోంది. భవిష్యత్తులో నియామకాల సంఖ్య ఏటా 1.5 లక్షలకు చేరుతుందని పేర్కొంది. నాలుగేళ్ల తరవాత వారిలో 25 శాతాన్ని దళాల్లో కొనసాగించి, మిగిలిన వారికి పదవీ విరమణ కల్పిస్తామని పేర్కొంది. ఆ సమయంలో రూ.11.71 లక్షలు అందించడంతోపాటు, ఉన్నత విద్య, బ్యాంకు రుణాలు, ఇతర ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని ప్రకటించింది. దానిపై ఒక్కసారిగా ఆందోళనలు చెలరేగడంతో యువతను బుజ్జగించేందుకు తొలి ఏడాది మరో రెండేళ్ల మినహాయింపును కల్పించారు. అది యువతలో భయాందోళనలను ఏమాత్రం తగ్గించలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల మధ్యే నోటిఫికేషన్‌ సైతం జారీ చేయడం గమనార్హం.

 

శిక్షణ కేంద్రాల కొరత

మిగిలిన ఉద్యోగాలతో పోలిస్తే రక్షణ దళాల్లో పనితీరు భిన్నంగా ఉంటుంది. సాధారణ సైనిక శిక్షణే కనీసం ఏడాది కాలం పాటు ఉంటుంది. ఆ తరవాత అభ్యర్థికి లభించే పోస్టింగును బట్టి అక్కడ ఉపయోగించే ఆయుధాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలపై మరికొంత కాలం శిక్షణ ఇస్తారు. అంటే- తుపాకులు, శతఘ్నులు, ట్యాంకులు, రాకెట్‌ లాంచర్లు, యుద్ధనౌకలు, యుద్ధవిమానాలు... ఇలా వేర్వేరు ఆయుధాలను వినియోగించేలా సిద్ధం చేస్తారు. అసలు పూర్తిస్థాయిలో సైనికుడు సిద్ధం కావడానికి ఎంత లేదన్నా ఆరు నుంచి ఏడేళ్ల సమయం పడుతుంది. అటువంటిది కేవలం ఆరు నెలల శిక్షణతో రెజిమెంట్‌లోకి వచ్చి ఏమి నేర్చుకొంటారంటూ విశ్రాంత జనరల్స్‌ పెదవి విరుస్తున్నారు. మరోపక్క శిక్షణ కేంద్రాల కొరత కూడా తీవ్రం కానుంది. ఉదాహరణకు గన్నర్లకు శిక్షణ ఇచ్చే రెండు కేంద్రాలు సామర్థ్యానికి మించిన శిక్షణార్థులతో నడుస్తున్నాయి. కొత్తగా వచ్చే అగ్నివీరులకు వాటిలో శిక్షణ ఇవ్వాలంటే అదనపు సౌకర్యాలు, సిబ్బంది అవసరం. ఇదే పరిస్థితి చాలా విభాగాల్లో ఉంది. ఇక నాలుగేళ్ల కాలంలో అగ్నివీరుల సెలవులు, శిక్షణ సమయం తీసేస్తే వారు విధి నిర్వహణలో ఉండే కాలం తక్కువే. వారికి ఆయా రెజిమెంట్లతో ఎటువంటి అనుబంధం ఏర్పడదు. ఇది వారి పోరాట పటిమపై పెనుప్రభావం చూపుతుంది. తాజాగా ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా సేనల్లోని నిర్బంధ యువ సైనికుల పనితీరు అధ్వానంగా ఉన్నట్లు విమర్శలున్నాయి. ఇప్పటి వరకు సైన్యంలోకి గుజరాత్‌, గోవా వంటి ప్రాంతాల నుంచి తక్కువ మంది వస్తుండగా- యూపీ, ఎంపీ, పంజాబ్‌వంటి ప్రాంతాల నుంచి ఎక్కువ మంది దళాల్లో చేరుతున్నారు. అగ్నిపథ్‌ ఎంపిక పూర్తిస్థాయిలో అమలై ఏటా లక్షన్నర మంది చేరితే కొన్ని ప్రాంతాలకు చెందిన వారే దళాల్లో అత్యధికంగా ఉంటారు. పెద్ద సంఖ్యలో చేర్చుకోవాలంటే నియామకాలు, శిక్షణ, నిర్వహణ సిబ్బంది సంఖ్యా రెట్టింపు కావాలి. అప్పుడు పోరాటేతర సిబ్బంది సంఖ్య పెరుగుతుంది. సైన్యానికి కీలకమైన పోరాట, పోరాటేతర సిబ్బంది నిష్పత్తిని ఇది ప్రభావితం చేస్తుంది. భవిష్యత్తులో ఎంతలేదన్నా దళాల్లో అగ్నివీరుల సంఖ్య కనీసం 50శాతం ఉంటుంది. వీరిరాకతో సైన్యం సగటు వయసు 32 ఏళ్ల నుంచి 26 ఏళ్లకు తగ్గుతుందన్నది ప్రభుత్వ వాదన. కేవలం ఆరు నెలల శిక్షణతో వచ్చే ఈ యువకులతో యుద్ధాలు గెలవడం ఎంతవరకు సాధ్యమనేది ప్రశ్నార్థకమే! అగ్నివీరులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందిపుచ్చుకొంటారని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 10, 12 తరగతులు పూర్తి చేసిన యువత ఆరునెలల శిక్షణతో సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం సాధించడం కష్టతరమే. ఈ పథకం కేవలం సైనిక దళాల పింఛను బడ్జెట్‌ను మిగుల్చుకోవడం కోసమే అనే విమర్శలూ ఉన్నాయి. వాస్తవానికి 2015కు ముందు రక్షణ బడ్జెట్‌లో పింఛన్లను కలిపి చూపేవారు కాదు. ఆ తరవాత నుంచి వాటినీ కలపడంతో బలగాల నిర్వహణ వ్యయం గణనీయంగా పెరిగినట్లు కనిపించసాగింది.

 

ముందుగానే ఒప్పందాలు...

ప్రపంచవ్యాప్తంగా కిరాయి సైనికులు, ప్రైవేటు మిలిటరీ కాంట్రాక్టర్ల వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. అగ్నిపథ్‌ నుంచి బయటకు వచ్చినవారు వాటిలో చేరితే భారత్‌కు భవిష్యత్తులో పలురకాల చిక్కులు తప్పవు. సైనిక శిక్షణ పొందిన నిరుద్యోగులను స్వార్థప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి భారత్‌లోనే పలు వేర్పాటువాద, అసాంఘిక శక్తులు సిద్ధంగా ఉంటాయని బ్రిగేడియర్‌ రాహుల్‌ భన్సల్‌ వంటివారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగ్నిపథ్‌ పథకాన్ని ప్రయోగాత్మకంగా చిన్న స్థాయిలో మొదలుపెట్టి లోటుపాట్లను సరిదిద్దుకొని ప్రకటించాల్సింది. నాలుగేళ్ల తరవాత నిరుద్యోగులుగా మారే అగ్నివీరులకు ఉపాధి కల్పించేందుకు రాజకీయాలకు అతీతంగా ఆయా రాష్ట్రాల హోంశాఖలు, ప్రైవేటు రంగంతో ముందే ఒప్పందాలు చేసుకొని పథకాన్ని ప్రకటిస్తే ఇంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండేది కాదు. పాక్‌, చైనాలతో వివాదాలు కొనసాగుతున్న వేళ దళాల సంఖ్య తగ్గింపు, అగ్నిపథ్‌, ఆయుధాల్లో ఆత్మనిర్భర్‌ వంటి సైనిక సంస్కరణలను ఏకకాలంలో అమలులోకి తీసుకురావడం ఇబ్బందికర పరిణామాలకు దారి తీయవచ్చు. ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

 

ఉపాధి కల్పన సమస్యే

నాలుగేళ్ల సర్వీసు ముగించుకొని బయటకు వచ్చే 75శాతం అగ్నివీరులకు ఉపాధి కల్పించడంపై ప్రభుత్వానికి స్పష్టత లేకపోవడం ఇందులో అతిపెద్ద లోపం.  లక్షన్నర మందిని దళాల్లోకి తీసుకొంటే దాదాపు 85 వేల మంది నాలుగేళ్ల తరవాత బయటకు వచ్చి ఉద్యోగ వేట మొదలు పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం పదవీ విరమణ చేస్తున్న సైనికులకే పూర్తిస్థాయి ఉపాధిని చూపడం సాధ్యం కావడం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఏటా భారీ సంఖ్యలో బయటకు వచ్చే అగ్నివీరులకు ఉపాధి చూపడం కష్టసాధ్యమే! ఆందోళనలు పెచ్చరిల్లాక కేంద్ర సాయుధ పోలీస్‌ బలగాలు, అస్సాం రైఫిల్స్‌లో రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. దాంతోపాటు కొన్ని రాష్ట్రాలు, కేంద్ర నౌకాయానశాఖ అగ్నివీరులకు ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నాయి. ఇలాంటి ప్రకటనలకు చట్టబద్ధత కల్పించాల్సి ఉంది.

 

- పెద్దింటి ఫణికిరణ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ముసురుతున్న అణుభయాలు

‣ వైద్యరంగంలో సాంకేతిక విప్లవం

‣ బలపడుతున్న ద్వైపాక్షిక బంధం

‣ రైతు ఆదాయం రెట్టింపయ్యేదెన్నడు?

‣ పర్యావరణ సూచీలో అట్టడుగున భారత్‌

‣ రాజ్యాంగ బద్ధతే ప్రామాణికం

Posted Date: 22-06-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం